"క్షమాపణల సభ"
posted on Mar 11, 2015 10:55AM

తెలంగాణ శాసనసభలో చర్చలకంటే ఒకరినికొరు ధూషించుకోవడం ఎక్కువైంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పలువురు నేతలు మాటల యుద్ధాలే చేశారు. దీంతో కొంతమంది నేతలు చింతించడం, విచారించడంతో... ప్రతిపక్ష నేత జానా రెడ్డి అటు ముఖ్యమంత్రి కేసిఆర్ లు కలసి ఫుటేజ్ లు పరిశీలించి మరీ ఇరుపక్షాలతో క్షమాపణలు చెప్పించారు. అసలు సంగతి ఏంటంటే నిన్న జరిగిన సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె అరుణ మాట్లాడుతున్నప్పుడు టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెప్పడంతో ఆమె మండిపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె మైకు విరగకొట్టి "నోర్ముయ్.. ఏం మాట్లాడుతున్నావని" వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కల్పించుకొని మీ దాదాగిరి ఏదైనా ఉంటే మహబూబ్ నగర్ లో చూపించుకోండి ఇక్కడ చూపించకండి అని సమాధానమివ్వడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో స్పీకర్, ముఖ్యమంత్రి సభను వాయిదా వేసి ఫుటేజ్ లు పరిశీలించి మంత్రి కేటీఆర్, డీకే అరుణ ఇద్దరూ క్షమాపణలు కోరాలని నిర్ణయించారు. తీరా సభ ఆరంభమయ్యాక తానెందుకు ముందు క్షమాపణ చెప్పాలంటూ అరుణ ప్రశ్నించారు. చివరకు అధికారపక్షమే మొదట క్షమాపణ చెబుతుందని సీఎం పేర్కొనడంతో కేటీఆర్ తన మాటలపై విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత డీకేఅరుణ కొద్దిసేపు తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. మైకు విరగ్గొట్టినందుకు క్షమాపణ చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి కూడా చేసిన పరూష అనే వ్యాఖ్యలపై జానా రెడ్డి, సీఎం అభ్యంతరం తెలపడంతో తన మాటలను ఉపసంహరించుకున్నారు.