ధరణి పోర్టల్ తో దేవాలయ భూములకు గండి
posted on Jul 24, 2023 10:18AM
ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలోని దేవాలయ భూములను ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని బ్రాహ్మణ సమాజం ఆవేదన చెందుతుంది. . ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలని, అన్యాక్రాంతమవుతున్న దేవాలయ భూములను కాపాడాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. భూముల అన్యాక్రాంతంతో బ్రాహ్మణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో బ్రాహ్మణ, అర్చక సంఘం శంఖారావ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బ్రాహ్మణ సంఘం కీలక పాత్ర పోషించిందని అర్చక సంఘం తీర్మానించింది. సంఘం అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీలో చర్చించి మేనిఫెస్టోలో పెట్టే ఆలోచన చేయాలని బ్రాహ్మణ సమాజం కోరుకుంటుంది. అనాదిగా వస్తున్న వృత్తినే ఎంచుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులు కొత్తగా ఆలోచిస్తేనే వృద్ధిలోకి వస్తారని వారి అభిప్రాయం.
వృత్తిని కొనసాగిస్తూనే ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలవైపు దృష్టి సారించాలనే డిమాండ్ ను ఈ సమావేశం బలపరిచింది. ప్రస్తుతం దేశంలో చట్టసభల్లో బ్రాహ్మణులు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ లేరు. పీవీ నర్సింహారావు హయాంలో 26 మంది ఉండేవారు. గత ఏడాది సెప్టెంబరు 17న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిస్తే జీవో 57తో 5,625 మంది దేవాలయ అర్చక ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో దేవాలయ ఇనాం భూములపై దేవాదాయ శాఖ అధికారులు ఉన్నత న్యాయస్థానం ఆదేశించినా న్యాయం చేయడం లేదు. బ్రాహ్మణ సంక్షేమానికి కేసీఆర్ ఎనలేని కృషి చేశారని, దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యం కింద ప్రతి నెలా రూ.12,500 అందిస్తున్నారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అంటున్నారు.