లోక్‌పాల్ గొడుగు కిందకి సేవా సంస్థలు

లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలో చేర్చిన కొత్త నిబంధనలు దేశంలోని స్వచ్ఛంద సంస్థల మెడకు చుట్టుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత నెల 20న విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం లోక్‌పాల్ చట్టంలోని  సెక్షన్ 14(1) కింద ప్రభుత్వ అధికారులు తమ ఆస్తులు, అప్పుల జాబితాను ఈ నెలాఖరులోపు ప్రభుత్వానికి సమర్పించాలి. తమతో పాటు భార్య, పిల్లల పేర్ల మీద ఉన్న ఆస్తిపాస్తులు, అప్పులు, నగదు నిల్వ, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ము తదితర వివరాలన్నీ ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ప్రభుత్వ అధికారులతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కూడా నడవాలి. ప్రభుత్వం నుంచి రూ.కోటి, విదేశాల నుంచి రూ.10 లక్షలకు పైగా విరాళాలు అందుకుంటున్న ఎన్జీవోలు అన్నీ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలు ప్రకటించాలని కేంద్రప్రభుత్వం ఆదేశించడంతో స్వచ్ఛంద సంస్థల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.

 

రిజిస్టర్డ్ సొసైటీలు, ట్రస్ట్‌లు ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల్లోని డైరెక్టర్లు, మేనేజర్లు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ముఖ్యమైన అధికారులు..అందరూ లోక్‌పాల్ చట్టంలోని నిబంధనల ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అవుతున్నారు. అభాగ్యుల బాగు కోసం పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ..అంటరానితనంపై పోరాడుతున్న ఎన్జీవో ఇలా ప్రతిరోజు వార్తల్లో వింటూనే ఉంటాం. లాభాపేక్ష లేకుండా ఒక పదిమందికో, ఇరవై మందికో మేలు చేస్తూ దానికే అమితమైన ప్రచారం కల్పించుకునే సంస్థలు దేశంలో అనేకం. స్వచ్ఛంద సంస్థంటే..స్వచ్ఛందంగా సేవ చేసే సంస్థని అర్థం. దేశంలోని దాదాపు 99 శాతం స్వచ్ఛంద సంస్థలు ఒకరిద్దరు వ్యక్తులు నడిపేవే. కుటుంబ పోషణ తదితర ఖర్చులకు సరిపడా ఆదాయాన్నిచ్చే వృత్తి లేదా ఉద్యోగం ఉండి..మిగతా సమయంలో కొంత భాగాన్ని సేవకు ఉపయోగించేవారు కొందరు.

 

తాము నెలకొల్పిన సంస్థకు విరాళాల రూపంలో వచ్చిన నిధులను పరిమితంగానైనా సొంత అవసరాలకు వాడుకునేవారు సర్వసాధారణం. పని మానుకొని పేదలు, అనాథల సేవకే జీవితాన్ని ఆర్పించి..నా కోసం రూ. 50-60 వేలు తీసుకోవడంలో తప్పేంటి..? అని ప్రశ్నించే నిర్వాహకులు చాలా మంది ఉన్నారు. అలా సేవ కాస్తా ఆర్జనకు మార్గంగా మారింది. సేవ పేరిట ప్రభుత్వాలు, విదేశాలు, ప్రజల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరిస్తున్నాయి ఈ సంస్థలు. వచ్చిన విరాళాలకు, చేసిన ఖర్చుకు పొంతన లేదని, సరైన రికార్డులు చూపించలేదని ప్రభుత్వం ఎన్నో ఎన్జీవోల అనుమతులు రద్దు చేసిన సందర్భాలు కోకొల్లలు. ఆయా సంస్థలు వివాదాల్లో ఉన్నా మీడియా పెద్దగా పట్టించుకోదు కాబట్టి ప్రజలకు తెలిసే అవకాశం లేదు..మీడియా వీటిని టచ్ చేయకపోవడానికి కారణం అత్యున్నత హోదాల్లోని వ్యక్తులు నడుపుతుండటం, రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు నడిపే సంస్థలు, కొంతమంది నాయకులను లక్ష్యంగా చేసుకుని ఉద్యమాలు, న్యాయపోరాటాలు చేస్తున్న సంస్థలు కావడమే.

 

ఎన్జీవోలు ఏం సేవలు చేస్తున్నాయి? వాటి అసలు లక్ష్యం ఏంటి? నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఎలా ఖర్చు చేస్తున్నారు? తదితర వివరాలు సామాన్యులకు తెలిసే అవకాశం లేదు. ఈ విషయాలను గురించి ఎవరైనా ఆయా సంస్థల నిర్వాహకులను అడిగినా..వాటి గురించి చెప్పరు. దేశంలో దాదాపు 45 వేల ఎన్జీవోలకు, సీఎస్‌వోలకు విదేశీ విరాళాలు అందుతున్నాయి. ఈ విరాళాలను పొందుతున్న సంస్థలన్నీ ఏటా తమ విరాళాలు, ఖర్చుల వివరాలను కేంద్ర హోంశాఖకు పంపాలి. దేశంలోని ఎన్జీవోలన్నింటిలో ఇలా ప్రభుత్వానికి సహకరిస్తున్న సంస్థలు కేవలం 10 శాతం మాత్రమేనని గణాంకాలు వివరిస్తున్నాయి. ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందన లేకపోవడంతో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా పదివేలకు పైగా వివిధ సంస్థల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ఈ మద్యనే 4470 ఎన్‌జీవోల లైసెన్స్‌లను రద్దు చేసింది. ఓ పక్క విదేశాల నుంచి నిధులు, మరోపక్క ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందుతున్న ఈ తరహా సంస్థలు చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, అందువల్ల చర్యలు తప్పటం లేదని ప్రభుత్వ వాదన.

 

అయితే స్వచ్ఛంద సేవా సంస్థలను మొత్తం ఒకే గాటన కట్టేయలేం. ఎన్జీవోలన్నీ అక్రమాలే చేస్తున్నాయని గానీ, అన్నీ సక్రమంగానే ఉన్నాయని గానీ అనడానికి లేదు. ఎన్జీవోల మీద విమర్శలు, ఆరోపణలు వచ్చిన వెంటనే వాటిపై నిష్పాక్షిక దర్యాప్తును జరిపించి నిజాన్ని నిగ్గు తేల్చే వ్యవస్థ మనదేశంలో లేదు. రాజకీయంగా తమకు అనుకూలంగా ఉండి, తమ దారికి అడ్డురానప్పుడు..అవి ఏం చేసినా ప్రభుత్వాలకు పట్టదు. అలా కాకుండా నిబంధనలను పాటించని ఎన్జీవోలన్నింటి మీద నిష్పాక్షిక విచారణ జరిపి, వాటి అసలు స్వరూపాన్ని బయటపెడితే స్వచ్ఛంద సేవ చేసే సంస్థలే మిగులుతాయి. ఇన్ని విమర్శల మధ్యన పార్లమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు, ఎన్జీవోలకు పెద్ద ఊరటనిచ్చింది. లోక్‌పాల్ చట్టంలోని 44వ సెక్షన్ సవరణకు లోక్‌సభ తాజాగా ఆమోదం తెలిపింది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎన్జీవోలు తమ ఆస్తుల వివరాల దాఖలు గడువును జూలై 31 నుంచి మరోసారి పొడిగించినట్లైంది.