ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులు?
posted on Feb 19, 2023 @ 9:50AM
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దూకుడు పెంచింది. ఒక వైపు ఈ కేసులో ఈడీ దూకుడు కొనసాగుతుండగా, మరో పైవు సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన సీబీఐ.. దానికి కొనసాగింపుగా తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో గత ఏడాది డిసెంబరు 11న సీబీఐ విచారించింది.
అలాగే ఇదే కేసులో మనీ లాండరింగ్ కోణం నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను ఈడీ అరెస్టు చేసింది. ఇదే కుంభకోణంలో అవినీతి, అధికార దుర్వినియోగం, ఎక్సయిజ్ పాలసీ కారణంగా ఢిల్లీ రాష్ట్ర ఖజానాకు ఏర్పడిన నష్టం తదితరాలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఈ కుంభకోణం కేసులో ఏకకాలంలో రెండు దర్యాప్తు సంస్థలూ దూకుడు పెంచడంతో ఏ క్షణంలో ఎవరు అరెస్టవుతారు అన్న ఉత్కంఠ రాజకీయవర్గాలలో నెలకొని ఉంది. ఈ స్కామ్‌లో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారించింది. మరికొందరిని అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండుకు తరలించింది. వీరిపై తీవ్రమైన అభియోగాలు నమోదైనందున బెయిల్ ఇవ్వడానికి స్పెషల్ కోర్టు నిరాకరించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసిన సీబీఐ పలువురిని అరెస్టు చేసి వారిపై చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో సమర్పించింది. స్కామ్‌లో పలువురి ప్రమేయం ఉన్నందున వారిని విచారించే ప్రక్రియ కొనసాగుతున్నదని, ఆ తర్వాత తదుపరి చార్జిషీట్‌లో అదనపు వివరాలు వెలుగులోకి వస్తాయంటూ అప్పట్లోనే సీబీఐ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. ఇప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎంకు రెండో సారి నోటీసులు జారీ చేయడంతో ఈ సారి మనీశ్ సిసోడియాను ప్రశ్నించి వదిలేస్తుందా? లేక అరెస్టు చేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తొలిసారి విచారణకు హాజరైనప్పుడు బీజేపీలో చేరాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేశారంటూ మనీష్ సిసోడియా మీడియా ముఖంగా చెప్పడాన్ని తీవ్రంగా పరిగణించిన సీబీఐ తమకు రాజకీయాలతో సంబంధం లేదని వివరణ కూడా ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే సీబీఐ ఈ కుంభకోణం కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించి పకడ్బందీగా దర్యాప్తు కొనసాగిస్తోందని చెబుతున్నారు. దీంతోనే మనీశ్ సిసోడియాకు రెండో సారి నోటీసులు జారీ చేయడంతో ఆయనను ప్రశ్నించి వదిలేస్తారా? అరెస్టు చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే ఎమ్మెల్సీకవితకు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందన్నప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఎందుకంటే గతంలో సీబీఐ విచారణ అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ, లిక్కర్ స్కామ్‌లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, ఒక సాక్షిగా మాత్రమే తనను సీబీఐ అధికారులు విచారించారంటూ కవిత చెప్పారు. అ
యితే ఆ తర్వాత గంటల వ్యవధిలోనే సీఆర్‌పీసీలోని సెక్షన్ 191 కింద కవితకు సీబీఐ నోటీసులు జారీచేసి కొన్ని డాక్యుమెంట్లు, ఆధారాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వ్యక్తిగతంగా స్థిర, చరాస్తుల వివరాలు, డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల ఆర్థిక లావాదేవీలు తదితరాలను 2022 వరకూ క్రోడీకరించి ఇవ్వాలని ఆ నోటీసుల్లో సీబీఐ పేర్కొన్నది. ఆ ప్రకారం వివరాలను కవిత వారికి సమర్పించినట్టు ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మనీశ్ సిసోడియాను ఒకసారి విచారించిన తర్వాత రెండో సారి కూడా నోటీసులు జారీచేయడంతో కల్వకుంట్ల కవితకు సైతం ఇలాంటి నోటీసులు అందుతాయని నిపుణులు అంటున్నారు.