మోడీ 'తంథాన' పలికితే..భారతానికి విషమ ఘడియలే!

 

 

 

ఏమీ తెలియనట్టు, ఇంతకుముందెలాంటి ఘోరకలికి తాను కారణం కాదని బుకాయించజూచే వాడికి నటించేవాడికి మనపెద్దలు "నంగనాచి తుంగబుర్ర'' అని ఎద్దేవా చేసేవారు! ఇప్పుడు అలాంటి పరిణామం "హిందుత్వ'' పేరిట మతరాజకీయాలు నడుపుతున్న భారతీయ జనతా పార్టీ మూలంగా ఏర్పడింది. నిజానికి అది "హైందవం'' అనేది అసలైన సిసలైన లోకికభారతం, అదే "ఆది బౌద్ధం''. కులాతీత, మతాతీత వృత్తి సమాజాన్ని బౌద్ధధర్మం నిర్మించింది. దాన్ని చెడకొట్టి వృత్తులమీద, శ్రమజీవనంమీద ఆధారపడి బతికే వృత్తి సమాజాన్ని కాస్తా దెబ్బతీసి సమాజంలోని ఛాందస వర్గం సోమరిపోతులను, దోపిడీ వర్గాన్ని పెంచే మతరాజకీయానికి ప్రాణం పోసింది. ఆ సంప్రదాయ ఛాయల్లో స్వాతంత్ర్యానికి ముందూ, ఆ తరువాతా ఎదిగివచ్చిన ఛాందసవర్గానికి "హిందూ మహాసభ'' పేరిట కొన్నాళ్ళూ, 'జనసంఘ్' పేరిట మరికొన్నాళ్ళూ, 'రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్' ముసుగులో ఇంకొన్నాళ్ళు పెరుగుతూ వచ్చిన మతశక్తులకు ఎమర్జెన్సీ కాలంలో ఏర్పడిన "జనతాపార్టీ''లోకి దూరి, మత రాజకీయాలకు కానరాని ప్రతినిధిగా అవతరించిందే "భారతీయ జనతా పార్టీ''. దానికి పొట్టిపేరు బి.జె.పి. జనతాపార్టీ ప్రభుత్వంలో దూరడం ద్వారా కొన్నాళ్ళ పాటు మతరాజకీయాన్ని పెట్టెలో దాచి, జనతా ప్రభుత్వం కూలిపోయిన తరువాత తిరిగి మతరంగంలో ["హిందూత్వ''] జనంలో ప్రవేశించింది. ఎమర్జెన్సీ దుష్టపాలనకు నిలువెత్తు చిహ్నంగా మిగిలిపోయిన ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం జనరల్ ఎన్నికల్లో కుప్ప కూలిపోవటంతో హిందూత్వశక్తులు జనతా ప్రభుత్వంలో పాగావేశాయి.


 

ఆదినుంచీ ఈ శక్తులకు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చింది. ఆర్.ఎస్.ఎస్. సంస్థ. ఈ సంస్థలో ప్రధాన కార్యకర్త అయిన నాధోరామ్ గాడ్సే జాతిపిత గాంధీజీని ప్రార్థనా సమయంలో దారుణంగా హత్య చేసినవాడు. గాంధీ హత్యతో దేశం అట్టుడికి పోతున్న సమయంలో ఆర్.ఎస్.ఎస్. కార్యాలయాలపైన ప్రజలు తిరగబడుతున్న సమయంలో గాంధీ హత్యలతో తనకెలాంటి 'సంబంధంలేద'ని గాడ్సే ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త కాదనీ బుకాయించడానికి ఆర్.ఎస్.ఎస్. నాయకత్వం ప్రయత్నించి విఫలమవడం, గాడ్సే తమ్ముడు తన సోడరుడే గాంధీజీని హత్య చేసినవాడని అతను ఆర్,ఎస్,ఎస్, క్రియాశీల కార్యకర్త అని తరువాత వాంగ్మూలం యివ్వడం చేరపరాని చరిత్ర. ఈ చరిత్ర పూర్వరంగంనుంచి వచ్చిన వాడే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ! ఆ మాటకొస్తే బి.జె.పి. రాజకీయాలను మతరాజకీయాలుగా మలిచి, పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ దేశంలో అమలు జరిపిస్తున్నది ఆర్.ఎస్.ఎస్., భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంస్థలే.
 



ఈ తానులోని 'ముక్క' అయిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్ లో 2000 మంది ముస్లీం మైనారటీల ఊచకోతకు కారణం అయి, దేశ లౌకిక (సెక్యులర్) ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికే ప్రమాదంగా పరిణమించడం దేశప్రజలకు తెలుసు; అలాంటి మోడీని రేపు 2014 నాటి జనరల్ ఎన్నికలలో నరేంద్రమోడీని బిజెపి జాతీయ ప్రచారక్ సంఘ్ సారధిగా, అదే ఆర్.ఎస్.ఎస్. తానులో మరో ముక్కగా అవతరించిన బిజెపి అధ్యక్షుడుగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ తన నిర్ణయంగా గోవాలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకపక్షంగా ప్రకటించాడు. దాంతో బిజెపి శ్రేణుల్లో, నాయకుల్లో ముసలం పుట్టింది. ఇందుకు బిజెపి అగ్రనాయకుడు, ప్రధానమంత్రి పదవి తానింతవరకు నిర్వహించలేదన్న దిగులుతో ఉన్న లాల్ కిషన్ అద్వానీ కోపంతో గోవా సమావేశానికి గ్రైర్ హాజరై ఇంటివద్ద కూర్చున్నాడు. అయితే ఈ 'అలకపాన్పు' మానడానికి ఆయనకు రెండురోజులు కూడా పట్టలేదు.


ఏడాదిలోగా జనరల్ ఎన్నికలు జరుగనుండగా బిజెపిలో ముసలం వల్ల కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం లేదా పాత ఎన్.డి.ఎ. పక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం కష్టమని భావించిన బిజెపి అగ్రశ్రేణి నాయకులంతా పునరాలోచన చేసుకుని అద్వానీపై వత్తిడి తెచ్చి, ఆయన అన్ని పార్టీ పదవులకు యిచ్చిన రాజీనామానుంచి వెనక్కి తగ్గెట్టు చేయగలిగారు! కాని, ఇలా వెనక్కి తగ్గడానికి మూడ్ను చేసిన ఒక ప్రకటనలో అద్వానీ "పార్టీలో కొందరు పదవీకాంక్షతో తీసుకుంటున్నందువల్లనే పార్టీ పక్కతోవలు పడుతోంద''ని విమర్శించారు. నిజానికి "ప్రధానమంత్రి'' పదవిని తాను అనుభవించలేదన్న 'గుర్రు' అద్వానీలో కూడా చాలాకాలంగా గూడుకట్టుకుని ఉండిపోయిందని మరవరాదు! అయితే అదే తపనలో ఉన్న నరేంద్రమోడీ గుజరాత్ లో తన ప్రభుత్వం చేసిన మానవమారణకాండ తాలూకు కేసులనుంచి తప్పించుకుపోవాలన్న కోర్కె బలీయంగా తనలో పీడిస్తున్నందున బిజెపిలోని ఆర్.ఎస్.ఎస్. ముఠాను కూడగట్టుకుని దేశ ప్రధానమంత్రి పదవివైపు మోరలు చాచాడు.



అతని కోర్కెను రాజ్ నాథ్ సింగ్ రానున్న ఎన్నికల్లో బిజెపిని తిరిగి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన వాతావరణాన్ని సమీకరించగల శక్తి మోడీకి ఉందని భావించి, పార్టీ ప్రచార సంఘానికి సారథిగా చేశాడు. అయితే రాజ్ నాథ్ సింగ్ నిర్ణయం తప్పని బిజెపి సీనియర్ నాయకులు కొందరు భావించడానికి కారణం ఉంది. నరేంద్ర మోడీ మతతత్వ రాజకీయాన్ని మానవమారణకాండకు ఆయుధంగా మార్చినందువల్ల, ఇప్పటికి గుజరాత్ వరకే పరిమితమై ఉన్న మత దురహంకార రాజకీయం రేపు అతను ప్రధాని అయ్యే పక్షంలో దేశాన్ని అల్లకల్లోలంలోకి నెట్టే ప్రమాదం లేకపోలేదని లోలోన భయ సందేహాలున్నాయి.



మత దురహంకారానికి సరిహద్దులుండవన్న నిజాన్ని జర్మనీలో, అబిసేనియా (ఇటలీ)లో హిట్లర్, ముస్సోలినీలు నిరూపించడం ఒక చారిత్రిక సత్యం. ఆ హిట్లర్ "ఆర్య జాతి'' రక్తం ఏ జాతికన్నా కూడా పవిత్రమైనదన్న నమ్మకం మీదనే జర్మనీలో యూదుల్ని లక్షల సంఖ్యలో కాల్చి చంపాడు, గ్యాస్ ఛాంబర్లలో బంధించి చంపాడు. ఆ హిట్లర్ ఆరాధకులే భారతదేశంలోని హిందూ మహా సభ, విశ్వహిందూ పరిషత్, ఆర్.ఎస్.ఎస్. వర్గీయులని మరచిపోరాదు! ఈ 'హిట్లర్ ఆరాధన' పూర్వరంగాన్ని ఏయే భారత ప్రతినిధులు హిట్లర్ నాజీ పార్టీతో ఒకనాడు కలిసి వచ్చారో ప్రసిద్ధ పరిశోధకుడు జెఫ్రలాట్ భారతదేశంలో 'హిందూత్వ'' ముఠా పుట్టుపూర్వోత్తరాలను వెల్లడిస్తూ రాశాడు!
 


ఎందుకంటే, అయోధ్యలో తప్పుడు భావాల మీద ఆధారపడి బాబ్రీ మసీదును కూలగొట్టిన 'హిందుత్వ' ముఠా, గుజరాత్ లో మైనారిటీళ ఊచకోతకు వెనుకాడని మతశక్తులు రేపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రత్యామ్నాయం తామేనని భావిస్తున్నందువల్ల భారతదేశ లౌకిక వ్యవస్థను "కుమ్మరి పురుగుల్లా'' తొలుచుకుంటూ వెళ్ళి గుజరాత్ ఘటనలను జాతీయస్థాయిలో పునరావృత్తం చేయరన్న గ్యారెంటీ లేదు, ఆ భరోసాను ఎంతటి శాంతికాముకుడూ, మరెంతటి ప్రజాస్వామ్యవాదీ కూడా యివ్వలేరు. కనుకనే రాజ్యాంగబద్ధమైన లౌకిక, ప్రజాతంత్ర సమసమాజ వ్యవస్థాభిలాషులంతా ఇనుమడించిన చైతన్యంతో మతశక్తుల రేపటి ఎజెండాను ఈ రోజు నుంచీ, ఈ క్షణం నుంచీ మిలిటెన్సీతో ఎదుర్కొని లౌకిక సమైక్య భారత వ్యవస్థను, విభిన్నజాతులు, మతధర్మాలు, భిన్నభాషలతో దీపించె భారతదేశాన్ని వేయికళ్ళతో కాపాడుకోవలసిన అవసరం ఉంది. ప్రమత్తత ప్రాణం తీస్తూంది, అప్రమత్తత ప్రాణం పోస్తూంది! కనుకనే 'మోడీ' తపనను తుంచివేయాలి గాని 'తంథాన' పలకరాదు!