టీడీపీ నేతలు మృతి.. చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి
posted on Mar 21, 2016 10:25AM

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు టీడీపీ నేతలు మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఈ రోజు తెల్లవారుజామున చిత్తూరు నగర శివారు యాదమరి మండలం ముత్తిరేవుల క్రాస్ వద్ద చెన్నై-బెంగళూరు హైవేపై లారీ-బోలేరు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కుప్పంలోని శాంతిపురం మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటమునిరెడ్డి, పార్టీ నేతలు బాలకృష్ణ, సురేశ్ లు మృతి చెందగా.. సర్పంచ్ గోపాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఈప్రమాదం గురించి తెలుసుకున్న చంద్రబాబు, లోకేశ్ లు షాక్ కు గురయ్యారు. వెంటనే పార్టీ చిత్తూరు జిల్లా నేతలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న వారిద్దరూ చనిపోయిన పార్టీ నేతల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.