కోటని తవ్వి ఎముకలు పట్టారు!

      ఉత్తరప్రదేశ్‌లోని రాంబకష్ సింగ్ కోటలో గత ఐదు రోజులుగా పురావస్తు శాఖ అధికారుల పరిస్థితి కోటని తవ్వి ఎముకల్ని పట్టినట్టయింది. కోట భూమిలో టన్నులకొద్దీ బంగారం ఉందని శోభన్ సర్కార్ అనే స్వామీజీ చెప్పిన మాటలు నమ్మి తవ్వకాలు మొదలుపెట్టిన పురావస్తు శాఖ అధికారులు శుక్రవారం తవ్వకాల్లో ఒక వంటగది, పొయ్యి, కొన్ని ఎముకలు బయటపడటంతో నోళ్ళు తెరిచారు. స్వామీజీ మాటలు నమ్మి కోటని తవ్విపోస్తున్నారేంటని హేతువాదులు విమర్శిస్తే, స్వామీజీ చెప్పారని కాదు.. అక్కడి భూమిలో నిధులున్నాయని తమ పరిశోధనల్లో బయటపడిందని అధికారులు మొదట్లో చెప్పారు. తాజాగా బుధవారం కొత్త స్టోరీ వినిపించారు. కోటలో తవ్వకాలు జరుపుతోంది నిధుల కోసం కాదట.. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో ఉపయోగించిన ఆయుధాల కోసమట. దేశంలోని ఏ  పురావస్తు పరిశోధనశాలలోనూ సిపాయిల తిరుగుబాటు కాలం నాటి ఆయుధాలు లేవట. ఆ లోటుని భర్తీ చేయడానికే ఈ తవ్వకాలు చేపట్టారట. వీళ్ళ తవ్వకాల్లో ఆయుధాలు దొరికితే  వాటిని ప్రదర్శనలో పెడతారట. వీళ్ళ మాటలు వింటుంటే జనం చెవిలో పూలు పెట్టడంలో పురావస్తు శాఖ అధికారులు శోభన్ సర్కార్ స్వామీజీని మించిపోయారని అనిపించడం లేదూ?!  అన్నట్టు ఇంత జరగడానికీ కారణమైన స్వామీజా శోభన్ సర్కార్‌తోపాటు ఆయన శిష్యుడి మీద కేసు నమోదైంది.

థాంక్యూ కేటీఆర్!

      తెరాస నాయకులు కేటీఆర్‌ గారికి సీమాంధ్ర ప్రజల మీద ప్రేమ పొంగి పొర్లుతోంది. అసలే వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైపోతున్న సీమాంధ్ర ప్రజలు ఘనత వహించిన కేటీఆర్ గారు తమ మీద కురిపిస్తున్న అపారమైన ప్రేమ ధాటికి మరింత ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. సీమాంధ్ర వాళ్ళని దొంగలు, దోపిడీదారులుగా, హైదరాబాద్ నుంచి తరిమికొట్టాల్సిన వాళ్ళుగా భావించే కేటీఆర్, సడన్‌గా సీమాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద తన సానుభూతిని వ్యక్తం చేశారు.     అదెలాగంటే, వై.ఎస్.జగన్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న సమైక్య సభని తిట్టిపోయడానికి కేటీఆర్ ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. జగన్‌ని నోరారా తిట్టిన అనంతరం ‘‘ఒకవైపు సీమాంధ్ర ప్రజలు వర్షాలతో, వరదలతో బాధలు పడుతుంటే,  ఆ విషయాన్ని పట్టించుకోకుండా హైదరాబాద్‌లో సమైక్య సభ ఎందుకు పెడుతున్నావ్?’’ అని లా పాయింట్ లాగారు. కేటీఆర్ ప్రశ్నని జగన్ పట్టించుకున్నారో లేదో గానీ, కరడుగట్టిన విభజనవాది నోటి వెంట తమ మీద సానుభూతి వాక్యాలు రావడం విని సీమాంధ్ర ప్రజలు పులకరించిపోతున్నారు. ఇది కలా నిజమా అని తమని తాము గిల్లుకుంటున్నారు. సీమాంధ్రుల బాధల్ని తలచుకుని బాధపడిపోతున్న కేటీఆర్‌కి మనసులోనే థ్యాంక్స్ చెబుతున్నారు. ఏపీఎన్జీవోలు సమ్మె చేసినప్పడు కూడా ఉద్యోగుల సమ్మె వల్ల సీమాంధ్ర ప్రజలు బాధలు పడుతున్నారని, అంచేత వెంటనే సమ్మె విరమించుకోవాలని టీఆర్ఎస్ నాయకులు టెన్షన్ పడిపోయారు. సీమాంధ్ర ప్రజల మీద టీఆర్‌ఎస్ నాయకులకు ఎంత ప్రేమ.. ఎంత ప్రేమ!!

మాయల మరాఠీ పాలిటిక్స్!

      మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రైతుల ఉసురు పోసుకుంటోంది. కీలక సందర్భాల్లో ప్రాజెక్ట్ గేట్లు మూసేస్తూ తెలంగాణ రైతు కంట కన్నీరు వచ్చేలా చేస్తోంది. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశాధినేత చంద్రబాబునాయుడు గతంలో భారీ ఉద్యమం నడిపారు. మహారాష్ట్ర సరిహద్దులకు వెళ్ళి ప్రాణాలకు తెగించి మరీ ఉద్యమించారు. చంద్రబాబు మీద ఆ కృతజ్ఞత తెలంగాణ రైతుల్లో వుంది.   త్వరలో మళ్ళీ తెలంగాణ రైతులకు బాబ్లీ ప్రాజెక్ట్ ద్వారా కష్టాలు రాబోతున్నాయి. ఈనెల 29న బాబ్లీ గేట్లను తానే స్వయంగా మూసివేస్తానని, తెలంగాణా రైతులు అడ్డుకున్నా ఆగేది లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ ప్రకటించారు. ఈ అజిత్ పవార్ ఎవరో కాదు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మరాఠా యోధుడు శరద్ పవార్‌కి స్వయానా సోదరుడి కొడుకు. ఒకపక్క ఎన్.సి.పి. నేత శరద్ పవర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వుంటారు. మరోపక్క ఆయన సోదరుడి కొడుకు, ఆయన పార్టీకే చెందిన అజిత్ పవార్ తెలంగాణ రైతుల కంట కన్నీరు తెప్పించడానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఈ ద్వంద్వ వైఖరిని ఏమని పిలవాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటూ శరద్ పవార్ కపటప్రేమ చూపిస్తున్నారని అనుకోవాలా? మాయల మరాఠీ పాలిటిక్స్ ఇలాగే వుంటాయనుకుని ఊరుకోవాలా? ఈసారి బాబ్లీ కష్టాల నుంచి తెలంగాణ రైతులను ఘనత వహించిన విభజనవాదులు ఎలా కాపాడతారో వేచిచూడాలి.  

దరిద్రులం.. క్షమించు మహాత్మా!

      భారత జాతిపిత మహాత్మాగాంధీ బ్రిటీష్ వాళ్ళని ఇండియా నుంచి తరిమేశారు. బ్రిటీషోళ్ళు మహాత్ముడికి చెందిన వస్తువులని వేలంలో పెట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ రకంగా మహాత్ముడి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు. భారత ప్రభుత్వం మాత్రం మహాత్ముడి వస్తువులను వేలంపాటల చెర నుంచి తప్పించలేనంత దరిద్రంలో కొట్టుమిట్టాడుతోంది.   గతంలో మహాత్ముడికి సంబంధించిన లేఖలు వేలానికి వచ్చాయి. ఎవరెవరో ఫారినోళ్ళు వాటిని వేలం పాటలో పాడుకుని వాటిని వ్యాపార వస్తువులుగా మార్చేశారు. భారత జాతి సంపదగా చెప్పుకోదగ్గ  ఆ లేఖలను ఇండియాకి తిరిగి తెప్పించడానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మరోసారి గాంధీజీ ఉపయోగించిన వస్తువులు లండన్‌లో వేలానికి పెట్టారు. నవంబర్ 5న ఈ వేలం జరగనుంది. ఎరవాడ జైలులో వున్న సమయంలో గాంధీజీ నూలు వడకడానికి ఉపయోగించిన చరఖాతోపాటు, గాంధీజీ ఉపయోగించిన మొత్తం 60 వస్తువులు ఈసారి వేలానికి పెట్టారు. గాంధీజీ చరఖా దాదాపు 60 లక్షలకు అమ్ముడయ్యే అవకాశం వుందని వేలం నిర్వాహకులు భావిస్తున్నారు. ఈసారి వేలం వేసే వాటిలో గాంధీజికి సంబంధించిన ముఖ్యమైన నివేదికలు, పుస్తకాలు, ఫొటోలు కూడా ఉంటాయట. ఈసారి కూడా ప్రభుత్వం గాంధీజీకి సంబంధించిన ఈ వస్తువులను అవసరమైనంత డబ్బు ఖర్చుపెట్టి ఇండియాకి తెప్పిస్తుందన్న ఆశ కలగటం లేదు. తరతరాలుగా భారతీయులు అబ్బురంగా చూడాల్సిన గాంధీజీ జ్ఞాపక చిహ్నాలు ఇలా అంగడి వస్తువులుగా మారిపోవడం బాధాకరం. అందుకే... మహాత్ముడి జ్ఞాపకాల స్వాధీనం కోసం డబ్బు ఖర్చు పెట్టలేనంత దరిద్రంలో వున్న భారత ప్రభుత్వం తరఫున మహాత్ముడికి క్షమాపణలు!

దిగ్విజయ్ ఇంటికి గవర్నర్ వెళ్ళొచ్చా?

      రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి వివరించడానికి ఢిల్లీకి వెళ్ళిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, యుపీఎ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు పలువురు కేంద్రమంత్రుల్ని, కీలక అధికారులను కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులను పూస గుచ్చినట్టు వివరించారు. అంతవరకూ ఓకే. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ని ఆయన ఇంటికి వెళ్ళి మరీ నరసింహన్ కలవటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశమైంది.   దిగ్విజయ్‌సింగ్ ఇంటికి వెళ్ళిన సమయంలో గవర్నర్ చేతిలో అధికారిక అంశాలకు చెందిన ఫైల్ కూడా ఉందని తెలుస్తోంది. గవర్నర్ హోదాలో వున్న వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిని ఇంటికి వెళ్ళి కలవటం, అది కూడా అధికార పర్యటనలో ఉన్నప్పడు కలవటం ఎంతవరకు సమంజసమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దిగ్విజయ్‌సింగ్‌ని నరసింహన్ కలవటం పలు ఊహాగానాలకు కూడా తావిచ్చేలా వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో వున్న గవర్నర్ విమర్శలు తలెత్తే విధంగా వ్యవహరించడం కూడా మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే విభజన సమస్య అత్యంత సున్నితంగా మారిన పరిస్థితుల్లో గవర్నర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది. ఏ ప్రాంతం వారిలోనూ ఎలాంటి అపోహలు, అనుమానాలు కలగకుండా వ్యవహరించాల్సి వుంటుంది. అన్నీ తెలిసిన వారు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తారు. ఇది కూడా అలాంటిదేనేమో!

ఇతనా ప్రధాని అవ్వాలనుకునేది?

      అమ్మ సోనియమ్మ కలలన్నీ ఫలించి, చేయాలనుకున్న అడ్డగోలు విభజన వర్కవుటై, ఈదేశాన్ని ఏ రాహు గ్రహమో వక్రంగా చూస్తే రాహుల్‌గాంధీ భారత ప్రధాని అయిపోవడం ఖాయం. జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, గుల్జారీలాల్ నందా, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి లాంటి మహామహులు అధిష్టించిన భారత ప్రధాని కుర్చీమీద రాహుల్ గాంధీ లాంటి అనుభవశూన్యుడు, వారసత్వం తప్ప మరే సత్వం లేని రాహుల్ గాంధీ కూర్చుంటే ప్రజలు ఆ పదవికి ఉన్న గత వైభవాన్ని తలచుకుని బాధపడటం తప్ప మరేం చేయగలరు?     పైన చెప్పిన మహానుభావులతో పోల్చుకుంటే  ఏ విషయంలో అయినా రాహుల్ గాంధీ సరితూగగలడా? సరి తూగకపోతే పోయాడు అడ్జస్ట్ అయిపోదామనుకుంటే అయ్యగారి బిహేవియర్, మాట్లాడే పద్ధతి ఏమైనా పద్ధతిగా ఉంటాయా? ప్రధానమంత్రి పదవికి పోటీపడే వ్యక్తి స్థాయిలో మచ్చుకైనా వుంటాయా? అర్హతని మించిన పదవీకాంక్ష, రాజ్యాంగేతర శక్తిలా ఉండే వ్యవహారశైలి, ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియనితనం.. ఈ లక్షణాల కలబోతగా ఉండే రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా ఊహిస్తేనే ఏదోలా అనిపించదా? రాహుల్ గాంధీ తనను తాను ఒక్కసారి పరిశీలించుకుంటే, తానేంటి.. ఈ దేశానికి ప్రధాని అవ్వాలనుకోవడమేంటని అనిపించదా?

రాహుల్‌ని చంపే పనిలేనోడెవరు?

      పాపం రాహుల్‌గాంధీ తననుతాను ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకునే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టున్నాడు. అలాంటి వ్యాధేదో లేకపోతే తన నాయనమ్మ ఇందిరాగాంధీ, నాన్న రాజీవ్‌గాంధీ తరహాలోనే తనను చంపే కుట్ర జరుగుతోందని కామెడీ స్టేట్‌మెంట్ ఇవ్వడు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్యల వెనుక చాలా హిస్టరీ వుంది. బలమైన కారణాలు, తీవ్రమైన ఉద్యమాలు ఉన్నాయి. మరి రాహుల్‌గాంధీ వెనుక ఏ హిస్టరీ వుంది? రాజీవ్, సోనియాగాంధీల కొడుకుగా పుట్టడం తప్ప రాహుల్ గాంధీకి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన ప్రాణాలకు తెగించి డీల్ చేసిన ఇష్యూలేంటి? ఎవరో కక్షకట్టి చంపాల్సినంత తీవ్రమైన సమస్యల్ని వేటిని రాహుల్ డీల్ చేశాడు? చంపాల్సినంత సీన్ లేని రాహుల్‌గాంధీని చంపడానికి ప్రయత్నించే పనిలేనోడు ఎవడుంటాడు? తన ప్రవర్తనతో రాహుల్ గాంధీ దేశంలో జనాన్ని చచ్చేలా నవ్వేలా చేస్తున్నాడు. ఇలాంటి కామెడీ కేరెక్టర్ రాహుల్ గాంధీని ఎవరైనా చంపుతారా? ఇండియాలో ప్రస్తుతానికి రాహుల్‌గాంధీని చంపాల్సిన అవసరం ఎవరికీ కనిపించడం లేదు. ఒకవేళ ఎక్కడో స్పెయిన్లో వున్న రాహుల్‌గాంధీ లవర్ వెరోనికా తాలూకు వాళ్ళెవరికైనా ఆ అవసరం ఉందేమో రాహులే ఆలోచించుకోవాలి. నాయనా రాహుల్ గాంధీ భారతీయులెవరూ నిన్ను చంపే అవకాశం లేదు. కాబట్టి ప్రశాంతంగా నిద్రపో. నోటికొచ్చిన స్టేట్‌మెంట్లు ఇవ్వకుండా దేశాన్ని ప్రశాంతంగా వుంచు.

పళ్ళూడిపోయాకే పాలిటిక్సా?

      మెగా బ్రదర్స్ పవన్‌కళ్యాణ్, నాగబాబు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు పుకార్లు రావడం, ఎలక్ట్రానిక్ మీడియా ఆ పుకార్లని పెంచి పోషించి వీళ్ళు పోటీ చేయబోయే నియోజకవర్గాలను కూడా డిసైడ్ చేయడం, చివరకు తాము తెలుగుదేశంలో చేరబోవడం లేదని నాగబాబు లేఖ రాయడంతో ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడిన విషయం తెలిసిందే. కాకపోతే టోటల్‌గా ఈ ఇష్యూలో బోలెడన్ని ధర్మసందేహాలు కలుగుతూ వున్నాయి.     ‘అత్తారింటికి దారేది’ సినిమాకి మైలేజ్ పెంచుకోవడానికే పవన్‌కళ్యాణ్ వర్గీయులే ఈ పుకార్లని షికార్లు చేయించారనేది ఒక డౌటు. సరే, ఆ డౌట్ సంగతి అలా ఉంచితే, పవన్‌కళ్యాణ్ ఏదైనా పార్టీలో చేరితో ఆ పార్టీకి లాభమో, నష్టమో జరుగుతుంది. అంతవరకు ఓకే. మధ్యలో ఈ నాగబాబు ఎవరంట? ఆయన రాజకీయాల్లోకి వచ్చినా, ఏ పార్టీలో చేరినా ఎవరికైనా ఒరిగేదేముందంట? రాజకీయ రంగంలో ఆయన్ని పట్టించుకునేదెవరంట? తాచుపాము బుసకొడితే దాన్నిచూసి వానపాము కూడా బుసకొట్టినట్టు నాగబాబు కూడా తన తమ్ముడితోపాటు తనకి కూడా పొలిటికల్ ప్రాధాన్యం ఆపాదించుకోవడమెందుకో?! పుకార్లన్నీ మెయిన్‌గా పవన్‌కళ్యాణ్‌ మీద వచ్చాయి. అలాంటప్పుడు తెలుగుదేశంలో చేరట్లేదు మొర్రో అని పవన్‌కళ్యాణ్ స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోయేది కదా..  ఇద్దరి తరఫున నాగబాబు ఇవ్వడమేంటి? పవన్‌కళ్యాణ్ తనమీద వస్తున్న పుకార్లని కూడా ఖండించలేనంత బిజీనా? రేపెప్పుడైనా పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయిపోతే ఆయన వ్యవహారాలన్నీ నాగబాబే చూసుకుంటారా?  నాగబాబు మీడియాకి విడుదల చేసిన లేఖలో మరో కామెడీ కూడా వుంది. ప్రస్తుతం అన్నదమ్ములిద్దరూ తమ వృత్తిలో బిజీగా వున్నారన్న మాటని నాగబాబు ఉపయోగించాడు. అంటే అర్థం ఏమిటి? వృత్తిలో బిజీ అంతా అయిపోయాక, చేతిలో పనేమీ లేనప్పుడు, పళ్ళూడిపోయాక రాజకీయాల్లోకి వస్తామనా? రాజకీయాలంటే, పార్టీలంటే పనిలేనివాళ్ళ పునరావాస కేంద్రాలా? ఇలాంటి సవాలక్ష ధర్మ సందేహాలకు సమాధానాలు ఇచ్చేదెవరు?

అరుణమ్మ ప్లాను అదిరింది!

      2014లో వచ్చే ఎన్నికలలో రాహుల్‌గాంధీ చేత మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర మంత్రిణి, తెలంగాణ ఆడపడుచు డి.కె.అరుణ కంకణం కట్టుకుంది. దీనికోసం ఈమధ్య అరుణమ్మ గారు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కి వినతిపత్రం సమర్పించింది. అక్కడితో ఆగకుండా మరింత అడ్వాన్సయి రాహుల్‌బాబుని కలిసి మహబూబ్‌నగర్‌లో పోటీ చేసి తెలంగాణని ఉద్ధరించాలని వేడుకున్నట్టు తెలుస్తోంది.   తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేస్తున్నట్టు ప్రకటించడంతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీమీద, సోనియాగాంధీ మీద ప్రేమ తెగ కారిపోతోందట. పాలమూరులో రాహుల్‌గాంధీ పోటీ చేస్తే ఓటర్లు ఎగబడి ఓట్లు వేస్తారట. భారీ మెజారిటీ ఇచ్చేస్తారట. ఇదీ అరుణమ్మగారు చెబుతున్న వెర్షన్. అరుణమ్మ గారు ఆహ్వానించగానే రాహుల్‌గాంధీ తన కుటుంబ నియోజకవర్గమైన అమేథీని వదిలిపెట్టి మహబూబ్‌నగర్ వస్తాడా? పొరపాటుగా కూడా రాడు. రాహుల్‌గాంధీ మరీ అంత బుర్రలో బురదున్నోడు కాడు. ఈ  విషయం డి.కె.అరుణకి కూడా తెలిసే ఉంటుంది. తెలిసినా రాహుల్‌గాంధీని పాలమూరుకి ఆహ్వానించడం వెనుక పెద్దప్లానే వుందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితో ముఖ్యమంత్రి అయిపోవాలని కోరుకుంటున్న వారి క్యూలో డీకే అరుణమ్మ కూడా వుంది. క్యూలో తన ముందు వున్న అందరినీ దాటుకుని వెళ్ళి తెలంగాణ సీఎం పీఠం ఎక్కాలంటే రాహుల్‌గాంధీ మీద తనకున్న విధేయతను ప్రకటించి ఆయనగారి దృష్టిలో పడాలి. అందులో భాగమే రాహుల్‌గాంధీకి అరుణగారి ఆహ్వాన పత్రమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ సీఎం కావడానికి వాళ్ళనీ వీళ్ళనీ కాకాపట్టడం కాకుండా కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు డైరెక్టుగా రాహుల్‌గాంధీనే టార్గెట్ చేసి అరుణమ్మ భలే ప్లాన్ వేసిందని అంటున్నారు.

అమ్మో సోనియమ్మ-కిరణేమో కీలుబొమ్మ

      రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్నందుకు సోనియాగాంధీ పేరు చెబితేనే కంపరం పుట్టుకొస్తున్నా, ఆమె రాజకీయ చతురతకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేమని కొంతమంది సమైక్యవాదులు అంటున్నారు. ఇందిరాగాంధీతో సహా నెహ్రూ కుటుంబంలో ఎవరికీ లేని కొంపలు ముంచే రాజకీయ తెలివితేటలు సోనియాగాంధీకి మాత్రమే ఎలా ఒంటబట్టాయా అని అనుకుంటున్నారు. రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఎన్నో సందర్భాలలో సోనియా గాంధీ తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించింది. ఎప్పటి విషయాలో, ఎక్కడి విషయాలో ఎందుకు? రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టిన విభజన చిచ్చునే చూడండి.   మహాతల్లి ఎంత చక్కగా అంటించిందో!  అత్త ఇందిరాగాంధీ కూడా చేతులెత్తేసిన తెలంగాణ ఇష్యూని పెంచి, పోషించించి. చివరకి ఆ సమస్యని తన పుత్రరత్నం ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడేలా చేసుకుంది. ఈ రేంజ్ రాజకీయాలు ప్రదర్శిస్తున్న ఇటాలియన్ సోనియాగాంధీని చూసి మనదేశ రాజకీయ నాయకులు పాఠాలు నేర్చుకోవాలి. తెలంగాణకి సోనియాగాంధీ ఓకే అంది కాబట్టి వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్, అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌కే మెజారిటీ వస్తుంది. సీమాంధ్రలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మటాషేనని అమాయక ఇండియన్లు మొదట్లో అనుకున్నారు. ఆ తర్వాత సోనియమ్మ తన ఇటలీ పాలిటిక్స్ బయటపెట్టింది. జైల్లోనే శేషజీవితం గడిపేస్తాడేమోనని అందరూ అనుకున్న జగన్‌ని బయటకి తీసుకొచ్చింది. సమన్యాయం జగన్ని సమైక్యవాదం వైపు మళ్ళించి సీమాంధ్రలో జగన్నాటకానికి తెరతీసింది. దాంతో సీమాంధ్రలో జగన్‌కి వచ్చే ఓటు బ్యాంకుని, సీటు బ్యాంకుని తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేసింది. ఒకవేళ ఫ్యూచర్లో జగన్ తోకజాడిస్తే ఎలా అనుకుంది. సేఫ్ గేమ్ మొదలెట్టి సీఎం కిరణ్‌ని సమైక్యవాదిగా రంగంలోకి దించింది. సీఎం కిరణ్ సోనియమ్మ చెప్పినప్పుడల్లా సమైక్యవాదాన్ని వినిపిస్తూ సీమాంధ్ర ప్రజలకు చేరువైపోతున్నాడు. రేపోమాపో సీమాంధ్రలో పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ కొత్తపార్టీ స్కీమ్ కూడా సోనియాగాంధీదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మలా మారిన కిరణ్‌కుమార్‌రెడ్డిని చూసి జాలిపడుతున్నారు. మొత్తమ్మీద రాజకీయ కీకారణ్యంలో సోనియాగాంధీ పెద్ద హంటర్.  ఒకే దెబ్బకు మూడు పిట్టల్ని కొట్టేసింది. అటు తెలంగాణలో పెద్దపిట్ట కేసీఆర్‌ని గ్రిప్‌లో వున్నాడు. ఇక సీమాంధ్రలో పోటీపడే కిరణ్, జగన్ ఇద్దరూ కాంగ్రెస్ గూటి పిట్టలే. వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగే పక్షంలో రెండు రాష్ట్రాల్లోనూ తనదే హవా.. ఇదీ సోనియమ్మ వేసిన ప్లాన్. అంతా బాగానే వుందిగానీ, సోనియాగాంధీ అసలు స్వరూపాన్ని తెలుగు ప్రజలు కనిపెట్టేశారు. ఇక తెలుగోళ్ళ దగ్గర సోనియాగాంధీ తప్పులు ఉడకవ్!

రాకోయీ... అనుకున్న అతిథీ!!

      ఏదైనా సంస్థ నిర్వహించే కార్యక్రమానికి ఆ రాష్ట్ర గవర్నర్ వస్తే ఆ సంస్థకి ఎంత గౌరవం? అయితే రాష్ట్ర గవర్నర్ వస్తానన్నా రావొద్దనే సంస్థ ఉంటుందా? ఉంటుంది.. గవర్నర్ని రావొద్దన్న ఆ సంస్థ పేరు డెలోయిట్. రాకోయీ... అనుకున్న అతిథీ అనిపించుకున్న ఆ గవర్నర్ మరెవరో కాదు.. మన రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్.   అసలింతకీ జరిగిందేంటంటే, మల్టీనేషన్ కంపెనీ డెలోయిట్ హైదరాబాద్‌లోని మైండ్‌స్పేస్‌లో తమ సంస్థకి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ప్రతినిధులు రాజ్‌భవన్‌కి వెళ్ళ గవర్నర్ని తమ కార్యక్రమానికి ఆహ్వానించారు. నరసింహన్ గారు పెద్దమనసు చేసుకుని సరే వస్తానన్నారు. డెలోయిట్ సంస్థ ప్రతినిథులు సంతోషంగా వెళ్ళిపోయారు. యథాప్రకారం గవర్నర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారని ఇన్విటేషన్లలో కూడా వేసేశారు. ఆ తర్వాత షరామామూలుగానే రాజ్‌భవన్ అధికారులు గవర్నర్ గారు పాల్గొనే ఫంక్షన్లో  ఏమేం జరగాలో, ఏమేం జరక్కూడదో తెలిపే ప్రొటోకాల్ షీట్ డెలోయిట్ ప్రతినిధులకు ఇచ్చారు.  గవర్నర్ పాల్గొనే కార్యక్రమంలో రెండుసార్లు జాతీయ గీతాన్ని వినిపించడం అనేది ప్రొటోకాల్. గవర్నర్ గారు సదరు కార్యక్రమంలో 45 నిమిషాలు మాత్రమే  ఉంటారని, గవర్నర్ గారు వచ్చేసరికి అప్పుడు జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఆపేయాలని, ఆయన రాగానే ఒకసారి, వెళ్ళబోయేముందు ఒకసారి.. మొత్తం రెండుసార్లు జాతీయ గీతాన్ని వినిపించాలని ప్రొటోకాల్ అధికారులు చెప్పారు. అయితే తమ కార్యక్రమంలో జాతీయగీతాన్ని ఒకసారి మాత్రమే వినిపిస్తామని, రెండోసారి మాత్రం తమవల్ల కాదని డెలోయిట్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చే తమ గెస్ట్‌లకి ఈ తతంగమంతా ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని అన్నారు. అయితే గవర్నర్ ప్రొటోకాల్ అధికారులు మాత్రం జాతీయ గీతాన్ని రెండుసార్లు వినిపించాల్సిందేనని పట్టుపట్టారు. దాంతో మా సంస్థ కార్యక్రమాన్ని గవర్నర్ గారు లేకుండానే జరుపుకుంటామని, గవర్నర్ గారు రావాల్సిన అవసరం లేదని డెలోయిట్ ప్రతినిధులు చెప్పేశారు. అలాగే జరిపేశారు. ఈ ధోరణి చూసి రాజ్‌భవన్ అధికారులు అవాక్కయిపోయారు. అయినా గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని.. విదేశీ సంస్థలకి మన జాతీయగీతం విలువ, గవర్నర్ పదవికి వున్న గౌరవం ఏం తెలుస్తుందనీ?! అసలు రహస్యం ఏమిటంటే,  డెలోయిట్ సంస్థ బ్రిటీషోళ్ళది. వాళ్ళకి మన జాతీయగీతమంటే సహజంగానే నచ్చదు. అంతేగా?!

హైదరాబాద్ యు.టి. కన్ఫర్మా?

      అడ్డగోలుగా తెలంగాణ ఇచ్చేసి యువరాజు రాహుల్ని దొడ్డిదారిలో అయినా పీఎం చేయాలని ప్లాన్ వేసిన కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున లేచిన నిరసన జ్వాలల ధాటికి డీలాపడినట్టే అనిపిస్తోంది. పైకి విభజన మీద వెనక్కి తగ్గేది లేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, సీమాంధ్రులను మంచి చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే వుంది.   తాజాగా ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల మాటతీరు చూస్తుంటే హైదరాబాద్‌ని శాశ్వత యు.టి. చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తాజాగా హైదరాబాద్‌ని యు.టి. చేయడమే అన్ని సమస్యలకి పరిష్కారం అని  కేంద్రమంత్రి జేడీ శీలం చేసిన వ్యాఖ్యలు ఏవో ఆషామాషీగా చేసినవి కావని అంటున్నారు. జేడీ శీలం నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యక్తికాదు. గతంలో ఉండవల్లి, లగడపాటి లాంటి సీమాంధ్ర  కాంగ్రెస్ నాయకులంతా తెలంగాణ రాదని కుండ బద్దలు కొట్టిన కాలంలో కూడా జేడీ శీలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం ఖాయమని నిర్మొహమాటంగా చెప్పారు.  ఇంకా చాలా సందర్భాలలో  శీలం చెప్పిన మాటలు శీలంతో కూడుకునే వున్నాయి. చాలామంది సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల మాదిరిగా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పే అలవాటు లేని  జేడీ శీలం యు.టి.యే అన్ని సమస్యలకు పరిష్కారం అని అన్నారంటే నిప్పు లేకుండా పొగ రాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఐఎఎస్ ఆఫీసర్ అయిన జేడీ శీలం సోనియాగాంధీకి వీర విధేయుడిగా వుంటూ, కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. అలాంటి వ్యక్తి నోటి వెంట వచ్చిన మాటని ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడినా లైట్‌గా తీసుకునే దిగ్విజయ్‌సింగ్ కూడా జేడీ శీలం నోటివెంట యు.టి. అనే మాట రాగానే ఢిల్లీలో ఉన్నవాడు ఉలిక్కిపడి కవర్ చేయడానికి ఏదేదో మాట్లాడాడు. యు.టి. చేస్తున్నామని నేనెవరితోనూ అనలేదు అన్నాడు. డిగ్గీ అన్నాడని ఎవరన్నారంట? డిగ్గీరాజా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న సామెతని రుజువు చేసేట్టు మాట్లాడాడంటే  హైదరాబాద్‌ని యు.టి. చేయడం ఖాయమనే అనిపిస్తోంది.

కరెక్ట్ మొగుడు అశోక్‌బాబు!

      రాష్ట్రాన్ని విభజించడానికి కారణమైన సీమాంధ్ర, తెలంగాణ రాజకీయ నాయకులకు కరెక్ట్ మొగుడు ఎవరయ్యా అని అడిగితే.. ఇంకెవరయ్యా.. ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబే అనొచ్చు. రెండు నెలలపాటు సక్సెస్‌ఫుల్‌గా సీమాంధ్ర ఉద్యోగుల చేత సమ్మె చేయించి, అటు విభజనవాదులతోపాటు ఇటు గోడమీద పిల్లివాటాన్ని ప్రదర్శిస్తున్న సీమాంధ్ర రాజకీయ నాయకులు ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచేలా చేశారు.   సమ్మెలు, నిరసనలు ఇలా చాలా ప్రశాంతంగా కూడా చేయవచ్చని నిరూపించిన అశోక్‌బాబు అలనాటి సత్యాగ్రహాన్ని గుర్తుకు తెచ్చారు. ఉద్యమం శాంతియుతంగా ఎలా చేయాలో తెలంగాణవాదులు కూడా చూసి నేర్చుకునేలా చేసిన క్రెడిట్ మొత్తం అశోక్‌బాబుది, ఆయన వెనుక ఉన్న ఉద్యోగులదే. ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా ఉద్యమం చేస్తున్నాడన్న అక్కసుతో తెలంగాణవాదులు ఆయన్ని ఉద్దేశించి ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా, మనకి దక్కని క్రెడిట్ అశోక్‌బాబుకి దక్కేస్తోందని కొందరు సీమాంధ్ర నాయకులు ఎంత విషం కక్కినా నిండుకుండలా తొణక్కుండా వున్న  అశోక్‌బాబు అసలు సిసలు స్థితప్రజ్ఞతని ప్రదర్శించారు. ఉద్యోగుల సమ్మె విరమణను కూడా వ్యూహాత్మకంగా చేసిన అశోక్‌బాబుని ఎక్కడ నెగ్గాలో అనేది మాత్రమే కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వ్యక్తి అని అంటున్నారు. ఏది మాట్లాడినా ఆచి, తూచి ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడే అశోక్‌బాబుని చూసి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది చాలా వుందని విశేషకులు అంటున్నారు. ఎవరు తనను రెచ్చగొట్టేట్టు మాట్లాడినా ఎంతమాత్రం రెచ్చిపోకుండా సంస్కారబద్ధమైన లాంగ్వేజ్‌తో వాతలు పెడుతున్న అశోక్‌బాబుకి అటు సీమాంధ్ర ప్రజల్లో మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల్లో కూడా అభిమానులు పెరుగుతున్నారు. ఈ మహానుభావుడు తెలంగాణ ప్రకటించిన తర్వాత కాకుండా కాస్తంత ముందుగా రంగంలోకి దిగి వుంటే విభజన సీను ఇంత దూరం వచ్చేదేకాదు. ఏది ఏమైనా సీమాంధ్రలో మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రంలో అశోక్‌బాబు మీద ప్రజల్లో ఎంతో గౌరవం వుంది. ఈ గౌరవాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద వుంది. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ పంచనో చేరకుండా, ఏ రాజకీయ నాయకుడి మోచేతి నీళ్ళో తాగకుండా ప్రజల పక్షాల నిలబడితే రాష్ట్ర చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

తిరుపతిలో ముస్లిం యూనివర్సిటీ వివాదం

      హిందువులు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించే, కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల పాదాల చెంత వున్న తిరుపతి నగరంలో ఒక ముస్లిం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉండటం వివాదస్పదమైంది. నోహెరా షేక్ అనే ముస్లిం మహిళ తిరుపతిలో ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనన్నానని, ఇస్లామిక్ తత్త్వాన్ని ప్రచారం చేయడమే తమ యూనివర్సిటీ ప్రధానోద్దేశమని ప్రకటించడంతో వివాదం మొదలైంది.   నోహెరా షేక్ తిరుపతిలో ఎంతోకాలంగా మదర్సా నిస్వాన్ పేరుతో ఆడపిల్లలకోసం ఒక మదర్సాని గత కొంతకాలంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె ఏకంగా తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని, అనుమతులు కూడా ఇచ్చేసిందని వార్తలు  రావడంలో తిరుపతిలో హిందూ మత సంస్థలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రంలో ముస్లిం విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వడమేమిటని? అది కూడా ప్రభుత్వం స్థలం ఇవ్వడమేమిటని ఆ సంస్థల ప్రతినిథులు ఆగ్రహిస్తున్నారు. తిరుమలలో, తిరుపతిలో అన్యమత ప్రచారం చేయడం భావ్యం కాదని అంటున్నారు.  అయితే ఈ విషయంలో ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రావడం లేదు. అధికారులు ఎవరికి వారు ఇది తమకు సంబంధించిన విషయం కాదన్నట్టు కిక్కురుమనకుండా ఉండిపోతున్నారు. అయితే స్థానిక ప్రజల్లో ఈ అంశం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హిందూ సంస్థలు మాత్రమే కాకుండా ముస్లింలు కూడా తిరుపతిలో ముస్లిం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదని వ్యతిరేకిస్తున్నారు. తిరుమల-తిరుపతి చరిత్రలో కూడా భాగంగా వున్న హిందూ, ముస్లిం ఐక్యతకు భంగం కలిగించే చర్యలు మంచివి కాదని అంటున్నారు. ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నవారు తమ ప్రయత్నాలు మానుకోవాలని ముస్లింలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. తిరుపతిలో ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని వ్యతిరేకించే ఉద్యమంలో హిందూ సంస్థలకు తమ సహకారాన్ని అందిస్తామని తిరుపతిలో నివసిస్తున్న ముస్లింలు అంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టతని ఇవ్వాల్సిన అవసరం వుంది. లేకపోతే ఏడుకొండలవాడే తన క్షేత్రాన్ని తానే రక్షించుకుంటాడు.

ఇద్దరు లేక ముగ్గురు చాలరు మొర్రో

  సత్తి : ఒరే నాయుడు బావ పెభుత్వమేమో ఒక్కళ్ళు లేక ఇద్దరు సాలని సెపుతుంటే మన అన్నేట్రా అట్టా సెపుతున్నాడు?   నాయుడు : ఏటి అన్న నిన్నేమి గంపెడు పిల్లల్ని కనమని గానీ సెప్పినాడా? ఏటి?   సత్తి : అది కాదహే..ముగ్గురేమో నలుగురవ్వాలి... ఆ నలుగురు రేపు.. ఐదుగురు.. రేపు ఆరుగురు కావాలని అంటే మరర్ధం ఏటి? అదే గదా..   నాయుడు : ఓస్! అదా నీ ధర్మసందేహం..నానేమో ఏరేలా అనుకొన్నాలే..మరేటి నేదురా అన్న ఎక్స్ పార్టీ వోల్లందరినీ సమేకం కోసం తనెనుకే ఫాలో అయిపోమని సెపుతున్నాడన్నమాట. అందరూ తన ఎంటోస్తే సమేకం ఇప్పిచేస్తానని సెపుతున్నాడు.   సత్తి : ఓస్! అదా సంగతి. కానోరే సత్తిగా నాకోటి తెలవక అడుగుతాను. మనం పార్టీ ఎట్టి గట్టిగా మూడేళ్ళు కూడా కానేదు..మరి అన్న పిలిస్తే అందరూ పారెల్లి రాడానికి ఎక్స్ పార్టీ వోల్లెమయినా ఏర్రోళ్ళా..నేక పిచోళ్ళా సెప్పు!   నాయుడు : నిజమేననుకో...గానీ మనమే సమేకం సేత్తున్నామని జనాలు నమ్మాలంటే ఏటో ఒకటి సెప్పాలి గదా ఎర్రి నాయాలా?   సత్తి : సరే! ఆల్లందరూ నిజంగా మనోడెనుక వచ్చీనారనుకో...అప్పుడు మనోడు డిల్లీ ఓల్లతో మాట్లాడి ఒప్పించేయడానికి ఆల్లకి ఈయనేమయిన సుట్టమా..నేకపోతే స్నేహితుడా సెప్పు?   నాయుడు: ఒరేయ్ సత్తిగా! నా సావసంతో కూడా నీకు గ్యానం అబ్బకపోతే, ఇక నీకా దేవుడు కూడా గ్యానం ఇవ్వనేడురొరే... ఆ డిల్లీలో కూకొని కబుర్లు సేపుతాడే ఆడేవడబ్బా... ఆ! దిగ్గీజ సింగ్ అప్పుడెప్పుడో ఓపాలి ఎట్టన్నాడో గుర్తునేదేటి? మన అన్నని నా కొడుకులాంటోడే అని సెప్పాడా నేదా? ఆనక మన నగడపాటి బాబు కూడా ఆ పొద్దెపుడో డిల్లీ పాల్లమెంటు కాడ కూకొని ఏడుస్తూ “ఆ డెవరో దత్త కొడుకుని సూసుకొని మాయంటి సొంత కొడుకుల్నే అన్నేయం సేసీనావే సోనియమ్మా... అని రాగాలు తీసినాడా నేదా? మరిప్పుడు సెప్పు మన అన్న తలుసుకొంటే డిల్లీలో సెక్కరం తిప్పీగలడా నేదా?   సత్తి: నిజమేరో.. నా బల్బెలగనేదు సుమా!   నాయుడు: అదెప్పుడు ఎలగదు కూడా...హ.. హా.. హా..

అన్నసభ పెడితే మ్మమ్మమ్మ...మాస్...

సత్తి: అన్నకి బెయిలొస్తే మాస్..అన్న దీక్షేస్తే మాస్..మ్మమ్మమ్మ...మాస్... అవున్రా…నాయుడో.. అదేదో సమేకమట...దానికోసం రోడ్డు మీద కూకుంటే ఆ తెలంగానోళ్ళు మీదపడి కలబడతారేమోనని, పాపం మన అన్న ఇంటి కాడే సిన్న టెంట్ ఏసుకొని ఐదు రోజులు ముద్ద కూడా ముట్టకుండా పాపం పెనాల మీదకు తెచ్చుకొన్నాడు రా? కానీ, ఆ డిల్లీ వోళ్ళు సమేకం మాత్రం ఇవ్వనేదట్రా... ఆసుపత్రిలో కుదేసి బలవంతంగా సూది మందు ఎక్కించేసి, ఇక ఈ నాటకాలు సాలించి ఇంటికెల్లి బువ్వ తిని తొంగో..అని ఆసుపత్రి నుండి గెంటేసినారట. ఎంతన్నాయం...ఎంతన్నాయం. నాయుడు: ఒరేయ్ సత్తిగా! నాకోటి తెలవక ఆడుతున్నాగానీ, మొన్నటి దాక అన్న జైల్లో సల్లగా కూకోని బిర్యానీలు తినుకొంటూ, కూల్ డ్రింకులు పీల్సుకొంటూ ఊసలు నెక్కెట్టుకొన్నాడా? అప్పుడు పాపం ఆ ఆడకూతురు, ఆల్లమ్మ ఇద్దరూ ఎండనక, వాననక ఆ తెలంగాణంలో పడి తిరిగి తిరిగి “మా అన్నొస్తాడు...నా కొడుకొస్తాడు మిమ్మల్ని ఉద్దరిత్తాడు...”అని అక్కడి జనాల సెవులు సిల్లులు పొడిసినారా? మరేట్రా మనోడిప్పుడు.. ఉన్నపాలిగా ఆళ్ళకి హ్యాండిచ్చేసి మన పక్క జంపయిపోయి... జైలు నుండి రావడం రావడంతోనే సమేకం అని ఓ! ఒకటే... దీచ్చలు, సభలు సేసేతున్నాడు? అసలు ఈన్నిమనం నమ్మోచ్చంటావా?   సత్తి: ఒరే! అన్ననే అనుమానిత్తావురా? కళ్ళు పేలిపోతాయిరా..లెంపలేసుకో..మన అన్నేమి రేతిరికి రేతిరి జంపయిపోనేదురా సచ్చినోడా? అసలు అన్ననోట ఎప్పుడయినా తెలంగాణం ఇస్తామని పలికినట్లు నీకు గురతుందిరా నీకు? అక్కడి జనాలను బాధపెడితే మానకేటోస్తదని ఏదో ‘గవురిస్తాం’ అన్నాడు అంతే. అదట్టుకొని అన్న మడమ తిప్పేసి, తెలంగాణం నుండి జంపయిపోనాడాని నీబోటోళ్ళు కూడా అనేస్తే నాకు మా సెడ్డ బాధగా ఉందిరోరే.   నాయుడు: నిజమేననుకో...కానీ ఆల్లు మనకొద్దని అనేసుకొని ఆడి నుండి సల్లగా బయటడిపోనాక, మళ్ళీ జనాలని పోగేసుకొని, ఆల్లకి టిపినీలు..కాపీలు..బిర్యాని పొట్లాలు ఇచ్చుకొంటూ ఈ సమేకం దీచ్చలు ఎందుకంటా? అదేదో మనకాడే జెండా ఒట్టుకొని తిరిగితే మామేటి ఒద్దన్నమేటి? అన్న దీచ్చకి జనాలు మొకం సూపనేదంటే మనకి ఎంత నామోసీగా ఉంటాదో నీకేరుక నేదేటి? అందుకే నాను బాధ పడుతున్నా..అయినా ఆ ఇంటి గుమ్మo కాడ కూకోని దీచ్చలు సేసే బదులు, అదేదో లంకంత ఇంట్లో ఎంచక్కా ఐసు పెట్టె ఏసుకొని సేసుకోవచ్చు కదా అని నేనడుగుతున్నా?   సత్తి: ఒరేయ్ నాయుడు... నీ కున్నపాటి తెలివి తేటలు మన అన్నకి నేవనుకున్నవురా ఎర్రిమోకమా?   కొంచెం సీకటయ్యాక, రేతిరి పూట ఇంట్లోనే తొంగోనొస్తున్నాడని ఆ పేపరోల్లు రాసింది సదవ నేదురా? తెలివి తక్కువ నాయాలా?   నాయుడు: అవున్రా..గానీ ఏమాటకామాటే సెప్పుకోవాల్రోరేయ్... ఇంట్లో తొంగోనొచ్చినా లోనకెళ్ళి ముద్ద మాత్రం ముట్టనేదురా మన అన్న. అది మాత్రం నేను గేరంటీగా సెప్పగలను...అన్న మాటంటే మాటేరా? గానీ మనకి మడమ తిప్పొదని గట్టిగా సెప్పి ఆయన మాత్రం మాటిమాటికి మడమ తిప్పుతున్నాడేట్రా? దీనినిమాత్రం నువ్వు కాదంటే నాను ఒప్పుకోను..స్మీ!   సత్తి: నాకు తెలీకుండా అన్నమడమ ఎప్పుడు తిప్పినాడురా? తెలంగానోల్లని ‘గవురిస్తాం’ అన్నాడు.ఇప్పుడు అదే మాట మీదున్నాడు. సమేకం అంటే సమేకం కాదు... కావల్నంటే మీ కోసరం కూడా కొట్లాడతా అన్నాడా? అట్టాగే సమేకం కోసమయితే నేటి, మరిదేని కోసరమయితేనేటి గానీ ఉద్దెమాలు సేత్తున్నాడా? “నీ ఊరు కోస్తా.. నీ పేట కోస్తా..నీ... ఈది కోస్తా..నీ ఇంటి కోస్తా... అక్కడే సమేకం సభ ఎడతా..’ అని నందమూరోళ్ళ మాదిరి తొడగొట్టి సభ ఎడుతున్నాడా? లేదా?ఇంకేటి కావల నీకు? నాయుడు: గానీ మనోడు ఎంత దువ్వినా ఆ గవుర్నుమెంటోల్లని మాత్రం మనకేసి లాగనేకపోనాడురా? అప్పటికీ మన అమ్మోగోరు ఆల్లకి పనిసేయకపోయినా జీతాలు, పండుగ డబ్బులు గట్రా ఇత్తానని సెప్పి సూసిందిరా..గానీ అల్లు అమ్మ మాటింటే కదా...అందరూ పొలోమని ఆ ముక్కెమంత్రి ఏమందు సేల్లాడో ఏటో బెల్లం సుట్టూ ఈగల్లాగా ఆయన సుట్టూ ముసురుకొన్నారు తప్ప, ఒక్కడూ మనోడ్ని పట్టించుకొన్నపాపాన్న పోనేదురా.. నాకు మా సెడ్డ బాధగా ఉందిరొరే సత్తిగా...   సత్తి: అదేటి అమ్మగోరు అన్ని లచ్చల మందికి జీతాలు, పండగ డబ్బులు ఇచ్చేస్తే అమ్మగారికిక ఆస్తేటి మిగులుద్ది. ఆనక మన అన్నకు ఆ ఆడకూతురికి ఏటిస్తాదేటి అమ్మ? అయినా అన్ని లచ్చల మందికి పంచేంత డబ్బు డబ్బు అమ్మగారికాడ ఉందంటే నమ్మమంటావారొరే?   నాయుడు: స్సీ..స్సీ... బుద్ది లేనోడా...జీతాలు బత్తేలు ఎవులన్నాజేబులోంచి తీసి ఇస్తారురా? అయినా నిజంగా అమ్మగారు ఇవ్వాలనుకొంటే ఆల్లకి అదొక నెక్కకాదనుకో...గానీ అన్న ముక్కెమంత్రి అయినాక ఇస్తామని సేప్పినారురా ఆమ్మగోరు.   సత్తి: ఆ... ఆలా సెప్పు మరి. అంటే అల్లకి జీతాలు బత్తేలు కావాలంటే ముందు ఆ గవుర్నుమెంటోలందరూ మన అన్నకి ఓటేసి ముక్కేమంత్రిని సేసీయలన్న మాట! ఒరే..అన్న మనమనుకొన్నంత అమాయకుడేమి కాదురోరేయ్..మా సెడ్డ కంత్రీ బుర్రరో మనోడిది...   నాయుడు: సెత్! అట్లా అనమాకురా ఎవులయినా ఇంటే నవ్విపోతారు. అన్న మా సెడ్డ తెలివయినోడనాలి...తప్ప కంత్రీవోడు, ఊసరవెల్లి అనమాకురొరే..అన్నకి తెలిస్తే నీ సెమడా ఒలిపించీ గలడు.            సత్తి: అద్సరే గాన్రోరే నాయుడూ..మనమేమో అన్న జైలు నుండి బయటకోచ్చేస్తే ఇక అంతా మ్మమ్మమ్మ...మాస్...అని ఓ మందు కొట్టి సిందులేసీసామా... కోరుటు అనుమతియ్యాలే కానీ ‘బస్తీ మే సవాల్’ అని తొడగొట్టి అయిదరాబాదులోనే సమేకం సబెట్టుకొంటామని సాలేంజి కూడా సేసేసినామా? తీరాసేసి ఇప్పుడు కోరుటోళ్ళు పర్మిసను కూడా ఇచ్చీనాక జనాలని పోగేసుకోడానికి మాకు టైం సరిపోదు, మాకాడ జనాలు నేరు.. ఆ గవుర్నుమెంటోళ్ళు మోకాలు చాటేసారు...అని సేప్పుకోవడం మా సెడ్డ నామోషీగా ఉందిరొరే... నాయుడు : నిజమే...గానేటి సేత్తాం సెప్పు మనోడికి దూకుడెక్కువ...ఓ పాలి రాజీనామాలు సేసేయండి అంటాడు..మరో పాలి...అందరూ సాటుగా బిర్యానీలు తినుకొంటూ అయినా సరే, అదేటది...సచ్చేదాకా సత్తేగ్రహాలు సేసేయమంటాడు...’గవుర్నరు మనోడే.. నానెల్లి సెపితే ఇనక సస్తాడా?’ అని మనోల్లని ఎంటేసుకొని ఎల్లి ‘ఎంటనే శాసనసభ ఎట్టేస్తే నానే సమేకం తీరుమానం సేసేసి నానే బరబరామని సంతకం గీకేసి ఆ డిల్లీ ఓల్లకి పంపీగలను’ అని ఓ ఒకటే ఊదరగొట్టేసాడు. గానీ ఎవురయినా మనోడి మాట ఇంటే గదా అసలు? మనోడు ఎప్పుడు ఓ ఊరకే రెచ్చిపోయి ఆయాసపడిపోడమే గానీ, పనయినాదేటి ఎప్పుడయినా? అసలు మనోడికి మనమే ఇంకా బాగా ట్రైనింగు ఇచ్చుకోవలేమోరా?          సత్తి: అవున్రా కనీసం ఇప్పుడు ‘సమేకం సభ ఎట్టుకొండిరా...’అని కోరుటోళ్ళు సెప్పినా కూడా సభ ఎట్టుకోలేని  పరిస్థితి చూస్తే, అన్నకెలా ఉందో తెలవదు కానీ, నాకు మాత్రం తల కొట్టేసినట్లుందిరోరే. నానే అన్న కుర్సీలో కూకోని ఉంటే, నాకాడే అన్న లెక్కన డబ్బు మూటలు ఉంటేనా... నేను రేతిరికి రేతిరే మన కూలోల్లని అందరికీ తలో వెయ్యి ముఖాన కొట్టి వెయ్యి లారీలతో అయిదరాబాదులో సభ ఎట్టి మన తడాకా సూపేటోడిని.   నాయుడు : ఓస్..ఓసోస్...మొన్నపంచాయితీ ఎలచ్చన్లలో పట్టుమని పది మందిని కూడా పోగేయనేక పోనావు గానీ ఇప్పుడు ఎయ్యి లారీలలో జనాలని ..అది కూడా అయిదరాబాదుకి తోలుకెలిపోతావా? నాకు తెలవక అడుగుతున్నాను రా ఒరే...సత్తిగా.. అసలు నీ జన్మలో ఎప్పుడయినా అయిదరాబాదు మొకం సూసేవురా? అసలు ఆయిదరాబాదుకు దారెటో తెలుసురా నీకు? అయిదరాబాదులో మనూరుంత ఇల్లు కట్టుకొని, సేతిలో డబ్బు సంచులు ఒట్టుకొని, నీ లాంటి గొట్టంగాళ్ళని వంద మందిని వెనకేసుకొని తిరుగుతున్న మన అన్నేఏటీ సెయ్యనేక సేతులు పిసుకొంటుంటే, బేరాలేక ఈ డొక్కు రిచ్చాలో కాలు మీద కాలేసుకొని కూకోని బీడీలు కాల్సుకొంటూ అయిదరాబాదులో సభ ఎట్టేస్తాడట...దానికి ఈడ నుండి జనాలని తోలేస్తాడట....హ హా...హా..   సత్తి: నవ్వరా నవ్వు... ఏదో ఒకరోజు అన్నసభ ఎట్టకపోతాడా.. నాను ఎల్లకపోతానా? అప్పుడు సూద్దువుగాని..నా...పవరేటో..   నాయుడు : ఒరే సత్తిగా..మనకీ నారీలు, బస్సులు లెందుగ్గానీ, అన్న కబురంపితే నువ్వు నీ డొక్కు రిచ్చాలో నాను నా డొక్కు రిచ్చాలలో మన ఆడోల్లని, పిల్ల పాపని ఏసుకొని ఆయిదరాబాదుకి ఎల్తే ఎట్టుటుందంటావు రా...?       హా...హా... హా.. అప్పుడుగానీ మనకి బుద్ది రాదురొరే            

పలుకవే నా బంగారు చిలుకా

    ఈ కాకులేమిటి అచ్చు మన చిలకల్లానే అరుస్తున్నాయి?    అవి కాకులు కావమ్మా మన సీబీఐ చిలుకలే. మనం ఇంతకాలం కప్పెట్టి ఉంచిన బొగ్గు కుంభకోణంలో అవి ముక్కు దూర్చినందుకు వాటికి కూడా ఆ బొగ్గు మసి అంటుకోవడంతో మీకు అలా కనిపిస్తున్నాయి అంతే.      అయితే, అదేమిటయ్యా అవి మనతో ‘షేర్’ చేసుకోవలసిన సీక్రెట్ వ్యవహారాలను ఎవరో పీసీ.ఫరెక్ అట అతనితో ‘షేర్’ చేసుకోవడమేమిటి? అతను మన మౌనముని మన్మోహన్ పై బురద జల్లడం ఏమిటి? బుద్ది లేకపోతేను? అసలు మనం మన చిలుకలకి ఎంతగా శిక్షణ ఇచ్చివదిలినప్పటికీ, అవి ఎదుట వాడి ఇల్లొదిలి తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ మనింటి మీదకే చేరి గోలచేస్తున్నాయి?     వాటిని అనుమానించకండి అమ్మగారు. వాటికి విశ్వాసం ఉండబట్టే అవి మనింటి చుట్టూ తిరుగుతున్నాయి.     ఏడిసినట్టే ఉంది నీ తెలివి. అవి మనకు విశ్వాసంగా ఉంటే మరి మన మనుషులనే ఎందుకు పొడుస్తున్నాయి?   అదేంటమ్మా మేము వాటికి బాగానే ట్రైనింగ్ ఇచ్చేమే?       ఏమిటి అప్పుడే మరిచిపోయావా? వాటి గోల భరించలేక ఇంతకు ముందు మన రైల్వేమంత్రి  బన్సాల్ గారిని, న్యాయ శాఖా మంత్రి అశ్వినీ కుమార్ గారిని మనమే బయటకు గెంటేసుకోవలసి వచ్చింది. ఇప్పుడేమో ఏకంగా అవి మన్మోహన్ గారి కుర్చీమీద వాలి గోల చేస్తున్నాయి. అలాగని ఆయనను గెంటేయలేము కదా? వీటికి అసమదీయులెవరో(మనవాళ్ళెవరో) తసమదీయులెవరో(శత్రువులెవరో) కూడా గుర్తించేలా శిక్షణ కూడా ఈయలేకపోతే ఎలా? అవసరమయితే ఇటలీ నుండో లేక ఇంగ్లాండ్ నుండో ఎవరినయినా రప్పించి వీటికి మంచి శిక్షణ ఇప్పించండి.     అలాగేనమ్మా.        నువ్వు అలాగేనమ్మా... అలాగేనమ్మా అంటూ ఇక్కడ కాలక్షేపం చేస్తూ కూర్చుంటే అవతల ఆ చిలుకలు మన కొంప ముంచేట్లున్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వదిలిన మన చిలకలు “చూసిరా.. అంటే ఏకంగా కాల్చివచ్చాయి. వాటి దెబ్బకి పాపం ఆ..ధర్మాన, సబిత ఇద్దరు మంత్రులకి పదవులూడితే, మరొక పెద్దాయన ఎవరో మోపిదేవిట! పాపం ఏడాదిన్నరగా జైలులోనే మగ్గుతున్నాడుట. మనం గీకమన్నచోటల్లా సంతకాలు గీకేసే మరో డజను మంది అధికారులు కూడా ఈ చిలుకలు పుణ్యామాని కోర్టులు చుట్టూ తిరుగుతున్నారిప్పుడు. వారిని చూస్తే నా మనసు కరిగిపోతుంది. అలాగని వాళ్ళు మనోళ్ళేనని నలుగురిలో వెనకేసుకు రావడం కుదరదు కదా?      అవునమ్మగారు.. ఈ పాడు చిలుకలకి అసమదీయులేవరో తసమదీయులెవరో గుర్తు పట్టడంలో ఇంకా శిక్షణ ఇప్పించాల్సిన అవసరముంది. అప్పటికీ ఒకటికి పదిసార్లు అసమదీయుల ఫోటోలు చూపించి మరీ వదులుతాము. కానీ ఏదో ఒకటి అరా మనవాళ్ళని అవి గుర్తుపట్టి కాపాడినా, ఈ ప్రతిపక్ష పార్టీలు అది చూసి కాకుల్లా గోలగోల చేస్తున్నాయి. అప్పటికీ పదునయిన ముక్కులున్న మన చిలుకలని వెనక్కి రప్పించుకొని, ముసలి చిలుకలని ఆ స్థానంలో పెట్టి మనకి అవసరమయిన ఒకటీ అరా మనుషులను వీలును బట్టి బయటకి తెచ్చుకొంటున్నాము తప్ప అధికారం మన చేతిలో ఉంది కదాని అందరికీ ఒకటే సారి బెయిలిచ్చేసి బయటకి తెచ్చేసుకోవట్లేదు కదా?     అవునయ్యా.. మన నీతి నిజాయితీ లోకానికేమి తెలుసు? పశువులకి గడ్డి కూడా వదలకుండా తినేద్దామని ప్రయత్నించిన ఆ లాలూ ప్రసాద్ ని మన చిలుకల చేత నానా గడ్డి తినిపించడం లేదూ? అటువంటి విషయాలు ఎవరూ పట్టించుకోరు. కానీ, మా ముద్దుల బాబు ఏదో ముచ్చటపడి ‘నాన్సెన్స్’ అనకపోయి ఉంటే ఆ లాలూ ప్రసాద్ ని కూడా మనమే వెనకేసుకు వస్తున్నామని లోకం కోడై కూసిందంటే నమ్ము.    అవునమ్మా నేను కూడా అదే అనుకొన్నాను.  ఆ..  ఆ..ఆ..నా అభిప్రాయం అదికాదమ్మా..జనాలు కూడా అలా అనేసుకోన్నారా? అని నేను అనుకొన్నానమ్మా.    ఆ..సర్సరే...ముందు ఆ చిలుకలు మన పాలిట రాబందులుగా మారకుండా చూడు.     అలాగేనమ్మా..మొన్న మొన్ననే మన దిగ్గీ రాజాగారు కూడా అసమదీయులెవరో,  తసమదీయులెవరో తెలుసుకోమని వాటికి గట్టిగా చెప్పారు. కానీ ఈ విషయమూ ఎవరో కాకితో కబురంపినట్లు ఎక్కడో హైదరాబాదులో ఉన్నవాళ్ళందరికీ కూడా ఎలాగో తెలిసిపోయింది. దానితో మళ్ళీ కాకి గోల మొదలయింది. అసలు ఈ చిలుకలకి ఆయనతో పనేమిటి? అవి ఆయన దగ్గర ఏమి నేర్చుకోవడానికి వెళ్ళాయి? ఎందుకు వెళ్ళాయి? అంటూ అర్ధం పర్ధం లేని చిలక ప్రశ్నలు అడుగుతూ ప్రతిపక్షాల వాళ్ళు కాకుల్లా గోల గోల చేసారమ్మా.     ఆ..సరే లేవయ్యా కాకులు అరుస్తున్నాయని చిలుకలను వదలకుండా పంజరంలో పెట్టుకొని కూర్చొంటామా?     అవునమ్మ గారు. మొన్న సుప్రీంకోర్టు కూడా ఆ మాటే అంది. అవన్నీ పంజరంలో పెరుగుతున్న చిలుకలు అని బలే కనిపెట్టేసిందమ్మగారు.      ఆ..మరిచిపోయాను...మనం గుజరాత్ కి పంపిన చిలుకలు ఏమయినా పలుకుతున్నాయా లేకపోతే అవి కూడా ‘నమో నమో’ అంటూ అక్కడే ఆయన చుట్టూనే ప్రదక్షిణాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాయా?      భయపడకండి అమ్మగారు. అవి ఎంతయినా మన పెరటి జాం చెట్టు మీద పుట్టి పెరిగిన చిలుకలు. ఆ మోడీ ఇంటి మీద వాలాలని ప్రయత్నించాయి గానీ ఆయన “మీతోనే నేను ఎన్నికలలో పోటీ చేయాలా?” అని అడిగేసరికి అవి బిత్తరపోయి అక్కడి నుండి ఎగిరొచ్చేసి, ఆయన శిష్యుడు ఎవరో ‘అమిత్ షా’ అట అతని వెంటబడ్డామని ఇటుగా వస్తున్న కాకితో మనకి కబురు పంపాయమ్మ గారు.     ఆ..సర్సరే! నీక్కూడా వాటి సహవాసంతో చిలుక పలుకులు పలకడం బాగా అలవాటయిపోయింది తప్ప పని కనబడటం లేదు. ఇంతకీ ఉత్తర ప్రదేశ్ లో మాయావతి ఇంటికి, ములాయం ఇంటి మీదకి వదిలిన మన చిలుకలు ఏమి చేస్తున్నాయిట? మాయావతి వ్యవహారంలో మన చిలుకలు ‘సరయిన కార్డు’ తీయలేదని ఆవిడని సుప్రీం కోర్టు వదిలిపెట్టేసిందిట కదా?    అవునమ్మగారు. ఇది మనం ముందుగా అనుకొన్నదే కదా? తమరు పని ఒత్తిడిలో మర్చిపోయినట్లున్నారు.     ఆ..ఆ...అవునవును..మరిచిపోయాను. వాళ్ళని కేవలం భయపెడుతూ మన మాటవినేలా చూడమని చెప్పాను కదా. సర్సరే...ఎందుకయినా మంచిది దేశంలో ఉన్న తసమదీయులందరి మీద మన చిలుకలను ఓ కన్నేసి ఉంచమను..ఎప్పుడు ఎవరి ప్లగ్గు పీకాల్సి వస్తుందో ఎవరికి తెలుసు?   అలాగే అమ్మగారు.       అంత కంటే ముందుగా వాటికి అసమదీయులు, తసమదీయులను గుర్తు పట్టేందుకు బాగా శిక్షణ ఇప్పించు. అప్పుడే వాటిని బయటకి వదిలి పెట్టు. మరిచిపోకు. మళ్ళీ మరో సారి పొరపాటయ్యిందంటే ఈ సారి నీ మీదకే వాటిని వదిలిపెడతా గుర్తుంచుకో.. అయ్యో! ఎంత మాటా...తప్పకుండానమ్మా!

కిరణ్ వేరు కుంపటి పెట్టుకొంటారా లేదా

  రాష్ట్ర విభజన సీరియల్ మొదలయిన నాటి నుండి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అందులో హీరో, విలన్ పాత్రలు రెండు చేసేస్తూ, ఎవరు కోరుకొన్నట్లు వారికి దర్శనమిస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు. అదే విధంగా అక్టోబర్ మొదటివారంలో అధిష్టానం ఆయన ప్లగ్గు పీకేయబోతోందని కేసీఆర్ సైతం ఓ డేట్ కూడా ఇచ్చేసారు.   ఈ ప్లగ్గు పీకుడు సస్పెన్స్ ఇలా కొనసాగుతుంటే, మరో వైపు కొత్తగా కొత్తపార్టీ లీకొకటి పుట్టుకొచ్చింది. నిప్పు లేనిదే పొగ రాదూ కదా?అని మీడియా వాళ్ళు ఆయనని అడిగితే “నేను ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే, మీరేమిటి కొత్త పార్టీ పెడతారా? అని అడుగుతున్నారు” అని ఎదురు ప్రశ్నిస్తూ తెలివిగా సమాధానం దాట వేస్తారు.   ఇక కేంద్రం కూడా తన వంతుగా రోజుకొక రకంగా మాట్లాడుతూ ఈ సీరియల్లో సస్పెన్స్ కొనసాగిస్తుంటుంది. ఆయన ప్లగ్గు ఊడుతుందా లేదా? కొత్త పార్టీ పెడతారా లేదా? శాసనసభకు తెలంగాణా తీర్మానం వస్తుందా లేక ఏదో కాగితం ముక్క మాత్రమే వస్తుందా? వచ్చేకయినా ఈ పెద్దమనుషులు రాజీనామాలు చేస్తారా లేదా? చేస్తే ఏమవుతుంది? చేయకపోతే ఏమవుతుంది? వంటి అనేక యక్ష ప్రశ్నల గురించి ఒకేసారి శ్రమ పడి ఆలోచించడం కంటే, ఏదో ఒకటే పాయింటు పట్టుకొని ఆలోచించుకొంటే అందరికీ తేలికగా ఉంటుంది.   కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కంటే ప్రజలే ముఖ్యమని గొప్ప సత్యం ప్రకటించారు, గనుక ఆయన పార్టీ పెట్టేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని అనుకోవచ్చును. అయితే ఆయనను గొప్పసమైక్య హీరో అని జనాలు ఎంతగా మెచ్చుకొంటునప్పటికీ, కాంగ్రెస్ పార్టీలోఆయనకు ‘లైక్స్’ తక్కువేనని చెప్పక తప్పదు. ఎవరి కారణాలు వారికున్నాయి.   ఒకరికి ఆయనలో అహంభావం నచ్చదు, మరొకరికి ఆయన సీనియారిటీ సరిపోదు. మరికొందరికి ఆయన చూపించిన చేదు అనుభవాలు ఇంకా తాజాగానే ఉన్నందున ఇబ్బంది. చాలా మందికి ముఖ్యమంత్రి పదవి అత్యవసరం గనుక దానిని ఆయనతో పంచుకోలేక చేరలేకపోవచ్చును. పార్టీ పెట్టక మునుపే ఇంతమందికి ఆయనతో సమస్యలున్నప్పుడు వారు ఆయన నేతృత్వంలో పనిచేస్తారని అనుకోలేము.   అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టాలంటే తనకు వంది మాగాదులుగా ఉండే వారిని పోగేసుకోవలసి ఉంటుంది. వారు తప్పనిసరిగా గెలుపు గుర్రాలయ్యి ఉండాలి. ఎవరి ఎన్నికల ఖర్చు వారే భరించుకోవాలి. సోనియమ్మ, రాహుల్ గాంధీల పేర్లు చెప్పుకోవడానికి వీలుండదు గనుక, అభ్యర్ధులు తమ తమ గోత్ర నామాలు చెప్పుకొనే ప్రచారం చేసుకోవలసి ఉంటుంది. ఇక అన్నిటి కంటే ముఖ్యమయిన షరతు మరొకటి ఉంది. ఎన్నికలయిన తరువాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిందుకు అంగీకరించాలి. వీటిలో దేనిని అంగీకరించకపోయినా ఆఖరి షరతుకి మాత్రం అందరూ అంగీకరించవచ్చు గనుక, ఈ ‘ఆరు నెలల పార్టీ’ లో చాలామందే జేరవచ్చును.   కానీ, రాయపాటి, లగడపాటి, ఉండవల్లి, హర్షకుమార్ వంటి సీనియర్లు మాత్రం స్వతంత్రంగా పోటీచేసి ఆనక మళ్ళీ కాంగ్రెస్ హస్తం అందుకోవచ్చును. ఇక కిరణ్ కుమార్ రెడ్డి వేరు కుంపటి పెట్టుకోకపోతే, ఆయనకు బొత్స, ఆనం, డొక్కా వంటి మంత్రులే పొగబెట్టడం ఖాయం. గనుక ఇష్టమున్న కష్టమున్న కిరణ్ వేరు కుంపటి పెట్టుకోక తప్పదు.