మాస్క్ లేకపోతే వెయ్యి ఫైన్.. ప్రజలకేనా? పాలకులకు వర్తించదా?
posted on Dec 3, 2021 10:23AM
ప్రపంచానికి ఒమిక్రాన్ భయం. ఇండియాలోనూ ఆ మహమ్మారి ఎంట్రీ ఇవ్వడంతో మరింత కలకలం. మన పక్కనే ఉన్న బెంగళూరులో అఫిషియల్‌గా రెండు కేసులు. ఇక అనధికారికంగా? ఎన్నున్నాయో ఎవరికీ తెలీదు. ఒమిక్రాన్ టెన్షన్‌తో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. అనూహ్యంగా డీహెచ్ శ్రీనివాసరావు మీడియా ముందుకు వచ్చి.. మరింత భయపెట్టారు. థర్డ్ వేవ్ ఎప్పుడైనా రావొచ్చని.. ఒమిక్రాన్ యమ డేంజర్ అని హెచ్చరించారు. పనిలో పనిగా మరుగున పడిన రూల్‌ను మరోసారి గుర్తు చేశారు. తెలంగాణలో మాస్క్ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయల ఫైన్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అదేంటి.. తెలంగాణలో ఇప్పటి వరకూ ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా రాలేదు.. అప్పుడే మాస్క్ లేకపోతే వెయ్యి ఫైన్ ఎందుకంటూ ప్రజలు విసుక్కుంటున్నారు.
ఇలా డీహెచ్ ప్రకటించారో లేదో.. అలా పోలీసులు రోడ్లపై వాలిపోయారు. మాస్క్ లేని వారిని పట్టుకుని ఫైన్లు బాదేస్తున్నారు. దొరికితే వెయ్యి. వామ్మో అంటున్నారు జనాలు.

సోషల్ మీడియాలోనైతే మరో రకమైన డిమాండ్ వినిపిస్తోంది. మాస్క్ లేకపోతే ఫైన్లు మాకేనా? పాలకులకు వేయరా? రూల్స్ సామాన్యులకేనా? రాజకీయ నాయకులకు వర్తించవా? అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే...
గురువారం నుంచి మాస్క్ లేకపోతే వెయ్యి ఫైన్ నిబంధన అమలు చేస్తున్నారు. ఇదే గురువారం సీఎం కేసీఆర్ గద్వాల జిల్లాకు వెళ్లారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా మందితో కలిశారు. గద్వాల్ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తూ.. మార్గమధ్యలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియం కొండ తండా గ్రామ పంచాయతీ ఫరిధిలోని రైతులు సాగు చేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. అంతా బాగానే ఉంది కానీ, ఆ పర్యటన మొత్తంలో సీఎం కేసీఆర్ ఎక్కడా మాస్క్ ధరించలేదు. ఆయన పక్కన ఉన్న మంత్రులు, అధికారులు సైతం ఎలాంటి మాస్క్ పెట్టుకోలేదు. మరి, వారికి ఫైన్ వేసే సాహనం అధికారులు చేయగలరా? సామాన్యుల నుంచి వెయ్యి వసూలు చేసినట్టు కేసీఆర్ నుంచి ఫైన్ వసూలు చేయగలరా? అంటూ సోషల్ మీడియాలో తెగ కుమ్మేస్తున్నారు.
కేసీఆర్ అనే కాదు.. ఏ రాజకీయ నాయకుడూ మాస్క్‌లు పెట్టుకోవడం లేదు. మాస్క్ పెట్టుకుంటే మీడియాలో ఫేస్ సరిగ్గా కనిపించదనుకుంటారో ఏమో.. ఆదర్శంగా నిలవాల్సిన నాయకులు, అధికారులే మాస్క్‌ను ఎప్పుడో పక్కనపెట్టేశారు. తాజాగా, కొత్త రూల్ తీసుకొచ్చినా.. వాళ్లంతా మాస్క్‌లు పెట్టుకుంటారనే నమ్మకం లేదంటున్నారు. స్వయనా సీఎస్ సైతం మాస్క్ లేకుండా కనిపిస్తుంటారు. ఆయనకు కొవిడ్ వచ్చినప్పుడు కూడా రెండు రోజులకే మాస్క్ లేకుండా అధికారులతో రివ్యూ నిర్వహించడం అప్పట్లో వివాదాస్పదమైంది. మాస్క్‌ను కంపల్సరీ చేయడం.. ఫైన్ వేయడంపై ఎవరికీ అభ్యంతరం లేకపోవచ్చు. అయితే, ఆ రూల్ అందరికీ వర్తింపచేయకపోవడమే వివాదాస్పదం..అంటున్నారు.