ఆంధ్రా నుండి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా!!

  కృష్ణా జిల్లా నందిగామలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఓ వైపు రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల ఉపాధి లేక కూలీలు అల్లాడుతుంటే మరోవైపు దర్జాగా అక్రమ రవాణా సాగిపోతుంది. కృష్ణా జిల్లా నుండి పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతున్న ఇసుక లారీలను చెక్ పోస్టు దగ్గర పోలీసులు పట్టుకున్నారు. నందిగామ డివిజన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టిన చర్యలు తీసుకుంటున్నామని.. అదే విధంగా 110 కిలో మీటర్లు ఉన్న డివిజన్ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. మొత్తం 7 చెక్ పోస్టులు, 6 మొబైల్ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు నందిగామ డీఎస్పీ చెప్పారు.  ఇటీవల కాలంలో నందిగామ పరిధిలో చెక్ పోస్టుల పరిధిలో పోలీసులు లారీలను పట్టుకున్నారు. జొన్నల గడ్డ, అనాసాగరం, కీసర ప్రాంతాల్లో లారీలను ఆపి పరిశీలిస్తే పాత బిల్లులతో పర్మిట్లు ఉన్నాయి. వాటిని ఉపయోగించి కృష్ణా జిల్లా నుంచి తెలంగాణకు ఇసుక తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. పర్మిట్ లు తీసుకున్న వాహన దారులు మోతాదుకు మించి లోడ్ ను లారీల్లో నింపుతున్నట్లు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. వాటికి జరిమానా కూడా విధించారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ఇసుక వారోత్సవాలు జరుపుతుంటే మరోవైపు అక్రమార్కులు ఏదో ఓ రూపంలో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

కొడాలి నానిని క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి!!

  మంత్రి కొడాలి నానిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. తిరుమల ఆలయం పై మంత్రి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని  మండిపడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. శ్రీ వారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన మంత్రి నాని పై చర్యలు తీసుకోవాలంటూ..  ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్యమతస్థులు తిరుమల శ్రీ వారి దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వాలన్న చట్టం కాపీలను ఆయన పోలీసులకు అందజేశారు. మంత్రి నాని పై కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని భానుప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక అయిన తిరుమల తిరుపతి దేవస్థానాల్లో గుడికి కానీ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తానంటే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని.. గుడిని చట్టాల్ని అగౌరపరిచే విధంగా  రాష్ట్ర మంత్రివర్యులు కొడాలి నాని గారి వ్యవహార శైలి కోట్లాది మంది హిందువుల మనోభవాలు కించపరిచేలా ఉందని ఆయన తెలియజేశారు.  అయ్యా నాని గారు మీరు మాట్లాడే భాష కోట్లాది మంది శ్రీవారి భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి వెంటనే మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. మీరు మాట్లాడిన పదాలు కూడా నేను ఇక్కడ మాట్లాడలేనని.. కానీ భక్తులందరికీ తెలిసిరావాలని.. గౌరవ మంత్రిగా ఉండి మీరు మాట్లాడిన మాటలు 'నీ అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడిని'  అని ఎలా సంభోదించారు. ఒకసారి తిరుమల ఆలయ చరిత్ర తెలుసుకోండి. కొన్ని దశాబ్దాల క్రితం శతాబ్దాల క్రితం చోళులు పల్లవులు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు వీరందరూ స్వామి మీద ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించినట్టి ప్రసిద్ధమైన ఆలయం తిరుమల. ఈ రోజు కలియుగ వైకుంఠంగా ఉన్నటువంటి ఈ ఆలయం పట్ల ఆలయంలో ఉన్న వ్యవహారాల పట్ల మీరు వ్యాఖ్యానించిన  మాటలని వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఇలా హిందువుల మనోభావాలను గాయపరిచిన కొడాలి నానిని వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయవలసిందిగా బీజేపీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. హిందువులు కాకపోతే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి గెజిట్ ఉంది. దీనికి కూడా చట్టం ఉంది.. చట్టాన్ని కూడా గమనించకపోతే ఎలా అంటూ ఘాటుగా స్పందించారు.

ఎమ్మార్వోని కాదు ఇక పీఆర్వోని కలవాలి.. రెవెన్యూ కార్యాలయాల్లో కొత్త పద్ధతి

  ఎమ్మార్వో కార్యాలయాలకు వెళ్తున్నారా.. తహసీల్దార్ ఆర్డీవోలను కలవాలనుకుంటున్నారా.. అయితే ఇక పై వారిని నేరుగా కలిసే అవకాశం లేదు. తహసిల్దార్ విజయా రెడ్డి హత్య అనంతరం అధికారులకు.. ప్రజలకు.. మధ్య కొత్త వ్యవస్థ రాబోతుంది. వారి మధ్య పీఆర్వో విధానం రాబోతుంది. తహసిల్దార్ విజయరెడ్డి హత్యానంతరం ఎమ్మార్వో కార్యాలయాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో పీఆర్వోలను నియమించటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఎన్నో సమస్యలతో రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే వారు నేరుగా అధికారులను కలవకుండా పీఆర్వోలను కలిసే విధానం రాబోతుంది. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలు మొదటగా పీఆర్వోను కలుస్తారు. తమ సమస్యలు ఎంత వరకు వచ్చిందని వారిని అడుగుతారు. వారి వినతి పత్రాలను పీఆర్వోలు అధికారులకు అందజేస్తారు. పరిష్కారం ఎంత వరకు వచ్చిందో తెలుసుకొని ప్రజలకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తారు.  పీఆర్వో విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమస్యలు సరిగ్గా పరిష్కరిస్తే ఎందుకు దాడులు జరుగుతాయంటున్నారు సామాజిక కార్యకర్త ఆర్ శ్రీనివాస్.పీఆర్వో వ్యవస్థను ప్రవేశ పెట్టడం చాలా సంతోషకరమైన వార్త అలాగే ప్రజలు అధికారులు.. తోటి సిబ్బంది కూడా సహకరించాలి. సిబ్బంది కూడా ప్రజలతో సహకరించి.. ఏ సమస్య ఉన్నా క్షుణ్ణంగా వాళ్లు పరీక్షిస్తేనే ఆ సమస్య పరిష్కారమవుతుందని శీనివాస్ వెల్లడించారు.  మరోవైపు విజయారెడ్డి హత్యానంతరం రెవెన్యూ అధికారులకు భద్రత అవసరమని ముఖ్యంగా మహిళా రెవెన్యూ ఆఫీసర్లకు భద్రత తప్పనిసరి అంటున్నారు. ఇంకో వైపు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులకు , మళ్లీ పీఆర్వోలు ఎందుకంటున్నారు మరికొంతమంది అధికారులు. ప్రజా సమస్యలు పరిష్కరించడం కొరకు నియమితులైన అధికారులు వాటిని పరిష్కరించకుండా పీఆర్వో వ్యవస్థ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అంటున్నారు.ప్రజల మనస్తత్వం మారనంత వరకు ఎంత సెక్యూరిటీ ఎన్ని చట్టాలు వచ్చినా ఉపయోగం లేదు అంటున్నారు మరికొందరు అధికారులు. వ్యవస్థలోని కొన్ని లోపాలు కూడా దీనికి కారణమంటున్నారు.

కిటికీలకు 80 లక్షలా!.. బంగారంతో చేపిస్తున్నారా?.. జగన్ పై ప్రశ్నల వర్షం

  వ్యవసాయ రంగంపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టిడిపి సీనియర్ నేత ఆలపాటి రాజా. కోటి మంది రైతులుంటే 40 లక్షల మందికే భరోసా ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఆదా చేస్తున్నామని చెప్పుకునే వైసిపి జగన్ ఇంటి కిటికీలకు రూ.80 లక్షలు ఖర్చు చేయడం ఏంటని నిలదీశారు. గతంలో కోటి మంది రైతులున్నారు. ఇవాళ కనీసం నలభై లక్షల మంది రైతులను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంది. అంతే కాకుండా కౌలు రైతులకి మేం భరోసా అన్నారు.. ఇవాళ కౌలు రైతులను గుర్తించే విషయంలోనే మీరు విఫలమైతే మీరు వారికి ఏం న్యాయం చేయగలుగుతారు. బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు మీరు ఎంత ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక శ్వేత పత్రం ఎక్కడైనా రిలీజ్ చేశారా..? రైతు భరోసా అని చెప్పి చాలా గొప్పగా ఈనాడు చెప్పుకుంటున్నారు. కొన్ని లక్షల రూపాయలు మీరు రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ఇవాళ పబ్లిసిటీ పేరుతో దుర్వినియోగం చేశారు. ఇందులో ఏమి ఆదా చేస్తున్నారు. మేము రివర్స్ టెండర్ల ద్వారా ఆదా చేస్తామన్నారు ఏ రకమైన ఆదా చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ ల రంగు మార్చినందుకు రూ.1100  కోట్ల రూపాయల ఖర్చయ్యింది. ఆఖరికి మీరు కట్టుకున్న ఇంటికి రూ.20 కోట్ల రూపాయల ఖర్చెందుకు పెడతారన్నారు. బాత్ రూము టాయిలెట్స్ కి 10 లక్షల రూపాయలు.. కిటికీలకూ 80 లక్షల రూపాయలు ఏమి వెండితో చేయిస్తున్నారా కిటికీలూ లేద బంగారంతో చేపిస్తున్నారా. మీ ఇంటికి రోడ్డు వేయటానికి రూ.5 కోట్ల రూపాయలా ఏమిటిది..? ప్రజాధనం అని మర్చిపోకండి అంటూ జగన్ ప్రభుత్వ నిర్వాకంపై మండి పడ్డారు.  

వాట్ యన్ ఐడియా కలెక్టర్ సాబ్.. "కిలో ప్లాస్టిక్ కు కిలో బియ్యం"

  ఆయనొక కలెక్టర్.. ప్రజారోగ్యం, ప్రజా సంక్షేమమే ఆయన లక్ష్యం. మొన్న దీపావళికీ నో క్రాకర్స్ అన్నారు. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొన్న దీపావళి టపాసులు నిషేధం.. నేడు ప్లాస్టిక్ పై యుద్ధం.. ములుగు జిల్లా వెలుగే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు కలెక్టర్ నారాయణరెడ్డి. దీపావళికి టపాసులు కాల్చకుండా.. గ్రీన్ దివాళీ జరుపుకొందామని అవగాహన ఇచ్చిన ఆయన ఈ సారి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కిలో ప్లాస్టిక్ కు కిలో బియ్యం స్కీమ్ ను తీసుకొచ్చారు. ప్లాస్టిక్ ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇక్కడ కూడా అదే జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీల్లో 171 గ్రామ పంచాయతీల్లో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వంద శాతం నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఉన్న ప్లాస్టిక్  వెనక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక కేజీ ప్లాస్టిక్ వేస్ట్ కు ఒక కేజీ మంచి బియ్యాన్ని ఇచ్చే విధంగా ప్రొగ్రాం చేపట్టామని అధికారులు వెల్లడించారు. ములుగు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు కలెక్టర్. వాడి వదిలేసిన ప్లాస్టిక్ కవర్లు ,బాటిల్స్ వ్యర్థాలన్నింటినీ సేకరిస్తున్నారు. కిలో ప్లాస్టిక్ సేకరిస్తే కిలో సన్న బియ్యం అందిస్తున్నారు. ఇప్పుడు స్కీమ్ ఉద్యమంలా సాగుతోంది. ప్రజలంతా ప్లాస్టిక్ సేకరణలో భాగస్వాములయ్యారు. ప్రజలకు బియ్యం అందించేందుకు ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు.ఇక్కడ సేకరించిన ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయడానికి అప్పగించి అదే విధంగా రీసైకిల్ చేయలేని క్యారీ బ్యాగ్స్ లాంటి వాటిని సిమెంట్ ఫ్యాక్టరీ పంపించే విధంగా కూడా చర్యలు తీసుకుటున్నట్లు సమాచారం. వీటితో పాటుగా మహిళా సంఘాలకు పేపర్ తో బ్యాగ్ తయారు చేసే విధంగా ఒక యూనిట్ ను ప్రారంభించే విధంగా సంఘం నుంచి తీసుకుంటున్నాం.తర్వాత క్లాత్ ద్వారా కూడా మనకు క్లాత్ బ్యాగ్స్ ను కూడా వినియోగంలోకి తీసుకురావాలనుకుంటునట్లు తెలియజేశారు.   త్వరలో మేడారం మహా జాతర ప్రారంభమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాంటీ ప్లాస్టిక్ జాతర నిర్వహించాలని ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నారు కలెక్టర్. రాబోయే మేడారం కూడా అంటే సుమారు నెలకు కోటి ముప్పై లక్షల జనాభా ఒక వారం రోజుల్లో వస్తారు. అలాంటప్పుడు ఒక్క సింగిల్ పీస్ ప్లాస్టిక్ కూడా ఉండకుండా చూసుకునే విధంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతుందన్నారు. తప్పకుండా అందరి సహకారంతో  ప్లాస్టిక్ ఫ్రీ ములుగుతో పాటు ప్లాస్టిక్ ఫ్రీ మేడారం కూడా సాధిద్దామని అధికారులు ఆశిస్తున్నారు.ఏ ప్రయత్నమైనా ఒక్కరితో మొదలవుతుంది.అది ఆచరణలో సరిగ్గా అమలైతే మహాయజ్ఞంలా సాగుతుందనడానికి, కిలో ప్లాస్టిక్ కు కిలో బియ్యం పథకం నిదర్శనం. ప్రజలంతా ప్లాస్టిక్ ఏరివేత పనిలో పడ్డారు. త్వరలో ములుగు ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుతుంద ని ఆశిస్తున్నారు.  

చిత్తూరు జిల్లా టీడీపీ రాజకీయం.. ఓడిపోయాక బిజినెస్ చేసుకుంటున్న అమరనాథరెడ్డి

  నూతనకాల్వ అమరనాథరెడ్డి చిత్తూరు జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలకమైన నేత. జిల్లా నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అమరనాథరెడ్డి ఇప్పుడు అధికారానికి దూరం కావడంతో రాజకీయంగా కంటే వ్యాపారపరంగానే బిజీ అయ్యారు. ఇదే ఇప్పుడు జిల్లా పార్టీ కేడర్ లో చర్చగా మారింది. 1996 లో అమరనాథరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి చిత్తూరు ఎంపీగా గెలవడంతో.. పుంగనూరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అమరనాథ్ రెడ్డి 36,046 ఓట్ల ఆధిక్యంతో గెలిచి పొలిటికల్ ఎంట్రీ చేశారు. ఆ తర్వాత నియోజక వర్గం పునర్విభజనతో 2009 లో పలమనేరు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా మరోసారి గెలిచారు. రాష్ట్ర విభజన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు వైఖరిని తప్పుపడుతూ ఆ పార్టీకి దూరమైన అమరనాథరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో పలమనేరు నుంచి మళ్లీ గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యి, మంత్రిగా పని చేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో షాక్ కొట్టడంతో ఎమ్మెల్యే పదవికి కూడా దూరమయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి అమరనాథరెడ్డి పూర్తిగా సైలెంటయ్యారు. కొంతకాలం రాజకీయం కంటే వ్యాపారమే మేలని భావిస్తున్నారు.  ఓటమి ఎరుగని తండ్రి నూతనకాల్వ రామకృష్ణారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అమరనాథరెడ్డి రాష్ట్రంలో టీడీపీ ఓటమిని.. పలమనేరులో తన ఓటమిని.. జీర్ణించుకోలేకపోతున్నారు. మే 23 న ఓట్ల లెక్కింపు తర్వాత అమరనాథరెడ్డి జిల్లాలో కనిపించడం లేదు. కొన్ని రోజులు విదేశాల్లో గడిపారు. ఆ తర్వాత అప్పుడప్పుడు పలమనేరులో కేడర్ ను కలుస్తూనే ఎక్కువ సమయం బెంగళూరుల్లో వ్యాపారంపైనే అమర్ దృష్టిపెట్టారు. చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేసి ఆ తర్వాత జిల్లాకు రావడం లేదనే టాక్ నడుస్తుంది. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వ్యాపార సంబంధాలు కూడా ఉండడంతో అమరనాథరెడ్డి సైలెంటయ్యారు అనేది ఓ వార్త. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం కంటే వ్యాపారమే బెటర్ అని అమర్ భావించి వుంటారన్న చర్చ కూడా ఉంది. త్వరలోనే స్థానిక సంస్ధల ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉండటంతో అమర్ మౌనం వీడి దూకుడు ప్రదర్శిస్తారని జిల్లా పార్టీ యంత్రాంగం భావిస్తుంది. జిల్లా టీడీపీలో మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న అమర్ మౌనం వీడి దూకుడు ప్రదర్శించారని కేడర్ కూడా కోరుకుంటోంది.

సియాచిన్ లో విరిగిన మంచుకొండ చర్యలు.. ఆరుగురు మృతి

  సియాచిన్ లో రెస్క్యూ ఆపరేషన్ కష్టతరంగా మారింది. మంచు తుఫాన్ విపరీతంగా ఉండడం తో మృతి చెందిన వారిని బయటకు తీసుకు రావడం ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఆరుగురు చనిపోగా అందులో నలుగురు సైనికులు.. ఇద్దరు పౌరులుగా అనుమానిస్తున్నారు. సియాచిన్ హిమనీనదం పై ఆర్మీ పహారా కాస్తున్న ప్రదేశంలో ఒక్కసారి గా వచ్చిన మంచు తుఫాన్ లో ఎనిమిది మంది చిక్కుకపోయారు. గంటల తరబడి మంచులో ఉండిపోవడంతో అందులో ఆరుగురు చనిపోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పోర్టర్ లు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఎనిమిది మందితో పెట్రోలింగ్ గ్రూప్ మంచు తుఫాన్ వచ్చిన ప్రదేశంలో విధులు నిర్వహిస్తోంది అని సమాచారం. అసలే 19వేల అడుగుల ఎత్తు, ఓ వైపు గడ్డకట్టిన మంచు, మరోవైపు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత, ఆక్సిజన్ అందని పరిస్థితి లో సైనికుల చనిపోయినట్లుగా ఆర్మీ అధికారులు తెలిపారు. తుఫాను తర్వాత ఆర్మీ పెద్దెత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. మంచు చర్యల్లో నుంచి ఎనిమిది మందిని బయటకు తీసింది. అయితే ఆ ప్రయత్నాల్లో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన ఆ ఇద్దరికీ దగ్గర లోని మిలటరీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది.

ఆగ్రా పేరుని ఆగ్రవన్ గా మార్చనున్న యూపీ ప్రభుత్వం

  యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తాజ్ మహల్ అంటేనే గుర్తుకొచ్చే పేరు ఆగ్రా.. ఇప్పుడు అలా పిలవడానికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం "ఆగ్రావన్"  గా మార్చబోతున్నట్లు సమాచారం. ఇన్నాళ్ళు చారిత్రక నగరంగా విరజిల్లిన ఆగ్రా పేరు త్వరలో కనుమరుగుకానుంది. అయితే ఆగ్రావన్ పేరు అధికారికంగా నిర్ణయించనప్పటికీ చారిత్రకంగా ఇంకా ఏదైనా మంచి పేరు ఉంటే సూచించాలని యూపీ ప్రభుత్వం అంబేద్కర్ వర్సిటీకి ఒక లేఖ కూడా రాసింది. పూర్వం ఆగ్రవన్ పేరే ఉండేదని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నేపథ్యం లోనే ఆ పేరే ఖరారయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తుంది.  ఆగ్రాకు పర్యాటక కేంద్రంగా ఎంతో ప్రాధాన్యముంది. తాజ్ మహల్ ఇక్కడే ఉండడంతో పేరు మార్చితే పర్యాటకంగా నష్టపోతామని కొందరు చెప్తున్నారు. ఫైజాబాద్ అయోధ్యగా పేరు మార్చారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్య నాథ్ బాధ్యతలు చేపట్టాక ప్రముఖ నగరాల పేర్లు మార్చుతూ వస్తున్నారు. ఇప్పుడా తాజా జాబితాలో ఆగ్రా కూడా చేరింది. దీని కోసం డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ వర్సిటీ కూడా ప్రయత్నాలు చేస్తుంది. చరిత్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సుగం ఆనంద్ పర్యవేక్షణలో పరిశోధన మొదలైంది. తాజ్ నగర్ కు మొదట్లో ఆగ్రవన్ పేరే ఉండదని ఇంకా ప్రాథమిక సాక్ష్యాలేంటి అన్న దానిపై సమస్త సమాచారాన్ని వెలికి తీసే పనిలో ఉన్నారు. మహాభారత కాలంలో ఈ ప్రాంతానికి ఆగ్రవన్ అంటే అగ్రభాగంలోని బాణం అన్న అర్థం వచ్చేలా పేరుండేది. ఆగ్రా గెజిట్ లో కూడా ఈ ప్రస్తావన ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. అంగీ రమణి ఈ ప్రాంతంలో తపస్సు చేయడంతో ఆయన పేరుతో ఈ నగరాన్ని అంగీరు అని పిలిచేవారని కథలో కూడా ఉంది.

అవినీతిపరులే బీజేపీ టార్గెట్.. ఐఏఎస్ లను కూడా వదలట్లేదు.. రాజకీయ నాయకుల్లో టెన్షన్

  చేతిలో పార్టీ జెండా, ఆ పై స్పష్టమైన ఎజెండాతో ప్రధాని మోదీ అధికారానికి వచ్చారు. వచ్చిందే తడవుగా దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టారు. 1980 నుంచి బీజేపీ ఎజెండాలో ఉన్న అంశాలను అమలు చేయటమే లక్ష్యంగా మోదీ అడుగులు వేస్తున్నారు. మోదీ తొలి పాలనలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ఇలాంటి చర్యల ద్వారా వ్యవస్థలో మార్పులకు ప్రయత్నించారు. రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత తన గుజరాత్ సహచరుడైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సాయంతో ఆయన వేగంగా దూసుకుపోతున్నారు. పదవిని చేపట్టిన మొదటి 6 నెలల కాలం లోనే కీలక నిర్ణయాల ద్వారా దేశ ప్రజల ప్రశంసలు పొందారు. ఆర్టికల్ 370 ని రద్దు చేయడం ద్వారా కశ్మీర్ ను భారత్ లో పూర్తిగా అంతర్భాగం చేశారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణం బీజేపీ వారి కోర్ ఎజెండాగా ఉంది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు వారి ఆలోచనా విధానాన్ని అమలు చేసేందుకు అవకాశమిచ్చింది. దానితో తన ఎజెండాలో అత్యంత కీలక అంశమైన అవినీతి నిర్మూలన పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. బీజేపీ విధానాలను అమలు చేయటంలో మోదీది రాబిన్ హుడ్ స్టైల్ అని విదేశీ పత్రికలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. అవినీతిని నిర్మూలించటంలోనూ మోదీ, షా ద్వయం దూసుకెళ్తున్నారని చెప్పక తప్పదు. రాజకీయాల నుంచి, ఆర్థిక వ్యవస్థ నుంచి, ఉద్యోగస్వామ్యం నుంచి అవినీతిని నిర్మూలించాలని మోదీ కంకణం కట్టుకున్నారు. తొలిమెట్టుగా ప్రత్యక్ష పన్నుల శాఖలో అవినీతి అధికారులుగా పేరు పొందిన 64 మందికి నిర్బంధ పదవీ విరమణ కల్పించారు. అవినీతికర ఐఏఎస్ లను కూడా వదిలేది లేదని తీర్మానించిన మోదీ సర్కార్ అలాంటి అధికారుల జాబితాను రూపొందించాలని సిబ్బంది వ్యవహారాల శాఖను ఆదేశించింది.  రాజకీయాలలో అవినీతి ప్రక్షాళన చేయాల్సి ఉందని బీజేపీ చాలా రోజులుగా చెబుతున్న మాటే. అవినీతికి దూరంగా స్వచ్ఛమైన రాజకీయాలు ఉండాలని మోదీ కోరుకుంటున్నారు. రాజకీయాల్లో కీలకంగా ఉంటూ అవినీతి కేసులున్న వారి జాబితాను రూపొందించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో బీజేపీ ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది. కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి చిదంబరం, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివ కుమార్ అరెస్టును ఈ దిశగానే పరిగణించాలి. మనీ లాండరింగ్ కేసులో శివ కుమార్ కు బెయిల్ మంజూరు కాగా చిదంబరం ఇంకా కస్టడీ లోనే ఉన్నారు. నిజానికి బీజేపీ నేతల పై అవినీతి కేసులు చాలా తక్కువ. విపక్షంలో ఉన్న కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీల నేతల పై కేసులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. ఇంత కాలం ఆడింది ఆట పాడింది పాటగా సాగించుకున్న నేతలు ఇప్పుడు ఇరకాటంలో పడక తప్పడం లేదు. ఒక్కొక్కరిపై అవినీతి కేసుల విచారణ వేగవంతమవుతుంటే వారికి ముచ్చెమటలు పట్టే పరిస్థితి ఎదురవుతుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పురి పై మనీ లాండరింగ్ కేసు ఉండటంతో ఆయనను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. మరో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తనయుడు పైసల్ , అల్లుడు ఇర్ఫాన్ సిద్దిఖీ పై కూడా మనీ లాండరింగ్ కేసు ఉంది.ఇక పశ్చిమ బెంగాల్ లో శారద నారద కేసు, తమిళనాడులో ఎన్నికల సందర్భంగా డీఎంకే నేతల పై ఆదాయ పన్ను శాఖ కేసులు, మహారాష్ట్రలో అశోక్ చవాన్ సహా కాంగ్రెస్ నేతల పై వేర్వేరు కేసులు ఉన్నాయి.  మన వ్యవస్థలో అవినీతి పాతుకుపోయిందని దాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని బీజేపీ పట్టుబట్టింది. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ నేతల పై లెక్కకు మించిన అవినీతి కేసులున్నాయి. అవినీతిపై పోరాటంలో మోదీ సర్కారుకు స్పష్టత ఉందని.. ఎన్నికల ముందు అమిత్ షా ఒక మాటన్నారు. మోదీ అవినీతి రహిత సమాజాన్ని కోరుకుంటున్నారని అందుకే విపక్షాలు, మోదీ రహిత భారత్ కోసం పన్నాగం పన్నుతున్నాయని అమిత్ షా ఆరోపించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదని తేల్చి చెప్పారు. అవినీతిని నిర్మూలిస్తేనే ఆశ్రిత పక్షపాతం, దుష్పరిపాలన, పేదరికం పోతాయని బీజేపీ నమ్ముతుంది. ఇంతకాలం కాంగ్రెస్ నేతృత్వ సంకీర్ణాలు అవినీతిలో బతికాయని బీజేపీ వాదిస్తుంది. అవినీతిని నిర్మూలిస్తేనే రాజకీయాల్లో పెనుమార్పులు సాధిస్తామని బీజేపీ విశ్వసిస్తుంది. వరుసగా రెండవ సారి అధికారానికి వచ్చిన బీజేపీ తన పాలనను శాశ్వతం చెయ్యాలంటే ఎజెండాలో ఉన్న ప్రధానాంశం అవినీతి నిర్మూలనేనని చెబుతోంది.

ప్లాస్టిక్ మేమే బ్యాన్ చేస్తున్నాం.. బ్యాగ్ తెచ్చుకోండి లేదా మా దగ్గరే కొనుక్కోండి

  ప్లాస్టిక్ కవర్లను బ్యాన్ చేయడంతో వ్యాపారస్తులు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. పేపర్ బ్యాగ్స్ వాడుతున్నారు. వీటి వాడకం కూడా పర్యావరణానికి కాస్త ఇబ్బందనే అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. పేపర్ బ్యాగ్స్ చేయాలంటే చెట్లు నరకాల్సిందే.. ఇప్పటికే గ్లోబల్ ఎఫెక్ట్..కాలుష్యంతో ఎన్నో ఇబ్బందులను ఎదురుకుంటున్నారు ప్రజలు. ప్రస్తుతానికి ప్లాస్టిక్ ను తగ్గించేందుకు పేపర్ బ్యాగ్స్ వాడినా.. భవిష్యత్తులో మాత్రం జూట్, బట్ట సంచులనే వాడతామంటున్నారు వ్యాపారులు. ప్లాస్టిక్ ని బ్యాన్ చెయ్యాలంటే అది ఫ్యాక్టరీల నుంచే మొదలు కావాలి. కొంతమంది వ్యాపారుల సైతం తమను తామే ప్లాస్టిక్ నిషేదం పై ఆంక్షలు పెట్టుకున్నారు. ఒక వ్యాపారి అరటిపండ్లను న్యూస్ పేపర్ లలో చుట్టి ఇస్తూ ప్లాస్టిక్ వాడొద్దని జనాన్ని చైతన్యపరుస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాగ్ లను తగ్గించేందుకు పేపర్ లను వాడుతున్నామన్నారు పండ్ల వ్యాపారులు. మేము నష్ట పోయినా పర్లేదు ప్లాస్టిక్ వాడకూడదనే ఉద్దేశం తోనే ఇలా చేస్తున్నామని చెబుతున్నారు. తమ దగ్గరకు వచ్చే కొనుగోలుదారులు ఖచ్చితంగా బ్యాగులు తెచ్చుకోవాలంటున్నారు వ్యాపారులు. రైతు బజార్ లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రైతు బజార్ లలో కొందరు జూట్ బ్యాగ్ లతో కనిపిస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినా అందరిలో మార్పు వస్తేనే ప్లాస్టిక్ నివారణ సాధ్యపడుతుంది. ఏదైనా మనవరకు వస్తే కానీ తెలీదు అంటారు.. పర్యావరణాన్ని కాపాడండి అంటే ఎవ్వరూ పట్టించుకోలేదు.. ఇప్పుడు ప్రాణాపాయ సంకేతాలు కనిపించగానే ఎప్పుడు లేని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

సస్పెన్స్ థ్రిల్లర్... మహా రాజకీయంలో మరిన్ని మలుపులు

  మరాఠా రాజకీయాలు ఓ పట్టాన తేలడం లేదు. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన ప్రకటించింది.. కానీ మూడు పార్టీలు కలిసి ఇప్పటి వరకు ఎలాంటి ఉమ్మడి ప్రకటన చేయలేదు. మరోవైపు పవార్ చేసిన వ్యాఖ్యలు కూడా అనుమానాలకు తెరలేపుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ సరికొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు అంశం మరోసారి హస్తిన చేరుకుంది. ఎన్సీపీ చీఫ్ శరత్ పవార్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీల మధ్య ఢిల్లీలో మహారాష్ట్ర పరిణామాలపై కీలక భేటీ జరిగింది. భేటీ తర్వాత శరత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మరో ట్విస్ట్ కు దారితీశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేశాయి. వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారు శివసేన దారి ఎటువైపో వారే తేల్చుకోవాలంటూ ఆశ్చర్యకరమైన రీతిలో శరత్ కామెంట్ చేశారు.  అటు ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన ఆశలు ఏమాత్రం వదులుకోవడం లేదు. తాము త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ముగిసాక శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. అయితే మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పాటవ్వాలనే విషయం పై నయా ఫార్ములా తెరపైకి తీసుకొచ్చారు కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే. 3 ఏళ్లు బీజేపీ సీఎం,2 ఏళ్లు శివసేన సీఎం ఉండేలా సరికొత్త ఫార్ములాను ఆ పార్టీ నేతల ముందు ఉంచామని తెలిపారు. ఇలా మహారాష్ట్ర రాజకీయాలు 3 ట్విస్ట్ లు 6 మలుపులతో సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది.

పదవుల పోట్లాట... అహమే అడ్డుగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ నేతలు!

  మహబూబాబాద్ జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చే సీనియర్ లీడర్ రెడ్యా నాయక్. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన నేత. ఇదే జిల్లాకు చెందిన మరో కీలక నేత మహిళా శిశుసంక్షేమశాఖామంత్రి సత్యవతి రాథోడ్. ఇద్దరి నేతలు ప్రస్తుతం టిఆర్ఎస్ లో ఉన్నారు. ఒకే సామాజిక వర్గం ఒకే నియోజక వర్గం కావడంతో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ఓ లెవల్ లో సాగుతుంది. ఎమ్మెల్యే కూతురు కవిత కూడా ఎంపీ. పైకి చూస్తే నియోజకవర్గంలో అంతా బాగా ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ ఇగో ఫీలింగ్ అసలు సమస్యగా మారింది. రాజకీయాల్లో తన జూనియర్ తన చేతిలో ఎమ్మెల్యేగా ఓడిన నేత మంత్రి గావడం ఆ సీనియర్ ఎమ్మెల్యేకు మింగుడు పడటం లేదు. తనకు మంత్రి పదవి రాకపోవడం పట్ల సన్నిహితులు, పార్టీ సీనియర్ల దగ్గర తన ఆవేదన పంచుకున్నారు. కానీ తన జూనియర్ కు మంత్రి పదవి ఇవ్వడంపై మాత్రం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల కార్తీక పౌర్ణమి రోజున జరిగిన సంఘటన ఇందుకు ఉదాహారణ.. డోర్నకల్ నియోజకవర్గంలో ఇలాంటి సీన్లు ఇప్పుడు కామన్ గా మారాయి. మంత్రి, ఎమ్మెల్యే ఒకరికొకరు ఎదురుపడినా కనీసం పలకరించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఇటీవలే జిల్లాలో కురవి మండలం కందికొండలో జాతర జరిగింది. కందగిరి పర్వతంపై వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతరకు మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా పరిషత్ చైర్మన్ ఆంగోతు బిందు కలిసి స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు. ప్రియదర్శనం పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఆయన కూతురు కవిత , మంత్రికి ఎదురుపడ్డారు కానీ మంత్రిని కనీసం పలుకరించకపోవడం విమర్శలకూ దారితీసింది. అలయంలో ఇలా జరిగితే బైట కూడా అదే సీన్ రిపీటైంది. మంత్రి మీడియా సమావేశానికి ఎమ్మెల్యే, ఎంపీ డుమ్మాకొట్టారు. అదే ప్లేస్ లో ఆ తర్వాత ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం చర్చనీయాంశమైంది. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు మంత్రి పదవి దక్కక పోవడం, సత్యవతికి మంత్రి పదవి ఇవ్వడంతో రెడ్యా నాయక్ ముఖం చాటేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వర్గపోరుతో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు.

ఇప్పుడే కొనుక్కోండి.. భారీగా తగ్గుముఖం పట్టిన పసిడి ధర..

  ఇటీవల కాలంలో అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్లిన బంగారం ధర ఇప్పుడు తగ్గు ముఖం పడుతోంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గుతోంది. గత సెప్టెంబర్ లో 40,000 ల రూపాయల మార్కును దాటిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు 38,000 ల రూపాయల స్థాయికి దిగి వచ్చింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి 34,900 ల రూపాయలుగా ఉంది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడే సూచనలు కనిపిస్తుండటంతో మళ్లీ పెట్టుబడులు బంగారం నుంచి ఈక్విటీ మార్కెట్ ల వైపు మళ్లుతున్నాయి. ఇది బంగారం ధర పతనానికి దారి తీస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర రూ.1,467 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ కు తోడు దేశీయంగా నగల వ్యాపారులు వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర పతనమవుతుంది. వెండి ధర కూడా భారీగానే తగ్గుతుంది. ప్రస్తుతం కేజీ వెండి రూ.44 వేల రూపాయలుగా ఉంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు వెండి 17 డాలర్ లకు లోపే ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్ లో కూడా బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. ఈ పతనం మరికొంత కాలం సాగే సూచనలు కనిపిస్తున్నాయి

పాక్ యువతి కోసం వెళ్లి పోలీసులకు దొరికిపోయిన హైదరాబాద్ యువకుడు

  హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాకిస్థాన్ లో అరెస్టయ్యాడు. అతడితో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన టెకీ దరిలాల్ ను కూడా దేశ భద్రతా బలగాలు అరెస్టు చేసినట్లుగా పాకిస్థాన్ మీడియా తెలిపింది. పాక్ లోని బహావల్ పూర్ దగ్గర ఖోలిస్తాన్ ఎడారిలో వీరిని సోమవారం అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరి దగ్గర పాస్ పోర్ట్ లేదని గుర్తించినట్టుగా పాక్ మీడియా పేర్కొంది. హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్ కు ఆన్ లైన్ లో పరిచయమైన ఓ యువతిని వెతుక్కుంటూ గూగుల్ మ్యాప్ ఆధారంగా పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించాడని తెలిసింది. అతడు తెలుగులో మాట్లాడిన ఓ వీడియో సైతం పాక్ వెబ్ సైట్ లలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ ఆ దేశంలో ఉగ్రవాదానికి కుట్ర పన్నారన్న అభియోగాలు పాకిస్థాన్ మీడియాలో ప్రసారమవుతున్నాయి. ప్రశాంత్ స్వస్థలం విశాఖపట్నం అని గుర్తించినట్లు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. అతడు రెండేళ్ల క్రితమే పాక్ భూభాగంలోకి అడుగుపెట్టడాని తెలిపారు. ప్రేమ విఫలమవడంతో మతిస్థిమితం కోల్పోయిన ప్రశాంత్ అటూ ఇటూ తిరుగుతూ ఎడారి మార్గంలో పాకిస్థాన్ కు వెళ్లాడని వివరించారు. అప్పుడే అతన్ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. పాక్ మీడియాలో ప్రసారమవుతున్న ప్రశాంత్ తెలుగు వీడియోలో తన తల్లిదండ్రులకు ఓ సందేశానిచ్చాడు. అయితే ఆ వీడియో రెండేళ్ల కిందటిదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అటు శ్రీలంక కస్టమ్స్ అధికారులు ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేశారు. శ్రీలంక అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరు బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామని అధికారులు తెలిపారు.  

టీడీపీ ఖాతాలో 155కోట్లు... వైసీపీ అకౌంట్లో 138కోట్లు... టీఆర్ఎస్ కి 188కోట్లు

  సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడు నెలలు దాటిపోయింది. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటై కూడా ఆర్నెళ్లు కావొస్తోంది. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీలు పెట్టిన ఖర్చులపై ఎన్నికల సంఘానికి లెక్కలు సమర్పిస్తున్నాయి. వచ్చిన విరాళాలు... ఎన్నికల్లో ఖర్చుపై... వైసీపీ... అలాగే టీడీపీ... వివరాలు వెల్లడించాయి. అయితే, ఎన్నికల సమయానికి కేవలం 74లక్షలు మాత్రమే బ్యాంకు బ్యాలెన్స్ కలిగివున్న వైసీపీకి... ఎన్నికలు ముగిసేనాటికి 221కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఇందులో 85కోట్లను ఎన్నికల కోసం ఖర్చు చేసింది వైసీపీ. 9.72కోట్లు స్టార్ క్యాంపెయినర్ల కోసం... 36కోట్లు మీడియా ప్రకటనల కోసం వ్యయం చేశారు. మీడియా ప్రకటనల కోసం ఖర్చు చేసిన 36కోట్లలో... వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్ కే 24 కోట్లు ముట్టచెప్పారు. ఇక, వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ కి రికార్డు స్థాయిలో 37కోట్ల రూపాయలు చెల్లించింది. అలా, ఎన్నికల ఖర్చు తర్వాత వైసీపీ బ్యాంకు ఖాతాలో 138కోట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఇక, వైసీపీకి వచ్చిన విరాళాల్లో 181కోట్లు విరాళాల ద్వారా, 99కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా, 36కోట్లు నాన్ కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చినట్లు యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్ లో వైసీపీ ప్రకటించింది. ఇక, ఘోర పరాజయం చవిచూసి, కేవలం 23 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం... ఎన్నికల కోసం 77కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. అందులో మీడియా ప్రకటనల కోసం 49కోట్లు ఖర్చు చేయగా, హెలికాప్టర్ల వినియోగం కోసం 9కోట్లు వ్యవయం చేసింది. ఇక, ఎన్నికల నాటికి టీడీపీ అకౌంట్లో 102 కోట్లు ఉండగా, విరాళాల రూపంలో 131కోట్లు వచ్చాయి. ఎన్నికల వ్యయం తర్వాత టీడీపీ అకౌంట్లో ఇంకా 155కోట్లు ఉన్నట్లు ప్రకటించింది. ఇక, తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్... కేవలం 29కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ లో తెలిపింది. అలాగే, విరాళాల రూపంలో 188కోట్లు వచ్చినట్లు తెలిపింది. అయితే, ఏపీలో మాత్రమే వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఎన్నికల కోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశాయి. తెలుగుదేశం 77కోట్లు ఖర్చుచేస్తే... వైసీపీ మరింత ఎక్కువగా 85కోట్ల రూపాయలను వ్యయం చేసింది.  

ఒకవేళ జగన్ బెయిల్ రద్దయితే... సీఎం పీఠమెక్కేది విజయమ్మా? భారతా? 

  వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. సుదీర్ఘకాలంగా బయటున్నవాళ్ల బెయిల్ రద్దుచేసి నాలుగు వారాల్లో జైలుకు పంపాలని సుప్రీం ఆదేశించిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే, కేంద్ర హోంశాఖ పేరుతో మరో వార్త సర్క్యులేట్ అవుతోంది. సీరియస్ కేసుల్లో బయటున్న నిందితుల బెయిల్స్ రద్దు కోసం కోర్టుల్లో పిటిషన్ వేయాలంటూ సీబీఐ, ఈడీలను కేంద్ర హోంశాఖ ఆదేశించిందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఇందులో జగన్ పేరు కూడా ఉందని, దాంతో మళ్లీ జైలుకెళ్లడం ఖాయమంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు కోర్టు నో చెప్పడంతో... త్వరలోనే బెయిల్ కూడా రద్దు చేయాలంటూ సీబీఐ పిటిషన్ వేసే అవకాశముందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక, టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా కూడా ఇలాంటి పోస్టే ఒకటి పెట్టారు. జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ పావులు కదుపుతోందని, విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిని కేంద్రం సున్నితంగా తిరస్కరించిందంటూ ట్వీట్ చేశారు. జరుగుతున్న ప్రచారంలో నిజముందో లేదో తెలియదు కానీ, జగన్మోహన్ రెడ్డి... తన సతీమణితో కలిసి గవర్నర్ ను కలవడంపైనా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఒకవేళ బెయిల్ రద్దయి... జగన్ జైలుకెళ్తే... భారతిని ముఖ్యమంత్రి చేస్తారని, అందుకే... ముందుగా గవర్నర్ కు పరిచయం చేశారని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, భారతిని పాలనా వ్యవహారాల్లో ఇన్ వాల్వ్ చేస్తున్నారని, శిక్షణ కూడా ఇప్పిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇక, ఇటీవల కేసీఆర్ కూడా... మూడు నాలులు నెలల్లో జగన్ జైలుకెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఒకవేళ నిజంగానే బెయిల్ రద్దయి జగన్ జైలుకెళ్తే... విజయమ్మ ముఖ్యమంత్రి అవుతుందే కానీ... భారతిని ఎంచుకోకపోవచ్చని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే, సీబీఐ ఒకవేళ బెయిల్ రద్దు చేయాలని కోరినా... కోర్టు అంత త్వరగా అంగీకరించే పరిస్థితి ఉండదని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.  

పోలవరంపై మాటలకే పరిమితం చేసిన కేంద్రం... ఏపీ ప్రభుత్వానికి నిధులు ఆపేశారు!!

  పోలవరం ప్రాజెక్టు విషయంలో రోజుకో చిక్కుముడి బయటపడుతుంది. ఇది జాతీయ ప్రాజెక్టా లేక కేంద్రం ప్రత్యేకంగా చూసే ప్రాజెక్టా అర్థం కాక రాష్ట్ర ప్రభుత్వ అధికారులే తలలు బాదుకుంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పర్యవేక్షణకు కేంద్రమే నియమించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఉనికిని కూడా లేదు. పీపీఏ సిబ్బంది జీతభత్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని రీయింబర్స్ చేసేస్తున్నామని చెబుతూ కేంద్ర ఆర్థిక శాఖ సవాలక్ష నిబంధనలు పెడుతుంది. 2014 కి ముందు ప్రాజెక్టుకి ఖర్చు చేసిన మొత్తానికీ కాగ్ ఆడిట్ నివేదిక ఇవ్వాలని షరతు విధిస్తుంది. దీనిపై కేంద్ర జలశక్తి శాఖకు పంపిన ఆఫీసు మెమోరాండం చూశాక భవిష్యత్తులో పోలవరానికి నిధులు రావడం పై ఆశలు సన్నగిల్లుతున్నాయని నిపుణులంటున్నారు.  పోలవరం నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి ఇప్పటి దాకా వచ్చిన నిధులు భవిష్యత్ లో రావలసిన నిధులపై రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేకంగా అధ్యయనం చేస్తుంది. ఇప్పటి దాకా 6,727 కోట్లు విడుదలయ్యాయని ఇంకా 5,072 కోట్లు రియంబర్స్ కావలసి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందులో 1,850 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ నుంచి వర్తమానం అందింది. ఈ నెల 8 న జలశక్తి శాఖకు ఆర్థిక శాఖ పంపిన ఆఫీసు మెమోరాండంలో పలు కీలక అంశాలు కనిపించాయి. కేంద్ర బడ్జెట్ లో పోలవరానికి కేటాయింపులు లేవని అందులో ఆర్థిక శాఖ తెలిపింది. నాబార్డు ద్వారా రుణం సాయం పొంది జలశక్తి శాఖ ద్వారా పీపీఏ కు దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని గతంలో ఇదే కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. బడ్జెట్ లో ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం ప్రధాన అవరోధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుగా కేంద్ర బడ్జెట్ లో నిర్ణీత మొత్తాన్ని కేటాయిస్తే సమయానుకూలంగా నిధులు ఎక్కువగా తీసుకునేందుకు వీలుంటుందని అంటుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో 2020-21 బడ్జెట్ లో పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలనుకుంటుంది.  విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాక పీపీఏ ఏర్పడింది. అయితే పిపిఎతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. తమతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్రాన్ని ఎప్పట్నుంచో పీపీఏ కోరుతోంది. జలశక్తి శాఖ దానిని ప్రత్యేకంగా గుర్తించక పోవడంతో ఈ సంస్థతో ఎలా ఒప్పందం చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలో పోలవరాన్ని ప్రత్యేకంగా చూస్తూ జాతీయ జల అభివృద్ధి సంస్థ ద్వారా గాక నేరుగా రాష్ట్రానికే నిధులు మంజూరు చేసేలా ఒత్తిడి పెంచాలనే ఆలోచనలో జల వనరుల శాఖ ఉంది. గతంలో ఏఐబీపీ కింద చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం మేర నిధులు వెచ్చిస్తుండేది.  ఇందులో పోలవరం ప్రాజెక్టు కూడా ఉండేది. కానీ 2014 రాష్ట్ర విభజన చట్టంలో ఈ ప్రాజెక్టును జాతీయ హోదా ప్రాజెక్టుల జాబితాలో చేర్చారు. ఆ తర్వాత ప్రాజెక్టు మొత్తానికి అయ్యే వ్యయం అంతటిని తానే భరిస్తానని కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులో అప్పుడప్పుడు కొంత ఇవ్వడం తప్ప ప్రాజెక్టు కోసం అంటూ ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదు కేంద్రం. అంతేకాదు ప్రాజెక్టుకు సంబంధించిన సహాయ పునరావాస అంచనాల పై కేంద్ర ఆర్థిక శాఖ అడిగిన ప్రశ్నలే పదేపదే అడుగుతుంది. ప్రాజెక్టు టెండర్లు పనుల అప్పగింత పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిపుణుల కమిటీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ కమిటీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి చెల్లింపుల్లో అక్రమాలు జరగలేదని రుజువయ్యాకే భవిష్యత్ లో నిధులు మంజూరు చేయాలని ఆఫీసు మెమోరాండంలో ఆర్థిక శాఖ తేల్చి చెప్పడంతో జలవనరుల వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.

కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన జగన్...1.5 లక్షల ఉద్యోగుల తొలగింపు!

  కొంతకాలంగా ఏదో ఒక కారణంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ సారి భారీ ఎత్తున దానిపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. వారి నెత్తి పై ఉద్వాసన కత్తి వేలాడుతుందని అది ఎప్పుడైనా వారి కొలువులను కత్తిరించే ముప్పు పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. ఆర్థికశాఖ అనుమతి లేదనే ఒకే ఒక్క కారణం చెప్పి దాదాపు లక్షన్నర మందిని తొలగించే ప్రయత్నాలు ఆ శాఖ స్థాయిలోనే ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిసింది. ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ.. రోజుకో మెమో సర్క్యులర్ తో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని హడలెత్తిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా వారి ఉద్యోగాలకే చెక్ పెట్టారు. ఆయా విభాగాల పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలకు ఆర్థికశాఖ అనుమతి ఉందా లేదా అనే వివరాలు పంపాలని అన్ని శాఖల హెచ్వోడీలకు, జిల్లా కలెక్టర్ లకు, సచివాలయ అధికారులకు ఆర్థిక శాఖ లేఖ రాసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీకి జీతాలు ఇవ్వాలంటే వారు ఏ తరహా సిబ్బందో వివరాలివ్వాలని అందుకు సీఎఫ్ఎంఎస్ లాగిన్ ఐడీ వినియోగించుకోవాలని ఈ శాఖ మెమో ద్వారా సూచించింది.  ఆర్ధిక శాఖ 15 కాలమ్స్ తో వివరాలను పంపాలంటూ ఒక నమూనాను అన్ని శాఖలకు పంపింది. ఈ నమూనాలో మంజూరైన పోస్టుల సంఖ్య, మంజూరైన పోస్టుల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య, ప్రభుత్వ ఆదేశాలతో మంజూరైన పోస్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సంఖ్య, నియామకం చేపట్టిన విధానం వేతనాలు మంజూరు కాని పోస్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది సంఖ్యతో పాటు వారికి రావాల్సిన జీతాల పెండింగ్ బిల్లులు తదితర వివరాలు కలిగిన 15 కాలమ్స్ పూర్తి చేసి పంపాలని సూచించారు. వివరాలన్నీ వచ్చిన తర్వాత ఎవరిని కొనసాగించాలనే నిర్ణయం తీసుకుంటామని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి.  నిజానికి ఇటీవల కాలంలో ఏదో ఒక కారణం వెతికి తొలగించేయడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది మార్చి 31 కి ముందు ఉద్యోగాల్లో చేరి 40,000 ల పై బడి వేతనాలు పొందుతున్న సిబ్బందిని ఇప్పటికే తొలగించారు. పేపర్ నోటిఫికేషన్ ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ఏక పక్షంగా తీశారు. పలు శాఖలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఈ ఏడాది మార్చి నుంచి జీతాలు ఇవ్వడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆర్థికశాఖ అనుమతి పొందకుండా నియామకమైన కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కేటాయింపులు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. వారిలో ఆర్థికశాఖ అనుమతి బడ్జెట్ కేటాయింపులతో నియమించిన వారు 40,000 లకు మించి ఉండరు. ఈ నెల 14 న సచివాలయంలో జరిగిన వివిధ శాఖల నోడల్ అధికారుల సమావేశంలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల అంశం చర్చకు వచ్చింది. బడ్జెట్ లేకపోవటం, సిబ్బంది కాంట్రాక్ట్ ను రెన్యువల్ కాకపోవడం, ఆ ఉద్యోగుల నియామకాలకు ఆర్థికశాఖ అనుమతి లేకపోవడమే దీనికి కారణమని తేల్చారు.

అమ్మ ఒడి పథకంలో షరతులు... ప్రణాలికను విడుదల చేసిన జగన్ ప్రభుత్వం

  అమ్మ ఒడి పథకానికి సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. 75% హాజరు ఉంటేనే పథకం కింద ప్రయోజనం పొందనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల, పన్ను చెల్లించే వారి పిల్లలకు అమ్మ ఒడి లేదు. ఏపీ సర్కార్ వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. ఈ నెలాఖరు నాటికి విద్యార్థులకు 75% హాజరు ఉంటేనే ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని తెలిపింది.ఒకవేళ అంత కంటే తక్కువ హాజరువుంటే ప్రధానోపాధ్యాయులు నిశిత పరిశీలన చేసి హజరు తగ్గటానికి విద్యార్థి లోపం లేదని పరిగణనలోకి తీసుకోవచ్చని సిఫార్సు చేస్తే పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేసింది.  అదే విధంగా ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకుంటున్న మాజీ ఉద్యోగుల పిల్లలకు అమ్మ ఒడి ఉండదని మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్ర.. కేంద్ర ప్రభుత్వ.. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపు దారుల పిల్లలు ఈ పథకం కింద అర్హులు కాదని తెలిపింది. దారిద్య రేఖకు దిగువ ఉండి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కలిగిన వారు అమ్మఒడికి పూర్తి అర్హులని ప్రభుత్వం వివరించింది. ఈ కార్యక్రమం కోసం డీఈవో కార్యాలయంలో 24 గంటల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశించారు.  అమ్మఒడి కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 13జిల్లాలకు పర్యవేక్షకులను నియమించారు. పాఠశాల చైల్డ్ ఇన్ఫోలో నమోదైన విద్యార్థుల వివరాలను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు క్షుణ్ణంగా పరిశీలించి ఈ నెల 19లోగా నిర్థారించాలి. ఆ జాబితాను గ్రామ సచివాలయంలోని విద్య సంక్షేమ సహాయకునికి ఈ నెల 24న పంపాలి. ఈ జాబితాను 25వ తేదీ నాటికి గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో పెట్టాలి. వీటి పై అభ్యంతరాలను మూడు రోజుల్లో సేకరించి తెలియజేయాలి. ఆధార్ లేని విద్యార్థుల వివరాలను గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ నెల 25 నుంచి డిసెంబర్ 1వ తేదీలోగా సేకరించి హెచ్ ఎం అందించాలి. ముసాయిదా జాబితాకు డిసెంబరు 15 నుంచి 18వ తేదీలోగా గ్రామ సభ ఆమోదం పొందాలి. ఈ జాబితాను ప్రధానోపాధ్యాయుడు ఎంఈవో ద్వారా పీవోకు డిసెంబర్ 23 లోగా అందించాలి. బిఈవో డిసెంబర్ 24 నాటికి కలెక్టర్ ఆమోదం కోసం సమర్పించాలని ప్రభుత్వం ప్రణాళిక విడుదల చేసింది.