పాశమైలారం ఘటనలో వెలుగులోకి వచ్చిన మరో విషాదం
posted on Jul 1, 2025 @ 2:50PM
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచీ పరిశ్రమ జరిగిన ప్రమాద ఘటనలో మరో విషాదం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కంపెనీలో పని చేస్తోన్న కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య ఆచూకీ గల్లంతైంది. నిఖిల్‌రెడ్డి ఇటీవలే ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్యను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా వేడుక చేద్దామని నిర్ణయించుకున్నారు.
ఈక్రమంలో సోమవారం సిగాచీ ఇండస్ట్రీలో జరిగిన దుర్ఘటనలో దంపతులిద్దరూ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన వారు శోకసంద్రంలో మునిగిపోయారు. సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 43కి చేరింది. మరో 22 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. శిథిలాల కింద కొంతమంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.