దొంగతనం చేసింది 19 ఏళ్లకి…పట్టుబడింది 50 ఏళ్లకి
posted on Oct 31, 2017 1:02PM

సాధారణంగా కొన్ని కేసులు చాలా ఏళ్ల వరకూ పెండింగ్ లో ఉంటాయి. కొన్ని కేసులు కొట్టేస్తారు. కొన్ని కేసులయితే ఏళ్లు గడుస్తున్నా.. దర్యాప్తు చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ఓ ఆశ్యర్చకమైన ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగ తను యువకుడిగా ఉన్నప్పుడు దొంగతనాలు చేస్తే.. ఆయన దొరికింది మాత్రం ముప్పై ఏళ్ల తరువాత. ఆశ్చర్యంగా ఉంది కదా.. అసలు ఆ కథెంటో తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. కర్నూలు జిల్లా అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అంబటి మల్లికార్జునరెడ్డి బృందం 1988లో పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో దారికాచి దొంగతనాలు, లారీలను ఆపి దోపిడీలు చేస్తుండేవారు. అప్పుడే మల్లికార్జునరెడ్డిపై కేసు నమోదైంది. అప్పుడు మల్లికార్జునరెడ్డి వయసు 19 ఏళ్లు. అప్పటినుంచి అతడిని అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించే క్రమంలో ఈ దొంగ కేసు బయటపడింది. ఎలాగైనా ఈ దొంగను పట్టుకోవాలని సీఐ నిర్ణయించుకుని ఓ బృందాన్ని పాత ఫొటో ఇచ్చి కర్నూలుకు పంపారు. పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపి ఎలాగో అతడిని పట్టుకున్నారు. అయితే ఇప్పుడు మల్లికార్జునరెడ్డి వయసు 50 ఏళ్లు. ఇక మల్లికార్జునరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు పిడుగురాళ్లకు తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరిచారు.