తెలంగాణలో కొత్తగా రెండు మున్సిపాలిటీలు

  తెలంగాణ మున్సిపల్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రీశం, జిన్నారం మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా మున్సిపల్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులకు సైతం ఓటుహక్కు కల్పించేలా తెలంగాణ మున్సిపల్‌ చట్టంలోని సెక్షన్‌-20కి సవరణ చేశారు.ఈ సవరణలకు సంబంధించి న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.ఈ నిర్ణయం రాష్ట్రంలో పట్టణ అభివృద్ధి మరియు స్థానిక సంస్థల నిర్వహణలో మరింత సమర్థవంతమైన పాలనను సాధించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సేవలను మరింత చేరువ చేయడం, స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని పాలనను సులభతరం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలో, సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశంమరియు జిన్నారం ప్రాంతాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ రెండు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, వాణిజ్య కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  

ఈ నెల 18న నవంబర్‌ నెల శ్రీవారి ఆర్జిత టికెట్లు కోటా విడుదల

  తిరుమల దర్శనం, గదుల నవంబర్‌ కోటా వివరాలను టీటీడీ విడుదల చేసింది. శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన న‌వంబ‌ర్‌ నెల కోటాను ఆగ‌స్టు 18న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగ‌స్టు 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని సూచించింది.  ఈ టికెట్లు పొందిన భక్తులు ఆగ‌స్టు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయని వెల్లడించింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆగ‌స్టు 21న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌లో విడుదల చేయనున్నట్లు  టీటీడీ అధికారులు ప్రకటించారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు , 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు , శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాను 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నట్లు  వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుదల చేయనున్నట్లు తెలిపారు. 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను , మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ సూచించింది.

ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్

  బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు ఇతర నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోడు భూముల పట్టాల కోసం పోరాడుతున్న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా రైతులకు అండగా నిలిచినందుకు బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతుల చేతికి సంకెళ్లు వేశారని, వారి కోసం పోరాడుతున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేశారని... ఇది రేవంత్ ప్రభుత్వ గూండాగిరికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. పోడు రైతులను వేధించడం మాని, వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న ప్రవీణ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న  కాంగ్రెస్ సర్కార్ పతనం దగ్గర్లోనే ఉందని అన్నారు.

ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

  వాయువ్య బంగాళాఖాతంలో  ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు అనుకుని నిన్న ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్‌ హెచ్చరికలను జారీ చేసింది.  ఆ క్రమంలో ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల ప్రజలకు ప్రభుత్వం సూచించింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ హెచ్చరికలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే వివిధ శాఖల ఉన్నతాధికారుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఒక వైపు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లంకపల్లి వద్ద బుడమేరు వాగుకు భారీగా వరద నీరు పెరిగింది.  ఈ నేపథ్యంలో ఉంగుటూరు - ఉయ్యూరు మార్గంలో రాక పోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే భారీ వర్షాల కారణంగా.. జగ్గయ్యపేటతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నందిగామ, అవనిగడ్డ, జగ్గయ్యపేట, ఉంగుటూరు, గుడివాడ సమీపంలోని బ్రిడ్జిల పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. జిల్లాలోని 5 మండలాల్లో 100కుపైగా గ్రామాల్లో రాకపోకులు నిలిచి పోయాయి. ఇక మున్నేరు, కట్లేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఎవరూ వరద నీటిలో ఈతకు వెళ్లవద్దని, చేపల వేట కోసం నదిలోకి ప్రవేశించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నాటు పడవలపై ప్రయాణాలు ప్రమాదకరమని హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టులలో ప్రమాద సూచికలను ఏర్పాటు చేశారు.  

మళ్లీ ఫ్యాన్సీ నెంబర్ల గోల మొదలైంది బాబోయ్

    తెలంగాణ రవాణా శాఖ ధనవంతులకు షాక్ ఇచ్చింది..  వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు కొనుగోలు చేసే బడా బాబులకు రవాణా శాఖ జలక్ ఇచ్చిందని చెప్పవచ్చు.. ఫ్యాన్సీ నెంబర్ల పిచ్చి నానాటికి పెరిగిపోతుండడంతో దానిని ఎన్కాష్ చేసుకోవాలని రవాణా శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది.. ఇందులో భాగంగానే రవాణా శాఖకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఫ్యాన్సీ నెంబర్ల రేట్లను ఒక్కసారిగా డబుల్ చేసింది..  దాదాపు 100 నుంచి 200 శాతం రేట్లు పెంచుతూ ఆదేశాలిచ్చింది.. ఇప్పటికే ఒకటి నుంచి తొమ్మిది లోపు ఉన్న సింగిల్ డిజిట్ నెంబర్ల కోసం లక్షల రూపాయ లను బడాబాబులు ఖర్చు చేస్తున్నారు. వేలంపాటలో లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తు న్నారు. ఏకంగా *ఒక్క ఫాన్సీ నెంబర్ కోసం 15 నుంచి 20 లక్షల రూపాయ లను ఫాన్సీ నెంబర్ ల కోసం ఖర్చుపెట్టిన బడా బాబులు కూడా ఉన్నారు.. ఇప్పటివరకు టెండర్ కోసం వేసే ఫేసు చాలా తక్కువగా ఉంది దానిని గుర్తించిన రవాణా శాఖ టెండర్రింగ్ ఫీస్ ని భారీ మొత్తంలో పెంచాలని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే 50 వేలకు ఉన్న ఫీజు ను ఒక్కసారిగా 1,50,000కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.. మొత్తం ఆరు స్లాట్ గా ఉన్న టెండర్ ప్రక్రియకు సంబంధించిన రేట్లను సవరిస్తూ ఆదేశాలు ఇచ్చింది.  వీటిని అమలులోకి తెస్తామని పేర్కొంది.  రవాణా శాఖ లో ఫాన్సీ నంబర్స్ ఫీజులు భారీ గా పెంపు. 50 వేల ఫీజు ను 1, 50, 000 కి పెంపు.  30 వేల ఫీజు ను 1, 00, 000 కి పెంపు. 20 వేల ఫీజు ను 50, 000 కి పెంపు. 20 వేల ఫీజు ను 40, 000 కి పెంపు. 10 వేల ఫీజు ను 30,000 కి పెంపు. 5వేల ఫీజు ను 6000 కి పెంపు.

తొలగించిన 65 లక్షల ఓట్ల వివరాలను బహిర్గతం చేయాల్సిందే.. ఈసీఐకి సుప్రీం ఆదేశం

తొలగించిన ఓట్ల వివరాలను బహిర్గతం చేయాల్సిందే.. ఈసీఐకు సుప్రీం ఆదేశించింది. బీహార్ లో ఎస్ఐఆర్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను  సుప్రీం కోర్టు గురువారం (ఆగస్టు 14) విచారించింది. ఈ సందర్భంగా  బీహార్ లో ఇటీవల  నిర్వహించిన ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక  సవరణ)లో భాగంగా  తొలగించిన 65 లక్షల ఓట్ల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అదీ ఈ నెల 19లోగా ఆ వివరాలను వెల్లడించాలని గడువు విధించింది. అదే విధంగా తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలపై ఈనెల 22లోగా  తమకు నివేదిక సమర్పించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.    

సచివాలయంలో మెప్మా జూట్ బ్యాగ్స్ స్టాల్స్ ప్రారంభం

  ఏపీ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో జూట్ బ్యాగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో మెప్మా ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్స్ స్టాల్స్ ను రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ గురువారం ప్రారంభించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ఈ జూట్ బ్యాగ్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్థానంలో పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకువచ్చే దిశలో  ఈ స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  వచ్చే ఏడాది జూన్ 5 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  ఇచ్చిన పిలుపుకు నాంధి పలుకుతూ తొలుత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.  ఈ లక్ష్య సాధనలో భాగంగా స్టీల్ బాటిల్స్, జూట్స్ బ్యాగ్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇందుకై పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి మిషన్ మోడ్ లో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.  ఈ కార్యాచరణ అమల్లో భాగంగా తొలుత రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులైన ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, స్టిక్కర్లు, సాచెట్లు మరియు ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకం, పంపిణీ మరియు వాడకంపై తక్షణ నిషేధాన్ని అమలు చేయడం జరుగుచున్నదన్నారు. వీటి స్థానంలో పునర్వినియోగ, బయోడిగ్రేడబుల్ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టడం జరుగుచున్నదన్నారు.  అదే విధంగా రాష్ట్ర సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో త్రాగునీరు అందుబాటులో ఉండే విధంగా ఆర్.ఓ. ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుచున్నదని, సచివాలయ ఉద్యోగులకు పునర్వినియోగించదగిన స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లను ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  అదే విధంగా ఘన, ద్రవ్య మరియు ఇ-వ్యర్థాల సేకరణకు మూడు రంగుల డస్టు బిన్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుచున్నదన్నారు.  ఈ విదంగా రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా  రూపొందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సహకారంతో అమలు చేయడం జరుగుచున్నదని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సచివాలయ ఉద్యోగులు, సందర్శకులు అందరూ సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ తేజ్ భరత్ పాల్గొన్నారు. 

సీఎం యోగిపై ప్రశంసలు..ఎమ్మెల్యే పూజా పాల్‌పై వేటు

  ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాఫియా ఆగడాలపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ  ఎమ్మెల్యే పూజా పాల్‌‌ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.  ఈ వ్యవహారం కాస్త స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో  సమాజ్‌వాదీ పార్టీ  చీఫ్ అఖిలేశ్ యాదవ్ సస్పెండ్ చేయటం చర్చనీయాంశమైంది.  నా భర్తను చంపిన అతీక్ అహ్మద్ లాంటి క్రిమినల్స్‌పై సీఎం  యోగి తీసుకుంటున్న చర్యలు మహిళలకు వెంటనే న్యాయం జరిగేలా చేస్తున్నాయి. ఆయనకు ధన్యవాదాలు అని ప్రశంసించారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ పార్టీ హైకమాండ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డందుకు చర్యలు తీసుకున్నాట్లు పేర్కొన్నారు. 2005లో సమాజ వాదీ పార్టీ ఎమ్మెల్యే రాజు పాల్‌ పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పాల్పడింది.. గ్యాంగస్టర్లు అతీక్ అహ్మద్‌తోపాటు అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే రాజు పాల్‌ను పూజా పాల్ పెళ్లి చేసుకున్న కేవలం 10 రోజులకే ఈ మర్డర్ జరిగింది. ఇక గ్యాంగస్టర్లు అతీక, అష్రాఫ్‌లు 2023లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూజా పాల్‌ శాసన సభలో సీఎం యోగి అదిత్యను ప్రశంసించారు.  

హైకోర్టులో వైసీపీకి షాక్

  ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీకి షాక్ తగిలింది. వైఎస్సార్‌ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైసీపీ దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను  హైకోర్టు కొట్టివేసింది. జడ్పీటీసీ పరిధిలోని 15 పోలింగ్‌ కేంద్రాల్లో, ఒంటిమిట్టలోని 30 పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని వైసీపీ పిటిషన్‌ దాఖలు చేసింది.  దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రీ పోలింగ్‌ అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని, ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. వైసీపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,035 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి  6,267 ఓట్లతో గెలిచారు  

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

  ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సీఎం రేవంత్‌రెడ్డిని ఇవాళ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల సిప్లిగంజ్‌కు రూ. కోటి నగదు ప్రోత్సాహకం ప్రభుత్వం అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్‌ను శాలువ కప్పి సత్కరించారు.  కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలో తను పాడిన ‘నాటు నాటు’ సాంగ్‌‌కు ఆస్కార్ అవార్డు రావడంతో దేశవ్యాప్తంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాపులర్ అయ్యారు. ఆ ఒక్క సాంగ్‌తో ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నారు. అయితే, 2023లో ఓ ప్రోగ్రామ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నగదు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు జూలై 20న పాతబస్తీ బోనాల సందర్భంగా రాహుల్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి ప్రోత్సాహకం ప్రకటించింది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో రాహుల్‌తో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్‌..42 మంది మృతి

  జమ్మూ కశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. కిష్త్వార్ ప్రాంతంలో భారీ వరదలో 42 మంది భక్తులు కొట్టుకుపోయి మరణించారు. స్థానిక మచైల్ మాతా గుడికి వెళ్తుండగా నది దాడుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. దీంతో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. భారీ సంఖ్యలో యాత్రికులు ఇక్కడ ఉండటంతో.. సహాయక బృందాలు హుటాహుటిన ఆ ప్రదేశానికి తరలి వెళ్లాయి. కిశ్త్‌వాడ్‌ మాచైల్‌ మాతా (చండీ)మందిరానికి వెళ్లే యాత్ర బేస్‌ పాయింట్‌ ఇదే.   గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాయి. చషోటీ ప్రాంతంలో ప్రతీ సంవత్సరం జూలై 25 నుండి సెప్టెంబర్ 5 వరకు మచైల్ మాతా యాత్ర  ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఏడాది చండీ మాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా మచైల్‌ మాతా ఉత్సవాల్లో పాల్గొన్న భక్తుల మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద సంభవించిన చషోటీ ప్రాంతం మచైల్ మాతా యాత్రకు ప్రారంభ ప్రాంతంతో పాటు కిష్త్వార్‌లోని హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో వాహన సదుపాయం ఉన్న చివరి గ్రామం కూడా. దీంతో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా చషోటీ ప్రాంతంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

జగన్ గడ్డపై టిడిపి జెండా!

పులివెందులలో వైసీపీ డిపాజిట్ గల్లంతు  ఒంటిమిట్టలో తెలుగుదేశానికి భారీ మెజారిటీ జగన్ అడ్డాపై టిడిపి జెండా ఎగిరింది. అదీ  మామూలుగా కాదు. కనీవినీ ఎరుగని రీతిలో. కడప ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జడ్పీటీసీ  ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిం చారు. పులివెందులలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంతయింది.  ఇంతవరకు కడప జగన్ అడ్డా అంటూ గొప్పలు చెప్పుకున్న వైసీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు ఉంటాయని  ఊహించిన టీడీపీ నాయకులు ముందు నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిలో భాగంగానే పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం  ఇంచార్జ్ బీటెక్ రవి సతీమణిని రంగంలోకి దింపి వైసీపీని అయోమయంలో పడేశారు. దీనికితోడు వైసీపీ ఆనుపానులు తెలిసిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జడ్పీటీసీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. 1995 నుంచి జడ్పీటీసీ ఎన్నికల్లో 2016 మినహా ఎప్పుడూ కూడా ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం రాలేదు. ఈ సారి ఇరు పార్టీలు ఇచ్చే తాయిలాలు పుచ్చుకుని ఈ అవకాశం టీడీపీ వల్లనే వచ్చిందనే భావన ప్రజల్లో ఉంది. దానికి కృతజ్ఞతగా ఆ పార్టీకి ఈసారి తెలుగుదేశం అభ్యర్థికి మద్దతుగా నిలిచారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జెడ్పటీసి ఎన్నికల  విధానం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పులివెందులలో ఏ ఎన్నికలోనూ టిడిపి గెలవలేదు. 2 001లో జరిగిన ఎన్నికల్లో అయితే పోటీనే లేకుండా ప్రస్తుత వైసిపి అభ్యర్థి హేమంత్ రెడ్డి తండ్రి మహేశ్వర్ రెడ్డి  ఏకగ్రీవంగా గెలుపొందారు . అంటే జెడ్పీటీసీ  ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పులివెందల జడ్పిటీసీ స్థానం వైసిపి సొంతం అన్నట్లుగా గెలుస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఆ చరిత్ర తిరగరాసి వైసీపీకి చేదు అనుభవాన్ని చవిచూపించడంలో టిడిపి వ్యూహం పలించిందనే చెప్పాలి. పులివెందుల ఉపఎన్నిక మొదటి నుంచి వైసీపీ, టిడిపిల మధ్య రభస  జరుగుతూనే వచ్చింది. పోలింగ్ రోజు వైసీపీ నేత ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లను హౌస్ అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది.  దీనిపై వైసీపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రీపోలింగ్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో  పులివెందులలో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. పులివెందుల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలవడమే కాదు ఆమెకు వచ్చిన ఓట్లు కూడా ఒక చరిత్రే. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన లతా రెడ్డికి 6716 ఓట్లు వస్తే,  వైసీపీ నుండి పోటీ చేసిన హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి.  అంటే 6033 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం విజయం సాధించింది. ఇంత పెద్ద మెజార్టీ రావడం చూస్తే  టిడిపిని సాధారణ ఓటర్లు బాగా ఆదరించారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వైసీపీ కి ఇంత తక్కువ ఓట్లు రావడం, టిడిపికి ఊహించని స్థాయిలో ఓట్లు రావడం చూస్తే కడపలో జగన్ కు చెక్ పెట్టే పరిస్థితి త్వరలోనే ఉంటుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.  పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం జెండా  రెపరెపలాడడం లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మార్క్ కనిపిస్తోంది. పులివెందులలో మంచి రాజకీయ సంబంధాలు, బంధుత్వాలు కలిగిన ఆయన ఈ ఎన్నికల్లో తన ప్రభావం ఏంటో  చూపించారని చెప్పవచ్చు. గతంలో దివంగత వైయస్ వివేకానందరెడ్డిపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత జడ్పిటిసిగా  గెలిచిన అభ్యర్థి లతా రెడ్డి భర్త బీటెక్ రవి పోటీ చేసినప్పుడు కూడా ఆదినారాయణ రెడ్డి మంత్రాంగం ఫలించింది. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డికి తానేంటో  రుచి చూపించారు. ఇప్పుడు  జెడ్పీటీసి ఉప ఎన్నికలను అంతా తానై పదిరోజుల పాటు  పులివెందులలో తిష్ట వేసి ఊరు ,వాడ వీధి ,సందు అందరితో మాట్లాడి ఓటర్లను తమ వైపు మలుచుకోవడమే కాకుండా, ఓట్లు టిడిపి అభ్యర్థికి పోలయ్యే  విధంగా వ్యూహం రూపొందించారు. పులివెందుల ఉప ఎన్నికపై  జిల్లా, స్థానిక నాయకులు సమష్టిగా కష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆదేశానుసారం ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించలేదు. సర్వ శక్తులు కూడగట్టుకొని విజయం సాధించడంలో ఎవరి మేరకు వారు సత్తా చాటారు. టిడిపి అభ్యర్థి భర్త పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జి బీటెక్ రవితో పాటు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి   నిరంతరం ఎన్నికల నిర్వహణలో పోలింగ్ వరకు వారి వ్యూహాలను అనుసరిస్తూ వారికున్న సంబంధాలను అభ్యర్థి గెలుపుకోసం కోసం సానుకూలంగా మలుచుకుంటూ వచ్చారు. వీరితోపాటు  జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా  చైతన్య రెడ్డి లు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. చైతన్య రెడ్డి తో పాటు టిడిపి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ,కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి లు పులివెందులలో ప్రచారం చేసి టిడిపి అభ్యర్ధి విజయం కోసం కష్టపడ్డారు . ప్రచారంలో బిజెపి నేత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో పాటు పలువురు  బిజెపి నాయకులు కూడా పాల్గొన్నారు.  వీరితోపాటు కూటమిలో ఉన్న మరి కొందరు నాయకులు , కార్యకర్తలు గట్టిగా ప్రయత్నం చేశారు. ఒంటిమిట్ట లోనూ టిడిపి విజయం కేతనంతో  ఉమ్మడి కడప జిల్లాలో తన సత్తా ఏంటో తెలుగుదేశం నిరూపించుకుంది. సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో ని 10 స్థానాల్లో ఏడు స్థానాలను కూటమి విజయం సాధించింది. పులివెందులతో పాటు ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో కూడా టిడిపి అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇక్కడ టిడిపి, వైసిపిల మధ్య రసవత్తర పోరు జరిగినట్టు అనిపించినా, వైసీపీ నాయకులు ఆశలు పెట్టుకొని గట్టిగా ప్రయత్నించినా గెలుపు వారికి దరిదాపుల్లో లేకుండా పోయింది .టిడిపి అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి భారీ మెజార్టీ లభించింది. వైసిపి అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి 6,513 ఓట్లు మాత్రమే రాగా టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780ఓట్లు వచ్చాయి. దీంతో టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6267ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఒంటిమిట్టలో టిడిపి నాయకులు పడ్డ కష్టాలు, కసరత్తు ఫలించింది . ఒంటిమిట్ట గెలుపు పట్ల  టిడిపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  పులివెందుల, ఒంటిమిట్ట గెలుపు జిల్లా టిడిపి లో కొత్త ఉత్తేజం నింపింది.

పులివెందులలో జగన్ అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారు : సీఎం చంద్రబాబు

  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఓటు వేశామనే స్లిప్పులు పెట్టారు. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఆలోచించాలి. జగన్ అరాచకాల నుంచి పులివెందుల ప్రజలు ఇప్పుడే బయటపడుతున్నారు. ఈ విజయం పట్ల నేతలంతా స్పందించాలిని సీఎం చంద్రబాబు ఆదేశించారు.జగన్ అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని చంద్రబాబు చెప్పారు.  పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,035 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మరోవైపు  లతారెడ్డిని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అభినందించారు. చాలా అద్బుత విజయం సాధించారు. సంతోషంగా ఉంది. మీ విజయంతో పార్టీలో చాలా జోష్ ఇంకా ఎక్కువ కదా. అందరం తెలుగు దేశం పార్టీ ఫ్యామిలీ అని భువనేశ్వరి లతారెడ్డితో ఫోన్‌లో అన్నారు. స్వయంగా సీఎం భార్య ఫోన్ చేసి అభినందించడంతో లతారెడ్డి సంతోషంలో మునిగిపోయారు.  

చరిత్రను తిరగరాసిన పులివెందుల ఎన్నిక.. లతారెడ్డికి చంద్రబాబు అభినందన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత  నారా చంద్రబాబునాయుడు పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం విజయాన్ని మూడు దశాబ్దాల తరువాత చరిత్రను తిరగరాయడంగా అభివర్ణించారు. పులివెందులలో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి మారెడ్డి లతారెడ్డిని అభినందించిన ఆయన ఈ విజయాన్ని  మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా   హైలైట్ చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. మూడు దశాబ్దాల తరువాత పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్న చంద్రబాబు.. ఈ ఎన్నికలో పోటీ చేయడానికి 11 మంది ఔను సరిగ్గా 11 మంది నామినేషన్లు వేయడమే ఇందుకు తార్కానమని చెప్పారు. పదకొండు సంఖ్యను నొక్కి చెప్పడం ద్వారా పరోక్షంగా గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీకి వచ్చిన స్థానాలను వ్యంగ్యంగా ప్రస్తావించారు. ఈ సందర్బంగా బ్యాలెట్ బాక్సులో ఓ ఓటరు తన ఓటుతో పాటు.. 30 ఏళ్లలో తొలి సారి ఓటు వేస్తున్నా.. అందరికీ దండాలు అంటూ ఒక స్లిప్ కూడా వేయడాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. పులివెందుల రాజకీయాలలో ఈ జడ్పీటీసీ ఎన్నిక ఒక చరిత్ర అని చంద్రబాబు పేర్కొన్నారు.  

అసెంబ్లీకి గైర్హాజరై.. ప్రజాస్వామ్యం గురించి కబుర్లేంటి.. జగన్ పై అయ్యన్న ఫైర్

ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పే మీరు అసలు అసెంబ్లీకి వస్తారో రారో క్లారిటీ ఇవ్వండంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ పై ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా? రారా క్లారిటీ ఇవ్వాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరు వల్ల ప్రశ్నలు మురిగిపోతున్నాయని మండి పడ్డారు.   ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి.. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని  సూటిగా ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ సభ్యులు ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీకి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు.  జగన్ హయాంలో అసెంబ్లీలోని ప్రింటర్లలాగత ఐదేళ్లలో అసెంబ్లీలోని ప్రింటర్లు తుప్పు పట్టినట్టే సభ కూడా తుప్పు పట్టింది. జగన్ ఐదేళ్ల హయాంలో అసెంబ్లీ కేవలం 75 పనిదినాలు మాత్రమే నడిచిందన్న ఆయన తెలుగుదేశం కూటమి హయాంలో ఇప్పటికే  31 రోజులు సమావేశాలు జరిగాయన్నారు. ఈ నెల 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్న కనీస స్ఫృహ లేని వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. 

మంగళగిరిలో నారా బ్రహ్మణి పర్యటన.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా?

మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న స‌తీమ‌ణి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె  నారా బ్రాహ్మ‌ణి బుధవారం (ఆగస్టు 13) పర్యటించారు. ఆ సందర్భంగా ఆమె నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. తన భర్త ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంపై మమకారంతో ఆమె ఇప్పటికే అక్కడ తన స్వంత ఖర్చుతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో ముఖ్యంగా  మహిళల కోసం స్త్రీ శక్తి  కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే, స్థానిక పార్కులో పిల్లలకు ఆటసామగ్రిని తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేశారు.  వీటన్నిటినీ ఆమె ఈ పర్యటనలో సందర్శించారు.  అలాగే చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప‌రిశీలించారు. నూత‌నంగా తీసుకువ‌చ్చిన డిజైన్ల‌ను ప‌రిశీలించారు.  ‘స్త్రీ శ‌క్తి’ కుట్టు శిక్ష‌ణా కేంద్రాల‌ను ప‌రిశీలించి, శిక్షణ సాగుతున్న తీరును ఆరా తీశారు.  ఇప్ప‌టి వ‌ర‌కు మూడు బ్యాచ్‌లుగా శిక్ష‌ణ పొందిన వారు సొంత‌గానే కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరత్వం పొందుతున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.  పార్కులో స్వ‌యంగా తాను సొంత ఖ‌ర్చుతో ఏర్పాటు చేయించిన పిల్ల‌లు ఆడుకునే ప‌రిక‌రాలు.. వ‌స్తువుల‌ను నారా బ్రాహ్మ‌ణి ప‌రిశీలించారు. అలాగే మంగళగిరిలోని ప్ర‌సిద్ధ‌ పాన‌కాల‌స్వామి ఆల‌యాన్ని  నారా బ్రాహ్మ‌ణి సంద‌ర్శించారు.  నారా లోకేష్ సొంత ఖ‌ర్చుతో కొనుగోలు చేసి ఇచ్చిన ఉచిత బ‌స్సులో కొద్ది సేపు ప్రయాణించి, తోటి ప్రయాణీకులతో సంభాషించారు.  నారా బ్రహ్మణి పర్యటనకు జనం నుంచి అద్భుత స్పందన వచ్చింది. కాగా నారా బ్రహ్మణి మంగళగిరిలో పర్యటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అమె పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే.  

రాహుల్ పై జగన్ వ్యాఖ్యలు.. షర్మిల రియాక్షన్ తట్టుకోలేమంటూ వైసీపీ బెంబేలు

పులివెందుల ఓటమి జగన్ ప్రతిష్టను పాతాళానికి పడిపోయేలా చేసిందన్న మాటలు వైసీపీ వర్గాల నుంచే వినపిస్తున్నాయి. అయితే ఆ పాతాళం కంటే ఆయన ప్రతిష్ఠ దిగజారిపోయే పరిస్థితి ముందుందని అంటున్నారు. పులివెందుల ఓటమిని ముందుగానే అంచనా వేసిన జగన్.. ఆ ఓటమికి అధికార తెలుగుదేశం అధికార దుర్వినియోగమే కారణమని ఆరోపణలు కౌంటింగ్ కు ముందు రోజే గుప్పించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగి ఉంటే పాపం కొంచం ఆబోరైనా దక్కేదేమో.. కానీ జగన్ ఈ వ్యవహారంలోకి రాహుల్ గాంధీని లాగారు. ఓట్ చోరీ అంటూ హంగామా చేస్తున్న ఆయనకు ఏపీలో జరిగిన ఎన్నికల అక్రమాలు కనిపించలేదా? అని ప్రశ్నించడమే కాకుండా, ఏపీ వ్యవహారంపై ఆయన మాట్లాడకపోవడానికి చంద్రబాబుతో నిత్యం హాట్ లైన్ లో టచ్ లో ఉండటమే అందుకు కారణమని ఆరోపించారు.  జగన్ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీయులను గాభరా పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ కు సొంత చెల్లి అయిన షర్మిల జగన్ వ్యాఖ్యలకు రియార్ట్ అయితే తమ పరిస్థితి, జగన్ పరిస్థితి ఏమిటని బెంబేలెత్తిపోతున్నారు.  జగన్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ మామూలుగా ఉండదనీ, ఆమె సంధించే ప్రశ్నలు, చేసే విమర్శలతో జగన్ కు దిమ్మతిరిగి బొమ్మకనబడటం ఖాయమన్న మాటలు వైసీపీ నుంచే వినవస్తున్నాయి.  ఇటు బీజేపీ ఎన్డీయే లో భాగంగా ఉంటూ మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో బాబు హాట్ లైన్ లో ఉన్నారు అంటూ పులివెందుల పంచాయితీలోకి రాహుల్ లాగడం ద్వారా జగన్ తన చెల్లి షర్మిలను రెచ్చగొట్టారని అంటున్నారు.   ఇక ఇప్పుడు షర్మిల నోరు విప్పితే..పులివెందుల ఓటమితో బీటలు మాత్రమే వారిన జగన్ కోట బద్దలైపోవడం ఖాయమని అంటున్నారు. పులివెందుల పంచాయతీలోకి రాహుల్ ను లాగి జగన్ కొరివితో తలగోక్కున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  

పులివెందులలో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

అంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనం నమోదైంది. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందుల కోట బద్దలైంది. జగన్ సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఘనంగా ఎగిరింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది.  డిపాజిట్ కూడా కోల్పోయి కుదేలైంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఈ నెల 12న ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. పులివెందుల చరిత్రలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యయుతంగా జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏకగ్రీవమే తప్ప ఎన్నిక ఎరుగని పులివెందుల ఓటర్లు ఈ పరిణామంలో ఓటువేసేందుకు ఉత్సాహంతో పోటెత్తారు. పోలింగ్ సమయంలో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయడానికి వీలులేని పరిస్థితులు కల్పించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలను పోలీసులు సమర్ధంగా అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగేలా చూశారు. దీంతో ఎన్నిక సజావుగా సాగింది.  మొత్తం పోలైన ఓట్లలో తెలుగుదేశం అభ్యర్థికి  6716ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. జగన్ అడ్డాలో ఆయన పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. 

పులివెందులలో తెలుగుదేశం ఘన విజయం

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి ఘన విజయం సాధించారు. తెలుగుదేశం అభ్యర్థి  6 వేల 52 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి సతీమణి  లతారెడ్డి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.   ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచీ తెలుగుదేశం కు ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. ఏ దశలోనూ వైసీపీ అభ్యర్థి పుంజుకునే పరిస్థితి కనిపించలేదు. తెలుగుదేశం అభ్యర్థికి  6735 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు వచ్చాయి. పరాభవాన్ని, పరాజయాన్ని ముందుగానే అంచనా వేసిన వైసీపీ బహిష్కరణ  అంటూ పలాయనం చిత్తగించింది.