సీతాఫలాల సీజన్.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమ్మకాలు భేష్

    వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీతాఫలాల వ్యాపారం బాగా జరుగుతుంది. హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్, పబ్లిక్ గార్డెన్స్ దగ్గర సీతాఫలాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా ఎత్తయిన గుట్టలు ఎడారి ప్రాంతాలలో సహజసిద్ధంగా పండే సీతాఫలం చెట్లు చల్లని వాతావరణంలో పూతకు కోతకు వస్తాయి. అంటే చలికాలంలోనే ఏటా ఈ సీతాఫలాలు ఎక్కువ శాతం కాస్తుంటాయి. సీతాఫలం సహజసిద్ధంగా ఎలాంటి పురుగు మందులు వాడకుండానే కాస్తాయి. అందుకే సీతాఫలాలు తినేందుకు అంత ఆసక్తి చూపుతారు. ధర ఎంతైనా కొనుగోళ్లు చేస్తారు. ఇష్టంగా సీతాఫలాలు తింటారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, చిలుపూరు, చిన్నపెండ్యాల, దేవరుప్పల, దేవునూరు, హసన్ పర్తి మండలం, చింతగట్టు వంటి ఎత్తయిన అటవీ ప్రాంతాలలో సీతాఫలాల చెట్లు పెరుగుతాయి. స్థానిక రైతులు, కూలీలు ఆయా ప్రాంతాలకు వెళ్లి వారి ఉపాధి కోసం సీతాఫలాలను కోసి ఎడ్లబండ్ల ద్వారా పట్టణ, నగర ప్రాంతాలకు తరలిస్తారు. వాటిని అమ్మి ఉపాధి పొందుతూ ఉంటారు. ఇది శీతాకాలంలోని గ్రామీణ కూలీలకు ఒక రకమైన ఉపాధి మార్గంగా చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల నుండి సీతాఫలాలను తెచ్చి పట్టణ, నగర ప్రాంతాల్లో అమ్మే రైతుల నుండి స్థానిక కూలీలు కొనుగోలు చేసి ప్రజలకు విక్రయించి ఉపాధి పొందుతూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుండి సీతాఫలాలను తెచ్చేవారి నుండి గంపగుత్తగా కొనుగోలు చేస్తారు. కొంత లాభాన్ని చూసుకొని ప్రజలకు సీజనల్ సీతాఫలాని అమ్ముతారు. అనేక రకాలైన పోషకాహార విలువలు గల సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే లభించే సీతాఫలం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సీతాఫలానికి చలువచేసే గుణం ఎక్కువ, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మలబద్దకాన్ని నివారిస్తుంది. వీటిని తినటం వలన కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తిని అరికట్టి జీర్ణశక్తిని పెంచుతుంది. సీతాఫలాని మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్, జ్యూస్ తయారీలో అధికంగా వినియోగిస్తారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తప్పని సరిగా తినాల్సిన పండు ఏదైనా ఉందంటే అది ఒక్క సీతాఫలమేనని వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలను ఇచ్చే సీతాఫలం చూడగానే అందరికీ నోరూరుతుంది. అన్ని కాలాలలో సీతాఫలాలు వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అయితే సీతాఫలాలలో స్వీట్ ఎక్కువగా ఉండటంతో షుగర్ పేషంట్స్ మాత్రం తమకున్న మక్కువను తీర్చుకోలేకపోవడం బాధగా అనిపిస్తుంది.  

ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే.. నిధుల్లేక తలలు పట్టుకుంటున్న జగన్ సర్కార్!!

  ఆంధ్ర ప్రదేశ్ లో తాగు నీటి ప్రాజెక్టుల పనులు పడకేశాయి. తీవ్ర నిధుల కొరతతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. బ్యాంకులు రుణం ఇస్తేనే పనులు సాగే దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హాయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ సమీక్ష జరిపే వరకు పనులు ముందుకు సాగనీయ వద్దంటూ జల వనరుల శాఖకు ఆదేశాలొచ్చాయి. దీంతో కమిటీ నివేదిక కోసం కొంత కాలంగా ఆ శాఖ పనులన్నీ ఆపేసింది. హంద్రీ నీవా గాలేరు నగరి సుజల స్రవంతిలో అక్రమ చెల్లింపులు జరిగాయని, పోలవరం ప్రాజెక్టులను అదనపు చెల్లింపులు జరిగాయని కమిటీ తేల్చడంతో ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రివర్స్ టెండర్ కు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలవరం సాగు నీటి ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రాల్లో ఒకే ప్యాకేజీ గా రివర్స్ టెండర్ కు వెళ్లారు. ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి కోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. మిగిలిన ప్రాజెక్టుల విషయంలో జల వనరుల శాఖ మూడుసార్లు సీఎంతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించిన ఎలాంటి స్పష్టత రాలేదు. నిధుల కొరతే ఇందుకు ప్రధాన కారణంగా ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.  రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను చేపట్టేందుకు ఈ ఏడాది 7,687 కోట్లు అవసరమని సీఎం ఈ నెలలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జల వనరుల శాఖ నివేదిక ఇచ్చింది. అయితే ఈ 7,687 కోట్ల విషయంలో ఆర్థిక శాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వటం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్న సమయంలోనే ప్రభుత్వం భారీ సాగు నీటి ప్రాజెక్టులకు స్కెచ్ వేసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను పంపి రాయలసీమకు సాగు, తాగు నీరు అందించే భారీ ఎత్తిపోతల పథకానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పథకానికి దాదాపు 1.60 లక్షల కోట్లు వ్యయం అవుతాయని ఇంజనీరింగ్ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశాలు నిర్వహించినా చివరకు రైతుల లేమి కారణం తోనే ఈ భారీ ప్రణాళికకు దాదాపు పుల్ స్టాప్ పెట్టినట్టుగా జల వనరుల శాఖ వర్గాలు వివరిస్తున్నాయి.  పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి బానకచెర్ల వరకు గోదావరి జలాలను ఎత్తిపోసే మరో పథకానికి కార్యాచరణను సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనికి 80 వేల కోట్ల దాకా వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆర్థిక ఒడిదుడుకుల నేపధ్యంలో ఇంత పెద్ద మొత్తంలో నిధుల సేకరణ సాధ్యమేనా అనే సందేహాలు నెలకొన్నాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి పూర్తికావాలన్న బ్యాంకు రుణాల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జలవనరులశాఖ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దాని నుంచి బ్యాంకు రుణాలు పెద్ద మొత్తంలో తీసుకోవాలన్న ఆలోచనలో ఆ శాఖ ఉంది. అయితే రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ నుంచి ఎత్తిపోతల పథకాలు మధ్య తరహా ప్రాజెక్టుల కోసం తీసుకున్న వేల కోట్ల రుణాలకు ఇప్పటికే భారీ మొత్తంలో వడ్డీలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా బ్యాంకులను ఆశ్రయించే యోచనలో ఉన్నారు. అయితే ఈ కార్పొరేషన్ లకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయ అనే సందేహాలున్నాయి.  

వీడని చిన్నారి కిడ్నాప్ మిస్టరీ... మృతదేహాన్ని మాయం చేసిన సవతి తల్లి

  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చిన్నారి దీప్తీశ్రీ కిడ్నాప్ కేసులో మిస్టరీని చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మూడు రోజుల క్రితం ( నవంబర్ 22న ) స్కూల్ నుంచి తీసుకొస్తానని వెళ్లిన సవతి తల్లి శాంతకుమారి కిడ్నాప్ చేసి అటుపై హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే హత్య చేయడానికి గల కారణాలు.. చిన్నారిని హతమార్చిన కేసులో నిందితురాలి శాంతకుమారి కాకుండా ఇంకా ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీప్తీశ్రీ ని గొంతు నులిమి చంపానని అంగీకరించిన సవతి తల్లి మృతదేహాన్ని ఎక్కడ పడేసిందని అడిగితే మాత్రం నోరు మెడపటంలేదు. అది తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.  చిన్నారి కిడ్నాప్ కు గురైన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. స్కూలు నుంచి చిన్నారిని తీసుకుని కొద్ది దూరం వరకు నడిపించుకొని తీసుకెళ్లి అటుపై వేరే వ్యక్తి బైక్ పై తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. దీప్తీశ్రీ నాయనమ్మ బంధువులు చెప్పిన వివరాల్ని బట్టి కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. కిడ్నాప్ కు గురైన రోజు శాంతకుమారితో పాటు మరో వ్యక్తి ఉన్నాడని చెప్పడంతో వేర్వేరు కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ఇక పాప మృతదేహం కోసం కాకినాడ సామర్లకోట రోడ్డులోని పంట, మురుగు కాలువల్లో వెతుకుతున్నారు. బాలిక డెడ్ బాడీని గాలించేందుకు ధర్మాడి సత్యం బృందం నుండి 15 మందిని పిలిపించారు. మరోవైపు దీప్తీశ్రీ మృతదేహం ఆచూకీ లభించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చిన్నారి దీప్తీశ్రీ మిస్సింగ్ కేసులో పూర్తి వివరాలు రాబడుతున్నామని కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ తెలిపారు. ఇక చిన్నారి సవతి తల్లి ఇచ్చిన వివరాల ప్రకారం మృతదేహం కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ హత్య వెనుక కుటుంబ కలహాలే కారణమా..లేక వేరే ఏమైనా విషయాలు దాగి ఉన్నాయా.. అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నామనని తెలిపారు. తమ విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు డీఎస్పీ కరణం కుమార్.

సీన్ రివర్స్... 30వ తేదీన బలపరీక్షకు సిద్ధమంటున్న బీజేపీ

  మహారాష్ట్ర లో మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి. బలనిరూపణ కోసం కాంగ్రెస్, శివసేన సుప్రీం కోర్టుకెక్కితే బిజెపి మాత్రం నవంబర్ 30 న జరగబోయే బలపరీక్ష పై ఫోకస్ పెట్టింది. బలపరీక్ష వెంటనే నిర్వహించాల్సిన అవసరం లేదన్న సుప్రీం కోర్టు నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు బీజేపీ నేతలు. బలపరీక్ష నాడు గట్టెక్కడం ఖాయమని సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం ఫడ్నవీస్ సమావేశం నిర్వహిస్తే.. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ తదితర నేతలు కోర్టు నిర్ణయం పై ఎప్పటికప్పుడు ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారు. మహారాష్ట్ర లోని అన్ని పార్టీలూ డేగ కన్నేశాయి. ఉద్ధవ్ ఠాక్రే తదితర శివసేన నేతలు ఎన్సీపీ ఎమ్మెల్యేలను స్వయంగా కలిశారు. ఇక ముంబయి లోని హోటల్ లలిత్ లో బస చేసిన శివసేన ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే భేటీ అయ్యారు. బిజెపి ఎత్తుగడలపై అప్రమత్తంగా ఉంటున్న ఎన్సీపీ అధినేత పవార్ తమ ఎమ్మెల్యేలను సాయంత్రం రెనైజోమ్స్ హోటల్ కు తరలించారు. 41 మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారని ప్రకటించారు శరత్ పవార్. ఎన్సీపీ ఎమ్మెల్యేలను ఒక హోటల్ నుంచి మరోచోటికి తరలించారు. అలాగే ఈ రోజు సుప్రీం కోర్టు విచారణకు సరికొత్త వ్యూహ రచన చేశారు శరత్ పవార్. ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సుప్రీంకోర్టును అఫిడవిట్ దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీలో జరగాల్సిన వ్యవహారమంతా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్యేలతో అఫిడవిట్ లు దాఖలు చేయించే దిశగా ఎన్సీపీ అడుగులు వేస్తుంది. బిజెపి తమకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో బలపరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతుంది. 30వ తేదీన బలపరీక్ష ఉండటంతో అప్పటికి చాలా టైముంది కనుక ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అనేది కత్తిమీద సాములాంటిదనే అంటున్నారు విశ్లేషకులు. అప్పటి వరకు ఏ విధమైన పరిణామాలు చోటుచేసుకుంటాయో ఎవరూ ఊహించని పరిస్థితి.

పోలీస్ స్టేషన్లకు క్యూకడుతోన్న జనం... ఫిర్యాదుల్లో 52శాతం మహిళలవే...

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమం ప్రజల మన్ననలు అందుకుంటోంది. ముఖ్యంగా పోలీసులంటేనే భయపడే ప్రజలు... ధైర్యంగా ముందుకొచ్చి ఆర్జీలు అందచేస్తున్నారు. ఇక, పోలీస్‌స్టేషన్‌కు రావాలంటేనే భయపడే మహిళలు.... స్పందన కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. స్పందనలో వస్తోన్న ఫిర్యాదుల్లో 52శాతం మహిళలే స్వయంగా ఇచ్చినవి ఉంటున్నాయి. కేవలం ఆర్జీలు తీసుకోవడమే కాకుండా ఫిర్యాదుదారునికి వెంటనే మొబైల్‌కి అక్నాలజ్‌మెంట్ మెసేజ్ ఇవ్వడం... అలాగే నిర్ధిష్టమైన టైమ్ పిరియడ్‌లో సమస్యను పరిష్కరించడం లేదా ఉన్నతాధికారికి రిఫర్ చేస్తూ పరిష్కారాలు చూపిస్తుండటంతో స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇక, పోలీసులు కూడా స్పందనలో వస్తోన్న ఆర్జీలను ఛాలెంజింగ్ తీసుకుని పరిష్కరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 వారాల్లో స్పందన ద్వారా పోలీసులకు 42వేల 220 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 9వేల 441 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని, మరో 3వేల 71 కేసుల్లో ఇంతకుముందే ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయ్యాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇక, 10వేల 858 ఫిర్యాదులు సివిల్ వివాదాలు... అలాగే 6వేల 855 కంప్లైంట్స్ బాడ్లీ అఫెన్స్.... 6వేల 454 ఫిర్యాదు క్రైమ్ అగైనెస్ట్ ఉమన్.... 5వేల 254 ఇతర సమస్యలు... 4వే475 వైట్ కాలర్ అఫెన్స్‌.... 3వేల 591 ఫ్యామిలీ సమస్యలు... 2వే 353 ప్రాపర్టీ ఇష్యూస్... 964 న్యూసెన్స్‌... 926 రోడ్ యాక్సిడెంట్స్‌.... 257 సైబర్ క్రైమ్... 233 ఎస్సీఎస్టీ ఫిర్యాదులు ఉన్నాయని డీజీపీ వివరించారు. ఇలా, ఇప్పటివరకు వచ్చిన 42వేల 220 ఫిర్యాదుల్లో... 40వేల 158 అంటే 95శాతం కంప్లైంట్స్ పరిష్కారమైనట్లు తెలిపారు. కేవలం 2వేల 62 ఫిర్యాదులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయన్నారు. స్పందన అంటే... చాలామందిలో కేవలం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం మాత్రమేననే అపోహ ఉండేదని, కానీ, ప్రతి ఆర్జీని నిశితంగా పరిశీలించి, పరిష్కరిస్తున్నారని ఫిర్యాదుదారులు అంటున్నారు. గతంలో పోలీస్ స్టేషన్ అంటేనే ఏదో తెలియని భయం ఉండేదని, కానీ ఇప్పుడు ధైర్యంగా వెళ్లి ఆర్జీ ఇవ్వగలుగుతున్నామని, అలాగే పర్టిక్యులర్ టైమ్ పిరియడ్‌లో సమస్య పరిష్కారమవుతుందని అంటున్నారు. అంతేకాదు, పోలీసులు తమకు గౌరవం ఇవ్వడంతోపాటు, మంచినీళ్లు, టీ ఇవ్వడం చూస్తుంటే అసలు ఇది పోలీస్ స్టేషనేనా అనే అనుమానం కలుగుతోందని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. గతంలో అధికారులను కలవాలంటే కష్టమయ్యేదని, కానీ ఇప్పుడు వాళ్లే తమ సమస్యలు వింటూ ఆర్జీలు స్వీకరిస్తున్నారని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వారానికి ఒక్కరోజు కాకుండా, కనీసం రెండ్రోజులు, లేదా అంటే ఎక్కువ రోజులు పెడితే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అంటున్నారు. ఒకవైపు స్పందనకు విశేష స్పందన రావడం... మరోవైపు స్పందన గురించి సాక్షాత్తు దేశ ప్రధానే స్వయంగా ఆరా తీయడంతో ఏపీ పోలీసులు గర్వంగా ఫీలవుతున్నారు. గుజరాత్ వడోదరలో నిర్వహించిన పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్‌లో ఏపీ స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీ స్టాల్‌ను సందర్శించిన ప్రధాని మోడీ.... స్పందన, వీక్లీ ఆఫ్ సిస్టమ్‌, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్‌, ఫేస్ రికక్నైజేషన్‌, ఈ-విట్‌, డీజీ డ్యాష్ బోర్డ్‌, లాక్డ్ హౌస్‌ మోనిటరింగ్... ఇలా ప్రతి అంశంలోనూ ఏపీ పోలీస్ విధానాలపై ప్రధాని ఆసక్తి చూపించారు. ముఖ్యంగా స్పందన గురించి ప్రధాని కార్యాలయానికి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు సూచించారు. అయితే, స్పందన గురించి ప్రధాని ప్రత్యేకంగా అడగడం... మెచ్చుకోవడం ఆనందంగా ఉందని, తాము పడుతున్న కష్టానికి, ఏకంగా ప్రధాని నుంచే ప్రశంసలు దక్కడం సంతోషంగా ఉందని అంటున్నారు. దేశంలో ఎక్కడా స్పందన కార్యక్రమం లేదని, ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే.... ప్రజలకు పోలీసులు మరింత చేరువ కావొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజలకు... పోలీసులకు మధ్య వారధిలా స్పందన కార్యక్రమం పనిచేస్తోందని, స్పందనను మరింత పకడ్బందీగా అమలుచేస్తే, పోలీసుల పట్ల అభిప్రాయం మారడమే కాకుండా, గౌరవం కూడా పెరుగుతుందని అంటున్నారు. అయితే, స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన రావడమే కాకుండా... ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ నుంచే ప్రశంసలు దక్కడంతో ఏపీ పోలీసులు ఉబ్బితబ్బివుతున్నారు.

ఐటీ ఉద్యోగుల భయం భయం... సీనియర్లపై వేలాడుతోన్న కత్తి..!

లక్షల్లో జీతాలు తీసుకుంటూ... వీకెండ్ వచ్చేసరికి ఎంజాయ్ మెంట్... మెజారిటీ ఐటీ ఉద్యోగుల జీవనశైలి ఇది... అయితే, ఇప్పుడు ఐటీ ఉద్యోగుల పరిస్థితి మారింది. లక్షల్లో జీతాలు పొందుతున్నా... ముందుజాగ్రత్తగా ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అంతేకాదు వీకెండ్ పార్టీలకు గుడ్ బై చెప్పి... అవసరమైతే ఇంకో గంట ఎక్కువ సమయం ఆఫీసుకు కేటాయిస్తున్నారు. అయితే, ఇంత సడన్ ఛేంజ్ ఏంటీ అనుకుంటున్నారా? ఎందుకంటే... ఐటీ ఉద్యోగులపై ఇప్పుడు కత్తి వేలాడుతోంది. ఐటీ కంపెనీలు ఎప్పుడు ఎవర్నీ తీసేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని కంపెనీలైతే ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల జీతాల్లో భారీ కోత పెడుతున్నాయి. దాంతో, ఐటీ ఉద్యోగులంతా తమ జాబ్ ను కాపాడుకునే పనిలో పడ్డారు. ఇటీవల హైదరాబాద్ లో ఓ యువతి తన ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకోవడం చూస్తే సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ పరిస్థితికి అద్దం పడుతోంది. సాధారణంగా ప్రతి ఏడాది చివరిలో ఐటీ కంపనీలు ఉద్యోగుల పని తీరును చూస్తుంటాయి. ప్రధానంగా ఒకటి నుంచి నాలుగు వరకు రేటింగ్ ఇస్తుంటాయి. కానీ ఇప్పుడు అవేవి చూడకుండా నేరుగా ప్రాజెక్టులు లేవంటూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఐటీ కంపెనీల తీరుపై సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంక్రిమెంట్స్ లేకున్నా ఫర్వాలేదు... కానీ ఉద్యోగాల నుంచి మాత్రం తొలగించవద్దంటున్నారు ఐటీ ఉద్యోగులు. ఉద్యోగం నుంచి తొలగిస్తే ఏడాదిపాటు ఆరోగ్య బీమాతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, సీనియర్ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న కంపెనీలు.... ఏడాదికి నాలుగైదు లక్షల రేంజ్ లో జూనియర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. పెద్దపెద్ద ఐటీ కంపెనీలతోపాటు మధ్య తరహా కంపెనీల్లోనూ ఉద్యోగులను ఇంటికి పంపివేస్తుండటంతో వారి వేతనాలపై పడింది. తమ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగం కోల్పోతే... తమ పరిస్థితి ఏంటని ఉద్యోగులు దిగులు చెందుతున్నారు. మరోవైపు సెక్సువల్ హరాస్ మెంట్ కూడా ఉంటుందని మహిళా ఐటీ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగం నుంచి తొలగించేందుకు సాకులు వెతికే బదులుగా ఉన్నవారిని మరింత మెరుగుపరిచేలా కంపెనీలు చూడాలని కోరుతున్నారు. ఇయర్ ఎండింగ్ లో వరుసపెట్టి ...ఐటీ కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటనలు చేస్తుండంటో సాఫ్ట్ వేర్ ఉద్యోగులను కలవర పెడుతున్నాయి. కొత్తగా నియామకాలు చేయకపోయినా..నష్టాల తగ్గింపు పేరుతో ఉద్యోగుల తొలగించడం చట్టవిరుద్దమంటున్నారు ఐటీ ఉద్యోగులు.

జగన్‌కు రాజధాని రైతుల అల్టిమేటం... రాజధానిపై ప్రకటనకు డిమాండ్...

రాజధాని రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మంత్రి బొత్స వ్యాఖ్యలతో ఇప్పటికే అమరావతిపై నీలినీడలు కమ్ముకోగా, అసలు రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవంటూ మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మంత్రుల వ్యాఖ్యలతో అయోమయానికి గురవుతున్న రాజధాని రైతులు... అమరావతిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి... రోజుకో ప్రకటన చేస్తున్నారని మండిపడుతోన్న రాజధాని రైతులు... అసలు ప్రభుత్వ విధానమేంటో ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తేల్చిచెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మంత్రి బొత్స ప్రకటనలతో రైతులకు టెన్షన్ పట్టుకుంటే... ఇఫ్పుడు అమరావతి నిర్మాణానికి డబ్బుల్లేవని, అదీగాక పెద్దఎత్తున నిర్మాణం అవసరం లేదంటూ బుగ్గన ప్రకటన చేయటంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అందుకే, ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే అమరావతిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అసెంబ్లీకి సమీపంలో... రాజధాని భూముల్లో దీక్షలు చేపడతామని రైతులు హెచ్చరించారు. ఒకరోజో రెండ్రోజులో కాదు... అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ నిరసన తెలుపుతామని 29 గ్రామాల రాజధాని రైతులు ప్రకటించారు. రాజధానిపై రోజుకో ప్రకటన చేయడంపై రైతులు మండిపడుతున్నారు. రాజధానిపై అభిప్రాయ సేకరణకు నిపుణుల కమిటీ వేయడాన్ని ఇప్పటికే హైకోర్టులో సవాలు చేసిన రైతులు....ఇప్పుడు ప్రభుత్వానికి నేరుగా అల్టిమేటం ఇచ్చారు. కమిటీ రిపోర్టుల పేరుతో రాజధానిని మారిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. తాము భూములిచ్చింది పార్టీలకు కాదని, ప్రభుత్వానికని గుర్తుచేస్తున్నారు. ఒకవేళ శీతాకాల సమావేశాల్లో సీఎం జగన్ ప్రకటన చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు. మొత్తానికి బుగ్గన ప్రకటనతో రాజధాని రైతుల్లో మళ్లీ అలజడి రేగింది.

కృష్ణా జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

  కృష్ణా జిల్లా బంటుమిల్లులో టీడీపీ, వైసీపీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చిన్న తుమ్మిడి గ్రామంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. వైసీపీ వర్గీయులు తమపై దాడి చేశారని ఆరోపిస్తూ టిడిపి నేతలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అక్కడికి వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా చేరుకోవడంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. దీనిపై బంటుమిల్లి సీఐ కేసు నమోదు చేశారు. పాత కక్షలతోనే ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్నారని సీఐ చెప్పారు. కృష్ణా జిల్లాలో బంటుమిల్లిలో నవంబర్  22న అర్ధరాత్రి వైసీపీ - టీడీపీ వర్గీయుల మధ్య పరస్పర దాడులు జరిగాయి. చిన్న తుమ్మిడి గ్రామంలో ప్రధానంగా పొలానికి సంబంధించిన వివాదానికి టీడీపీకి చెందిన ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీళ్లందరూ టీడీపీ వర్గానికి చెందిన అనుచరులని పోలీసులకు కూడా గుర్తించారు. వైసీపీకి చెందిన అనుచరులు దాడి చేశారని.. టిడిపి నేతలు అందరూ కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి దీనికి సంబంధించి ఫిర్యాదు చేశామన్నారు. గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన కృష్ణ ప్రసాద్ దీనిపై స్పందిస్తూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి గ్రామాల్లో ఉన్న టీడీపీ వర్గీయులపై తీవ్రంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.  

పరారీలో నిత్యానంద... ఇద్దరు మైనర్ బాలికలను బంధించాడని కేసు నమోదు

  వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. క్రిమినల్ కేసు నమోదు కావడంతో స్వామి నిత్యానంద దేశం విడిచి పారిపోయాడనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నిత్యానంద కోసం అన్ని చోట్ల తీవ్రంగా గాలిస్తున్నారు. బాలికల్ని అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణతో నిత్యానందపై కేసు నమోదైంది. ఆశ్రమంలో ఇద్దరు మైనర్ బాలికలను బంధించారని వారి తల్లిదండ్రులు నిత్యానంద ఆశ్రమంపై ఫిర్యాదు చేశారు. గుజరాత్ కు చెందిన జనార్దన శర్మ తన కుమార్తెల కోసం చేసిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిత్యానంద ఆశ్రమంలో ఉన్న జనార్దన శర్మ ఇద్దరు కూతుళ్లు కొన్నాళ్లుగా అక్కడే ఉంటూ ఇంటికి రావడానికి నిరాకరించారు. తన కూతుళ్లని అక్రమంగా ఆశ్రమంలో ఉంచారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జనార్దన శర్మ. ఈ కంప్లయింట్ గుజరాత్ హై కోర్టు వరకు వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. నిత్యానందకు చెందిన సర్వజ్ఞ ఆశ్రమానికి పోలీసులు వెళ్లడంతో అక్కడ జరుగుతున్న భాగోతాలు వెలుగులోకి వచ్చాయి. తమను బాగా హింసించారని.. పనిచేయాలని పదిరోజులకుపైగా ఒక ఫ్లాట్ లో అక్రమంగా నిర్బంధంలో ఉంచారని పోలీసులకు చెప్పారు బాధితులు. ఆశ్రమ నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు చిన్నారులకు బంధ విముక్తి కల్పించారు. యోగిని సర్వజ్ఞ పీఠములో ఉన్న బాలికలను విడిపించిన అహ్మదాబాద్ పోలీసులు నిత్యానంద కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్, అక్రమంగా నిర్బంధించడం, దాడి చేయడం లాంటి ఆరోపణలతో నిత్యానంద శిష్యులైన ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. నిత్యానంద దేశం విడిచి పారిపోయారని అనుమానిస్తున్న తరుణంలో ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ఆయన ఎక్కడ ఉన్నాసరే వదిలే ప్రసక్తే లేదని గుజరాత్ పోలీసులు ప్రకటించారు. అవసరమైతే విదేశాలకు వెళ్లిన నిత్యానందను అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఇప్పటికే విదేశాంగ శాఖతో వివిధ విభాగాలకు సమాచారమిచ్చి నిత్యానంద కోసం వేట సాగిస్తున్నారు గుజరాత్ పోలీసులు.  ఆశ్రమం పేరుతో సెక్స్ పాఠాలు చెప్పడం.. అదేమంటే తానే భగవంతుడని బుకాయించటం నిత్యానందకు అలవాటు అయిపోయాయి. శిష్యులపై కన్నా శిష్యురాలు అంటే ఎక్కువ ప్రేమ చూపించి నిత్యానంద ఏకంగా సినీ నటి రంజితకే వలేశాడు. రంజితను శిష్యురాలిగా చేర్చుకొని మా ఆనందమయి అంటూ కొత్త పేరు పెట్టారు. ఆమెతో కలిసి ఆశ్రమంలో చేసిన రాసలీలలు టేపులుగా బయటకు రావడంతో నిత్యానంద గుట్టు రట్టైంది. 2010లో వెలుగులోకి వచ్చిన నిత్యానంద, రంజిత టేపులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అప్పట్లో పోలీసులు నిత్యానంద, రంజితను అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో నిత్యానంద చెప్పిన విషయాలు మరింత చర్చ నీయాంశంగా మారాయి. తాను అస్సలు మగాడినే కాదని నిత్యానంద బుకాయించాడు. అయితే పురుషత్వ పరీక్షలు జరపాలని పోలీసులు ప్రయత్నించారు. దీనికి అంగీకరించని నిత్యానంద కోర్టును ఆశ్రయించాడు. అయితే పురుషత్వ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో చివరకు టెస్టులకు అంగీకరించాడు. నిత్యానంద పురుషుడేనని డాక్టర్ లు తేల్చడంతో మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి. కొన్నాళ్ల పాటు జైలులో వున్న నిత్యానంద తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు.  కొన్నిరోజులు గప్ చుప్ గా ఉండి మళ్లీ తన స్టైల్ పనులు మొదలుపెట్టాడు. కొన్నాళ్ల క్రితం నిత్యానంద ఆశ్రమంలో యువతి శవం బయటపడటం సంచలనం రేపింది. యువతి మరణించిన విషయాన్ని ఆశ్రమ వర్గాలు దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇలా ఒకటి రెండు కాదు నిత్యానందపై పెద్ద సంఖ్య లోనే ఫిర్యాదులున్నాయి. అమ్మాయిల్ని అక్రమంగా నిర్బంధించడం వారిని రాసలీలల కోసం ఉపయోగిస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఇద్దరు మైనర్ బాలికల సంగతి వెలుగులోకి రావడంతో విదేశాలకు పారిపోయాడు నిత్యానంద. చివరికి పిచ్చి వాడు అయ్యేలా ఉన్నడంటూ కొందరు.. వీడి పిచ్చితో చిన్న పిల్లలని బానిసలుగా చేసుకుంటున్నాడంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు అడ్డాగా డ్రగ్స్ దందా.. ఆ వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్నాడని డౌట్!!

  గుంటూరులో డ్రగ్స్ కలకలం రేగింది. సౌదీ దేశస్తుడు షాజీ నల్లపాడు సమీపం లోని ఓ అపార్టుమెంట్ లో ఫ్లాట్ ను అద్దెకు తీసుకొని అందులో డ్రగ్స్ తయారు చేస్తూ ఆన్ లైన్ లో అమ్ముతున్నాడు. దీని పై సమాచారం అందుకున్న పోలీసులు అపార్ట్ మెంట్ కి వెళ్లి షాజీని అదుపు లోకి తీసుకున్నారు. షాజీ ఫ్లాట్ లో డ్రగ్స్ తయారీకి ఉపయోగించే వస్తువులని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు బొమ్మ చేతులు, గ్లౌజులు, ముఖం మాస్కులు దొరికాయి. నిందితుడు ఇక్కడ ఎన్నాళ్ల నుంచి ఉంటున్నాడు? ఎప్పటి నుంచి డ్రగ్స్ తయారు చేసి ఆన్ లైన్ లో అమ్ముతున్నాడు? అనే దానిపై విచారణ జరుపుతున్నారు. అతనికి ఇంకా ఎవరైనా సహకరిస్తున్నారా అని కూడా ఆరా తీస్తున్నారు. ఇక షాజీ వాడే ఖరీదైన స్పోర్ట్స్ బైకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి ముందువైపు కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన నెంబర్ ప్లేట్ ఉండగా వెనకాల నెంబర్ ప్లేట్ లేదు. అంతేకాదు బైక్ పెట్రోల్ ట్యాంక్ పై జగన్ స్టిక్కర్ అతికించి ఉంది. షాజీ జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే కార్యక్రమాలకు ఆ బైక్ మీద తిరుగుతూ ఉంటాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దాంతో పోలీసులు ఆ వైసీపీ ఎమ్మెల్యే ఎవరు ఆయనకు.. షాజీకి ఉన్న సంబంధం ఏంటి అనే అంశాలపై కుపీలాగుతున్నారు.

కేసీఆర్ కు తలనొప్పి...  నియోజకవర్గానికి రెండు వర్గాలుగా విడిపోయిన గులాబీ తమ్ముళ్లు

  టీఆర్ఎస్ లోకి ఈ మధ్య చాలా మంది నేతలు జంపయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిన చోట కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార పార్టీ లోకి వచ్చిన నేతలు నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నించడంతో అసలు సమస్య మొదలైంది. అసలే పదవులు లేక పరేషాన్ అవుతున్న పాత నేతలని పట్టించుకోక పోవడంతో నియోజక వర్గాల్లో గొడవలు జరుగుతున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో.. కమిటీల్లో.. పాత ఎమ్మెల్యేలను లెక్కలలోకి తీసుకోకపోవడంతో వర్గపోరు జరిగినట్లు తెలుస్తుంది. తాజాగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ మధ్య జూపల్లి వర్గాన్ని చీల్చి తన బలాన్ని పెంచుకోవాలని హర్షవర్దన్ ప్రయత్నం చేసినట్లు చర్చ జరుగుతుంది. నియోజకవర్గంలో జూపల్లి - హర్షల మధ్య చిచ్చు రాజుకున్నట్లు క్యాడర్ చర్చించుకుంటోంది. హర్షవర్ధన్ రెడ్డి , మంత్రి నిరంజన్ రెడ్డి వర్గంలో చేరటం జూపల్లి వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది. దీనికి తోడు కొల్లాపూర్ కోట వివాదం విషయంలో మాజీ మంత్రి బహిరంగ సభలు పెట్టి మరీ ఆరోపణలు చేస్తున్నారు. ఈ కోట కథ వెనకాల ఎమ్మెల్యే వర్గీయుల ప్రమేయం ఉంది అన్నది జూపల్లి బ్యాచ్ వాదన. ఇక పాలేరు నియోజకవర్గం లోనూ ఇదే పరిస్థితి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ యాక్టివ్ గా తిరుగుతున్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఉపేంద్ర వైపు వెళ్లకుండా తుమ్మల ఈ స్కెచ్ వేసినట్లు పార్టీలో ప్రచారం అవుతోంది. తుమ్మలపై ఉపేందర్ పార్టీ అధిష్టానంకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఉపేందర్ రెడ్డి వర్గీయులు అవసరమైతే పార్టీ మారాలని వత్తిళ్ళు కూడా తెస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటుండడం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.

బాబు, జగన్ అప్రమత్తంగా ఉండాలి... బోండా ఉమ కీలక వ్యాఖ్యలు

  భార్యను పేదరికంలో పరీక్షిస్తే... కష్టకాలంలో సహకరిస్తుందో లేక కాల్చుకు తింటుందో తేలిపోతుందని అంటారు. ఇక మనం దుఖంలో ఉన్నప్పుడే బంధువులను, స్నేహితులను, సన్నిహితులను పరీక్షించాలని, అప్పుడే ఎవరు హితులో... ఎవరు స్నేహితులో అర్ధమవుతుందని చెబుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే... మనిషి మనస్తత్వం... కష్టకాలంలోనే బయటపడుతుంది. రాజకీయాలకు వచ్చినా ఇదే సూత్రం వర్తిస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే... నిజమైన విధేయులెవరో తెలుస్తుంది. 2014 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది బోధపడింది. 2019 ఎన్నికల తర్వాత ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా అర్ధమవుతోంది.  అయితే, రాజకీయాల్లో పార్టీలు మారడం అత్యంత సహజమే అయినా, కొందరు నేతలు వెళ్లిన తీరు, చేసిన విమర్శలు గుర్తుండిపోతాయి. అయినా కూడా పరస్పర రాజకీయ అవసరాల కోసం ఆయా పార్టీల అధినేతలు రాజీ పడుతూ ఉంటారు. అందుకే, చంద్రబాబు, జగన్ ఎవరూ అతీతులు కారు. కానీ, ఏ పార్టీ అధినేత అయినా, కొందరు లీడర్లపై గట్టి నమ్మకం పెట్టుకుంటారు. అలాంటి నేతలు పార్టీని వీడినప్పుడు, ఘాటు విమర్శలు చేస్తున్నప్పుడు తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందు ఆ పరిస్థితిని జగన్ ఎదుర్కొంటే... ఇప్పుడదే పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. అయితే, అది ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ముందుముందు ఇది ఇంకా తీవ్రంగా ఉండబోతోంది. అయితే, ఇలాంటి లీడర్ల విషయంలో అటు జగన్... ఇటు చంద్రబాబు ఇద్దరూ అప్రమత్తంగా ఉండాలి. అయితే, ప్రస్తుతం టీడీపీలో పరిస్థితిపై బోండా ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో స్ర్కాప్ బయటికి వెళ్లిపోతోందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్తున్నారని మండిపడ్డారు. ఇలా పార్టీలు మారుతున్న వాళ్లకు సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యమని బోండా ఉమ ఫైరయ్యారు. రేపు మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే... మళ్లీ తెలుగుదేశంలో చేరి సొంత గూటికి వచ్చామంటారని అన్నారు. అధికారాన్ని బట్టి పార్టీలు మారే నేతల విషయంలో ఇఫ్పటికైనా చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పుడు వైసీపీ పచ్చగా ఉందని వెళ్తున్న నేతలంతా, ఎండటం మొదలుకాగానే మళ్లీ బయటికి వచ్చేస్తారని, అలాంటి లీడర్లను జగన్ కూడా నమ్మొద్దన్నారు.

చంద్రబాబు... జూ.ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నారా? 

  చంద్రబాబు అండ్ లోకేష్ పై కొడాలి నాని మాటల తూటాలు కొనసాగుతున్నాయి. తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతోన్న కొడాలి నాని... మరోసారి తన నోటికి పనిచెప్పారు. అసలు చంద్రబాబు, లోకేష్ పేరు ఎత్తుతూనే ముందొక తిట్టు... వెనుకొక తిట్టు జోడిస్తున్నారు. మంత్రిగా ఉంటూ అలా మాట్లాడటం తప్పు కాదా అంటే... దానికి సమాధానం చెబుతున్నారు. మరి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందేమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆనాడు మంత్రులతోను, టీడీపీ ఎమ్మెల్యేలతో తమను చంద్రబాబు తిట్టించలేదా అంటున్నారు. అచ్చెన్నాయుడు, బోండా ఉమ, చింతమనేని... ఇలా పలువురు నేతలు... ఏకంగా అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డిని, తనను బూతులు తిట్టారని, అప్పుడెందుకు వాళ్లను ప్రశ్నించలేదని రివర్స్ కౌంటరిస్తున్నారు.  అయితే, తాజాగా కొడాలి నాని మరో సీక్రెట్ ను బయటపెట్టారు. 2009లో తనకు, వల్లభనేని వంశీకి సీట్లు ఇచ్చింది చంద్రబాబు కాదని.... జూనియర్ ఎన్టీఆర్ అని కొత్త బాంబు పేల్చారు. తనకు, వల్లభనేని వంశీకి టికెట్లు ఇప్పించడానికి చంద్రబాబుతో ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ చేశాడని, అందుకే ఇప్పటికీ తాము ఎన్టీఆర్ కుటుంబానికి కృతజ్ఞతతో ఉన్నామన్నారు. అయితే, చంద్రబాబులాగా... తాము జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు మాత్రం పట్టుకోలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. 2009 ఎన్నికల్లో ప్రచారం చేయాలంటూ చంద్రబాబు.... జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నారని అప్పటి పరిస్థితులను చెప్పుకొచ్చారు. అయితే, ఆ తర్వాత లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు దూరం పెట్టారన్న కొడాలి నాని.... ఎన్టీఆర్ పేరు చెప్పకుండా ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకి ఉందా అంటూ సవాలు చేశారు. ఇక, జగన్ క్రిస్టియానిటీ విమర్శలపైనా కొడాలి డిఫరెంట్ గా స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తిరుమల వెళ్లడానికి డిక్లరేషన్ ఎందుకివ్వాలో చంద్రబాబు చెప్పాలన్నారు. జగన్ ఒక మతానికో... ఒక కులానికో... ముఖ్యమంత్రి కాదని డిక్లరేషన్ ఇవ్వడానికి అన్నారు. అయినా, వెంకటేశ్వరస్వామి కుల దైవమని చెప్పుకునే చంద్రబాబు... ఒక్కసారైనా... తిరుమల కొండపై గుండు చేయించుకున్నారా అంటూ ప్రశ్నించారు. ఓటమిని జీర్జించుకోలేకే మతం పేరుతో కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. తిరుమల లడ్డూను మద్యాన్ని ఒకేలా పోల్చినందుకు... అలిపిరి దగ్గర కొండకు తల బాదుకుని క్షమాపణ చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.  

కన్నాకు రాజ్యసభ.. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సుజనా చౌదరి!!

  ఏపీ బీజేపీలో మార్పులు రాబోతున్నాయని అంటున్నారు కమలనాథులు. వచ్చే నెలలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు ముగుస్తాయి. బీజేపీకి కొత్త అధ్యక్షుడితో పాటు రాష్ట్రాలకు కూడా కొత్త సారథులు వస్తారని ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏపీ కూడా కొత్త ప్రెసిడెంట్ వస్తారని తెలుస్తుంది. ప్రస్తుత బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణను రాజ్యసభకు పంపించి వచ్చే నెలలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో కేంద్ర మంత్రిని చేస్తారని కార్యకర్తల్లో టాక్. ఆయన కేంద్ర మంత్రిగా వెళ్తే ఆయన ప్లేస్ లో ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తారనే చర్చ కూడా వినిపిస్తుంది. అధ్యక్ష రేసులో బీజేపీలో చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రెసిడెంట్ రేసులో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరితో పాటు బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డికి పగ్గాలు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతుంది. యువతకు చాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది.. సీనియర్లకూ మరోసార అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది.. అనే దానిపై అధిష్టానం వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ బీజేపీ అధిష్టానం సుజనకు కేంద్రంలో బెర్తిస్తే అధ్యక్ష రేసులో కన్నా విష్ణువర్దన్ రెడ్డి మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. మొత్తానికి ఇటు కేంద్ర కేబినెట్ బెర్త్ గానీ అటు ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో తీవ్ర పోటీ నెలకొంది. మరో నెలలో ఏపి బిజెపిలో మార్పులు మాత్రం ఖాయమని తెలుస్తుంది. కొత్త ఏడాదిలో కొత్త అధ్యక్షుడు వస్తారనేది మాత్రం గ్యారెంటీ. ఆయన ఎవరనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

మూగబోయిన ప్రజాగాయకుడు... ఉద్యమానికి దూరంగా ఉండటానికి కారణమేంటి?

  గత ఆరునెలలుగా ప్రజాగాయకుడు గద్దర్ జాడ కనిపించడం లేదు. తెలంగాణ ఉద్యమం నుండి 2018 మహా కూటమి వరకు చాలా చురుగ్గా ఉన్నారు గద్దర్.  49 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే గద్దర్ ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న చక్కర్లు కొడుతుంది. ఉద్యమం అంటే ముందుండి.. తనదైన శైలిలో పాటలతో ఉత్తేజ పరుస్తారు గద్దర్. ఆర్టీసీ కార్మికులకు ఆయన సంఘీభావం కూడా ప్రకటించలేదు. ఆర్టీసీ సమ్మెకు గద్దర్ ఎందుకు దూరంగా ఉన్నారో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. గద్దర్ మౌనానికి కారణమేంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. గద్దర్ రాజకీయాలకు.. ప్రజా సమస్యలకు.. దూరంగా ఉన్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి.  2018 ఎన్నికల టైంలో సోనియగాంధీ మొదలు చంద్రబాబు వరకు హేమాహేమీలతో సమావేశమవుతూ బిజీ బిజీగా గడిపిన గద్దర్ ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజా కూటమి తరపున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ప్రజాకూటమి పరాజయం తరువాత గద్దర్ సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం గద్దర్ సొంత పనుల్లో నిమగ్నమయ్యారని ప్రచారం జరుగుతుంది. కర్ణాటకలోనే ఎక్కువగా ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికీ ఆయన లోకల్ లో ఎక్కువగా ఉండటం లేదంటున్నారు. కానీ ఆయన లేని లోటు మాత్రం సమ్మెలో స్పష్టంగా కనిపించిందని ఆయన అభిమానుల వర్షన్.

పేర్ని నాని పంచ్ లు... బాబు, లోకేష్, పవన్, సుజనాపై నిప్పులు...

  చంద్రబాబు, లోకేష్ అండ్ పవన్ పై మంత్రి పేర్ని నాని పంచ్ లు పేల్చారు. యూటర్న్ చంద్రబాబు.... మరోసారి యూటర్న్ తీసుకున్నారని సెటైర్లు వేశారు. నిన్నటివరకు ఇంగ్లీష్ మీడియం వద్దన్న చంద్రబాబు.... ఇప్పుడు తామే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక, చంద్రబాబు సొంత పుత్రుడు నారా లోకేష్‌.... దత్త పుత్రుడు పవన్ కల్యాణ్‌.... కూడా మాట మార్చడం అలవాటైపోయిందని పేర్నినాని నిప్పులు చెరిగారు. ఇంగ్లీష్ మీడియం అమలుకు తాము ప్రయత్నిస్తే ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ అడ్డుకున్నారని చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. ఇప్పటివరకు ఇంగ్లీష్ మీడియం వద్దే వద్దన్న బాబు.... ఇప్పుడు ఆంగ్ల మాధ్యమానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తెలుగు కూడా ఉండాలనడం యూటర్నే అన్నారు పేర్ని నాని. ఇంగ్లీష్ మీడియంతోపాటు తెలుగు అలాగే ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టులు ఉంటాయని తాము మొదట్నుంచి చెబుతున్నామని అన్నారు.  అయితే, జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక.... మతం పేరుతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ మత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు కంటే... బీజేపీ, శివసేన, ఎంఐఎమ్మే బెటర్ అన్నారు. కనీసం వాళ్లు... తాము తమతమ మతాల కోసం పనిచేస్తామని డైరెక్టుగా చెబుతారని, కానీ తెలుగుదేశం సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ మత రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇక, బీజేపీ నేత సుజనాచౌదరిపై మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. సుజనాచౌదరి... చంద్రబాబు ఏజెంటన్న పేర్ని నాని... ఇది బీజేపీ వాళ్లకు ఎప్పుడు అర్ధమవుతుందో ఆ దేవుడికే తెలియాలన్నారు. సుజనాచౌదరి రోజూ చంద్రబాబుతో మాట్లాడకపోతే.... కాల్‌ డేటాను మీడియా ఇవ్వాలని పేర్ని నాని సవాలు చేశారు. ఇక, ఎప్పటిలాగే సుజనా... ఒక బ్యాంకుల దొంగ, మోసగాడు అంటూ పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు.  

కేసీఆర్ మాస్టర్ ప్లాన్... ఆర్టీసీలో మొదలుకానున్న వీఆర్ఎస్ స్కీం!

  ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్ రాబోతుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. స్టాఫ్ తగ్గించటం ద్వారా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆర్టీసీలో 50 వేలమంది కార్మికులు పనిచేస్తున్నారు. యాభై శాతం ప్రైవేట్ రూట్లకు ప్రైవేటు బస్సులను తీసుకు వస్తే ఇక ఆర్టీసీలో మిగిలేది అయిదు వేల బస్సులు మాత్రమే. ఇప్పటి వరకూ 10,400 ల బస్సులకు ఈ యాభైవేలమంది కార్మికులు పనిచేసేవారు. బస్సుల సంఖ్య సగానికి తగ్గడంతో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది కార్మికులు సరిపోతారు. దీంతో ఆర్టీసీలో విఆర్ఎస్ స్కీమ్ తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీని పై కొంత కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు వీఆర్ఎస్ స్కీమ్ ప్రకటించకపోవచ్చు అనేది మరికొందరు అధికారులు చెబుతున్న మాట. సమ్మె ముగిసిన తరువాత యాభైవేలమంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. ఆ తరువాత వీఆర్ఎస్ ను తెరపైకి తేవాలని ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తుంది. వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు కొంత ప్రోత్సాహకంగా ఆర్టీసీ ఇచ్చే బెనిఫిట్స్ తో పాటు ప్రభుత్వం కూడా కొంత నగదును కలిపే అవకాశముంది. వాలెంటరీ రిటైర్ మెంట్ పథకాన్ని అమలులోకి తెస్తే అప్పటికప్పుడు కాకుండా ఒకట్రెండేళ్లలో సగం మంది ఉద్యోగులు తగ్గుతారని ఆర్టీసీ యాజమాన్యం అంచనా. ప్రభుత్వం వీఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తే రిటైర్ మెంట్ దగ్గరగా లేదా మరో ఐదారేళ్ల సర్వీసున్న కొంతమంది ఉద్యోగులు వీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.  దీనిపై విమర్శలు రాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రతి పక్షాలు ఎదురు దాడికి దిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం వెనక ప్రతిపక్షాల రాజకీయ లబ్ది ఉందని అధికార పార్టీ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. ఈ సమ్మె వల్ల ఆర్టీసి కోలుకోలేని ఆర్ధిక భారం మూటగట్టుకున్నదని ఇక ఆర్టీసీని ఆదుకోవడం ప్రభుత్వానికి కూడా కష్టమే అంటూ ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరించాలనేది ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది. అయితే యాభై శాతం మించకుండా ఉంటుందనేది సీఎం స్పష్టంగా చెప్తున్న మాట. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సంస్థల్లో వీఆర్ఎస్ తీసుకొస్తున్న నేపథ్యంలో అటు బీజేపీ నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం లేదు.

ప్రమాదాలకు అడ్డాగా బయోడైవర్సిటీ ఫ్లైఓవర్.. కారు పడి మహిళ మృతి!

  హైదరాబాదులోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ పై నుంచి ఒక్కసారిగా  కిందపడింది. ఫ్లై ఓవర్ కింద నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ కారు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. అంతేకాదు.. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులతో సహా దాదాపు 8 మంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.  ఫ్లైఓవర్‌పై మలుపు దగ్గర  స్పీడ్ కంట్రోల్ కాకపోవటంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఫ్లై ఓవర్ ను ప్రారంభించి నెల రోజులు కూడా గడవక ముందే.. ఇది మూడో ప్రమాదం కావడం గమనార్హం. ఫ్లైఓవర్‌ డిజైన్‌లో లోపం, చాలా మలుపులు ఉండటంతో ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి  ప్రయోజనం చేకూర్చడం కోసం.. ఫ్లైఓవర్ డిజైన్‌లో హడావుడిగా మార్పులు చేసి నిర్మించడం వల్ల.. నిర్మాణంలో లోపాలు ఏర్పడి  ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గంజాయి మత్తులో విద్యార్థులు... అమ్మడం కూడా మొదలుపెట్టారు!!

  విశాఖ ఏజెన్సీలో దట్టమైన అడవులు పచ్చని వాతావరణం ఘాట్ రోడ్లు పర్యాటక ప్రాంతానికే కాదు గంజాయి అక్రమ రవాణాకి కూడా విశాఖ ఏజెన్సీ అడ్డాగా మారింది. ఏజెన్సీ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఒక పక్క పోలీసులు, మరో పక్క ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు ఎన్ని దాడులు చేసినప్పటికి  లాభం లేకుండా పోతుంది. గంజాయి పట్టకున్నట్లు ప్రతి రోజు వార్తలు వస్తున్నాయి. అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు దొరికిన వారు జైల్లో మగ్గుతున్నారు. ఇంత జరుగుతున్నా గంజాయి అక్రమ రవాణాను అక్రమార్కులు వదలటం లేదు.  ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు గంజాయి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా అనేది లాభదాయకమైన వ్యాపారం. అందుకే గంజాయి అక్రమ రవాణాకు అక్రమార్కులు వివిధ పద్ధతులను వాడుకుంటున్నారు. చివరకు విద్యార్థులకు పాకెట్ మనీ ఆశ చూపి విద్యార్థులతో గంజాయి అక్రమ రవాణా చేయిస్తున్నట్టు ఇటీవల పోలీసుల దాడుల్లో బయటపడింది. ఇది తెలిసిన పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం యూత్ ఎంజాయ్ లైఫ్ కు అలవాటు పడిపోయారు. కాలేజ్ కు వెళ్తున్న విద్యార్థులకు ఇంట్లో ఇచ్చిన పాకెట్ మనీ సరిపోకపోవడంతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఉదయం ఇంట్లో కాలేజీకి వెళ్లిన విద్యార్థి రాత్రి ఏ సమయానికి వస్తాడో తెలియని పరిస్థితి తల్లిదండ్రులకు ఎదురైంది.  విద్యార్థులంతా ఒక చోట చేరుకొని సిగరెట్, కాఫీ, కూల్ డ్రింగ్ తాగుతూ చర్చలు పెట్టుకుంటారు. అక్కడితో ఆగకుండా వీకెండ్ అంటూ ప్రత్యేక పార్టీలు, లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకుంటారు. ఒక పక్క బిజీ లైఫ్ తో పాటు మరో పక్క ఎంజాయ్ మెంట్ ను కోరుకోవడంతో విద్యార్థులు అక్రమార్కుల చేతిలో అడ్డంగా బలవుతున్నారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 మంది విద్యార్థులు ముక్లబ్ ఏజెన్సీ నుంచి గంజాయి తెస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారమందింది. దీంతో ఆ విషయం విద్యార్థులకు తెలిసిపోవడంతో గంజాయిని దారిలోనే పడేసి జాగ్రత్త పడ్డారు. పోలీసులకు పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయిని మార్గమధ్యంలోనే వదిలేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఇదే విధంగా ఆరిలోవ పరిధిలో ఇంజనీరింగ్ డిస్ కంటిన్యూ చేస్తున్న ముగ్గురు విద్యార్థులు ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి విద్యార్థులకు విక్రయిస్తూ పట్టుబట్టారు. ఇక తాజాగా ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు సాగర్ లో గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఏడాది గంజాయి అక్రమ రవాణా స్మగ్లింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారిలో 30 ఏళ్ళలోపు వారే అధికంగా ఉన్నారని, అందులో విద్యార్థులు ఉన్నారని తేలింది.