పేర్ని కిట్టు అండ్ గంజాయి బ్యాచ్ మీద హత్యాయత్నం కేసు

వైసీపీ నాయకుడు పేర్ని నాని తన కుమారుడు పేర్ని కిట్టు రాజకీయాల్లో ఎదగాలని, ఆ ఎదగడం కూడా తన ప్రియతమ నాయకుడు జగన్ అంత ఎదగాలని కోరుకున్నారు. అందుకే ఈసారి ఎన్నికలలో మచిలీపట్నం అసెంబ్లీ  నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయకుండా తన కుమారుడు పేర్ని కిట్టుని నిలబెట్టారు. పేర్ని కిట్టు ఎలక్షన్లకు ముందే తన తండ్రి కోరుకున్నట్టుగా జగన్ స్థాయికి చేరుకున్నారు. అదెలాగంటే, హత్యాయత్నం కేసులో ఇరుక్కుని A1గా పోలీసు రికార్డుల్లోకి చేరారు. ఈ విధంగా పేర్ని నాని కల నెరవేరింది. తన నాయకుడు జగన్ A1 ఇప్పుడు తన కుమారుడు పేర్ని కిట్టు కూడా A1... ఆహా అదృష్టం అంటే పేర్ని నానిదే.

మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని కిట్టు అబ్బో మామూలుగా ప్రచారం చేయడం లేదు. గంజాయి బ్యాచ్‌ని వెంటేసుకోవడం, మచిలీపట్నంలో తిరుగుతూ నానా చర్చ చేయడం. ఆ గంజాయి బ్యాచ్ కూడా మన దగ్గర స్టాకే కదా అన్నట్టు పఫ్ఫుల మీద పఫ్ఫులు లాగుతూ రోడ్డు మీద రెచ్చిపోతూ వుంటారు. వీళ్ళందరికీ ప్రచారం కంటే హడావిడి చేయడం మీదే ఎక్కువ కాన్సంట్రేషన్. ఎవరైనా ప్రతిపక్ష నాయకులు గానీ, వాళ్ళ ఇళ్ళుగానీ కనిపిస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అలవాటు.  నిన్న గురువారం నాడు మచిలీపట్నంలోని విశ్వబ్రాహ్మణ కాలనీకి పేర్ని కిట్టు ఈ గంజాయి బ్యాచ్‌తో కలసి వెళ్ళారు. అక్కడ జనసేన నాయకుడు కర్రి మహేష్ ఇంటిని చూడగానే కిట్టు అండ్ బ్యాచ్ బుర్రలో గంజాయి పొగలు సుడులు తిరిగాయి. వెంటనే బాణసంచా వెలిగించి కర్రి మహేష్ ఇంటి మీదకి వదిలారు. అవి కర్రి మహేష్ ఇంట్లోకి వెళ్ళాయి. దాంతో కర్రి మహేష్ కుటుంబ సభ్యులు ఏంటీ దుర్మార్గం అని ప్రశ్నించారు. అలా ప్రశ్నించడమే తప్పు గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఇంటి ముందు వున్న పూల కుండీలు ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. కర్రి మహేష్ భార్య హేమలత మీద దాడి చేశారు. ఆమె మెడలో వున్నతాళిబొట్టు లాగేశారు. అక్కడే వున్న కుటుంబ సభ్యులందరినీ గాయపరిచారు. అదే సమయంలో అక్కడకి వచ్చిన కర్రి మహేష్ మీద కూడా దాడి చేశారు. ఈ గంజాయి బ్యాచ్ నుంచి రక్షించండి మహాప్రభో అని పోలీసులకు ఫోన్ చేసినా పట్టించుకున్నవారే లేకుండా పోయారు. ఈ సంఘటన కర్రి మహేష్ కుటుంబ సభ్యులను మాత్రమే కాదు.. మచిలీపట్నం ప్రజానికాన్ని కూడా భయభ్రాంతులకు గురిచేసింది.  పొరపాటుగా పేర్ని కిట్టుని గెలిపిస్తే మచిలీపట్నం భవిష్యత్తు ఎలా వుండబోతోందనేది శాంపిల్ రూపంలో మచిలీపట్నం ఓటర్లకు క్లియర్‌గా అర్థమైపోయింది. 

ఈ సంఘటన మీద కేసు నమోదు చేయడానికి పోలీసులు తాత్సారం చేశారు. టీడీపీ నాయకులు ఆందోళన చేయడంతో దిగి వచ్చిన పోలీసులు పేర్ని కిట్టుతోపాటు మొత్తం ఆరుగురి మీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ కేసులో మన కథానాయకుడు పేర్ని కిట్టు A1గా ఉన్నత స్థానంలో నిలిచారు. పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్‌తోపాటు కర్రి మహేష్ కుటుంబం మీద కూడా ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టారు. ఒక వైసీపీ కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టారు. మొత్తమ్మీద ఏమిటంటే, పేర్ని కిట్టు విశ్వరూపం మచిలీపట్నం నియోజకవర్గం ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది. ఇప్పటికే పేర్ని కిట్టుకు ఇక్కడ గెలిచే అవకాశం లేదు. ఇప్పుడీ సంఘటనతో ఆ అవకాశాలు మరింత దిగజారాయని పరిశీలకులు భావిస్తున్నారు.