డౌటొచ్చేలా కిరణ్ తీరు!

 

 kiran kumar reddy on samaikyandhra, kiran kumar reddy, congress, telangana, telangana state, apngo strike

 

 

రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విమర్శించడం ద్వారా కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రజల దృష్టిలో హీరో అయ్యారు. సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న కిరణ్ సమైక్యవాద ఛాంపియన్ అని ఆయన సన్నిహితులు చెబుతూ వుంటారు. తుఫాన్‌ని ఆపలేను గానీ, విభజన తుఫాన్‌ని మాత్రం ఆపగలను అని కిరణ్ చెప్పిన మాట పంచ్ డైలాగ్‌లా చాలా బాగుంది.

 

అయితే విభజనను ఆపే విషయంలో ఆయన ఆచరణ ద్వారా చేస్తున్నది మాత్రం ఏమీ లేదు. ఇంతకీ కిరణ్ సమైక్యవాదేనా లేక సమైక్యవాద ముసుగు వేసుకుని, సీమాంధ్ర ప్రజల్ని మభ్యపెడుతూ రాష్ట్ర విభజన సాఫీగా సాగిపోవడానికి సహకరిస్తున్నారా? ఈ అనుమానాలు ఆయన్ని వ్యతిరేకించేవారిలో మాత్రమే కాకుండా.. అభిమానించేవారిలో కూడా వస్తున్నాయి. ఎందుకంటే కిరణ్ తీరు అనేక సందేహాలు కలిగించేలా వుంది.

]ఒకపక్క కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా చకచకా అడుగులు వేస్తోంది. విభజనను అడ్డుకుంటానంటున్న కిరణ్ మాత్రం  విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చేదాకా వేచిచూద్దాం అని ప్రశాంతంగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేచిచూసే ధోరణి కాకుండా దూసుకెళ్ళే ధోరణే కరెక్ట్. అయితే ముఖ్యమంత్రి మాత్రం దూసుకెళ్ళేలా కనిపించడం లేదు. కేంద్రం విభజన బిల్లుని అసెంబ్లీకి పంపకపోతే అప్పుడు ఎవరూ చేయగలిగింది ఏమీ వుండదు. అందుకే ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ముందుగానే అసెంబ్లీని సమావేశపరచి విభజన వ్యతిరేక తీర్మానం పంపితే బావుంటుందన్న అభిప్రాయం సమైక్య వాదుల్లో వుంది.


ముఖ్యమంత్రి తనకు తానుగా అసెంబ్లీని సమావేశపచడానికి ఆదేశించవచ్చు. ఒకవేళ అలా తనకు తాను ఆదేశిస్తే హైకమాండ్ నొచ్చుకుంటుందనుకుంటే, విభజన తీర్మానం చేద్దామంటూ వైకాపా రాసిన లేఖ ఆధారంగానైనా అసెంబ్లీని సమావేశపరచొచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని సమైక్యవాదులు కోరుతున్నారు. హైకమాండ్‌ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించే ధైర్యం లేకపోవడం, రాష్ట్ర విభజన తర్వాత కేంద్రంలో ఉజ్వల భవిష్యత్తుకు కిరణ్‌కి అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ రావడం వల్లే కిరణ్ కిక్కురుమనడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu