మళ్లీ తప్పని ఎంసెట్‌!

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం బహిర్గతం అయిపోవడంతో... ఇప్పుడు మరోసారి ఎంసెట్‌ను నిర్వహించక తప్పనిసరి వచ్చింది. కొద్దిమంది స్వార్థం కోసం మా జీవితాలను బలి చేయవద్దు మొర్రోమంటూ విద్యార్థులు ఎంత మొక్కినా ఉపయోగం లేకుండా పోయింది. మున్ముందు న్యాయపరమైన చిక్కులు ఏవీ తలెత్తకుండా ఉండాలంటే మరోసారి ఎంసెట్‌ను నిర్వహించక తప్పదంటూ నిపుణులు తేల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఒకే ఏడాది ఎంసెట్‌-1, ఎంసెట్-2, ఎపిఎంసెట్‌, నీట్-1, నీట్‌-2లతో పాటుగా ఇప్పుడు ఎంసెట్‌-3... ఇలా ఆరుసార్లు పరీక్షలను ఎదుర్కొనే గతి పట్టింది. సమాజంలో పేరుప్రతిష్టల కోసమో, పెళ్లి వ్యాపారంలో ధర ఎక్కువ పలికేందుకో, వైద్య వ్యాపారంలో దండిగా సంపాదించుకుంటారనో... కొందరు తల్లిదండ్రులు పడిన కక్కుర్తి ఫలితంగా ఇప్పుడు వేలాది ఇళ్లలో విషాదం అలముకొంది. ఒకసారి తరువాత మరోసారి ప్రశ్నాపత్రాలతో వ్యాపారం చేస్తున్నా దర్జాగా తిరుగుతున్న ‘లీకు రాకాసుల’ వల్ల తెలంగాణ చిన్నబోయింది. ‘కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకున్నాం! ఇక మా రెక్కలు అలసిపోయాయంటూ’ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంత్రులను బతిమిలాడుకున్నా ఉపయోగం లేకుండా పోయింది.

సెప్టెంబరు 30లోగా అన్ని వైద్య కోర్సులనూ భర్తీ చేయాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఇప్పుడు ఆదరాబాదరాగా మరోసారి ఎంసెట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా నోటిఫికేషన్‌ నుంచి కౌన్సిలింగ్‌ వరకూ దాదాపు మూడు నెలల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు అంత సమయం లేకపోవడంతో పరీక్షకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులకు పెద్దగా సమయం దక్కకపోవచ్చు. ఈ విషయమై సుప్రీం కోర్టుని వేడుకుంటే, లీకేజీ వ్యవహారమై మొట్టికాయలు తినవలసి వస్తుందన్నది రాష్ట్ర ప్రభుత్వం భయపడుతున్నట్లు తోస్తోంది.

ఈ మొత్తం ప్రక్రియలో జాతీయ స్థాయిలో మనది అని చెప్పుకోదగిన జేఎన్‌టీయూహెచ్‌ విశ్వవిద్యాలయం ప్రతిష్ట దారుణంగా మసకబారింది. విశ్వవిద్యాలయ అధికారుల నిర్లిప్తత, అలసత్వం వల్లే లీకేజీ సాధ్యమైందన్న విమర్శలు వినవస్తున్నాయి. కానీ ఇప్పటివరకూ విశ్వవిద్యాలయపు అధికారుల మీద ఎలాంటి చర్యలూ తీసుకున్నట్లు వార్తలు రాలేదు. ప్రస్తుతం దర్యాప్తు అధికారుల ధ్యాసంతా ఈ లీకేజీకి ప్రత్యక్ష బాధ్యులైన రాజగోపాల్ వంటి నిందితుల మీదే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి వీరి మీద కఠినమైన చట్టాలను ప్రయోగించాలని పట్టుదలగా ఉండటం ఒక్కటే ఈ మొత్తం వ్యవహారంలో మిగిలిన ఒకే ఒక్క మంచి పరిణామం.

ఎంసెట్‌ పరీక్షను మరోసారి నిర్వహించడం అన్నది ఎలాగూ తప్పదని తేలిపోయింది. ఇక మున్ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలన్నదే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. నేరస్తులు లీకేజీకి భయపడేలా కఠినమైన చట్టాలను తీసుకురావడం, విద్యాశాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరించడం, పరీక్షను నిర్వహించే సంస్థలు తుది వరకూ ఎలాంటి లొసుగుతూ మిగలకుండా చూసుకోవడం... వంటి జాగ్రత్తలు తప్పనిసరి. అన్నింటికీ మించి పిల్లలకి ఏది మంచి ఏది చెడు అని చెప్పాల్సిన తల్లిదండ్రులే, తప్పుదారి పట్టకుండా ఉండాలని ఆశించడం మినహా మరేం చేయగలం!!!