నదుల అనసంధానం కోసం నిర్మాణాత్మకంగా ముందుకు.. ఆనం రామనారాయణ రెడ్డి

నదుల అనుసంధానం విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతుందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనంరామనారాయణ రెడ్డి అన్నారు. గురువారం (ఆగస్టు 28) మీడియాతో మాట్లాడిన ఆయన నారాచంద్రబాబునాయుడు గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానంపై కసరత్తు చేస్తున్నారనీ, ఇందు కోసం 84 వేల కోట్ల రూపాయలతో ప్రణాళికలు కూడా రూపొందించారనీ తెలిపారు. ఉప్పొంగే నదుల జీవ జలాలు ఉప్పు సముద్రం పాలు కాకూడదన్న మహదాశయంతో చంద్రబాబు ముందుకు సాగుతుంటే.. దానిపై కూడా కొందరు రాజకీయ స్వప్రయోజనాల కోసం రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.  ఇక నదుల అనుసంధానానికి పొరుగురాష్ట్రాల సమ్మతి పొందే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆనం వివరించారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తే రాయలసీమ ప్రాంతానికి రెండో పంటకు  కూడా నీరందించగలమని ఆనం అన్నారు.  కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు శరవేగంగా పూర్తవుతున్నాయన్న ఆనం రామనారాయణ రెడ్డి..  గత ప్రభుత్వం కేవలం 400 కోట్ల రూపాయలు వ్యయం చేయలేక హంద్రీనీవా ప్రాజెక్టును పక్కన పడేసిందని విమర్శించారు. ఆ పనిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తి చేసిందన్నారు. సోమశిలకి ఎగువ ప్రాంతాల నుంచి 18750  క్యూసెక్కుల నీరు వస్తోందనీ,  ప్రస్తుతం సోమశిల, కండలేరులో 150 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామనీ చెప్పారు.   సోమశిల నుంచి కండలేరు ఫ్లడ్ ఛానల్ సామర్ధ్యం 12వేల క్యూసెక్కుల నుంచి 24వేలకి పెంచుతామన్న జగన్ ఆయన హయాంలో  ఆలోచన లేకుండా కమిషన్ల కోసం టెండర్లు పిలిచారనీ, వారు పనులు మధ్యలోనే ఆపేసిపోయారు పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు సోమశిల హైలెవెల్ కెనాల్ కోసం నిధులు ఇచ్చారన్నారు.   అలాగే జిల్లాలో 40 పంవాయతీ భవనాల నిర్మాణానికి రూ.12.8కోట్లు, గ్రామాల్లో రోడ్ల కోసం రూ.50కోట్లు ఇచ్చినట్లు తెలిపారు.  గత ప్రభుత్వం, తమ పార్టీ పంచాయతీల నిధులన్నీ మళ్లించింది. ఇప్పుడు కూడా మేము నిధులు ఇస్తామంటే ఒక మండలం వైసీపీ ప్రజాప్రతినిధులు కలిసి రావడం లేదన్న ఆనం రామనారాయణ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వాలలో ఉన్నవాడిగా తనకు  విషయాలూ తెలుసునన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టడం తన అభిమతం కాదన్న ఆయన కలిసిరాకుండా నష్టం వాళ్లకేనన్నారు. 

రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న వినాయకుడి విగ్రహం తొలగింపు

హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి వేడుకలు ఎంతో ప్రత్యేకమైనవి. వాడవాడలా గణేష్ మండపాలను ఏర్పాటు చేసి అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. అలాగే మండపాలలో ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమలు  వినూత్నత, సృజన ఉట్టిపడేలా ఉంటాయి. భిన్న రూపాలలలో సమాకాలీన అంశాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తారు.  అందులో భాగంగానే హైదరాబాద్ హబీబ్ నగర్ లో కాంగ్రెస్ నేత, తెలంగాణ మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్.. తమ పార్టీ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్ఫురింప చేసేలా ప్యాంటు, షర్టు ధరించిన గణేషుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రి రూపాన్ని స్ఫురింపచేసేలా ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వివాదాస్పదంగా మారింది.  విగ్రహ ఏర్పాటు మాత్రమే కాకుండా  మండపాన్ని సైతం తెలంగాణ రైజింగ్ అనే హోర్టింగ్ లతో ఏర్పాటు చేశారు. ఇలా ఏకంగా సిఎం రేవంత్ రెడ్డిని వినాయకుడి రూపంలో మార్చడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  అభిమానం ఉండాలే కానీ అది హద్దులు దాటకూడదు,  హీరోలు, రాజకీయ నాయకుల రూపాలలో గణేష్ ప్రతిమలు చేయడం సరికాదంటూ పలువురు అభ్యంతరం చెప్పారు. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి,  హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రేవంత్ రూపాన్ని స్ఫురింప చేసేలా వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం తగదంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు హబీబ్ నగర్ లో ఏర్పాటు చేసిన మండపం వద్దకు బుధవారం (ఆగస్టు 27) వెళ్లి పరిశీలించిన సౌత్ జోన్ డిసిపి  రేవంత్ రెడ్డి రూపంలో వినాయకుని విగ్రహం ఉండడం చూసి, వెంటనే మండపం ఏర్పాటు చేసిన ఫిషిరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిలిపించి భక్తుల మనోభావాలు దెబ్బతీయ వద్దనీ, వెంటనే విగ్రహం మార్చా లంటూ పోలీసులు సూచించారు. దీంతో నిర్వాహ కులు  రేవంత్ రెడ్డి రూపం లో ఉన్న విగ్రహం మార్చి మరో విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు.  

గూగుల్ మ్యాప్ బోల్తా కొట్టించింది.. వరదలోకి దారి చూపింది!

గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ప్రయాణాలు సాగించడం ఒక్కోసారి ప్రాణాల మీదకు తీసుకువస్తున్నది. అటువంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నా, ప్రయాణాలు చేసేవారు ఆ మ్యాప్ ల మీదే ఆధారపడి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ ప్రయాణం చేస్తున్న ఓ కుటుంబంలో ఘోర విషాదం సంభవించిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్ లోని  సవాయి భోజ్‌ను  దర్శించుకుని వ్యాన్ లో తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం గూగూల్ మ్యాప్ సూచించిన విధంగా ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆ మ్యాప్ వారిని నేరుగా బనాస్ వరద నీటిలోకి గైడ్ చేసింది. దీంతో వారు ప్రయాణిస్తున్న వ్యాన్  వరద నీటిలో కొట్టుకుపోయింది. చిత్తోర్ ఘడ్ జిల్లా  రష్మి పోలీస్ స్టేషన్ పరిధిలో  జరిగిన ఈ ఘోర ఘటనలో ఓ బాలిక మరణించింది. మరో ముగ్గురు గల్లంతయ్యారు.  స్థానికుల సహకారంతో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు.  వివరాలిలా ఉన్నాయి. రాజ్‌సమంద్ జిల్లాకు చెందిన గదరి వర్గానికి చెందిన కుటుంబం విహార యాత్ర కోసం భిల్వారాలోని సవాయి భోజ్‌ను సందర్శించింది. తిరుగు ప్రయాణంలో గూగుల్ మ్యాప్‌లో చూపిన మార్గాన్ని అనుసరించి వారు రష్మి పీఎస్ పరిధిలోని సోమి–ఉప్రెడా మధ్యనున్న కల్వర్ట్  మీదుగా ప్రయాణించాల్సి ఉంది. వాస్తవానికి ఆ కల్వర్ట్ గత మూడేళ్లుగా బంద్ అయి ఉంది.  దానిపై రాకపోకలను నిషేధించారు. అయితే గూగుల్ మ్యాప్ ఆ కల్వర్టు మీదుగానే ప్రయాణించాలని సూచించడంతో వారు అ లాగే ముందకు సాగారు. కానీ ఇటీవలి భారీ వర్షాలకు  బనాస్ నదికి వరద పోటెత్తి ఆకల్వర్టు మార్గాన్ని ముంచేసింది. అయితే గూగుల్ అంటూ ముందుకు సాగిన వారు, తమ వ్యాన్ ను కల్వర్ట్ పైకి తీసుకు వెళ్లారు. అయితే వరద ప్రవాహానికి ఆ వ్యాన్ కొట్టుకుపోయింది. ఈ ఘటన  జరిగిన సమయంలో వ్యాన్ లో తొమ్మండుగురు ఉణ్నారు.  స్థానికులు వెంటనే స్పందించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత పోలీసులు స్థానికుల సహకారంతో ఐదుగురిని రక్షించగలిగారు. ఒక బాలిక మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుడ్డిగా గూగుల్ మ్యాప్ లను చూసి ప్రయాణాలు సాగించడం ప్రమాదకరమని ఈ ఘటనతో మరోసారి రుజువైందని పరిశీలకులు అంటున్నారు.  

భగవద్గీత పుస్తకాలతో వినాయక విగ్రహం

దేశ వ్యాప్తంగా  వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో, అత్యంత ఘనంగా గురువారం (ఆగస్టు 27)న జరుపుకున్న సంగతి తెలిసిందే. వాడవాడలా గణేస్ మంటపాలను ఏర్పాటు చేసి గణపతి నవరాత్రి ఉత్సవాలను వేడుకగా జరుపుకోనున్నారు. అయితే పందిళ్లలో వినాయ విగ్రహాల ఏర్పాటులో నిర్వాహకులు తమ సృజనాత్మకతను ఆవిష్కరిస్తున్నారు.   వినూత్న రూపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో  చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ విగ్రహం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. చెన్నైలోని మన్నాలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ మండపంలో  గణనాథుడి విగ్రహాన్ని పూర్తిగా పుస్తకాలతో రూపొందించారు. ఇందు కోసం నిర్వాహకులు ఐదు వేల భగవద్గీత పుస్తకాలను ఉపయోగించారు. వీటితో పాటుగా  1500 'వేల్ విరుత్తమ్', 1008 'మురుగన్ కావసం' వంటి ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా ఉపయోగించారు. ఐదు వేల బగవద్గీత పుస్తకాలతో రూపొందించిన గణనాథుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఈ మంటపానికి తరలి వస్తున్నారు. ఇక ఈ మండపం వద్ద పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా నిర్వాహకులు అన్ని చర్యలూ తీసుకున్నారు. భజనలు, సంకీర్తలలతో మండపం, పరిసర ప్రాంతాలు ఆధ్మాత్మిక శోభతో అలరారుతున్నాయి.  

వరద బాధిత జిల్లాల్లో సిఎం ఏరియల్ సర్వే!

తెలంగాణలో  భారీ వర్షాలు, వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న  జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గురువారం (ఆగస్టు 28) ఏరియల్ సర్వే  చేయనున్నారు. కొద్ది సేపటి కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వర్షాలపై   తన జూబ్లీహిల్స్ నివాసంలో  ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రేవంత్ ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ, సహాయక చర్యలను వేగవంతం చేయడంలోనూ ఎటువంటి ఉదాశీనతా ఉండకూడదని స్పష్టం చేశారు.  కాగా  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కె. రామకృష్ణా రావు  భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న మెదక్, కామారెడ్డి, నిజామాబాద్,  నిర్మల్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి లతో  బుధవారం (ఆగస్టు 27)  రాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితి సమీక్షించారు.   విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్సర్వీసుల శాఖ డీ.జి నాగిరెడ్డి, వరద భాదిత జిల్లాలకు నియమించేంచిన స్పెషల్ అధికారులు  కూడా ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.   గురువారం (ఆగస్టు 28) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంపు గ్రామాలు, లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎస్ ఈ సందర్భంగా ఆదేశించారు. వర్షాల వాళ్ళ దెబ్బతిన్న విధ్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను  యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరించాలన్నారు.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.  మిన్నెసోటా మినియాపొలిస్‌లో ని ఓ పాఠశాలలోకి ప్రవేశించిన సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.  మరో 14 మంది చిన్నారులు సహా 17 మంది గాయపడ్డారు.  విద్యార్థులు ప్రార్థన చేస్తుండగా దుండగుడు చర్చి కిటికీల గుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని 23 ఏళ్ల రాబిన్ వెస్ట్ మ్యాన్ గా గుర్తించారు.  కాల్పులకు పాల్పడిన సాయుధుడు తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు.  అతడి తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులకు స్వాధీనం చేసుకున్న తుపాకీపై న్యూక్ ఇండియా’ ,  మాషా అల్లా అని ఉంది. కాల్పుల ఘటనకు ముందు అతడుసోషల్ మీడియాలో పలు వీడిమోలు పోస్టు చేశాడు.  

వినాయక పూజ చేసి ప్రసాదం స్వీకరించిన జగన్.. ఈ మార్పు వెనుక మర్మమేంటో?

జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేని పరిస్థితి ఉంది.   జగన్ అధికారంలో ఉండగా అంతర్వేది నరసింహ స్వామి రథం దగ్దం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండే సింహాలు మాయం, విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం,  కర్నూల్ జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం.. వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో అప్పట్లోనే జగన్ సర్కార్ హిందూ దేవాలయాలపై దాడులకు ప్రోత్సహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత జగన్ అధికారం కోల్పోయిన తరువాత.. ఆయన హయాంలో  తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం బయట పడింది. అంతే కాదు.. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించడం, తిరుమల తిరుపతి దేవస్థానంలో  అన్యమతస్తులకు  కొలువులు, తిరుమలలో అన్యమత ప్రచారం వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. అదే విధంగా దేవుడి ప్రసాదం తినడానికి కూడా జగన్ ఇష్టపడరన్న ఆరోపణలు ఉన్నాయి.    జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం నివాసంలో ప్రత్యేక పూజలు జరిగిన ప్రతి సందర్భంలోనూ జగన్ కానీ, ఆయన సతీమణి భారతి కానీ ప్రసాదం ముట్టలేదని అంటారు.  ఆయన మత విశ్వాసం మారిందో, లేక మారినట్లు కనిపిస్తే తప్ప జనం మద్దతు పొందలేమనుకున్నారో కానీ వినాయకచవిత సందర్భంగా బుధవారం (ఆగస్టు 27)న ఆయన గణపతి ప్రసాదాన్ని స్వీకరిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  వినాయకచవితి సందర్భంగా జగన్   తాడేపల్లిలోని  వైసీపీ ప్రధాన కార్యాలయంలో  గణపతి పూజ చేశారు. ఆయన నేరుగా పూజలో పాల్గొనడం, పూజ చేయడం ఇదే తొలిసారి. పూజ అనంతరం పూజారులు ఆయనకు ప్రసాదం అందించారు. ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. దీనిపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  జగన్ ప్రసాదం స్వీకరించడం ద్వారా  జగన్ ఇంత కాలం తన తీరుకు భిన్నంగా వ్యవహరించడం ఆసక్తి కలిగిస్తోంది. ఏది ఏమైనా వినాయక చవితి సందర్భంగా జగన్ ప్రసాదం స్వీకరించడం మాత్రం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. 

తెలంగాణలో 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలెర్ట్

తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం (ఆగస్టు 27) కామారెడ్డిలో అతి భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరాన్ని నీరు ముంచెత్తింది. పలు కార్లు, ద్విచక్రవాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక శుక్రవారం (ఆగస్టు 28( కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. భారీ వర్షాల కారణంగా పది జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించే ముప్పు ఉందని హెచ్చరించింది. ఇక పోతే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.   ఇక  ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో వర్షాలు పెరిగితే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలాలని అధికారులు సూచిస్తున్నారు. 

భారీ వర్షాలు.. తెలంగాణలో స్తంభించిన జనజీవనం!

తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. వివిధ జిల్లాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలో  రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై 44 పై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. పలు రైళ్లను రద్దు అయ్యాయి. మరిన్నింటిని దారి మళ్లించారు. భారీ వర్షాలకు అనేక జిల్లాల్లో చెరువులు కుంటలు తెగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి , మెదక్ జిల్లాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ కారణంగా గంటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి పట్టణంలో వరదలకు కార్లు కొట్టుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం అనేక జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.  అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది..లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.  భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. 

యూపీలో కరెన్సీ వర్షం కురిపించిన కోతి

మర్కట చేష్టలకు అర్ధం ఉండదు. ఒక్కోసారి అవి చేసే పనులు వినోదం కలిగిస్తాయి. ఇంకోసారి విస్మయ పరుస్తాయి. అలా విస్మయం కలిగించేలా ఓ కోతి చెట్టెక్కి మరీ నోట్ల వర్షం కురిపించింది. ఆ నోట్లను ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని దోదాపూర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగింది.   ఓటీచర్ టీచర్.. ఓ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం తన వెంటన 80 వేల రూపాయల నగదు కూడా తెచ్చిరు. ఆ నగదును ఓ సంచిలో ఉంచి తన బైక్ డిక్కీలో భద్రపరచుకున్నాడు. ఇక కార్యాలయం వద్ద ఆయన తన పనిలో ఉన్న సమయంలో ఓ కోతి.. ఎక్కడ నుంచి వచ్చిందో కానీ ఏకంగా బైక్ డిక్కీ తెరిచి అందులో ఉన్న డబ్బు సంచినీ ఎత్తుకెళ్లి సమీపంలోని చెట్టెక్కి కూర్చుంది.   తీరిగ్గా చెట్టుపై కూర్చుని సంచీని తెరిచి చూసింది. అందులో తాను తినడానికి పనికివచ్చే పదార్ధం ఏదీ లేకపోవడంతో.. కోపగించింది. అంతే తన కోతి చేష్ట చూపింది. సంచీలోని నోట్లను తీసి గాలిలోకి విసిరేయడం ఆరంభించింది. చెట్టు పై నుంచి నోట్లు రాలడంతో జనం వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

జగన్ వినాయకుడ్ని ఏం కోరుకునుంటారు?

జగన్  హిందూ మత విశ్వాసాలను నమ్మరన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన క్రిష్టియన్ సంప్రదాయాలకు విరుద్ధంగా మరో మారు హిందూ దేవతలకు పూజలు నిర్వహించారు. ఇప్పటికే ఆయన తాను సీఎంగా ఉండగా వెంకన్న సెట్ వేసి.. అక్కడ భక్తి రాహిత్యంతో కూడిన పూజల కారణంగా ఓడిపోయారని అంటారు పలువురు పాస్టర్లు. ఎందుకంటే ఎవరైతే  ఏసు ప్రభువును నమ్ముతారో వారు మరొక మతానికి చెందిన దేవుళ్లు, దేవతలకు పూజలు నిర్వహించరాదని అంటారు వీరు.  కానీ జగన్ తనపై ఉన్న క్రిష్టియన్ సీఎం అన్న ముద్ర చెరుపుకోడానికి చాలా ప్రయత్నాలే చేశారు. ఫైనల్ టచ్ ఇద్దామని వెంకన్న సెట్ వేసి మరీ స్వామి వార్ని భారీఎత్తున కాకా పట్టేద్దామని గట్టిగా ట్రై చేశారు. కానీ తన సతీమణి భారతీరెడ్డి తిరుమలలో ఏర్పాటు చేసిన తన సైన్యం ఎఫెక్టూ.. దీంతో పాటు ప్రసాదం న్యాప్ కిన్ కి చుట్టిన పాప ఫలితమూ.. అది కాస్తా బెడిసి కొట్టి స్వామివారు నాతో పెట్టుకుంటే పంగనామాలే అన్న కోణంలో.. పదకొండు సీట్లు ఇచ్చారని అంటారు   శ్రీవారి భక్తులు. ఇప్పుడు చూస్తే వినాయక చవితి సందర్భంగా మరోమారు హిందూ భక్తావతారం ఎత్తారు జగన్. ఈ సందర్భంగా స్వామివారిని ఏదో కోరుకుంటున్నట్టు కనిపించింది. ఆ మర్మరింగ్ కి మీనింగేంటా? అదే ఏం కోరుకుని ఉంటారా? అన్నదానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.  అదెలంటిదంటే.. ‘గతంలో వైయస్ కుమారుడిగా ఒకే ఒక్క ఛాన్స్ అన్నాను. జనం ఇచ్చారు. వారిని నిండా ముంచాను. ఇప్పుడు చూస్తే నన్ను కనీసం ప్రతిపక్షానికి కూడా దిక్కులేకుండా చేశారు. ఇప్పుడందరూ నన్ను సాధారణ ఎమ్మెల్యే.. సాధారణ ఎమ్మెల్యే.. అని దెప్పి పొడుస్తున్నారు. నువ్వే ఎలాగోలా, ఏదో ఒకటి చేసి మరో మారు నన్ను ముఖ్యమంత్రి చేయి వినాయకా’ అంటూ ఆయన మొక్కినట్టు.. అందుకు వినాయకుడు కూడా వైల్డ్ గానే రియాక్టయినట్టూ భావిస్తున్నారు. చాలయ్యా జగనూ.. చాలు! జనం సొమ్ము నువ్వు పప్పు బెల్లాల్లా పంచి.. రాష్ట్రాన్ని దివాలా తీయించింది చాలు. ఇకనైనా ఆ అమరావతిని ఎదగనీ. ఆ మాటకొస్తే ముందు నువ్వు నీ వాళ్లు నాలాంటి దేవతలు కొలువైన అమరావతిని వేశ్యల రాజధాని అంటూ దుష్ప్రచారం చేయించింది ఇక చాలు. దేవతలు అని అక్కడ ఉన్నా కూడా.. నువ్వు దాన్ని వేశ్యలంటూ నీ మీడియా ద్వారా చేయించిన రభస కైలాసం వరకూ రాలేదనుకున్నావా? నాకు మా కరస్పాండెంట్ నారదడు చెప్పారు. ఆపై నా మూషికం కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. ఈ సారి భూలోకం వెళ్లినపుడు మీరు జగన్ కి అట్టే వరాలు ఇవ్వకండి స్వామి.. అతడేం మీ భక్తుడు కాడు. అంతా నాటకం.. హిందూ ఓటర్లను బుట్టలో పడేసే యత్నం. పూజారులు ఏదైనా ప్రసాదం ఇచ్చినా జగన్ ఉండచుట్టి పక్కన పడేస్తారు. ఎందుకంటే ఎవరైతే హిందూ దేవతల ప్రసాదం తింటారో వారు ఆయా దేవుళ్ల భక్తులవుతారన్న నమ్మకాలున్నాయ్. వాటి ప్రకారం వారెట్టి పరిస్థితుల్లోనూ మన ప్రసాదాలను   ముట్టరు. కాబట్టి అట్టే ఆ దొంగ భక్తిని చూసి మురిసిపోకండి స్వామీ అని నాతో చెప్పే పంపింది. మా అమ్మ పార్వతమ్మ కూడా ఇదే చెప్పింది. కారణమేంటంటే.. నేను ఏమీ లేని పిండి బొమ్మ నుంచి నిన్ను పుట్టించాను. అక్కడ బాబు కూడా ఏమీ లేని ఆ ప్రాంతాన్ని సుసంపన్నం చేయడానికి ఒక రాజధాని పుట్టించాలని చూస్తున్నాడు. దాన్ని దేవతల రాజధాని అని కూడా అంటారు. నేను చేసే పిండి బొమ్మను ఎవరైనా ధ్వంసం చేయాలని చూస్తే నాకెలా ఆగ్రహం కలుగుతుందో.. అక్కడి ప్రజలకు కూడా సరిగ్గా అలాగే కోపం వస్తుంది. కాబట్టి దయచేసి నువ్వు నా కుమారుడిగా జగన్ని మాత్రం అస్సలు కనికరించవద్దు. ఎందుకంటే అతడు ఇంకా మారలేదు….ఒక రాజధానిని పట్టుకుని అతడి మనుషులు చేపలు పట్టడానికి కూడా పనికిరాదనడం, పులస చేపలు ఇక్కడ దొరకొచ్చని వెటకారం చేయడం.. అక్కడి జనాల్లో కోపం తెప్పిస్తోంది.. ఎవరైతే జన వాక్యం పట్టకుండా అనుచిత వ్యాఖ్యానాలు వినిపిస్తారో వారిని మనం అస్సలు క్షమించరాదు.. కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్ బేటా! అంటూ మా అమ్మ కూడా చెప్పింది. ఇక మా నాన్న సంగతి సరే సరి. ఆయన మల్లికార్జునుడిగా కొలువైన  శ్రీశైలం వేదికగా అన్యమతస్తులను మీ హయాంలో ఎలా ప్రోత్సహించారో.. ఆయన భక్తుల మనోభావాలకు ఎలాంటి కష్టం కలిగించారో ఒక సారి గుర్తు చేశారు. కాబట్టి నీ కోర్కెలు నేను తీర్చితే- జనం కోర్కెలకు గోరీ కట్టడమేనని ఆ వినాయకుడు కూడా జగన్ కి స్పష్టం చేసినట్టు తెలుస్తోందన్న కామెంట్లు వినవస్తున్నాయ్.

‘మహా’ విషాదం.. ముంబైలో భవనం కూలి 14 మంది మృతి

ముంబై సమీపంలో బహుళ అంతస్తుల నివాస భవనం కుప్పకూలి 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో నాలుగంతస్తుల నివాస భవనం  నాలుగో అంతస్తు వెనుక భాగం మంగళవారం (ఆగస్టు 27) అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది.    ఆ శిథిలాలు పక్కనే ఉన్న   ఇళ్ల సముదాయం మీద పడ్డాయి.  పోలీసులు, వసాయ్ విరార్ మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక సిబ్బంది, రెండు జాతీయ విపత్తు స్పందన దళం బృందాలు యుద్ధ ప్రతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.  ఇప్పటి వరకూ 11 మందిని శిథిలాల నుంచి సురక్షితంగా కాపాడారు. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.   

అన్నా చెళ్లెళ్లు ఒకే బైక్ పై.. బీహార్ లో కాంగ్రెస్ ర్యాలీ

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన  ఓటర్ అధికార్ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.   ముజఫర్‌పూర్‌లో ఆదివారం ఓట్ అధికార యాత్రలో భాగంగా జరిగిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ బైక్ ను స్వయంగా నడిపారు. ఆ బైక్ పై వెనుక ఆయన సోదరి, కాంగ్రెస్ సీనియర్ నేత, వాయనాడు ఎంపీ ప్రింయాంకా గాంధీ కూర్చున్నారు. ఈ   అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే బైక్‌పై ర్యాలీలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ చేపట్టిన ఓట్ అధికర యాత్రకు విశేష స్పందన లభిస్తున్నది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి   65 లక్షల మందికి  పేర్లను ఎన్నికల సంఘం తొలగించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటిమి ఈ ఓట్ అధికార్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న ససారామ్‌లో ప్రారంభమైన ఈ యాత్ర  మొత్తం 1,300 కిలోమీటర్ల మేర సాగి వచ్చేనెల 1న ముగియనుంది.  

ఐక్యతా భావాన్ని పెంచే వినాయకచవితి

విజయవాడలోని సీతార సెంటర్‍లో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకముందు మండపం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి కమిటీ సభ్యులు, నేతలు స్వాగతం పలికారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు..విఘ్ననాయకుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనీ, ఏపీ అభివృద్ధికి ఆటంకం రాకూడదని  ప్రార్థించానని చెప్పారు. వినాయకచవితిని అందరిలో ఐక్యాతా భావాన్ని పెంచే పండుగగా అభివర్ణించిన ఆయన గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామన్నారు.   గణేష్ చతుర్థతి అంటే తనకు నాకు చాలా ఇష్టమని, చిన్నతనం నుంచి ఈ పండుగను బాగా చేసుకునే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో గణేశ్ ఉత్సవాలు చేసుకోవాలంటే అన్నీ విఘ్నాలే. పండుగ చేసుకోవాలన్నా, మైక్ పెట్టాలన్నా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. ప్రతి దానికీ అనుమతులు తీసుకోవాలని ఇబ్బందులు పెట్టారు. కానీ మన ప్రజా ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు లేకుండా గణేశ్ మండపాలను ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వంపై రూ.30 కోట్ల భారం పడుతుంది. అయినప్పటికీ భక్తుల సౌలభ్యం కోసం ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.    సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసి వాడవాడలా బ్రహ్మాండంగా గణేశ్ ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు.   72 అడుగుల అతిపెద్ద మట్టి గణపతిని ఏర్పాటు చేసిన డూండీ సేవా సమితి సభ్యులను మనస్పూర్తిగా అభినందిస్తున్నాననీ,  విగ్రహం ఏర్పాటు చేసిన చోటే నిమజ్జన ఏర్పాట్లు చేయడం చాలామంచి కార్యక్రమమనీ  ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

ఆ జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం...రేపు విద్యా సంస్థలకు సెలవు

  తెలంగాణలో రికార్డు స్ధాయి అత్యధిక వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో అత్యధికంగా 50 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అటు మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్ధాయి వర్షపాతం మొదలైంది. కామారెడ్డి, మెదక్ జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో పశువుల పాకలు సైతం నీట మునిగాయి. పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు వరదల్లో చిక్కుకుపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.  మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలంలో ఉన్న ధూప్‌సింగ్ తండాను వరద నీరు ముంచెత్తింది. వరద నీరు ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రజలు ఇండ్లు పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. తమను కాపాడాలంటూ ప్రజలు ఆర్తనాదాలు పెట్టారు. మెదక్ జిల్లాలో రెప్పల ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఒకవైపు పోలీసులు ఫైట్ డిపార్ట్మెంట్ అధికారులు ఎస్కే చేసి బోట్లు ద్వారా ప్రజలను రక్షిస్తూ ఉండగా... మరోవైపు ఇండ్ల పైకి ఎక్కిన ప్రజలు హెలికాప్టర్ సహాయం కోసం ఎదురుచూశారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాదపు అంచున కొట్టుమిట్టాడుతోంది. వరద ఉధృతి భారీగా పెరగడంతో అలుగు పది అడుగుల తీవ్రతతో కిందికి దుంకుతున్నది. అయినప్పటికీ వరద నియంత్రణ కాకపోగా ప్రవాహం మట్టి కట్టను ఢీకొని పొంగిపొర్లుతోంది.  తద్వారా భారీ బుంగ ఏర్పడే ప్రమాదం నెలకొంది. అదే జరిగితే పోచారం ప్రాజెక్టు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి.భారీ వర్షాలు నేపథ్యంలో కామారెడ్డి, మెదక్‌ జిల్లాలో రేపుగురువారం)విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాల కలెక్టర్లు ఒక ప్రకటనలో తెలిపారు.

శేషాచల అడవుల్లో పెద్దపులి సంచారం

  ఎప్పుడూ కనిపించని ఉమ్మడి కడప జిల్లాలోని చిట్వేలి  ప్రాంతంలో గల శేషాచల అడవుల్లో పెద్ద పులి కనిపించింది .తిరుమల అడవులతో కలిసి ఉన్న శేషాచలం అడవుల్లో పెద్దపులి సంచారాన్ని అటవీ అధికారులు గుర్తించారు. అటవీ అధికారులు అమర్చిన  కెమెరాల్లో పులుల  సంచార దృశ్యాలు కనిపించినట్లు సమాచారం. చిట్వేలు రేంజ్ అధికారులు ఆ రేంజ్ పరిధిలో 30 ట్రాప్ కెమెరాలు ఇటీవల ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా పెద్దపులి రాత్రి సమయంలోనే కాకుండా పగటి కూడా తిరుగుతున్నట్టు కనిపించట్లు గుర్తించారు .రెండు నుంచి మూడు పులులు ఈ అడవుల్లో తిరుగుతున్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు.  ఈ పెద్ద పులులు కర్నూలు జిల్లా గుండ్లబ్రహ్మేశ్వరం  శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు నుంచి నల్లమల శేషాచలం కారిడార్ ద్వారా చిత్తూరు ప్రాంతానికి చేరుకుని ఉంటాయని భావిస్తున్నారు.గతంలో లంకమల పరిసర ప్రాంతాల్లో పులి కనిపించిన ప్రచారం జరిగింది . నల్లమల ,లంకమల,శేషాచలం అడవులను కలుపుతూ టైగర్ జోన్ ను కూడా గతంలో ఏర్పాటు చేశారు . ఈ పరిస్థితుల్లో నలమలశేశాచలం అటవీ కారిడార్ లో పులి ప్రత్యక్షం కావడం చూస్తే ఇక నలమల, లంకమల  శేషాచలం అడవుల్లో కూడా పులుల సంచారం పెరిగే  అవకాశాలు ఉన్నాయి.

భారీగా ఎర్రచందనం స్వాధీనం...నలుగురు స్మగ్లర్లు అరెస్ట్

  ఉమ్మడి కడప జిల్లాలో ఎర్రచందనం తరలిపోతూనే ఉంది .టాస్క్ ఫోర్స్ పోలీసులు  దాడులు చేసి పలు చోట్ల ఎర్రచందనం స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు‌. స్మగ్లర్ లను అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా స్మగ్లర్లు ఏదో ఒకచోట స్మగ్లింగ్ కు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మైదుకూరు మండలంలో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు స్వాధీనం పోలీసు స్వాధీనం చేసుకున్నారు .ఇందుకు  సంబంధించిన వివరాలను మైదుకూరు డీఎస్పి రాజేంద్రప్రసాద్ విలేకరులకు వివరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 ఎర్రచందనం దుంగలు ,గొడ్డలి రాళ్లు స్వాధీనం చేసుకున్న టాగ్లు తెలిపారు. దుంగలను స్వాధీనం చేసుకుని స్మగ్లర్లను అదుపులోకి తీసుకునే క్రమంలో వారు పోలీసులపై రాళ్లు, గొడ్డలితో దాడికి దిగినట్లు తెలిపారు. స్మగ్లర్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. స్మగ్లర్లను అరెస్ట్ చేసి దుంగలు స్వాధీనం చేసుకోవడంలో విజవంతంగా విధులు నిర్వహించిన మైదుకూరు రూరల్ సిఐ శివశంకర్, దువ్వూరు ఎస్సై వినోద్ కుమార్ సిబ్బందిని డి.ఎస్.పి రాజేంద్రప్రసాద్ అభినందించారు.