బ్రేకప్ అని బాధపడేవాళ్ల కళ్లు తెరిపించే విషయాలివి..!
జీవితం చాలా విచిత్రమైనది. నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందో లేదో తెలియదు. కానీ చాలామంది రేపు ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆశాభావంతో ఉంటారు. ప్రతీది ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని కొన్ని అంచనాలు కూడా పెట్టుకుంటారు. అలాంటి వాటిలో మనుషులతో కలిగే అనుబంధాలు చాలా ముఖ్యమైనవి. ప్రేమ కావచ్చు, భార్యాభర్తల బందం కావచ్చు. రేపు ఇలా జరిగితే బాగుంటుంది, మేమిద్దరం ఇలా ఉంటే బాగుంటుంది అని ఇద్దరిలో ఎవరో ఒకరు అనుకుంటూ ఉంటారు. కానీ బంధం విచ్చిన్నమైనప్పుడు, ఎంతగానో ప్రేమించిన వ్యక్తి తమను వదిలి వెళ్లిపోయినప్పుడు ప్రపంచం అంతా శత్రువుగా అనిపిస్తుంది. బ్రేకప్ అనేది చాలా బాధపెట్టే విషయం. చాలామంది బ్రేకప్ జరిగితే గత ఆలోచనలు జ్ఞాపకాలలో ఉంటూ, అక్కడే స్టక్ అయిపోయి ఎప్పుడూ వదిలి వెళ్ళిన వారినే తలచుకుంటూ ఉంటారు. కానీ బ్రేకప్ గురించి కొన్ని విషయాలు తెలిస్తే తాము చేస్తున్నది తప్పా లేక ఒప్పా అనే విషయం చాలా సులువుగా అర్థమైపోతుంది. బ్రేకప్ గురించి అందరూ తెలుసుకోవలసిన విషయాలేంటంటే..
బంధం.. తప్పు.. ఒప్పు..
చాలామంది ఒక బంధంలో ఉన్నప్పుడు తప్పు ఏది, ఒప్పు ఏది, తాము చేస్తున్నది కరెక్టా కాదా అనే విషయాలు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. వారి ఎమోషన్ వారిని ఏమీ ఆలోచించుకోనివ్వదు. బ్రేకప్ అనేది జరిగితే చాలా మంది అనుకునేది ఒక్కటే.. కాలం అన్నీ నయం చేస్తుంది అని. కానీ నిజం ఏంటంటే.. కాలం అన్నీ నయం చేయదు. కాలం నయం చేయాలంటే మారడానికి ముందు మనిషి సిద్దంగా ఉండాలి. అంతేకానీ కాలం నయం చేస్తుంది అనుకుంటూ పదే పదే గతంలో తిరుగాడుతూ ఉంటే కాలం నయం చేయకపోగా మనిషిలో శూన్యాన్ని పెంచుతుంది.
తమను తాము కోల్పోవడం..
బ్రేకప్ అనేది జరిగినప్పుడు, మనస్ఫూర్తిగా అవతలి వ్యక్తిని ఇష్టపడినప్పుడు చాలామంది అనుకునే మాట.. తమను తాము కోల్పోయాము అని. మరీ ముఖ్యంగా తమ పార్ట్నర్ కోసం అన్నీ వదిలేసుకున్నవారు ఉంటారు. అలాంటి వారు మోసపోతే తాము ఇంత చేసినా ఎందుకు మోసపోయాం అనే విషయాన్ని అర్థం చేసుకోలేక ఆలోచనలతో పిచ్చివాళ్లుగా మారుతుంటారు.
విడిపోవడం సులువే.. కానీ బాగుచేయడమే..
ఒక బంధాన్ని విడదీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ తిరిగి బంధాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం. ఇది చాలా మంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం కూడా. కారణాలు ఏవైనా కావచ్చు.. బంధాలు మెల్లిగా విచ్చిన్నం అయిపోతాయి. తీరా బంధాలు విచ్చిన్నమయ్యాక ఎందుకు ఇలా జరిగింది, దీన్ని తిరిగి నిలబెట్టుకోలేమా? అని ఆలోచిస్తూ ఉంటారు.
బంధానికి బేస్..
ఒక్కసారి బ్రేకప్ అయ్యాక చాలామంది నిరాశ, విరక్తి, వైరాగ్యంలోకి వెళుతూ ఉంటారు. కానీ చాలామంది అర్థం చేసుకోని విషయం, ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. బంధం ఎందుకు విచ్చిన్నం అయింది, ఎక్కడ తప్పు జరిగింది? తప్పు ఎవరిలో ఉంది? ఇవన్నీ ఆలోచించిన తరువాత అర్థమయ్యే విషయం ఒకటే.. బంధాలు కేవలం ప్రేమ పైనే నిలబడవు.. బంధాలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి గౌరవం, మాట్లాడే విధానం, బాలెన్స్డ్ గా ఉండటం మొదలైనవన్నీ చాలా అవసరం.
బ్రేకప్ నేర్పించే విషయాలు ఇవీ..
మనకు ఎవరు సరైనవారు, ఎవరు కాదు అనే విషయం నేర్పేది బ్రేకప్పే.. అలాగే ఒక వ్యక్తి వల్ల ప్రేమగా, సంతోషంగా ఉంటున్నామా లేక జీవితం యాంత్రికంగా సాగుతోందా అనేది కూడా బ్రేకప్పే నేర్పుతుంది.
ప్రేమించడం ముఖ్యమే.. కానీ సెల్ఫ్ లవ్ అనేది మరింత ముఖ్యం. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ముఖ్యం. అవతలి వ్యక్తి ఎంత ప్రేమ చూపించినా సరే. ఎప్పుడూ తమను తాము తగ్గించి, తమ వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకాల్సిన అవసరం లేదు.
తన ఆలోచనలకు, తన నిర్ణయాలకు తప్ప, తన జీవితంలోకి వచ్చిన ఒక మనిషికి విలువ ఇవ్వని వ్యక్తి వెళ్ళిపోయినందుకు బాధపడటం అనేది సహజమే. మంచితనం ఉన్న ప్రతి ఒక్కరూ, నిజంగా ప్రేమించిన వారు ఇట్లా బాధపడతారు. కానీ వారి ఆలోచనలతో, వారి జ్ఞాపకాలతో అక్కడే ఆగడం చాలా తప్పు.
*రూపశ్రీ.