మూడేళ్ల బాలుడికి కరోనా, తెలంగాణలో ఆరు కాంటాక్ట్ కేసులు!

తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతంగా విస్తరిస్తోంది. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. హైదరాబాద్‌కు చెందిన మరో మహిళకు ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా కరోనా సోకింది. దీంతో మొత్తం వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 41కి పెరిగింది. చిన్నారులకు కూడా కరోనా సోకడం ఆందోళనకర అంశం. హైదరాబాద్‌ గోల్కొండలో నివసిస్తున్న ఓ కుటుంబం ఇటీవలే సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వీరిలో మూడేళ్ల చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల రక్త నమూనాలను కూడా సేకరించి పరీక్షిస్తున్నారు. బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రోజురోజుకూ స్థానికంగా రెండో కాంటాక్ట్‌ ద్వారా కేసుల సంఖ్య పెరుగుతోందని, ఆరు కాంటాక్ట్ కేసులు నమోదైన‌ట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్నారు.