సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్‌ ఎన్వీ రమణ.. 

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్‌ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. జస్టిస్‌ బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ.. హోంశాఖకు పంపనుంది. హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జస్టిస్‌ బోబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్‌ 24న జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ పదవి అలంకరించిన తొలి తెలుగు వాడిగా జస్టిస్‌ ఎన్వీ రమణ గుర్తింపు పొందనున్నారు.

జస్టిస్ ఎన్‌వీ రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకట రమణ. కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న జన్మించారు. సుప్రీం కోర్టులో 2017 ఫిబ్రవరి 2న నియమితులయ్యారు. ఇంకా రెండేళ్ల పదవీ కాలం అంటే, 2022 ఆగస్టు 26 వరకూ ఆయనకు సర్వీసు ఉంది. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బీఎల్ చదివారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్), ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్ గా ఉన్నారు. క్యాట్‌లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరఫున పనిచేశారు.2000 జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మినెంటు జడ్జిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2013 సెప్టెంబరు 2న దిల్లీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. అనంతరం 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu