ఏపీలో కేసీఆర్ క్యాస్ట్ కార్డ్.. వైసీపీకి మద్దతుగా వ్యూహ రచన?

ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ కు రాష్ట్రంలో చావో రేవో పరిస్థితి ఉంది. పార్టీ జాతీయ పార్టీగా మార్చిన తరువాత నుంచీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు పుంజుకుంటుండటం, మరో వైపు తెలుగుదేశం కూడా తన ఉనికిని బలంగా చాటుతుండటంతో ఆయనకు ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం సంగతి అటుంచి తెలంగాణలో అధికారాన్ని కాపాడుకోవడమే ముఖ్యంగా మారిపోయిన పరిస్థితి. అయినా కూడా కేసీఆర్ దృష్టి అంతా తెలంగాణపై కంటే.. ఏపీ ముఖ్యమంత్రి, తన మిత్రుడు జగన్ కు మద్దతుపైనే ఉంది. తద్వారా తెలంగాణలో ఏపీ సెటిలర్స్ అండ తనకు దక్కేలా చూసుకోవాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఏ విధంగా అయితే ఏపీలో జగన్ అధికారానికి రావడానికి తోడ్పాటు అందించారో, అదే విధంగా వచ్చే ఎన్నికలలో కూడా సహకారం అందించాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న పార్టీలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. అంతే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల ఆందోళనలు, ఆగ్రహం రూపంలో విస్పష్టంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ.. మరో సారి అధికారం అన్న వ్యూహంతోనే పావులు కదుపుతూ పరస్పర సహకారం కోసం ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగానే.. ఏపీలో రాజకీయ సమీకరణాలు సమూలంగా మార్చేసే తెలుగుదేశం- జనసేన పొత్తును మొదట్లోనే విచ్ఛిన్నం చేయడంపైనే దృష్టి పెట్టాయి. అందులో భాగంగానే కేసీఆర్ క్యాస్ట్ కార్డును ప్రయోగించాలని నిర్ణయించారు. ఏపీలో జనసేన తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళితే.. జగన్ మరోసారి అధికారం సాధ్యం కాదన్న అవగాహనతో ఉన్న కేసీఆర్.. అదే జరిగితే.. ఆ పొత్తు ప్రభావం బీఆర్ఎస్ పై కూడా తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇప్పటికీ పటిష్టమైన, బలమైన క్యాడర్ బేస్ ఉండటం, అలాగే జనసేనానికీ తెలంగాణలో అభిమానుల అండతో పాటు కాపు సామాజిక వర్గం కూడా అండగా నిలుస్తుందన్న అంచనాలతో ఉన్న కేసీఆర్.. ఏపీలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొడవ కుండా  తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక వేళ ఆ రెండు పార్టీలూ పొత్తు కుదుర్చుకుంటే.. ఆ కూటమికి కీలకం కానున్న కాపు సామాజిక ఓట్లలో చీలికకు తనదైన శైలిలో వ్యూహరచన చేస్తూ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే తొలుత ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన  మాజీ ఐఏస్ అధికారి తోట చంద్రశేఖర్ ను నియమించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు వరకూ తోట చంద్రశేఖర్ జనసేనలో ఉన్నారు. అయితే కాపు సామాజిక వర్గాన్ని గంపగుత్తగా తనవైపు తిప్పుకోగలిగే సత్తా, సామార్ధ్యం ఆయనకు ఉన్నాయా అన్న విషయంలో కేసీఆర్ కు అనుమానాలు ఉన్నాయి. అందుకే ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన కన్నా ను కూడా సంప్రదించారు. కన్నా కమలం పార్టీకి రాజీనామా చేయడానికి ముందే కేసీఆర్ ఆయనకు బీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఆహ్వానం పంపారు. అయితే కన్నా ఆ ఆహ్వానాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తనను అడ్డుపెట్టుకుని కాపు సామాజిక ఓట్లు చీల్చాలన్న వ్యూహంలో భాగస్వామ్యం కాలేనని సున్నితంగా చెప్పారు. ఇక ఆ తరువాత కేసీఆర్ పవన్ కల్యాణ్ తో కూడా తెలంగాణలో పొత్తు విషయమై సంప్రదించారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఒక సందర్భంలో పవన్ కల్యాణ్ కూడా ఈ సంగతి అన్యాపదేశంగానైనా చెప్పారు. తెలంగాణలో జనసేన, బీఆర్ఎస్ పొత్తు ద్వారా ఇటు తెలంగాణలో లబ్ధి పొందడమే కాకుండా.. అటు ఏపీలో తన మిత్రుడు జగన్ కు కూడా ప్రయోజనం చేకూరుతుందని కేసీఆర్ భావించారు. అయితే అందుకు జనసేనాని సానుకూలంగా స్పందించలేదని అంటున్నారు. మొత్తంగా జనసేన- తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు పొసగకుండా చేయడం, అది కుదరకపోతే.. కాపు సామాజిక వర్గంలో చీలక ద్వారా లబ్ధి పొందడం అన్న లక్ష్యంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పావులు కదుపుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందుకే తెలుగుదేశం, జనసేనల పొత్తు కుదిరితే.. ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నను పదే పదే తెరమీదకు తీసుకురావడం ద్వారా జనసేన శ్రేణుల్లో.. ఆ డిమాండ్ బలంగా వినిపించేలా చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ పని మొదలెట్టేసింది. ఫర్ సపోజ్ కలిసి పోటీ చేసి ఏపీలో అత్యధిక స్థానాలను తెలుగుదేశం, జనసేన కూటమి గెలుచుకుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబా? పవన్ కల్యాణా అని ప్రశ్నిస్తూ.. జనసేన శ్రేణుల్లో ఆశ, ఆశక్తి రేకెత్తించేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇదే డిమాండ్ జనసేన శ్రేణుల నుంచి వస్తే.. ఇరు పార్టీల మధ్యా పొత్తు కుదిరినా క్షేత్ర స్థాయిలో ఓట్ల బదలీ జరిగే అవకాశం ఉండదన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరో వైపు తెలంగాణలో కాపు సామాజిక వర్గ ఓట్లలో చీలిక వచ్చి.. ఆ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్న కీలక  నియోజకవర్గాలలో బీఆర్ఎస్ లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నది బీఆర్ఎస్ వ్యూహంగా చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో తెలుగుదేశం- జనసేనల మధ్య పొత్తు అన్న మాటే ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీల అధినేతలను కలవరపాటుకు గురి చేస్తోందనడంలో సందేహం లేదని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ ఎక్స్ పోజ్ అయిపోయినట్లేనా?

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ సీబీఐ ఉచ్చు బిగించిందా.. అంటే వైసీపీ శ్రేణుల నుంచే ఔనన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఒక సారి వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ తాజాగా మరో సారి విచారణకు పిలిచింది. ఈ సారి ఫిబ్రవరి 25న హైదరాబాద్ సీబీఐ ఆఫీసుకు రావాలని సీబీఐ ఆ నోటీసులలో ఆదేశించింది. అదే సమయంలో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి  వైఎస్ భాస్కరరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన ఎక్కడ విచారణకు హాజరౌతారో చెప్పాలని ఆయనకే ఛాయిస్ ఇచ్చింది.  భాస్కరరెడ్డికి నోటీసుల విషయం పక్కన పెడితే.. నెల రోజులు కూడా పూర్తి కాకుండా అవినాష్ రెడ్డిని రెండో సారి విచారణకు పిలవడంతో  అవినాష్ ను సీబీఐ అరెస్టు చేస్తుందన్న అభిప్రాయం విస్తృతంగా వ్యక్తం అవుతుంది. తొలి సారి ఆయనను విచారణకు పిలిచిన సందర్భంలోనే అవినాష్ అరెస్టు పై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎంపి కనుక అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి లోక్ సభ స్పీకర్ అనుమతి కూడా సీబీఐ తీసుకుందని అప్పట్లోనే గట్టిగా వినిపించింది. పైగా ఆనవాయితీకి భిన్నంగా అప్పట్లో ఆయనను సాయంత్రం నాలుగు గంటల సమయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ ఆదేశించడంతో.. అదే రోజు రాత్రి అయనను అరెస్టు చేసే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేశాయి. అయితే అప్పట్లో సీబీఐ ఆయనను అరెస్టు చేయలేదు.. కానీ కీలక విషయాలను ఆయన నుంచి రాబట్టిందని అంటున్నారు. ముఖ్యంగా దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ చేరుకునేందుకు అవసరమైన కీలక సమాచారం అవినాష్ రెడ్డి నుంచి రాబట్టిన సీబీఐ.. సీఎం జగన్ ఓఎస్డీ, జగన్ సతీమణి భారతి పిఎలను విచారణకు పిలిచి ప్రశ్నించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.   వివేకా హత్య ఘటన  సాక్ష్యాలు  మాయం చేయడం దగ్గర నుంచీ, ఆయన గుండెపోటుతో మరణించారన్న ప్రచారం వరకూ అన్నిటా అవినాష్ రెడ్డి పాత్రే కీలకమనీ సీబీఐ నిర్ధారణకు వచ్చిందని చెబుతున్నారు.   వివేకా హత్య కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారిన క్షణం నుంచీ సీబీఐ దూకుడు పెంచింది. ఏపీలో విచారణ సందర్భంగా ఆ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్నో అవరోధాలను ఎదుర్కొనడమే కాకుండా.. పలు అపవాదులనూ ఎదుర్కొంది. స్వయంగా దర్యాప్తు సంస్థ అధికారులపైనే కేసులు నమోదయ్యాయి. బెదరింపులూ వచ్చాయి. వీటన్నిటి వెనుకా ఉన్నది వైఎస్ అవినాష్ రెడ్డే నని సీబీఐ నిర్ధారణకు వచ్చిందని చెబుతున్నారు. అందుకే కేసును ఏపీ నుంచి మార్చాలంటూ.. వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంను ఆశ్రయించిన సందర్బంగా, సీబీఐ కూడా ఏపీ నుంచి కేసు విచారణను మార్చాలనే పేర్కొంది. ఆ సందర్బంగా సుప్రీం కోర్టుకు కేసు దర్యాప్తులో అవరోధాలకు సునీత చెప్పిన ప్రతి కారణమూ అక్షరసత్యమని వాగ్మూంలం కూడా ఇచ్చింది.   వివేకా హత్య కేసు దర్యాప్తులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారనీ,  ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని వివేకా కుమార్తె  సునీతా రెడ్డి కోరగా, ఈ కేసు విచారిస్తున్న సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీం కోర్టుకు తెలియజేసింది.  ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు కేసును తెలంగాణకు బదలీ చేసింది. అంతే అప్పటి వరకూ మందగమనంగా సాగుతున్న సీబీఐ దర్యాప్తు ఒక్కసారిగా జోరందుకుంది. కేసు హైదరాబాద్ కు మారిన తరువాత వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు జోరందుకోవడమే కాకుండా.. అంతకు మందు కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందన్న అభిప్రాయాలు కూడా బలపడ్డాయి. ఇక గత జనవరిలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించిన తరువాత ఈ హత్య కేసు పాత్ర ధారులే కాకుండా, వెనుక ఉన్న సూత్ర ధారుల విషయం కూడా వెలుగులోనికి వస్తుందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.   

జై భారత్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మార్మోగుతున్న నినాదాలు!

నిర్బంధం, వివక్ష, అభివృద్ధి లేమి.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) లో భారత అనుకూల ఆందోళనలకు దారి తీశాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, దివాళా తీసిన పాకిస్థాన్ ( ఆ దేశ రక్షణ మంత్రే దివాళా అని ప్రకటించారు), ఇప్పుడు వేర్పాటు ఉద్యమం.. కాదు కాదు పీవోకేలో భారత్ లో విలీనం డిమాండ్ లో విలీన ఉద్యమం తారస్థాయికి చేరింది.   1947లో జమ్ము-కశ్మీర్ నుంచి కొంత భాగాన్ని పాకిస్థాన్  ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాన్నే పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పిలుస్తున్నారు.  ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఆజాద్ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్థాన్ గా విభజించింది.  పాక్ ఆక్రమిత కశ్మీర్ జనాభా (అజాద్ కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్) 2020 నాటికి దాదాపు  52 లక్షలు. 1947కు ముందు   పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ కూడా జమ్మూ-కశ్మీర్లో భామే.  పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని రెండు భాగాలలో ఒకటైనగిల్గిట్ బాల్టిస్టాన్ లో భారత్ లో విలీనం డిమాండ్ తో జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. విభజన సమయంలో, జమ్మూ కశ్మీర్ భారతదేశం లేదా పాకిస్థాన్లో చేరాలా అనే అంశంపై ఆనాటి పాలకుడు మహారాజా హరిసింగ్ దానిని స్వతంత్ర దేశంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు.  అయితే జమ్ము-కశ్మీర్ లో శాంతియుత పరిస్థితులు పునరుద్ధరణ తరువాత ఆ ప్రాంతం విలీనం గురించి ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవాలని అప్పటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటిన్ సూచన మేరకు ప్రయత్నాలు జరిగినా.. అది జరగలేదు. అనంతరం హరిసింగ్ 1947 అక్టోబర్ లో   ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ కు  గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్  ఆమోదంతోనే కాశ్మీర్ వివాదానికి బీజం పడింది.   ఏడు దశాబ్దాలుగా దోపిడీ, వివక్షలు అనుభవిస్తూ గడిపిన పాక్ ఆక్రమిత  కాశ్మీర్ ప్రజలకు భారత్ లో అభివృద్ధి, సంస్కరణలు తమ దయనీయ స్థితి నుంచి విముక్తి పొందే మార్గాన్ని చూపించాయి.  తాము ఒకపక్క అనేక సమస్యలతో సతమతమవుతుంటే తమకు పోరుగునే ఉన్న భారత్ లోని కశ్మీర్ అభివృద్ధిలో నడుస్తుండడంతో తాము కూడా భారత్ లో కలవాలన్న కాంక్ష పెరిగింది. అదే వారిని విలీన ఉద్యమానికి ఆకర్షితులను చేస్తున్నది.   

కాగడా పెట్టి వెతికినా కనిపించని పొలిటికల్ హార్మనీ!

భిన్నత్వంలో ఏకత్వం.. భారత్ డీఎన్ఏలోనే ఉందని ప్రధాని నరేంద్రమోడీ ఘనంగా చెబుతుంటారు. దేశంలో ప్రజల మధ్య సామరస్యం సంక్షోభమో, సమస్యో వచ్చిన ప్రతి సారీ కనిపిస్తూనే ఉంటుంది. అకేషన్ కు అనుగుణంగా దేశ ప్రజలు ఐక్యతను చాటుతూనే ఉన్నారు. దేశంలో మతసామరస్యం కోసం రాజకీయ నాయకులు, పార్టీలూ శ్రమించాల్సిన అవసరం లేదు. దేశ ప్రజలకు తమ ఐక్యతను ఎలా చాటాలో, ఎప్పుడు చాటాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. కుల,మత, వర్గ విభేదాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటే అని జనం పదే పదే చాటుతున్నారు. వాస్తవానికి సామరస్యం ఉండాల్సింది రాజకీయ పార్టీల మధ్యే. రాజకీయ నేతల మధ్యే. ప్రజాస్వామ్య మనుగడలోనే ప్రమాదంలో పడేసేంతగా రాజకీయ పార్టీల మధ్య ప్రత్యర్థి పార్టీలు అన్న భావన సమసిపోయి, శతృపార్టీలా అన్నంతగా విభేదాలూ, విద్వేషాలు ప్రజ్వరిల్లుతున్నాయి. వాస్తవానికి రాజకీయ పార్టీల మధ్య వైరుథ్యాలు, విభేదాలు సైద్ధాంతిక పరిధి దాటేసి వైరి పక్షాల స్థాయికి చేరిపోయింది. ఈ ధోరణి ఇందిరా గాంధీ హయాం నుంచీ కనిపిస్తున్నా.. ఇఫ్పుడు మోడీ హయాంలో మాత్రం కొత్త ఎత్తులకు ఆ ప్రమాదకర ధోరణి చేరింది. పార్లమెంటు సమావేశాలలో పార్టీల సభ్యులు బద్ధ శత్రువుల్లా మారి ఘర్షణలకు సైతం దిగుతున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో పెచ్చరిల్లాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలు వ్యక్తిగత దూషణలకు, పరస్పర నిందారోపణలకు పరిమితమౌతున్నాయి. రోజుల తరబడి సభా కార్యక్రమాలు జరగకుండా వాయిదాల పర్వం నడవడం అన్నది గతంలో ఎప్పుడూ, ఎన్నడూ లేని విధంగా ఇప్పుడొక ఆనవాయితీగా మరిపోయింది.  పార్టీల ఈ తీరు, వైఖరి  ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా పరిణమించింది. విపక్షాల సూచనలను విమర్శలను ఖండించడానికే అధికార పార్టీ సభ్యులు ఉన్నారా అన్నట్లుగా బీజేపీ, మిత్రపక్షాలు వ్యవహరిస్తుంటే.. ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకించడానికే ఉన్నట్లుగా విపక్ష సభ్యుల తీరు కనిపిస్తోంది.  రాజకీయ పార్టీల ఈ వైఖరి కారణంగా ప్రజాహితం, దేశ హితం, ప్రజా హితం కోసం చర్చలు జరగడం లేదు. పరస్పరం గౌరవించుకుంటూ.. ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చలకు వేదికగా నిలవాల్సిన పార్లమెంటు.. ఒక కుస్తీగోదాలా మారిపోయింది. అధికార విపక్ష సభ్యులు పరస్పర నిందలు, ఆరోపణలతో పార్లమెంటు సమావేశాలలో అర్ధవంతమైన చర్చ ను అటుంచి అసలు సమావేశాలనే అర్ధరహితంగా మార్చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అప్రజాస్వామిక విధానాలకు నిలువెత్తు నిదర్శనంగా కనిపించాయి. ఒక అంశంపై చర్చ విషయంలో మంచి చెడుల సంగతి ఇసుమంతైనా పట్టించుకోకుండా.. విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి, కనుక మనం సమర్ధించాలి అన్నట్లుగా అధికార పక్షం, అధికార పక్షం సమర్ధిస్తోంది కనుక మనం వ్యతిరేకించాలి అన్నట్లుగా విపక్షం తమ తమ పట్టుదలలకే పరిమితమై ప్రజలను, ప్రజా సమస్యలను గాలికొదిలేశాయి. ఆరోగ్యకర పార్లమెంటరీ వ్యవస్థలో పాలక, ప్రతిపక్షాల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, కాగడా పెట్టి వెతకినా కనిపించడం లేదు.  దురదృష్టవశాత్తూ పాలక, ప్రతిపక్షాలు మధ్య  ద్వేష భావమే తప్ప సుహృద్భావం  మచ్చుకైనా లేదు. అందుకే సమాజంలోనూ విద్వేష ధోరణులు గోచరిస్తున్నాయి.  ప్రజాస్వామ్యం పరిఢ విల్లాలంటే ముందుగా రాజకీయ పార్టీలలోనూ, ఆయా పార్టీల నాయకులలోనూ మార్పు రావాలి. సామరస్య ధోరణి రాజకీయ పార్టీలలో కనిపించాలి. 

కన్నా క్లారిటీ.. టీడీపీలోకే!

కన్నా లక్ష్మినారాయణ తాను ఏ పార్టీలో చేరబోతున్నాన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు.   భవిష్యత్ కార్యాచరణపై ఆదివారం ఆయన తన అనుచరులతో  సమావేశమై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరడమే మంచిదని ఆ సమావేశంలో అత్యధికులు చెప్పడంతో కన్నా తాను తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నెల  23న చంద్రబాబు సమక్షంలో కన్నా టీడీపీ కండువా కప్పుకుంటారని ఆయన అనుచరులు తెలిపారు.  కన్నాను తమ పార్టీలో చేర్చుకునేందుకు  జనసేనతో పాటు బీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేసింది.  వైసీపీ నుంచి కూడా కన్నా కోసం ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు.  ఇక  కన్నా లక్ష్మినారాయణకు టీడీపీలో చేరేందుకే  నిర్ణయించుకోవడంతో తెలుగుదేశం పార్టీకి  చేరికతో టీడీపీకి అదనపు బలం చేకూరినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇక బీజేపీలో కన్నాకు పొమ్మన లేకపోగపెట్టిన చందంగా వ్యవహరించిన సోము వీర్రాజు చేజేతులా పార్టీకి ఇంతో అంతో ఉన్న బలాన్ని కూడా దూరం చేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ఒక్క కన్నా లక్ష్మీనారాయణ అనే కాదు.. రాష్ట్ర విభజన తరువాత అటు కాంగ్రెస్ లో ఇమడ లేక, ఇటు తెలుగుదేశంలోనో, మరో పార్టీలోనో చేరలేక బీజేపీలో చేరిన పలువురు మాజీ కాంగ్రెస్ నాయకులు బీజేపీలో ఉక్కపోతకు గురౌతూనే ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చేప్పేశారు. ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తారని చాలా కాలంగా, అంటే ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన నాటి నుంచీ ప్రచారం జరుగుతున్నా.. ఆయన ఏ పార్టీలో చేరతారన్న విషయంలో నిన్న మొన్నటి దాకా క్లారిటీ లేదు. జనసేనలోనా, తెలుగుదేశంలోనా అన్న చర్చ జరిగింది. అయితే తెలుగువన్ మాత్రం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన నాడే ఆయన రూటు తెలుగుదేశం వైపే అని చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. కన్నా తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించేశారు. అయితే కన్నా బాటలోనే నడిచే నేతలు ఏపీ బీజేపీలో ఇంకా పలువురు ఉన్నారు. కేంద్ర మాజీ  మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా త్వరలోనూ బీజేపీ గూటిని వీడే అవకాశం ఉంది.  బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరు పట్ల ఆమె బహిరంగంగానే తన అసమ్మతిని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆమె కూడా త్వరలో పార్టీ వీడే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక పార్టీ నుంచి వైదొలగి, తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన కన్నా ప్రధాని మోడీ పట్ల తనకు గౌరవం, నమ్మకం ఉన్నప్పటికీ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు పట్ల తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని ప్రకటించారు. ఒక దశలో కన్నాను బుజ్జగించేందుకు బీజేపీ అధిష్ఠానం ఒక కేంద్ర మంత్రిని రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది.  ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావే శాలకు, అలాగే గత నెల  24న భీమవరంలో  జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ కూడా కన్నా   డుమ్మా కొట్టినప్పుడే ఆయేన బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమైపోంది.  ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతులు కలిపిన నేపధ్యంలో కన్నా అయితే టీడీపీలో కాదంటే జనసేనలో చేరడం ఖాయమని కూడా పరిశీలకులు తేల్చేశారు.  వాస్తవానికి బీజేపీకి కన్నా గుడ్ బై చెప్పేందుకు గ్రౌండ్ గత  ఏడాది డిసెంబర్ లోనే  ప్రిపేర్ అయ్యింది.   జనసేన రాజకీయ వ్యవహారాల  కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.   అ పాత మిత్రులం  కదా  అందు  ఓ సారి  కలిసి కబుర్లు చెప్పు కున్నాం. ఈ భేటికి రాజకీయ ప్రాధన్యత లేదని  అటు నాదెండ్ల, ఇటు కన్నా కూడా అప్పట్లో చెప్పినా వారి మాటలను ఎవరూ విశ్వసించలేదు.   అప్పట్లోనే జనసేనలో  కన్నా లక్ష్మీనారాయణ  చేరిక అంటూ ప్రచారం జరిగింది. ఇంతకీ బీజేపీలో కన్నా ఉక్కపోతకు కారణం ఎవరంటే మాత్రం కచ్చితంగా సోము వీర్రాజే అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు.  కన్నా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న సమయంలో  నియమించిన ఆరు  జిల్లాల అధ్యక్షులను సోము వీర్రాజు  తొలగించారు. దీంతో  అంతవరకూ కొంత సైలెంట్ గా ఉన్న కన్నా ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకపోవడంతో పాటు  జనసేనతో    సంబంధాలు బలహీనం అవ్వడానికి కూడా   సోము వీర్రాజ  వైఖరే కారణమని  కన్నా కుండ బద్దలు కొట్టారు. సోము వీర్రాజు వైఖరిని కన్నా లక్ష్మీనారాయణ  బహిరంగంగానే  తప్పుబట్టారు.  కన్నా లక్ష్మీనారాయణ విమర్శలపై సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రంలో  ఏం జరుగుతుందో  పార్టీ అధిష్టానానికి తెలుసునని వీర్రాజు అప్పట్లోనే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో కన్నా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు డుమ్మా కొట్టినప్పుడే బీజేపీలో ఆయన కౌంట్ డౌన్  స్టార్ట్ అయిందని, ఆ తరువాత  రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన గైర్హాజరు కావడంతో   ఆయన పార్టీ మారడం ఖాయమని అప్పట్లోనే నిర్ధారణ అయ్యింది.  అయితే కన్నా ఏ పార్టీలో, ఎప్పడు చేరుతున్నారు అన్నదే తేలాల్సి ఉందని అప్పట్లో పరిశీలకుల పేర్కొన్నారు.  ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు   కన్నాకు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. ఇప్పుడు కన్నా తెలుగుదేశంలో చేరనున్నట్లు స్వయంగా ప్రకటించేసి క్లారిటీ ఇచ్చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దూకుడు పెంచింది. ఒక వైపు ఈ కేసులో ఈడీ దూకుడు కొనసాగుతుండగా, మరో పైవు సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన సీబీఐ.. దానికి కొనసాగింపుగా తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను  హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో గత ఏడాది డిసెంబరు 11న సీబీఐ విచారించింది.  అలాగే ఇదే కేసులో మనీ లాండరింగ్ కోణం నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను ఈడీ అరెస్టు చేసింది. ఇదే కుంభకోణంలో అవినీతి, అధికార దుర్వినియోగం, ఎక్సయిజ్ పాలసీ కారణంగా ఢిల్లీ రాష్ట్ర ఖజానాకు ఏర్పడిన నష్టం తదితరాలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఈ కుంభకోణం కేసులో ఏకకాలంలో రెండు దర్యాప్తు సంస్థలూ దూకుడు పెంచడంతో ఏ క్షణంలో ఎవరు అరెస్టవుతారు అన్న ఉత్కంఠ రాజకీయవర్గాలలో నెలకొని ఉంది.  ఈ స్కామ్‌లో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారించింది. మరికొందరిని  అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండుకు తరలించింది. వీరిపై తీవ్రమైన అభియోగాలు నమోదైనందున బెయిల్ ఇవ్వడానికి స్పెషల్ కోర్టు నిరాకరించింది.   ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఇప్పటికే  ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసిన సీబీఐ పలువురిని అరెస్టు చేసి వారిపై చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో సమర్పించింది. స్కామ్‌లో పలువురి ప్రమేయం ఉన్నందున వారిని విచారించే ప్రక్రియ కొనసాగుతున్నదని, ఆ తర్వాత తదుపరి చార్జిషీట్‌లో అదనపు వివరాలు వెలుగులోకి వస్తాయంటూ అప్పట్లోనే సీబీఐ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. ఇప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎంకు రెండో సారి నోటీసులు జారీ చేయడంతో ఈ సారి  మనీశ్ సిసోడియాను ప్రశ్నించి వదిలేస్తుందా? లేక అరెస్టు చేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తొలిసారి విచారణకు హాజరైనప్పుడు బీజేపీలో చేరాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేశారంటూ మనీష్ సిసోడియా మీడియా ముఖంగా చెప్పడాన్ని తీవ్రంగా పరిగణించిన సీబీఐ తమకు రాజకీయాలతో సంబంధం లేదని వివరణ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఈ కుంభకోణం కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించి పకడ్బందీగా దర్యాప్తు కొనసాగిస్తోందని చెబుతున్నారు. దీంతోనే మనీశ్ సిసోడియాకు రెండో సారి నోటీసులు జారీ చేయడంతో ఆయనను ప్రశ్నించి వదిలేస్తారా? అరెస్టు చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే  ఎమ్మెల్సీకవితకు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందన్నప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఎందుకంటే గతంలో సీబీఐ విచారణ అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ,  లిక్కర్ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, ఒక సాక్షిగా మాత్రమే తనను సీబీఐ అధికారులు విచారించారంటూ కవిత చెప్పారు. అ యితే ఆ తర్వాత గంటల వ్యవధిలోనే సీఆర్‌పీసీలోని సెక్షన్ 191 కింద కవితకు సీబీఐ నోటీసులు జారీచేసి కొన్ని డాక్యుమెంట్లు, ఆధారాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.  రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వ్యక్తిగతంగా స్థిర, చరాస్తుల వివరాలు, డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల ఆర్థిక లావాదేవీలు తదితరాలను 2022 వరకూ క్రోడీకరించి ఇవ్వాలని ఆ నోటీసుల్లో సీబీఐ పేర్కొన్నది. ఆ ప్రకారం వివరాలను కవిత వారికి సమర్పించినట్టు ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మనీశ్ సిసోడియాను ఒకసారి విచారించిన తర్వాత రెండో సారి కూడా నోటీసులు జారీచేయడంతో కల్వకుంట్ల కవితకు సైతం ఇలాంటి నోటీసులు అందుతాయని నిపుణులు అంటున్నారు.  

వైఎస్ షర్మిల అరెస్ట్

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మళ్లీ అరెస్ట్ అయ్యారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు శంకర్ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ  షర్మిలపై నమోదు అయింది. దీంతో మహబూబాబాద్‌లో  షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకుని,  ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.  షర్మిల పాదయాత్రలో భాగంగా.. శనివారం సాయంత్రం మహబూబాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ  షర్మిల విమర్శించడమే కాకుండా పరుష పదజాలంతో దూషించారంటూ బీఆర్ఎస్ స్థానిక నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి  పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు.   గతేడాది నవంబర్‌లో వైయస్ షర్మిల.. తన పాదయాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డిపై తీవ్ర అనివీతి ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు ఆప్పట్లో వైయస్ షర్మిల రాత్రి బస చేసే బస్సును దగ్ధం చేసే ప్రయత్నం చేయడమే కాకుండా,  అక్కడ ఆ పార్టీకి చెందిన కార్లను సైతం చేశారు.  దీంతో తమపై జరిగిన దాడిని  షర్మిల ఖండించి..  నిరసన చేపట్టారు. ఇది శాంతి భద్రతల సమస్యకు దారి తీసే పరిస్థితి ఉందని భావించిన పోలీసులు అప్పట్లో ఆ  ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించే క్రమంలో  షర్మిల గాయపడ్డారు. దీనికి నిరసనగా అప్పట్లో షర్మిల  తనకు భద్రత కావాలని కోరుతూ.. బీఆర్‌ఎస్ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేసిన కారులోనే  ప్రగతి భవన్‌కు పయనమయ్యారు.  ఆ సందర్భంగా పోలీసులు క్రేన్ సహయాంతో షర్మిల ప్రయాణిస్తున్న కారును, ఆమె కారులో ఉండగానే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అరెస్టు చేశారు. దాంతో అప్పట్లో షర్మిల పాదయాత్ర నిలిచిపోయింది. అనంతరం ఆమె కోర్టు అనుమతితో పాదయాత్రను పున: ప్రారంభించారు. పాదయాత్ర పున: ప్రారంభించిన రోజుల వ్యవధిలోనే  షర్మిలను మళ్లీ అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. 

మళ్లీ జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. ఈ సారి అసమ్మతిని తట్టుకోగలరా?

ఏపీ సీఎం జగన్ మరో సారి తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారా? ఇటీవల ఆయన ఎమ్మెల్యేలు, మంత్రుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎవరికైనా ఔననే అనిపించకమానదు. మునిగిపోతున్న వైసీపీ నావను వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గట్టెక్కించాలన్న పట్టుదలతో ఉన్న జగన్.. అందు కోసం ఏం చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్లు స్పష్టంగానే తెలుస్తోంది. మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన వ్యక్తం చేస్తున్న అసంతృప్తి, అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వడంతో కేబినెట్ సహచరులు విఫలం అవుతున్నారన్న ఆగ్రహం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నేరుగా హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో.. మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.   మోస్ట్లీ ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత ఏ క్షణంలోనైనా జగన్ తన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశాలున్నాయనీ వైసీపీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలోనే జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించిన హింట్ ఇచ్చారు. పని తీరు మెరుగు పరచుకోకుండా ఉద్వాసన తప్పదని  కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఓ నలుగురు మంత్రులకు హెచ్చరిక కూడా చేశారు. అప్పట్లో   లిక్కర్ కుంభకోణంలో సీఎం జగన్ సతీమణి భారతిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిని మంత్రులు స్పందించడం లేదంటూ.. కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మంత్రులను  తప్పిస్తానని హెచ్చరించినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆ తరువాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించిన వార్తలు పెద్దగా వినిపించలేదు. ఆరు నెలల తరువాత మళ్లీ ఇప్పుడు మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై జోరుగా ప్రచారం జరుగుతోంది.   అయితే గతంలో మగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన అని ప్రచారం జరిగితే.. ఇప్పుడా మంత్రుల సంఖ్య ఆరడజనుకు పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం జరిగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణగా కనీసం అరడజను మంతి మంత్రులకు ఉద్వాసన తప్పదని పార్టీ శ్రేణుల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సారి వైఎస్ వివేకా హత్య కేసులో నేరుగా తన కుటుంబం వైపే వేలెత్తి చూపుతూ విపక్షాలు విమర్శలు చేస్తున్నా.. మంత్రుల స్పందన తూతూ మంత్రంగానే ఉందన్న ఆగ్రహం జగన్ లో ఉందని అంటున్నారు. ఈ సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసనకు గరయ్యే వారిలో ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా సుదీర్ఘ ఎదురు చూపుల అనంతరం గత కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పర్యాటక శాఖ మంత్రి పదవి దక్కిన రోజా, అలాగే తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా గత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కించుకున్న విడదల రజనిల పేర్లు ఉన్నాయని అంటున్నారు.   అయితే గత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా వైసీపీలో పెద్ద ఎత్తున ఆగ్రహ, అసమ్మతి జ్వాలలు ఎగసి పడ్డాయి. అప్పటితో పోలిస్తే వైసీపీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు, శ్రేణులు, కార్యకర్తలలో కూడా అసమ్మతి చాలా చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సమాయత్తం కావడం పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఎన్నికల వేళ మరో సారి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకత్వంపై అసమ్మతి భగ్గుమనడానికి ఇది దారి తీస్తుందన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది.  గత పునర్వ్యవస్థీకరణ సందర్భంగా  కొందరు పాతవారిని కొనసాగిస్తూ కొందరిని తప్పించడంతో అసంతృప్తి భగ్గు మంది. కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరి కొందరు మౌనం దాల్చి తన నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు.   మరోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే మళ్లీ గతంలో జరిగిన నట్లుగానే అసంతృప్తి భగ్గుమనడం తథ్యమని రాజకీయ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడిన తరుణంలో ఈ సారి ఆ వ్యక్తమయ్య అసంతృప్తి, అసమ్మతి తాటాకు మంటలా కాకుండా బడబాగ్నిగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలలో అసంతృప్తి గూడు కట్టుకుందనీ, కొందరు బహిరంగంగానే పార్టీ అధినాయత్వాన్ని, ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారనీ, ఇటువంటి తరుణంలో మరోసారి  జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడితే.. వెల్లువెత్తే అసమ్మతి, అసంతృప్తిని తట్టుకోవడం అంత సులభ సాధ్యం కాదని పార్టీ వర్గాలే అంటున్నాయి.  

బాల బాబాయ్.. తారకరత్న పిలుపు తలచుకుని కన్నీరు పెట్టిన బాలయ్య

నందమూరి తారకరత్న మరణం నందమూరి కుటుంబీకులు, ఆ కుటుంబ అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు, తెలుగుసినీ పరిశ్రమలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూసిన వారందరూ ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు. తారకరత్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరౌతున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ.. బాల బాబాయ్ అంటూ అప్యాయంగా పిలిచేవాడని తలచుకుని తలచుకుని కన్నీరు పెడుతున్నారు. ఆ పిలుపు ఇక వినబడదన్నఊహే తట్టుకోలేకపోతున్నానని బాలయ్య అన్నారు. తారకరత్న మరణం తమ కుటుంబానికీ, తెలుగుదేశం ఫ్యామిలీకి తీరని లోటని పేర్కొన్నారు. నటుడిగా తనను తాను నిరూపించుకున్నతారకరత్న.. రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేసేందుకు సమాయత్తమౌతున్న తరుణంలో గుండెపోటుకు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరమన్నారు. గుండెపోటుకు గురై మూడు వారాలకు పైగా మృత్యువుతో అలుపెరుగని పోరాటం చేసిన యోధుడని అన్నారు.  మృత్యుంజయుడై తిరిగి వస్తాడని ఆశించిన తమనందరినీ శోక సంద్రంలో ముంచేశాడని విలపించారు. తారకరత్న ప్రేమ, అనురాగం ఎప్పటికీ మనతోనే ఉంటాయని ఆయన మరో బాబాయ్ నందమూరి రామకృష్ణ అన్నారు.  తారకరత్న మృతి పట్ల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పుడు కలిసినా బావా అంటూ ఆప్యాయంగా పలుకరించే వారని గుర్తు చేసుకున్నారు. బావా అన్న పిలుపు తారకరత్న నోటి వెంట ఇక వినపడదన్న ఊహే తట్టుకోలేకపోతున్నానని లోకేష్ పేర్కొన్నారు.  నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగులు ఆగిపోయాయంటే నమ్మశక్యం కావడం లేదన్నారు. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటుని లోకేష్ పేర్కొన్నారు. తారకరత్న నిష్క‌ల్మ‌ష‌మైన  ప్రేమ‌, స్నేహ బంధం   ఎప్పుడూ తన హృదయంలో సజీవంగా ఉంటాయనీ పేర్కొంటూ, తారకరత్నతో ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.  తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తారకరత్న మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. శనివారం రాత్రి బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన తారకరత్న భౌతిక కాయాన్ని ఆదివారం (ఫిబ్రవరి 19) ఉదయం ఆ  మోకిలలోని ఆయన నివాసానికి తరలించారు. సోమవారం ఉదయం నుంచీ ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం ఫిలింఛాంబర్ లో ఉంచుతారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో అంత్యక్రియలు నిర్వహిస్తారు.  

మృత్యువుతో పోరాటంలో అలసి ఒరిగిన తారకరత్న!

ఆశలు ఆవిరి అయిపోయాయి. తీవ్ర గుండెపోటుకు గురై మూడు వారాలకు పైగా బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న కన్నుమూశారు. వైద్యానికి స్పందిస్తున్నారనీ, ఆయన తప్పకుండా కోలుకుంటారనీ అంతా భావించారు. వైద్యులు కూడా తారకరత్న ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేననీ, అయితే కోలుకోవడానికి కొంత సమయం పడుతుందనీ చెప్పారు. అయితే అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. దీంతో నందమూరి కుటుంబం, తారకరత్న అభిమానలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. కుప్పంలో గత 27ర తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నను బతికించేందుకు వైద్యులు బ్రహ్మ ప్రయత్నమే చేశారు. అయినా ఫలితం లేకపోయింది. దాదాపు 22 రోజులకు పైగా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. శనివారం (ఫిబ్రవరి 18) సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. గత నెల 27న గుండెపోటుకు గురైన వెంటనే ఆయనను కుప్పంలోని ఆసుపత్రికి, అక్కడి నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. తారకరత్న బాబాయ్, టీడీపీ నేత, హీరో బాలయ్య ఆస్పత్రి వద్దే ఉండి అన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు.  బెంగళూరులోని నారాయణ హృదయాలలో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. తొలుత  ఎక్మో అమర్చి చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్యం కొంచం మెరుగుపడగానే ఎక్మో తొలగించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు.   ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న ఆయన లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గత నెల 27న   కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజల కార్యక్రమంలోనూ, అనంతరం మసీదులో ప్రార్ధనలలోనూ కూడా తారకరత్న పాల్గొన్నారు. అనంతరం పాదయాత్రలో అడుగు కదిపారు. నడుస్తుండగానే ఒక్క సారిగా తారకరత్న కుప్పకూలిపోయారు. బెంగళూరు నాయారణ హృదయాలయ ఆసుపత్రిలో తొలి రెండు రోజులూ ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత ఆయన చికిత్సకు స్పందిస్తున్నారనీ, ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు పేర్కొన్నారు. ఆ మేరకు హెల్త్ బులిటిన్ కూడా విడుదల చేశారు. గుండె సంబంధిత సమస్యలన్నీ తొలగిపోయాయనీ, అయితే మెదడు డ్యామేజి కావడంతో ఆ చికిత్స చేస్తున్నామనీ వైద్యులు తెలిపారు.  శుక్రవారం (ఫిబ్రవరి 17)కూడా తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఆయన పూర్తిగా కొలుకోవడానికి కొంత సమయం పడుతుందనీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే అంతలోనే శనివారం సాయంత్రం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించడంతో కన్నుమూశారు. 

తారకరత్న కన్నుమూత

నందమూరి తారకరత్న కన్నుమూశారు.  గత 22 రోజులుగా  బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. దీంతో నందమూరి ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.   తారకరత్న  కోలుకుంటున్నారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన శనివారం సాయంత్రం కన్నుమూశారు. శనివారం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.   గత నెల 27న నారా లోకేష్   ‘యువగళం’ పాదయాత్రలో ప్రరంభ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.  వెంటనే తారకరత్నను కుప్పం ఆస్ప్రత్రికి తరలించి  చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగుళూరుని నారాయణ హృదయాలయకు తరలించారు. తారకరత్నని కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలుగా ప్రయత్నించారు.విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం కూడా వచ్చింది.  ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దిగ్గజ నటుడు సీనియర్ ఎన్టీఆర్ మనువడైన తారకరత్న 1983లో హైదరాబాద్ లో  జన్మించారు.  నటుడిగా 2002లో వచ్చిన  ఒకటో నంబర్ కుర్రాడు  చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.   ఆ తర్వాత  యువరత్న ,  భద్రాది రాముడు ,  అమరావతి , తదితర చిత్రాలలో నటించారు. ఆ తరువాత  క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా  పలు సినిమాలలో నటించారు. ఇటీవలే     తెలుగుదేశం పార్టీలోనే చేరి రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యారు.  ఈ ఉదయం నుంచే నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి   విషమంగా ఉం సమాచారం అందుకున్న ఆయన కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నారు. చివరి నిముషం వరకూ ఆయనను కాపాడడానికి వైద్యులు ప్రయత్నించారు. నిన్న కూడా తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందనీ, చికిత్సకు స్పందిస్తున్నారనీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించి ఈ సాయంత్రం కన్నుమూశారు. 

తెలంగాణలో సీపీఎంతోనే మా పొత్తు.. బీఆర్ఎస్ కు సీపీఐ షాక్!

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో పొత్తులపై సీపీఐ క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ ఇచ్చిందని చెప్పడం కంటే.. అధికార బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు అయితే తెలంగాణలో సీపీఎంతోనే మా పొత్తు అని కుండ బద్దలు కొట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. ఎశరినీ బతిమాలం, మాతో అవసరం ఉందనుకుంటే.. ఏ పార్టీ అయినా సరే మా దగ్గరకే రావాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో   ఫలితాలను తారుమారు చేసే సత్తా, బలం మాపక్షాలకు ఉందన్న ఆయన రాష్ట్రంలో ఎవరు అధికారం చేపట్టాలన్న విషయాన్ని వామపక్షాలే నిర్ణయిస్తాయని అన్నారు.     అతి త్వరలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభల నిర్వాహణకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్‌తో కలిసిన వామపక్షాలు.. అప్పట్లో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. బీఆర్ఎస్ తో తమ మైత్రి కేవలం మునుగోడుకే పరిమితం కాదనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోనూ.. ఆ తరువాత రానున్న సార్వత్రిక ఎన్నికలలోనూ కూడా బీఆర్ఎస్ తో మైత్రి పొత్తు కొనసాగుతుందని ప్రకటించిన సంగతి విదితమే.   అయితే ఇప్పుడు హఠాత్తుగా బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకున్నట్లుగా ప్రకటనలు గుప్పించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.  గత రెండు మూడు రోజులుగా బీఆర్ఎస్ తో వామపక్షాల మైత్రీ బంధం తెగిపోయిందన్న సంకేతాలు వస్తున్నా.. తాజాగా కూనంనేని ప్రకటనతో అది నిర్ధారణ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. అయితే కూనంనేని సాంబశివరావు ప్రకటనపై బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎటువంటి స్పందనా రాలేదు. 

పాలమూరు- రంగారెడ్డి పనులకు సుప్రీం ఓకే.. ఎన్బీటీ జరిమానాపై స్టే

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఒకే రోజు  రెండు వేర్వేరు కేసులకు సంబంధించి ఎదురు దెబ్బ, ఊరట లభించాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీంలో తెలంగాణ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలితే.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి భారీ ఊరట లభించింది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కొనసాగించేందుకు కేసీఆర్ సర్కార్ కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి విధించిన 900 కోట్ల రూపాయల జరిమానాపై స్టే విధించింది. జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎమ్.ఎమ్. సుందరేష్ లతో కూడిన ధర్మాసనం పాలమూరు-రంగారెడ్డి తాగునీటి ప్రాజెక్టు కు ఆమోదం తెలిపింది. తదుపరి విచారణ ఆగస్టు నెలకు వాయిదా వేసింది.  7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది అంటే రిజర్వాయర్ స్థాయి వరకూ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగించవచ్చని పేర్కొంది. అలాగే రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా చేసే కాలువల నిర్మాణ పనులను సాగునీటి ప్రాజెక్టుగా పరిగణించుకుని ప్రాజెక్టు పనులకు యథావిధిగా కొనసాగించేందుకు తెలంగాణ సర్కార్ కు మార్గం సుగమమౌతుంది. 

ఎమ్మెల్యేల ఎరకేసులో బీఆర్ఎస్ సర్కార్ కు సుప్రీంలో దక్కని ఊరట

ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ సర్కార్ సుప్రీం ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ కేసు   సుప్రీంలో  శుక్రవారం ( ఫిబ్రవరి 17) విచారణకు వచ్చింది. అయితే సుప్రీం కోర్టు ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ   హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కనీసం ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకూ ఎవరినీ అరెస్టు చేయవద్దంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కూడా సుప్రీం పరిగణనలోనికి తీసుకోలేదు.  సీబీఐను తాము నియంత్రించలేమని   జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రా లతో కూడిన ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

ఎమ్మెల్యే కాలేరుకు తృటిలో తప్పిన ప్రమాదం

అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు తృటిలో ప్రమాదం  తప్పింది. సీఎం పుట్టినరోజు వేడుకల్లో భాగంగా  అంబర్ పేట్ నియోజకవర్గం లో  సీఎం జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో కాచిగూడ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా  బీఆర్ఎస్ కార్యకర్తలు కాల్చిన బాణా సంచా  నుంచి వెలువడ్డ నిప్పురవ్వలు గ్యాస్ బెలూన్‌లపై పడటంతో అవి పేలిపోయాయి. దీంతో మంటలు రావటంతో ఎమ్మెల్యే, కార్యకర్తలు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోడ్డుపై పడిపోయారు. అదృష్ణ వశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

అయిన వారికే అందలాలు.. తెలంగాణలో రైటైర్డ్ బ్యూరోక్రాట్లకే పెద్ద పీట

తెలంగాణలో బ్యూరోక్రాట్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ లకే ఆయన పెద్ద పీట వేస్తుండటంతో అధికారుల్లో అసంతృప్తి అండర్ కరెంట్ గా రగులుతోంది. సర్వీసులు ఉన్న అధికారులను పక్కన పెట్టి మరీ పదవీ విరమణ చేసిన వారినే ఆయన అందలం ఎక్కిస్తున్నారన్న భావన చాలా మంది  అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఇష్టం ఉన్న అధికారులు పదవీ విరమణ కాగానే వారికి సలహాదారు పదవో, లేదా పదవీ విరమణ చేయడానికి ముందు వారు నిర్వహించిన వాఖలో బాధ్యతలను అప్పగించడంతో సర్వీసులో ఉన్న అధికారుల్లో అసంతృప్తి గూడుకట్టుకుంటుంది.   ముఖ్యమంత్రి వ్యవహారాలను చూసే ముఖ్య కార్యదర్శి సైతం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరే. ముఖ్యంగా రాష్ట్ర విభజన తరువాత అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారిన తరువాత కేసీఆర్ ఈ కొత్త ట్రెండ్ ను తీసుకు వచ్చారని అంటున్నారు.  ఆర్థిక, ప్రజాపంపిణీ, సాధారణ పరిపాలన, పశుసంవర్ధక శాఖల్లో పదవీ విరమణ చేసిన వారే అదే హోదాలో కొనసాగుతున్నారు.   అయితే రాష్ట్ర విభజన నాటికి 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రం ఆ తరువాత 32 జిల్లాల రాష్ట్రంగా మారడంతో ఐఏఎస్ ల కొరత కారణంగానే రిటైర్డ్ అధికారులను కొనసాగించాల్సి వచ్చిందన్న వాదన వినిపిస్తున్నా... రాష్ట్రంలో పని చేస్తున్న చాలా మంది ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టడంపై విమర్శలు వినవస్తున్నాయి.  

పశ్చిమ బెంగాల్.. అయినా పరిస్థితులు మారలేదు!

పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ మారినా.. పరిస్థితుల్లో ఇసుమంతైనా మార్పు కనిపించలేదు. గవర్నర్- ముఖ్యమంత్రి మధ్య విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి. పాత గవర్నర్ స్థానంలో కొత్త గవర్నర్ వచ్చినా ప్రభుత్వం- గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి మాత్రం అలాగే కొనసాగుతోంది.   గవర్నర్ గా  జగదీప్‌ ధనకర్‌ ఉన్నప్పుడు రాష్ట్రంలో నిత్యమూ ఘర్షణ పూర్వక వాతావరణమే కనిపించేది. గవర్నర్‌ ధన్‌కడ్‌, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య సఖ్యత సంగతి పక్కన పెడితే నిత్యం ఉప్పు నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ ఉండేవారు. ధన్ కడ్ గవర్నర్ గా ఉన్నంత కాలమూ.. ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం కూడా ఇరువురి మధ్యా సామరస్యపూరిత వాతావరణం ఉన్న దాఖలాలు లేవు. అయితే మమతకు ఊరట కలిగించేలా ధన్ కడ్   ఉప రాష్ట్రపతిగా ధన్‌కడ్‌   బాధ్యతలు స్వీకరించారు. ధన్ కడ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా వ్యవహరించిన తీరు కారణంగానే మోడీ ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించారని పరిశీలకుల విశ్లేషణలు పక్కన పెడితే ఆయన రాష్ట్రం నుంచి వెళ్లిపోవడంతో మమత ఊపిరి పీల్చుకున్నారనే చెప్పారు.  ఆయన స్థానంలో  1977 ఐఏఎస్‌ కేడర్‌కు చెందిన  సీవీ ఆనంద్ ను పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా మోడీ ఏరి కోరి ఎంపిక చేసి మరీ పంపించారు. గత ఏడాది  నవంబర్‌లో సీవీ ఆనంద్ బోస్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి నాళ్లలో గవర్న్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ మధ్య సుహృద్భావ పూరిత వాతావరణమే ఉండింది. మమత రచనలు, పెయింటింగ్లు, సంగీత కంపోజిషన్లు, అల్బమ్ లపై గవర్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే మమతా బెనర్జీ సైతం ఆయనకు ఎంతో ప్రీతిపాత్రమైన రసగుల్లాలను బహుమతిగా ఇచ్చారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ మమత ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని ఇటీవలి బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ఆనంద్ బోస్ అక్షరం పొల్లుపోకుండా చదివారు.  ముఖ్యంగా ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఏ, పీఎంఏవై నిధుల విషయంలో కేంద్రాన్ని తప్పుపడుతూ ఉన్న భాగాలను కూడా ఆయన అక్షరం పొల్లుపోకుండా చదివేశారు.   అయితే ఇటీవల ఆయన వైఖరి మారింది. అందుకు కారణం ఆయన వ్యవహార శైలి పట్ల కేంద్రం కన్నెర్ర చేయడమేనని సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ గవర్నర్ లో భేటీ అయ్యారు. వీరి మధ్య ఈ భేటీ దాదాపు రెండు గంటలకు పైగా జరిగింది. సాధారణంగా గవర్నర్ అంత సేపు ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వరు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీ తరువాత నుంచే గవర్నర్ వైఖరిలో మార్పు వచ్చిందని పరిశీలకులు సైతం చెబుతున్నారు. ఆ భేటీ తరువాత లోకాయక్త నియామకం విషయంలో గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించారు. ప్రమాణ స్వీకారం సైతం చేయలేదు. పైగా లోకాయుక్త నియామకం ఉత్తర్వులలో చట్టపరమైన లొసుగులు ఉన్నాయని ఆరోపణలు సైతం చేశారు. ఆ వెంటనే తనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న మమతా బెనర్జీకి సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన నందినీ చక్రవర్తికి గవర్నర్ ఉద్వాసన పలికారు. దీంతో పశ్చిమ బెంగాల్ లో గవర్నర్- ప్రభుత్వం మధ్య సంబంధాలు మళ్లీ మొదటికి చేరుకున్నాయి.  

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం.. కవిత భర్తకూ నోటీసులు?

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అంటే.. ఈడీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఆ అనుమానాలే బలపడుతున్నాయి.   ఈ కుంభకోణంలో సౌత్ గ్రూపు పోషించిన పాత్ర కీలకమని ఈడీ స్పెషల్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో సహా ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా   డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి ఈ గ్రూపును నడిపించినట్లు ఆరోపించింది. ఇందులో ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవను, శరత్‌చంద్రారెడ్డి  అరెస్టు అయ్యారు.   తదుపరి దర్యాప్తులో భాగంగా ఎవరి వంతు అవుతుందనే చర్చలు మొదలయ్యాయి.   ఈ కేసులో ఈడీ కవిత భర్త అనిల్‌కు కూడా నోటీసు జారీచేసి ప్రశ్నించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పన టైంలో అంటే గత ఏడాది మేలో హైదరాబాద్ లో కవిత నివాసంలోనే చర్చలు జరిగాయని ఈడీ ఇప్పటికే నిర్ధారణకు వచ్చింది.   ఆ సమావేశంలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె భర్త అనిల్, పిళ్ళై, బోయిన్‌పల్లి అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి పాల్గొన్నారని ఈడీ అంటోంది. ఆ రోజు చర్చల్లో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఈ స్కామ్‌లో ఏ మేరకు ఆయనకు భాగస్వామ్యం ఉంది అన్న వివరాలను రాబట్టేందుకు కవిత భర్తను ప్రశ్నించాలని ఈడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   

నిలకడగా తారకరత్న ఆరోగ్యం.. తాజా హెల్త్ బులిటిన్ లో వెల్లడి

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోంది.   ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు   హెల్త్ బులిటిన్ బులిటిన్ విడుదల చేశాయి.   తారకరత్న ఆరోగ్యం  నిలకడగా ఉందని పేర్కొన్నాయి. ఆయనకు ఎమ్మారై స్కానింగ్ చేసినట్టు చెప్పాయి.   ప్రస్తుతం తారకరత్న మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగుతున్నాయని వివరించాయి. ఇలా ఉండగా ఆయనకు అందిస్తున్న వైద్య చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలతో శుక్రవారం ( ఫిబ్రవరి 18) హెల్త్ బులిటెన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా   బెంగళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని రోజులుగా ఎటువంటి అప్ డేట్స్ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు తాజాగా ఆయన హెల్త్ బులిటిన్ విడుదల చేశాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ, మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోందని చెప్పారు. గురువారం(ఫిబ్రవరి 17) ఆయనకు ఎమ్ ఆర్ ఐ స్కానింగ్ చేసినట్లు తెలిపారు.  నందమూరి కుటుంబ సభ్యుల సన్నిహితుల నుంచి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిందనీ, చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారనీ తెలుస్తోంది. అన్నిటికీ మించి తారక రత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు బాలకృష్ణ వైద్యులతో సంప్రదిస్తున్నారనీ, వైద్యులు కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించిన అప్ డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారని చెబుతున్నారు.    గత నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్వి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నగుండెపోటుకు గురైన సంగతి విదితమే.    ఆయనకు మరి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని,   చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారనీ, ప్రస్తుతం ఆయనకు బ్రెయిన్ డ్యామేజీ రికవరీ చికిత్స అందిస్తున్నామనీ గతంలో వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న పొటో ఒకటి కూడా గతంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలో తారకరత్న క్లీన్ షేవ్ తో కనిపించారు.