అమ్జాద్ అలీఖాన్ సరోద్ గాయబ్!
posted on Jun 30, 2014 3:56PM

ప్రముఖ భారతీయ సరోద్ విద్వాంసుడు, పద్మవిభూషణ్ ఉస్తాద్ అమ్జాద్ అలీఖాన్ గురించి తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన సరోద్ వాయిద్యాన్ని చేత పట్టి రాగాలు పలికిస్తూ వుంటే తన్మయులు కానివారెవరైనా వుంటే వారిని వినికిడి లోపం వున్నవారిగా పరిగణించవచ్చు. గత 45 సంవత్సరాలుగా ఆయన ఒకే సరోద్ వాయిద్యం మీద ఆయన రాగాలు పలికిస్తున్నారు. ఆయనకు బాగా ఇష్టమైన సరోద్ అది. అయితే ఇప్పుడు ఆ సరోద్ ఆయన దగ్గర లేదు. ఎందుకంటే తాజాగా లండన్‌లో సరోద్ కచేరీ ఇచ్చిన ఆయన లండన్ ఎయిర్‌లైన్స్.కి చెందిన విమానంలో ఢిల్లీకి తిరిగి వస్తున్నారు. గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని.. అమూల్యమైన ఆ సరోద్‌ని లండన్ ఎయిర్ లైన్స్ సిబ్బంది ఎక్కడో పారేశారు. ఉస్తాద్ అమ్జాద్ అలీఖాన్ లండన్ నుంచి భార్యతో కలసి వచ్చారు. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్.లో దిగిన తర్వాత లగేజీని సరిచూసుకుంటే సరోద్ వుండే పెట్టె కనిపించలేదు. దాంతో ఆయనకి, ఆయన భార్యకి గుండెలు ఆగినంత పనైంది. అమూల్యమైన సరోద్ కనిపించకపోవడంతో ఉస్తాద్ సాబ్ దిగులుపెట్టేసుకున్నారు. దాదాపు 5 గంటల పాటు ఎయిర్ పోర్ట్ అంతా తిరిగి పనికొచ్చేవాడిని, పనికిమాలినవాడిని అందరిని తన సరోద్ బాక్స్ ఎక్కడైనా కనిపించిందా అని ఆయన అడిగారు. ఎవర్నడిగినా సమాధానం దొరకలేదు. సరోద్ పారేసిన బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ గాడిదలయితే సరోదా.. అంటే ఏంటి అని ప్రశ్నించారు. వారికి సరోద్ అంటే ఏంటో వివరిస్తే, మాకు తెలియదని పెదవులు విరిచేశారట. ఆ తర్వాత తాపీగా అలాంటి వస్తువేదైనా మేం లండన్‌లో మరచిపోయి వుంటే రేపటి విమానంలో వచ్చే అవకాశం వుందని కూల్‌గా చెప్పారట. తన సరోద్ విషయంలో బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అమ్జాద్ అలీఖాన్ వాపోతున్నారు. 45 ఏళ్ళుగా తన శరీరంలో ఒక భాగంగా వున్న సరోద్ తనకు కనిపించకపోయసరికి తాను తన శరీరంలో భాగాన్ని కోల్పోయినట్టుగా భావిస్తున్నానని ఆయన అంటున్నారు.