అనకాపల్లి బీసీ గురుకుల పాఠశాల వార్డెన్ సస్పెండ్

  ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత భోజనంలో బొద్దింక వచ్చిన ఘటనపై అనకాపల్లి బీసీ గర్ల్స్‌ హాస్టల్‌ వార్డెన్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి ప్రాంతంలో ఉన్న బీసీ బాలికల గురుకుల వసతి గృహాన్ని సందర్శించేందుకు వచ్చిన హోంమంత్రి. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం లంఛ్ టైమ్ కావడంతో ఆమె అక్కడే బాలికలతో కలిసి భోజనం చేయాలని నిర్ణయించుకున్నారు. హాస్టల్ సిబ్బంది ఆమెకు కూడా భోజనం వడ్డించారు.  విద్యార్థులతో కలిసి మధ్యలో కూర్చుని భోజనం మొదలుపెట్టిన సమయంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆమె ప్లేట్‌లో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటనతో అనిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హోంమంత్రి అయిన నా ప్లేట్‌లోనే బొద్దింకలు కనిపిస్తే, అక్కడే నివసించే బాలికలకు ఎలా క్వాలీటీ ఫుడ్ అందిస్తారని నిలదీశారు. అలాగే హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తిరుమల అన్నమయ్య భవన్ సమీపంలో చిరుత సంచారం

  తిరుమల అన్నమయ్య  అతిథి  భవనం సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇవాళ  మధ్యాహ్నం సమయంలో ఇనుప కంచెను దాటుకోని చిరుత వచ్చింది. సమాచారం అందుకోని ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు సైరన్ లు మ్రోగించడంతో తిరిగి ఫారెస్ట్‌లోకి చిరుత వెళ్లింది. ముఖ్యంగా అలిపిరి నడక మార్గంలోనూ, మొదటి ఘాట్ రోడ్డులోనూ చిరుతలను చూసినట్లు భక్తులు చెబుతున్నారు.  దీంతో ఫారెస్ట్ అధికారులు అధికారులు అప్రమత్తమై, భక్తులకు సూచనలు జారీ చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు, టీటీడీ సిబ్బంది కలిసి చిరుతల సంచారంపై నిఘా పెంచారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం గురించి భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లకూడదని టీటీడీ అధికారులు హెచ్చరించారు.  

డ్రైవర్ లేకుండానే కారు డెలివరీ

  ప్రపంచంలోనే తొలిసారి డ్రైవర్ లేకుండా కారును డెలివరీ చేసి టెస్లా రికార్డు సృష్టించింది. తమ కారు సెల్ఫ్ డ్రైవింగ్ స్కిల్స్ ఏంటో తెలిసేలా టెస్లా ఓ వీడియో పోస్ట్ చేసింది. టెక్సాస్ గిగా ఫ్యాక్టరీ నుంచి 30 ని.లు డ్రైవ్ చేసుకుని టెస్లా కారు తన ఓనర్ ఇంటికి చేరుకుంది. పార్కింగ్ స్లాట్స్, హైవేలు దాటుకుంటూ దానంతట అదే వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా తమ కొత్త కారును నేరుగా వినియోగదారుడి చెంతకు చేర్చింది.   ఏఐ సాయంతో నడిచే పూర్తిస్థాయి అటానమస్‌ కారు ‘మోడల్‌ వై’ను టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి అక్కడికి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న కస్టమర్‌ ఇంటికి పంపించింది. మార్గమధ్యలో ట్రాఫిక్‌ సిగ్నళ్లు, ఫ్లైఓవర్లు, హైవేలను దాటుకుంటూ కారు తన నూతన యజమాని ఇంటికి చేరుకుంది. ఎక్స్‌’వేదికగా ప్రకటించారు. ‘తొలిసారి ఒక కారు యజమానికి తనను తాను డెలివరీ చేసుకుంది’అని పేర్కొన్నారు. నిర్ణీత గడువుకన్నా ఒక రోజు ముందే కారును డెలివరీ చేశామన్నారు. తనకు తెలిసినంత వరకు వాహనంలో వ్యక్తులెవరూ లేకుండా లేదా రిమోట్‌ ఆపరేటింగ్‌ లేకుండా ఒక పబ్లిక్‌ హైవేపై ప్రయాణించిన తొలి పూర్తిస్థాయి అటానమస్‌ కారు తమదేనన్నారు

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ ఏకగ్రీవ ఎన్నిక

  ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం అయింది. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ఇంచార్జ్ పీసీ మోహన్ ప్రకటించారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఎవరు పోటీలో నిలవకపోవడంతో ఎంపీ పురంధేశ్వరి స్థానంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్త గర్వపడేలా బీజేపీని బలోపేతం చేస్తానని ప్రకటించారు. పదవి అంటే గొప్పస్థానం కాదు.. అదొక బాధ్యత అని అన్నారు.1973, ఆగస్టు 10న ఏపీ లోని మద్దిలపాలెం లో జన్మించారు. ఆయన మాజీ బీజేపీ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ అయిన పీ.వీ. చలపతి రావు, పీ.వీ రాధా దంపతుల పుత్రుడు.  ఆయన డాక్టర్ వీ.ఎస్. కృష్ణ కాలేజీ నుంచి బీ.కామ్ పట్టా పొందాడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా మాధవ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్‌లో ఆయన అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్  నగర కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం  భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.  ఈ కాలంలో బీజేపీ శాసన మండలి నాయకుడిగా కూడా వ్యవహరించారు. ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఎన్నికైన పీవీఎన్ మాధవ్‌కు సీఎం చంద్రబాబు,శుభాకాంక్షలు తెలియజేశారు. పరస్పర సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదామని ఎక్స్‌ వేదికగా ముఖ్యమంత్రి తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలియజేశారు.  కూటమిలోని మూడు పార్టీల సమన్వయం, పరస్పర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి పాటు పడదాం’ అంటూ ట్వీట్ చేశారు.  

బీవీ పట్టాభిరాం ఇక లేరు

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బీవీ పట్టాభిరామ్ (75) కన్నుమూశారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 75 ఏళ్లు.  కేవలం హిప్నాటిస్ట్ గా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానే కాకుండా ఆయన తన ప్రసంగాలూ, ప్రదర్శనలతో  సమాజంలో , వ్యక్తులలో డిప్రషన్ ను అధిగమించి మానసిక స్థైర్యం పెంపోందించేలా కృషి చేశారు.  అత్యంత క్లిష్టతరమైన మానసిక శాస్త్ర అంశాలను   సామాన్యులకు సైతం అవగత మయ్యేలా వివరించడం ఆయనకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఆయన ప్రసంగాలు ఉండేవి.  ఆ యన మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదంటూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పట్టాభిరాం అంత్యక్రియలు బుధవారం (జూలై 2) జరగుతాయి. 

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యం : రామచందర్‌రావు

  తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి అయిన కేంద్ర మంత్రి శోభా కరండ్లాజే ప్రకటించారు. ఈ మేరకు  రామచందర్‌రావుకు నియామిక పత్రాన్ని అందించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి కొత్త అధ్యక్షుడు  రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతు  బీజేపీలో పదవులు ముఖ్యం కాదని ఆయన అన్నారు. "రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా ఫర్వాలేదు. మన పార్టీకి కార్యకర్తలే నిజమైన నాయకులు, వాళ్లే మన బలం. నాయకత్వంలో ఎవరున్నా అందరూ ఐక్యంగా పనిచేయాలి అని ఆయన పిలుపునిచ్చారు.  నూతన అధ్యక్షుడు రామచందర్‌రావు నాయకత్వంలో నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్‌ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని రామచందర్‌రావు అన్నారు. స్టేట్ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సభలో ఆయన తొలిసారిగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తనను సౌమ్యుడిగా భావించవద్దని, ప్రజా సమస్యలపై పోరాటంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని ఆయన హెచ్చరించారు. గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగరేస్తామని పిలుపునిచ్చారు. ఎంతోమంది కార్యకర్తలు, నేతల త్యాగాల పునాదులపైనే బీజేపీ నేడు ఈ స్థాయిలో నిలిచిందని రామచందర్‌రావు అన్నారు.  ప్రజాస్వామ్యబద్ధమైన, వికసిత తెలంగాణ నిర్మాణం బీజేపీతోనే సాధ్యం. అందుకే ప్రజలు మనవైపు ఆశగా చూస్తున్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలి" అని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా వంటి జాతీయ నాయకత్వం సహకారంతో తెలంగాణలో పార్టీని మరింత ముందుకు నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాంచందర్ రావు ఒక మిస్సైల్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కిషన్ రెడ్డి, నేను, లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నపుడు మమ్మల్ని ట్రోల్ చేసే వారని బండి సంజయ్ పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయ్యాక  కూడా చాయి అమ్ముకునే వాడు ప్రధాని ఏంది అని ట్రోల్ చేశారని కేంద్ర మంత్రి అన్నారు.

కాషాయీక‌ర‌ణ నుంచి.. కిష‌న్ మార్క్ కార్పొరేటీక‌ర‌ణ దిశ‌గా బీజేపీ?

రాజాసింగ్ ఎపిసోడ్ చెబుతున్నదిదేనా? గంగ పూర్తిగా చంద్ర‌ముఖిగా మారింద‌ని ఒక సినిమా డైలాగ్. తెలంగాణ బీజేపీ కూడా అలా కాషాయీక‌ర‌ణ నుంచి కిష‌న్ రెడ్డీక‌ర‌ణ చెందిన‌ట్టేనా? ఆయ‌న్ను వ్య‌తిరేకించిన వారు, ఆయ‌న గుట్టు ర‌ట్టు చేసిన వారి జాడే లేకుండా పోతుందా? అన్న చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇప్పుడంద‌రి మాట ఏంటంటే గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆయ‌న‌కేం పెద్ద‌గా న‌ష్టం క‌లిగించ‌దు. ఎందుకంటే ఆయ‌న ఇప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీని మించి పోయారు. బీజేపీ హ‌వా లేకున్నా గెలుస్తారు. ఉన్నా గెలుస్తారు. ఆయ‌న ఇండిపెండెంట్ గా గెలుస్తారు. పార్టీ టికెట్ మీదా గెలుస్తారు. ఇప్పుడాయ‌న‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌రిచ‌యం అవ‌స‌రం లేని హిందుత్వ బ్రాండ్ గా రూపాంత‌రం చెందార‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పుడు స‌మ‌స్య అంతా ఏంటంటే రాజా సింగ్  తెలంగాణ బీజేపీకి ఒరిజిన‌ల్ సీడ్. కిష‌న్ రెడ్డ‌యినా అంబ‌ర్ పేట్ లో ఓడిపోతారేమోగానీ.. ఆయ‌న మాత్రం త‌న సెగ్మెంట్లో అస్స‌లు ఓడ‌రు. అంత‌టి సాలిడ్ ఓటు బ్యాంకు రాజాసింగ్  సొంతం. అలాంటి రాజాసింగ్ అంటే సిస‌లైన‌ కాషాయ సైనికుడు.  బీజేపీ దాని పొలిటిక‌ల్ డైన‌మిక్స్ ని ఆయన ఎప్పుడో దాటి పోయార‌న్న పేరుంది. ఒక ర‌కంగా చెబితే బీజేపీలో మ‌రే సాధార‌ణ నేత కూడా కామెంట్ చేయ‌లేని ఎన్నో అంశాల‌పై ఆయ‌న సంచ‌ల‌న కామెంట్లు చేసి స‌స్పెండ్ అయిన ప‌రిస్థితులున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఓల్డ్ సిటీలో ఎంఐఎంని ఢీ కొట్ట‌గ‌లిగే వారే లేరు. కానీ ఎంఐఎంని దాని విధానాల‌ను తూర్పార ప‌ట్ట‌గ‌ల ఒకే ఒక్క‌డుగా రాజాసింగ్ తనదైన గుర్తింపు పొందారు. అలాంటి రాజాసింగ్ లేని బీజేపీ నేతి బీరకాయలో నెయ్యి అన్న చందంగా కాషాయంలేని కాషాయ పార్టీగా బీజేపీ మిగిలిపోతుందని అంటున్నారు.  ఇప్పుడు అక్క‌డున్న ఎమ్మెల్యే, ఎంపీల్లోనూ చాలా మందిది బేసిగ్గా ఈ పార్టీ కానే కాదు. హిందుత్వ భావజాలం అసలే లేదు.  మ‌రీ ముఖ్యంగా ఈట‌ల‌, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి వారు వేరే వేరే పార్టీల నుంచి కమలం గూటికి చేరారు. మరీ ముఖ్యంగా  ఈట‌ల విషయమే తీసుకుంటే ఆయన వామపక్ష సానుభూతి పరుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు బీజేపీ శ్రేణులే ఆయనను బీఆర్ఎస్ కోవర్టుగా అభివర్ణిస్తున్నారు.  కాళేశ్వ‌రం అంశంలో బీఆర్ఎస్ ఇంత‌గా విచార‌ణ ఎదుర్కుంటుండ‌గా.. ఆయ‌న కూడా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ కు కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.  ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న వారిలో చాలా మంది మూలాలు ఆర్ఎస్ఎస్ భావ‌జాలం కాదు. కేవ‌లం రాజ‌కీయ అనివార్యత వల్లనే కమలం గూటికి చేరిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.  అలాంటి పార్టీలో ద ఒరిజిన‌ల్ కాషాయ ర‌క్తం బ‌య‌ట‌కు వెళ్ల‌డం అంటే ఆ పార్టీ మూల సిద్ధాంతం మ‌రుగున ప‌డ్డ ప‌రిస్థితులున్న‌ట్టుగానే భావించాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనంత‌టి వెన‌క కిష‌న్ రెడ్డి ఉన్న‌ట్టుగా పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. బేసిగ్గా కిష‌న్ రెడ్డి గురించి రాజా సింగ్ గ‌తంలో  అధికారంలో ఎవ‌రుంటే వారితో కిష‌న్ చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతార‌ని.. ఉగ్ర‌వాదం మీద పోరు చేస్తూనే ఉగ్ర‌వాదుల‌తో క‌ల‌సి వ్యాపారాలు చేసే అమెరిక‌న్ ప్రెసిడెంట్ల‌క‌న్నా పెద్ద ప్ర‌మాద‌కారి అనీ ఆరోపణలు, విమర్శలూ చేసిన సంగతి తెలిసిందే.   అలాంటి కిష‌న్ రెడ్డి ఆడమన్నట్లు పార్టీ అధిష్టానం ఆడుతోందనీ.. కార‌ణం ఆయ‌న కేంద్ర అధిష్టాన పెద్ద‌ల‌కు అత్యంత ద‌గ్గ‌రి వాడు కావ‌డమేననీ, అందుకనే సాధార‌ణ కార్య‌క‌ర్త‌కు పార్టీలో చోటు ద‌క్క‌కుండా  పోతోంద‌నీ.. తెలంగాణలో ప్రస్తుత   ఇది ఒక‌ప్ప‌టి కాషాయ పార్టీ కాద‌ని..  పూర్తి కిష‌న్ మార్క్ క‌మ‌ర్షియ‌ల్ వ‌ర్షెన్ అని రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పైకి చెప్పకపోయినా తొలి నుంచీ బీజేపీలో ఉన్నవారు అంతర్గత సంభాషణల్లో  రాజాసింగ్ తో ఏకీభవిస్తున్నారు. ఇక రాజాసింగ్ క్రమశిక్షణ గీత దాటారంటూ  రాణి రుద్ర‌మ వంటి చోటా మోటా లీడర్ల వివరణలను  పార్టీలో ప‌ద‌వుల వెంప‌ర్లాట కొద్దీ చేస్తున్నవిగా కొట్టి పారేస్తున్నారు రాజాసింగ్ మద్దతుదారులు. మొత్తానికి ఈ కాషాయ‌ త‌గువులాట ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుందో చూడాలి.

బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక.. ఈటల మౌనం వెనుక వ్యూహమేంటి?

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటలకు అవకాశం ఇవ్వకపోవడం ఆయనను అవమానించడమేనన్న భావన ఈటల అనుచరులలో వ్యక్తం అవుతున్నది. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల కాషాయ కండువా కప్పుకున్న సమయంలోనే పలువురు విస్మయం వ్యక్తం చేశారు. వామపక్ష భావజానం ఉన్న ఈటల బీజేపీలో ఇమడటం కష్టమన్న అభిప్రాయాన్ని అప్పట్లోనే పరిశీలకులు వ్యక్తం చేశారు. వారి విశ్లేషణలకు తగినట్లుగానే ఈటల బీజేపీలో ఇమడ లేకపోతున్నారనీ, ఉక్కపోతకు గురౌతున్నారనీ పలు సందర్భాలలో గట్టిగా వినిపించింది.  నిజానికి  వామపక్ష భావజాలం ఉన్న ఈటల  చేరితే కాంగ్రెస్ లో చేరాలి కానీ.. తన భావజాలానికి పూర్తి వ్యతిరేకమైన బీజేపీ కండువా ఎలా? ఎందుకు కప్పుకున్నారన్న ప్రశ్రలు ఉత్పన్నమయ్యయి. అయితే ఈటల మాత్రం పరిశీలకుల విశ్లేషణలను డౌటానుమానాలను పూర్వపక్షం చేస్తూ ఉక్కపోతకు గురైనా, ఇబ్బందులు పడినా బీజేపీలోనే కొనసాగారు. సాగుతున్నారు. ఈ మధ్యలో బీజేపీ అధిష్ఠానం కూడా ఈటల పాపులారిటీనీ, సిన్సియారిటీనీ గుర్తిస్తూ పార్టీలో సముచిత ప్రాధ్యాన్యత ఇస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో పరాజయం పాలైనా.. లోక్ సభ ఎన్నికలలో ఈటలకు మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీకి అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికలలో విజయం సాధించిన ఈటల ఎంపీ అయ్యారు. అలాగే బండి సంజయ్ ఈటల మధ్య పొడసూపిన విభేదాల సందర్భంలో బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ ను  రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి ఈటలకు మద్దతుగా నిలిచింది.  సరే బండి సంజయ్ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో చేరికల కమిటీని ఏర్పాటు చేసిన బీజేపీ ఆ కమిటీకి చైర్మన్ గా ఈటలను నియమించింది. ఈటల ఆధ్వర్యంలో  బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయనీ... ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయనీ అంతా ఆశించారు. అదలా ఉంటే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల నియామకానికి ముందు పార్టీలో ఈటలకు చాలా చాలా అవమానాలు ఎదురయ్యాయని చెబుతారు.  కానీ ఈటల బీజేపీలో చేరిన క్షణం నుంచి రాష్ట్రంలో ఆ పార్టీ నిర్వహించిన అన్ని కార్యక్రమాలలోనూ భాగస్వామిని చేయడం, అమిత్ షా, మోడీ వంటి అగ్రనేతల సభలలో కూడా వేదికపై ఆసనం ఇవ్వడంతో  ఈటలకు బీజేపీలో ఉక్కపోత అన్న భావన అప్పట్లో పలువురిలో వ్యక్తమైంది. అయితే బండితో విభేదాలు ఉన్నప్పటికీ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం పార్టీలో ఈటల గౌరవానికి ఎటువంటి భంగం వాటిల్లలేదు. కానీ కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత మాత్రం ఉద్దేశ పూర్వకంగా ఈటలను తక్కువ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని ఈటల సన్నిహితులు చెబుతూ వస్తున్నారు.  ముఖ్యంగా చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న తాను పార్టీలోకి చేరికల కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగడంపై ఈటల అప్పట్లోనే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.  మాజీ మంత్రి కృష్ణయాదవ్  పార్టీలో చేరిక అప్పట్లో చివరి క్షణంలో ఆగిపోవడానికి   కిషన్ రెడ్డి కారణమన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దీనితో ఈటల ఇక పార్టీలోకి చేరికల విషయంలో ఎటువంటి ప్రయత్నాలూ చేయడం లేదని అంటున్నారు. అలాగే.. ఈటల ద్వారా పార్టీలోకి స్పష్టమైన హామీతో చేరిన తుల ఉమ వంటి వారికి పోటీగా ఇతరులను తీసుకురావడం వంటి ఘటనలతో ఈటల పార్టీ వ్యవహారాలలో పెద్దగా పాల్గొనకుండా అంటీముట్టనట్లు వ్యవహిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నంత కాలం పార్టీలో పరిస్థితి ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా ఉందని పార్టీ వర్గాలే చెప్పేపరిస్థితికి విభేదాలు పెచ్చరిల్లాయి. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుని ఎన్నికపై చర్చ సందర్భంగా ఈటలకు పార్టీ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చిందనీ, కానీ చివరిక్షణంలో హాత్ ఇచ్చి రామచంద్రరావును ఎంపిక చేయడంపై ఆయన వర్గీయులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కాగా రామచంద్రరావుకు తెలంగాణ పార్టీ బాధ్యతలను అప్పగించడంపై ఈటల ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. 

ప్రారంభంలోనే ముగిసిన ప్రయాణం

  సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచీ పరిశ్రమ జరిగిన ప్రమాద ఘటనలో  విషాదం వెలుగులోకి వచ్చింది.  ప్రమాద సమయంలో కంపెనీలో పని చేస్తోన్న కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య ఆచూకీ   గల్లంతైంది. నిఖిల్‌రెడ్డి ఇటీవలే ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్యను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో సోమవారం సిగాచీ ఇండస్ట్రీలో జరిగిన దుర్ఘటనలో దంపతులిద్దరూ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన వారు శోకసంద్రంలో మునిగిపోయారు. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఒక చిన్న గ్రామానికి చెందిన రైతు బిడ్డ నిఖిల్ రెడ్డి..... ఎమ్మెస్సీ చదువుకొని పటాన్ చెరువు సమీపంలో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.  ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో పుట్రెల గ్రామంలో సౌత్ మాలపల్లిలో  ఒక రైతు కూలీ కుటుంబంలో పుట్టిన రామాల శ్రీ రమ్య.... తిరుపతి పద్మావతి మహిళ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివింది. నిఖిల్ రెడ్డి పనిచేస్తున్న ఫార్మా కంపెనీ లోనే ఉద్యోగం సంపాదించుకుంది. పిల్లలు ఇద్దరు అత్యంత సాధారణ కుటుంబాల నుంచి కష్టపడి చదువుకొని స్వయంకృషితో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఆ యువ జంట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఆశ్రయించారు. నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి కొలికపూడి పెళ్లికి ఒప్పించారు. కొద్దిరోజుల తర్వాత రమ్య కుటుంబం జమ్మలమడుగు వెళ్లి నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిశారు. రెండు కుటుంబాల పెద్దలు చాలా ఆత్మీయంగా మాట్లాడుకుని, ఆషాడ మాసం తర్వాత మంచి ముహూర్తం చూసి పిల్లలకు పెళ్ళి చేద్దామని నిర్ణయానికి వచ్చారు. ఇంతలో ఈ విషాదం ఘటన జరగడం వారి కుటుంబంలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చాయి.

మేడ్చల్ ఇండస్ట్రీలో పేలిన బాయిలర్.. ఒకరికి తీవ్ర గాయాలు

  మేడ్చల్ పారిశ్రామికవాడలోని ఆల్కలాయిడ్‌ బయో యాక్టివ్‌ ఫార్మా ఇండస్ట్రీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న కార్మికుడు శ్రీనివాస్‌ రెడ్డికి తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన యాజమాన్యం, తోటి సిబ్బంది బాధితుడిని వెంటనే పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుస ప్రమాదలతో కార్మికులు కలవరపడుతున్నారు. పరిశ్రమల్లో పనిచేసే వ్యక్తుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి.  పారిశ్రామిక ప్రమాదాలు తీవ్రంగా తీవ్ర విషాదాలు నింపుతున్నాయి. దీనికితోడూ భారీ ప్రాణనష్టం తీరని విషాదాలతో భయాందోళనలు కలిగిస్తున్నాయి. మరి ఏ తరహా పరిశ్రమల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రమాదాల నివారణకు అనుసరించాల్సిన విధివిధానాలపై ప్రభుత్వం కార్మికులకు అవగాహన కల్పించాలని స్థానిక ప్రజలు వాపోతున్నారు  

మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్.. 15 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్  కలకలం రేపింది. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కారణంగా మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఘటన వెలుగులోనికి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి విచారణ జరిపిన ఎయిమ్స్ అధికారులు 15 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థుల సస్పెన్షన్ వార్తలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ర్యాగింగ్ కు పాల్పడిన వారిలో ఎయిమ్స్ లోని ఓ కీలక ఉద్యోగి కుమారుడు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇలా ఉండగా ఎయిమ్స్ లో ర్యాగింగ్ పై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.  ర్యాగింగ్ ఆరోపణలపై యాంటీ ర్యాగింగ్ కమిటీ దర్యాప్తు జరుపుతోంది.  

పాశమైలారం ఘటనలో వెలుగులోకి వచ్చిన మరో విషాదం

  సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచీ పరిశ్రమ జరిగిన ప్రమాద ఘటనలో మరో  విషాదం వెలుగులోకి వచ్చింది.  ప్రమాద సమయంలో కంపెనీలో పని చేస్తోన్న కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య ఆచూకీ గల్లంతైంది. నిఖిల్‌రెడ్డి ఇటీవలే ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్యను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక చేద్దామని నిర్ణయించుకున్నారు.  ఈక్రమంలో సోమవారం సిగాచీ ఇండస్ట్రీలో జరిగిన దుర్ఘటనలో దంపతులిద్దరూ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన వారు శోకసంద్రంలో మునిగిపోయారు. సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 43కి చేరింది. మరో 22 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. శిథిలాల కింద కొంతమంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

పాశమైలారం ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. రేవంత్ రెడ్డి

పాశమైలారం ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత దురదృష్టకరమైన ఘటనగా తెలంగాణ సీఎం రేవంత్ అభివర్ణించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 36 మంది మరణించారని తెలిపారు. మృతులలో బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఏపీ, తెలంగాణ వాసులు ఉన్నారన్న ఆయన.. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇచ్చేలా పరిశ్రమ యాజమాన్యంతో  మాట్లాడాలని మంత్రులను ఆదేశించారు. తీవ్రగాయాలైనవారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇచ్చారు. ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలను తెలుసుకున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.   పాశమైలారం ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం  అధికారులు, మంత్రులతో సమీక్షించారు. ఈ ప్రమాదంపై ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నిపుణులను నియమించి, వారు ఇచ్చిన నివేదిక మాత్రమే తనకు ఇవ్వాలన్నారు.

పెద్దిరెడ్డి జమిలి జపం.. ఎందుకంటే?

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ గౌరవం ఇచ్చే ఇచ్చే అతికొద్ది మంది నాయకుల్లో ఒకరు. కొంత కాలంగా పొలిటికల్ స్టెట్‌మెంట్లకు దూరంగా ఉంటున్నారు పెద్దిరెడ్డి. మాజీ సీఎం జగన్ తరహాలోనే ఆయన జమిలి మంత్రి పఠిస్తున్నారు. 2027 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వస్తాయని,  వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.  స్వయంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషే ఆ విషయం చెప్పారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పైగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారంటూ పెద్దిరెడ్డి చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. జగన్ తరహాలో ఆయన కూడా తొలిసారి జమిలిమంత్రం పఠించడటంతో రాజకీయ వర్గాల్లో జమిలిపై చర్చ మొదలైంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే.. సార్వత్రిక ఎన్నికలు పూర్తైన కొన్ని రోజుల తర్వాత నుంచి రాష్ట్రంలో జమిలి ఎన్నికల ప్రచారం జోరందుకుంది.   2027లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని వైసీపీ నేతలు ఊదరగొడుతున్నారు. పార్టీలో పెద్దాయనగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడాఇప్పుడు  అదే చెబుతుండటం హాట్‌టాపిక్‌గా మారింది. అసలు పెద్దిరెడ్డి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ ఊపందుకుంది. పెద్దిరెడ్డి ఈ సమయంలో జమిలి జపం చేయడానికి ప్రధానంగా  రెండు  కారణాలు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.  ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడం వైసీపీని సహజంగానే నిరుత్సాహానికి గురిచేసింది. రాష్ట్రంలో కూటమి తిరుగులేని మెజార్టీ ఉండడంతో వలసలు సర్వ సాధారణమయ్యాయి. క్షేత్రస్థాయిలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు, క్యాడర్‌లో నైతిక స్థైర్యం నింపేందుకే స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి కామెంట్లు చేసి ఉండొచ్చన్న మాట విన్పిస్తోంది.  రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో విఫలమైందని ఆరోపిస్తోంది వైసీపీ. గత వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరికీ తాము ఎన్నో సంక్షేమ పథకాలు అందించగా.. ఇప్పుడు వాటిలో కొన్నింటిని కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని జగన్ పదేపదే ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం కోసమే ఈ మైండ్ గేమ్ అడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్దిరెడ్డి కావచ్చు.. లేదంటే మరో వైసీపీ నేత కావచ్చు.. ఎవరి కామెంట్లనైనా పక్కన పెడితే జమిలీ ఎన్నికలు 2027లో వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అదంత సులువేం కాదన్న మాట విన్పిస్తోంది. ఇప్పటికే జనగణనకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. జనగణనలోనే కులగణన చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. జనగణన, కులగణన పూర్తి చేసి, పార్లమెంటులో వాటిని ఆమోదించే ప్రక్రియ పూర్తయ్యే సరికి చాలా సమయం పడుతుంది. పైగా నియోజకవర్గాల పునర్విభజన అంశం ఎలాగూ ఉంది. ఆ ప్రకారం చూస్తే ఏదైనా అద్భుతం జరిగి చకచకా పరిణామాలు జరిగితే తప్ప 2029 వరకు జమిలీ వచ్చే అవకాశామే లేదన్న వాదన వినిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు. ఆ క్రమంలో  వైసీపీ కార్యకర్తలు, నేతలను ఇతర పార్టీల వైపు వెళ్లకుండా నిలువరించడం, ప్రత్యర్థి పార్టీలపై మైండ్ గేమ్ ఆడడం లక్ష్యంగా వైసీపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న వాదన బలంగా విన్పిస్తోంది.

శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి

తమిళనాడు శివకాశిలోని ఓ  బాణసంచా ఫ్యాక్టరీలో  మంగళవారం (జూలై1)న జరిగిన భారీ పేలుడులో ఐదుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలం వద్ద దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.   తెలంగాణలోని సంగారెడ్డి జల్లా  పాశమైలారం పారిశ్రామిక వాడలో  సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 45 మంది మరణించిన సంఘటనలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరో ఫ్యాక్టీరీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. శివకాశి పేలుడులో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. 

నకిలీ ఈ స్టాంపుల స్కామ్.. ఆ ఒక్కడి కుట్రేనా?

నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం ఏపీ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ మొత్తం వ్యవహారంలో అరెస్టులు జరిగినా.. పోలీసులు ప్రకటన చేసినా ఇంకా ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో రిస్క్‌తో కూడిన ఈ వ్యవహారాన్ని కేవలం ఓ మీసేవ నడిపే వ్యక్తే చేశారా.. లేదంటే ఇందులో పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా?  అలాగే.. ముందుగానే ఎంతో ఆలోచించి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఓ ప్లాన్ ప్రకారమే చేశారా?..  లేదంటే కోవర్టు రాజకీయాలకు తెరతీశారా అన్న   డౌటనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కల్యాణదుర్గం ఈ స్టాంపుల కుంభకోణంలో ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఆర్సీ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతోనే  ఈ మొత్తం కుంభకోణం బయటకు వచ్చిందని వెల్లడించారు జిల్లా ఎస్పీ జగదీశ్. ఈ సందర్భంగా  ఆయన మరిన్ని కీలక అంశాలు వెల్లడించారు. నిందితుడు బోయ ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు దాదాపుగా 15 వేల 850 ఈ స్టాంపులను అమ్మినట్లు గుర్తించినట్లు చెప్పారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వంద రూపాయల స్టాంపులను కొనుగోలు చేసిన బాబు.. ఫోటో షాప్‌ సాయంతో లక్షరూపాయల నకిలీ స్టాంపులుగా మార్చారని ప్రకటించారు. అయితే.. తెలుగుదేశం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌సీ కంపెనీతోపాటు ఈ సంస్థకు చెందిన అనుబంధ కంపెనీల కోసం 438 నకిలీ స్టాంపులను ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు విక్రయించినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు.  ఇక్కడే పొలిటికల్‌  వార్ మొదలైంది. ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్‌లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నది కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయనకు చెందిన ఎస్సార్సీ సంస్థ. వీళ్లు చాలా రోజుల నుంచి మీసేవ బాబు వద్దే స్టాంపులు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే  900 కోట్ల రుణం కోసం మరోసారి ఈ స్టాంపులు కొన్నారు. అయితే.. ఇందుకు సంబందించి స్టాంపు డ్యూటీ చెల్లించిన వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త రంగయ్య. అంతేకాదు.. స్కాంలో వాళ్ల పాత్ర ఉంది కాబట్టే సంబంధిత వివరాలు బయటపెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో మీసేవ బాబుకు ఎమ్మెల్యేతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారాయన.     వైసీపీ నేతల కామెంట్లకు కౌంటరిస్తున్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. మీ సేవ బాబుతో తనకు బాగా పరిచయం ఉందని వైసీపీ నాయకులు చెప్పడం అర్థరహితమంటూ కొట్టి పారేశారాయన. తనతో ఫోటోలు దిగినంత మాత్రాన తనకు బాగా క్లోజ్ అనిచెప్పడం సరికాదంటున్నారు ఎమ్మెల్యే. అంతేకాదు.. వైసీపీ నేతలకే బాబుతో చాలా అనుబంధం ఉందని ఆరోపించారాయన. అసలు తమ పేరుపై ఉన్న బ్లాంక్ ఈ స్టాంపు వాళ్లకు ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారాయన. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏసీబీ, సిట్ లేదంటే సీబీఐ సహా ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే సురేంద్ర బాబు.  రాజకీయ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఎస్‌ఆర్‌సీ సంస్థ ఫిర్యాదుతో ఈ కుంభకోణానికి సంబంధించి తీగ కదిలింది. పైగా మీ సేవ బాబు.. మొత్తం 15 వేలకు పైగా ఈ స్టాంపులను అమ్మినట్లు గుర్తించామని చెబుతున్నారు పోలీసులు. మరి అందులో నకిలీలు ఇంకా ఎన్ని ఉన్నాయి అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరి వాటి సంగతేంటి? నకిలీ స్టాంపులతో తీసుకున్న లోన్ల విషయంలో బ్యాంకులు ఎందుకు ఇంకా స్పందించడం లేదు? అసలు ఇంత పెద్ద వ్యవహారం ఒక్క మీ సేవ నడిపే బాబుతో అవుతుందా అన్నది కూడా ప్రస్తుతానికి సమాధానాలు లేని ప్రశ్నలే అన్న మాట విన్పిస్తోంది.

మోహిత్ రెడ్డి సన్ ఆఫ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. జైలు దారేనా?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఇంత వరకూ 11 మందిని అరెస్టు చేశారు. ఇండోర్ లో సోమవారం (జూన్ 30) చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇద్దరు పీఏలను అరెస్టు చేసి విజయవాడకు తరలించడంతో అరెస్టుల సంఖ్య పదకొండుకు చేరింది. అతి త్వరలో  ఈ సంఖ్య 12కు చేరుతుందని పరిశీలకులు అంటున్నారు. ఈ 12వ వ్యక్తి చెవిరెడ్డి మోహిత్ రెడ్డేనని విశ్లేషిస్తున్నారు.    ఏపీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏ39గా ఉన్నారు. ఆయన ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ట్రయల్ కోర్టు, ఏపీ హైకోర్టులలో పిటిషన్లు ద ాఖలు చేశారు. అయితే ఈ రెండు కోర్టులలోనూ కూడా ఆయనకు ఎదురుదెబ్బే తగిలింది. ఇటు ట్రయల్ కోర్టు, అటు హైకోర్టూ కూడా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్లను కొట్టివేశాయి.   దీంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టు అనివార్యమని పరిశీలకులే కాదు, న్యాయనిపుణులు కూడా అంటున్నారు.  ఇలా ఉండగా లిక్కర్ కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ మోహిత్ రెడ్డికి సోమవారం (జూన్ 30) నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ మోహిత్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కాకుండా గైర్హాజరయ్యారు. తాజాగా యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్లను కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఇక ఆయన విచారణకు హాజరుకాకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన విచారణకు వస్తే విచారణ తరువాత అరెస్టు అవుతారు. లేకున్నా అరెస్టు చేస్తారు అని అంటున్నారు.  తన తండ్రి చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టైన నాటి నుంచీ కూడా మోహిత్ రెడ్డి అజ్ణాతంలోనే ఉన్నారు.   

రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పీక్స్ కు.. బీజేపీ ప్రకటన

రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పీక్స్ కు చేరిందని బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సత్యదూరమని ఆ ప్రకటనలో పేర్కొంది. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానంటూ బీజేపీ కార్యాలయానికి వచ్చిన రాజాసింగ్ ను ఎవరూ అడ్డుకోలేదని స్పష్టం చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ అభయ్ పాటిల్ రాజాసింగ్ తో చర్చించి ఆయన కోరిక మేరకు రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి నామినేషన్ పత్రాలు ఇచ్చారనీ, అయితే పది మంది రాష్ట్ర కౌన్సిలర్ల మద్దతు ఉంటేనే నామినేషన్ సమర్పించేందుకు వీలవుతుందనీ పేర్కొన్న బీజేపీ.. అంత మంది మద్దతు లేకపోవడం వల్లే నామినేషన్ వేయకుండా రాజాసింగ్ చేతులెత్తేశారని పేర్కొంది. ఆ విషయాన్ని దాచి పెట్టి, పార్టీ పోటీ చేయనివ్వడం లేదు.. బెదిరిస్తున్నారంటూ మీడియా ముందు అవాస్తవాలు చెప్పారని బీజేపీ ఆ ప్రకటనలో విమర్శించింది.  రాజాసింగ్ రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడికి పంపిస్తారని తెలిపింది.   నిజంగానే రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయదలచుకుంటే.. స్పీకర్ కే రాజీనామా పత్రాన్ని సమర్పించాలని పేర్కొంది. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని స్పష్టం చేసింది. గతంలో కూడా పలుమార్లు క్రమశిక్షణను రాజాసింగ్ ఉల్లంఘించారనీ, ఒక సారి సస్పెండ్ కూడా  అయ్యారనీ తెలిపిన బీజేపీ    వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని తేల్చి చెప్పింది.  

కమల దళంలో కలకలం!

భారతీయ జనతా పార్టీ  రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఆలస్యం అయితే అయ్యింది.. ఇప్పటికైనా అంతా సవ్యంగా జరిగిందా అంటే అదీ లేదు. నిజానికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ముందుగానే తెర పైకి వచ్చింది. అయినా నామినేషన్ విషయంలో గందరగోళం నెలకొంది. ఓ వంక ఎవరైనా నామినేషన్ వేయవచ్చుని పార్టీ మాజీ అధ్యక్షుడు  బండి సంజయ్ మీడియా ముందు చెపుతున్న సమయంలోనే.. అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  తమ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసేందుకు వచ్చిన  స్టేట్ కౌన్సిల్ సభ్యులను బెదిరించి  వెనక్కి పంపారని  ఆరోపించారు.అక్కడితో ఆగకుండా.. మీకో దండం,మీ పార్టీకో దండం  అంటూ పార్టీకి రాజీనామా  చేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి.. రాజాసింగ్  ఇప్పుడే కాదు చాలా కాలంగా, చాలా సందర్భాలలో పార్టీ పనితీరు పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జిల్లా అధ్యక్షుల  ఎన్నిక విషయంలో కానీ..  ఇతరత్రా పార్టీలో జరుగతున్న పరిణామాల విషయంలో కానీ  రాజాసింగ్  పార్టీ పెద్దలతో విభేదించడం కొత్త కాదు. విభేదించడం మాత్రమే కాదు.. అనేక మార్లు ఆయన  నాయకత్వం టార్గెట్ గా బహిరంగ విమర్శలు చేశారు.  ఒకటికి పదిసార్లు  ఆయన పార్టీ నాయకత్వాన్ని తప్పు పట్టారు. ఒక దశలో..  పార్టీలో పుట్టి పెరిగిన సీనియర్ నాయకులు అందరినీ మూకుమ్మడిగా బయటకు పంపితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందనీ, పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. ముఖ్యంగా.. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  టార్గెట్ గా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలతో ఆయన  కుమ్ముక్కయ్యారని, పేరు పెట్టి మరీ ఆరోపించారు.  నిజానికి.. ఇప్పుడు కూడా రాజాసింగ్   2014 నుంచి తాను,టెర్రరిస్ట్ థ్రెట్స్  సహా   వ్యక్తిగతంగా , కుటుంబ పరంగా అనేక కష్టనష్టాలు భరిస్తూ కూడా పార్టీ కోసం పనిచేసినా, కొందరు నాయకుల పార్టీ ఎదుగుదలను అడ్డుకున్నారని, అందుకే ఇక లాభాల లేదనే నిర్ణయానికి వచ్చి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా, రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చిన రాజాసింగ్, ఆ లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపి, తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయమనాలని కిషన్ రెడ్డిని తాను కోరినట్లు చెప్పారు. అదలా ఉంటే.. మరో వంక బీజేపీ నాయకులు రాజాసింగ్  రాజీనామాను అంత సీరియస్ గా  తీసుకోవలసిన అవసరం లేదని అంటున్నారు. నిజానికి పార్టీలో ప్రతి నాయకుడికి  ఏదో విషయంలో,ఎన్నోకొన్ని సమస్యలు ఉంటాయి. అలాగే.. పదవుల విషయంలో ఇతరత్రా అసంతృప్తి  ఉంటుంది. అయినా.. సర్దుకు పోవాలి, కాదంటే, పార్టీ సమావేశాల్లో నాయకత్వ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిచుకోవాలి కానీ, ఇలా అయిన దానికి  కాని దానికి, చీటికి మాటికీ మీడియాకు ఎక్కడం మచిది కాదని పార్టీ నాయకులు భావిస్తున్నారు. నిజంగా రాజాసింగ్  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ దల్చుకుంటే నేరుగా స్పీకర్ కే రాజీనామా లేఖ సంర్పించాలని బీజేపీ నాయకులు అంటున్నారు. మరోవంక రాజాసింగ్ కు ప్రజల్లో ఉన్న మద్దతు దృష్ట్యా ఇంతవరకు చూసీ చూడనట్లు ఉన్నా..  ఇకపై తీవ్ర చర్యలు తపప్క పోవచ్చని అంటున్నారు. అయితే..  రాజాసింగ్   ఎపిసోడ్ చివరకు ఏ మలుపు తిరుగుతుంది?  అనేది చూడవలసి ఉంటుందని అంటున్నారు.