తొలగిన "స్థానికత" అడ్డు

తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఏపీకి తరలిరావడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న స్థానికత సమస్య తొలగిపోయింది. తెలంగాణలో స్థిరపడి తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారి స్థానికతను నిర్థారిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 1974, 1975 నాటి ఉత్తర్వులను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా 2017 జూన్ 2 లోపు ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లే అభ్యర్థులకు విద్య, ఉద్యోగాల పరంగా స్థానికత కల్పించే అధికారాన్ని కేంద్రప్రభుత్వం ఏపీ సర్కార్‌కు కట్టబెట్టింది. తెలంగాణ నుంచి తరలివచ్చే అభ్యర్థులు ఏపీలోని 13 జిల్లాల పరిధిలో ఎక్కడ నివాసం ఏర్పరుచుకున్నా అక్కడి స్థానికులతో సమానంగా పరిగణించబడతారు.

 

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో ఉన్న సచివాలయాన్ని పదేళ్లపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు పంచింది కేంద్రప్రభుత్వం. అయితే తదనంతర కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మాకాంను విజయవాడకు మార్చారు. ఆయనతో పాటు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు బెజవాడ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా జూన్ 27లోగా అమరావతికి వచ్చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సచివాలయ ఉద్యోగులు ఏపీకి తరలిరావడానికి ఉన్న ప్రధాన అడ్డంకి "స్థానికత".

 

ఉమ్మడి రాష్ట్రంలో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరువాత అన్ని ప్రాంతాల వారికి స్థానికత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యలో రిజర్వేషన్లు కల్పించేందుకు గానూ 1973లో అప్పటి కేంద్రప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి "371(డి)" నిబంధనను తీసుకువచ్చింది. 1974లో ఇది అమల్లోకి వచ్చి, 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించి 4వ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎక్కువ సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే స్థానికతగా పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాప్రాంతానికి చెందిన ఉద్యోగులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో స్థిరపడ్డారు.  వీరి పిల్లలు ఇక్కడే చదివి ఉండటంతో వారు తెలంగాణ స్థానికత కలిగిఉన్నారు. ఉన్నపళంగా ఏపీకి తరలివస్తే తమ పిల్లల భవిష్యత్ ఏంటని వారు ముఖ్యమంత్రికి మొరపెట్టుకోవడంతో ఆయన ఏజీ సలహా మేరకు స్థానికత మార్గదర్శకాల్లో సవరణ చేయాల్సిందిగా కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు.

 

కేంద్రం ఫైలును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు పంపడంతో పరిశీలించిన రాష్ట్రపతి తనకు సంక్రమించిన అధికారాల ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల(ప్రవేశాల నియంత్రణ) ఉత్తర్వులు-1974ను సవరిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల (ప్రవేశాల నియంత్రణ) సవరణ ఉత్తర్వులు-2016గా పరిగణిస్తారు. 1974 ఉత్తర్వుల్లోని 4వ పేరాగ్రాఫ్‌లో సబ్ పేరా 2 తర్వాత సబ్ పేరా 1,2లకు సంబంధం లేకుండా 2014 జూన్ 2 నుంచి మూడేళ్లలోపు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నా అక్కడి స్థానికులతో సమానంగా పరిగణింపబడతారు.

 

ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యూలేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఉత్తర్వులు-1975ను సవరిస్తూ తాజాగా ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ ఉత్తర్వులు-2016ను రాష్ట్రపతి జారీ చేశారు. దీని ప్రకారం పేరా 7లో సబ్ పేరా 2 తర్వాత సబ్ పేరా 1, 2లకు సంబంధం లేకుండా..తెలంగాణ నుంచి ఏపీలోని ఏ ప్రాంతానికైనా జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోపు వలస వచ్చేవారిని ఏపీ స్థానిక అభ్యర్థిగా గుర్తిస్తారు. ఆ ప్రాంతంలో నివసించే స్థానికులతో సమానంగా పరిగణింపబడతారని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం గెజిట్‌లో పొందుపరిచింది. ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు పెద్ద ఉపశమనం లభించినట్లైంది.