చైనా... అ దేశమంతే! అదో టైపు...

చైనా అనగానే ఇండియన్స్ కి అదో లాంటి ఫీలింగ్ కలుగుతుంది. కారణం... డ్రాగన్ మనల్ని పదే పదే మోసం చేయటమే! ఇప్పటి వరకూ ఇండియా ఓడిన ఏకైక యుద్ధం చైనాతోనే. మనం కొంత భూభాగం కూడా కోల్పోయాం. అంతే కాదు, చైనా పాకిస్తాన్ తో కలిసి చేసే న్యూసెన్స్ కూడా ఇండియాకి చిరాకు పుట్టించేదే. మొన్నటికి మొన్న ఉరీ ఉగ్రదాడి తరువాత కూడా అంతర్జాతీయంగా ఒంటరైన పాక్ కు అండగా నిలిచిన ఏకైక కరుడుగట్టిన దేశం చైనా! అయితే, చైనా కేవలం ఇండియానో, మరో దేశాన్నో విసిగిస్తుంది అనుకుంటే పొరపాటే. తన స్వంత ప్రజల్ని కూడా చైనా గవర్నమెంట్ , అధికార పార్టీ ఒక ఆటాడుకుంటున్నాయి... 

 


చైనాలో మన దగ్గరిలా బోలెడు పార్టీలుండవు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనానే ప్రధానమైన పార్టీ. దానిదే అధికారం. పైగా ప్రజలకి ప్రజాస్వామ్యంలో వున్నట్టు అత్యధిక స్వేచ్ఛ కూడా వుండదు. చైనీయులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం చాలా స్వల్పం. అలాగే, ఎన్నికల్లో ఓట్లతో సాధించేది కూడా పెద్దగా ఏం వుండదు. ప్రతీసారి కమ్యూనిస్ట్ పార్టీనే మళ్లీ మళ్లీ ఎన్నికైపోతుంటుంది. మొత్తంగా చూస్తే చైనాలో వుండేది కమ్యూనిజం పేరుతో నడిచే నిర్బంధం.... 

 

చైనాలో ప్రజాస్వామ్యం లేకపోవటం, చాలా సార్లు అక్కడి పాలకులు విధించే నిర్భందం ఇవన్నీ కొత్త అంశాలేం కాదు. కాని, తాజా షాకింగ్ న్యూస్ ఏంటంటే... అక్కడ అధికార పార్టీ 70కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ పై నిఘా పెట్టనుందట! మన దగ్గర ఆ మధ్య పోర్న్ సైట్లు కొన్ని నిషేదిస్తేనే ఎంత గొడవైపోయిందో గుర్తుందిగా? కాని, చైనాలో కమ్యూనిజం ముసుగులో ఏకంగా జనాలపై నిరంతర నిఘా పెట్టనున్నారట! 

 

చైనాలోని సోషల్ మీడియా యూజర్స్, ఇతర ఇంటర్నెట్ యూజర్స్ అంతా కలిపి 70కోట్లకు పైగా వుంటారు. వీళ్లందరిపై ప్రభుత్వం కూడా కాదు అధికార పార్టీ దృష్టి పెట్టబోతోంది. అనేక అంశాలు, రూల్స్ ఆధారంగా సోషల్ క్రెడిట్ సిస్టమ్ ఏర్పాటు చేసి జనానికి గ్రేడింట్ ఇస్తారట. ఏ గ్రేడ్ వచ్చిన వారికి ప్రభుత్వం నుంచీ, పార్టీ నుంచీ అన్ని వసతులూ అందుతాయి. డి గ్రేడ్ వచ్చిన వారికి ఎలాంటి సౌకర్యాలు, ప్రొత్సాహం వుండవు! అయితే, ఈ గ్రేడింగ్ ఇయ్యటానికి తల్లిదండ్రుల్ని చూసుకోకపోవటం, ప్రభుత్వ ఆస్తులు నష్టం చేయటం, సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేయటం వంటి పనులు చేశారా లేదా అని చెక్ చేస్తారట. చేస్తే మాత్రం వారికి గ్రేడ్ తగ్గిపోతుంది. ఏ నుంచి డి వరకూ పతనం అవుతూ వస్తుంది. ఎంత గ్రేడ్ పడిపోతే సదరు చైనీస్ సిటీజన్ కి అంత గండంగా మారుతుంది జీవితం! ప్రభుత్వం నుంచీ ఎలాంటి ప్రోత్సాహమూ వుండదు వారికి!

 

అసలు దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ వారికి జనాన్ని మంచోళ్లు, చెడ్డోళ్లుగా విభజించే హక్కు ఎక్కడిది? అదీ సోషల్ మీడియా లాంటి డూప్లికేట్ ప్రపంచంలో ఏ ఆధారంగా న్యాయ నిర్ణయం చేస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలు. అన్నిటికంటే ముఖ్యంగా జనం పై నిరంతర నిఘా పెట్టడం సమంజసమేనా? అడిగేవాడే లేడు చైనాలో. ఎవరన్నా జనం నిరసన తెలుపుతూ రోడ్డుపైకి వస్తే వాడి ప్రాణానికే ప్రమాదం కమ్యూనిస్టు కంట్రీలో. అందుకే, రాజ్యం చేసే దౌర్జన్యాన్ని ఇప్పటికైతే కోట్లాది చైనా జనం నోరు మూసుకుని భరిస్తున్నారు! ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి...