కూల్డ్రింక్ డబ్బులతో పరిశోధనలు

కూల్డ్రింక్స్ వల్ల ఎలాంటి అనారోగ్యాలు వస్తాయనేదాని మీద పెద్ద జాబితానే పేర్కొనవచ్చు. ఊబకాయం దగ్గర నుంచీ చక్కెర వ్యాధి వరకూ కూల్డ్రింకులు నానారకాల రోగాలనీ పెంచి పోషిస్తున్నాయనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఇలాంటి రోగాల గురించి జరిగే పరిశోధనలని ప్రభావితం చేసేందుకు సదరు శీతలపానీయాల తయారీదారులు ప్రయత్నిస్తున్నారా అంటే ఔననేందుకు తగిన ఆధారాలు కనిపిస్తున్నాయి.

దాదాపు వంద!

బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు పరిశోధకులు వివిధ పరిశోధనలు జరిపే కొన్ని సంస్థలను గుర్తించారు. వీరు చేస్తున్న పరిశోధనలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయీ అన్న విషయం మీద ఆరా తీశారు. ఈ ఆరాతో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. అమెరికాలో దాదాపు వంద సంస్థలకు కోకో-కోలా, పెప్సీల నుంచి పుష్కలంగా నిధులు అందుతున్నట్లు తేలింది. వీటిలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉండటం కూడా విశేషం.

ప్రభావం చూపేందుకే

ఏ పని చేసినా దాని వెనుక ప్రయోజం ఉండాలనుకునే వ్యాపార సంస్థలు, ప్రజల ఆరోగ్యం గురించి ఇంతగా శ్రద్ధ తీసుకుంటున్నాయంటే అనుమానం రాక మానదు. ఇదంతా కూడా పరిశోధనలను ప్రభావింతం చేసేందుకే అంటున్నారు నిపుణులు. దానికి ఉదాహరణగా 50 ఏళ్ల క్రితం జరిగిన ఒక పరిశోధనను గుర్తుచేస్తున్నారు. అప్పట్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక ప్రఖ్యాత పరిశోధనను వెలువరించారు. అందులో చక్కెరకంటే కొవ్వు పదార్థాల వల్లే గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువని తేల్చారు. చక్కెర పరిశ్రమ నుంచి భారీగా నిధులు అందడంతో వారు సదరు పరిశ్రమకు అనుకూలంగా ఈ పరిశోధన సాగించినట్లు తరువాతి కాలంలో తేలింది. ఇప్పుడు కూడా శీతలపానీయాల దుష్ప్రభావాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ నిధుల ప్రవాహం సాగుతున్నట్లు అనుమానిస్తున్నారు.

అబ్బే అంతా ఉత్తుత్తిదే

శీతలపానీయాలు పరిశోధనలకు నిధులు అందించడాన్ని వారి సమాఖ్య వెనుకేసుకు వస్తోంది. సదరు కంపెనీలకు ప్రజల ఆరోగ్యం మీద మహా శ్రద్ధ ఉండబట్టే అవి అన్నేసి నిధులను అందిస్తున్నాయనీ... దానికి చాలా సంతోషంగా ఉందనీ సన్నాయినొక్కులు నొక్కింది. ఇక నిధులను పుచ్చుకుంటున్న ఆరోగ్య సంస్థలు కూడా- ‘ఏదో తమ సామాజిక బాధ్యతలో భాగంగా వారు ఇస్తున్నారు కాబట్టి మేం పుచ్చుకుంటున్నామే కానీ, వారిచ్చే నిధులు మా పరిశోధనలని ప్రభావితం చేయలేవు’ అంటూ బీరాలు పలుకుతున్నాయి.


నిజానికి శీతలపానీయ సంస్థల చరిత్ర చూసినవారెవ్వరికైనా, వాటి నిజాయితీ మీద అనుమానాలు కలుగక మానదు. ఉదాహరణకు 2011-2015 మధ్యకాలంలో శీతలపానీయాల మీద నియంత్రణ విధించేందుకు ప్రయత్నించిన 28 బిల్లులను అవి తీవ్రంగా వ్యతిరేకించాయి. పైగా ఇవి అందించే నిధులతో వెలువడుతున్న పరిశోధనలు కూడా ఏమంత ఆమోదయోగ్యంగా ఉండటం లేదన్నది పరిశీలకుల మాట. ఉదాహరణకు ఊబకాయం గురించి జరిగిన ఓ పరిశోధనలో ఊబకాయానికీ, శీతలపానీయాలకీ మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడకుండా.... వ్యాయామం చేయకపోవడం వల్లే ఊబకాయం వస్తుందని తేల్చేశారట. ఈ ఒక్క ఉదాహరణ చాలు, ఏదో శీతలపానీయాల ప్రభావంతో ఏదో మతలబు ఉందని అనుమానించడానికి.

ఆఖరికి చక్కెర వ్యాధికి సంబంధించిన పరిశోధనలలో కూడా శీతలపానీయ సంస్థలు వేలుపెట్టడం చూస్తే మున్ముందు డయాబెటీస్ రోగులు కూడా శీతలపానీయాలను తాగవచ్చు అనే పరిశోధనలు వచ్చినా రావచ్చు. అందుకనే పరిశోధనా సంస్థలు శీతలపానీయాల ఉత్పత్తిదారుల నుంచి వచ్చే నిధులను తిరస్కరించాలంటూ వాదనలు వినిపిస్తున్నాయి.

 

- నిర్జర.