రాష్ట్రంలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు.. సర్వే కలకలం..

ఈ న్యూస్ చ‌దవ‌డం కాసేపు ఆపేసి.. మీకు తెలిసిన ఓ ప‌దిమందికి ఫోన్ చేసి చూడండి.. అందులో ఓ న‌లుగురికైనా, లేదంటే వారికి తెలిసిన వారికైనా.. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌నే ఆన్స‌ర్ వ‌స్తుంది. అంత‌లా క‌రోనా వైర‌స్ విచ్చ‌ల‌విడిగా వ్యాపిస్తోంది. ఫ‌స్ట్‌, సెంక‌డ్ వేవ్స్‌ను మించి.. పాజిటివ్‌ కేసులు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వం చెప్పే లెక్క‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది.. అవి ఎలా ఉంటాయో అంద‌రికీ తెలిసిందేగా. టెస్టుల వ‌ర‌కూ వెళ్లే వారు కొంద‌రే. స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న‌వారు చాలా మందే. ఇక ఎలాంటి ల‌క్ష‌ణాలు లేకుండా బ‌య‌ట తిరుగుతున్న‌వాళ్లు కోకొల్ల‌లు. 

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాప్తి విప‌రీతంగా ఉంది. తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ సర్వేలో తేలింది. ముందుముందు కేసులు మరింతగా పెరగ‌వచ్చని సర్వే అంచనా వేసింది. 

ఒమైక్రాన్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతోందని, రానున్న రెండు వారాల్లో కేసులు పెరుగుతాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. డిసెంబర్ రెండవ వారం నుంచి ఏఎన్ఎంలు, అంగన్ వాడీలు, ఆశావర్కర్లు చేసిన ఫీవర్ సర్వేలో 20 లక్షల మందికిపైగా కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్టు తేలింది. 

ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 15 లక్షల మందికి పైగా ల‌క్ష‌ణాలు నమోదయ్యాయని, జిల్లాల్లో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని సర్వే నివేదికను వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి అందజేసింది. ఇక ఇలాంటి సర్వే గనుక ఆంధ్రప్రదేశ్ లో చేసుంటే.. ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండటం ఖాయం అంటున్నారు.