యాంటీబయాటిక్స్‌ వాడితే మతిస్థిమితం తప్పుతుందా!

ఒంట్లో బాగోలేనప్పుడు యాంటీబయాటిక్స్‌ అవసరాన్ని కాదనలేరు. పంటినొప్పి దగ్గర్నుంచీ కేన్సర్‌ వరకూ యాంటీబయాటిక్స్‌ లేకుండా మన చికిత్సా విధానాలే లేవు. ఒకరకంగా చెప్పాలంటే యాంటీబయాటిక్స్‌ మన వైద్యవిధానాన్నీ, దాంతోపాటు మన జీవితాన్నీ కూడా సమూలంగా మార్చేశాయి. యాంటీబయాటిక్స్‌ లేనిరోజుల్లో చిన్నపాటి చెవిపోటుకే మనుషులు చనిపోయే సందర్భాలు ఉండేవి. అయితే రోజులు మారుతున్న కొద్దీ యాంటీబయాటిక్స వాడకం పెరిగిపోతోంది. అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్‌ను వాడేయడం, ఒకోసారి డాక్టరుని సంప్రదించకుండానే వాటిని పుచ్చుకోవడం సహజం అయిపోతోంది. ఇలా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ను వాడటం వల్ల లేనిపోని పరిణామాలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. శరీరం తనను తాను బాగుచేసుకునే సహజసిద్ధమైన గుణం ఎలాగూ చెడుతుంది... యాంటీబయాటిక్స్‌ వాడకం వల్ల ఇతరత్రా ప్రమాదాలు కూడా ఉన్నాయంటూ రోజుకో నివేదిక బయటపడుతోంది. యాంటీబయాటిక్స్‌ను తీసుకోవడం వల్ల పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుందన్న విషయం తెలియందేమీ కాదు. అయితే ఇలా మంచి బ్యాక్టీరియా నష్టపోవడం వల్ల ఏకంగా మెదడుకే ఎసరు వస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇన్నాళ్లూ శరీరం అనేది ఒక యంత్రం అనీ... అందులో ఈ మూల ఉండే పేగులకీ, ఎక్కడో పైన ఉండే మెదడుకీ అంతగా సంబంధం లేదనీ చాలామంది వైద్యులు సైతం భావిస్తూ వచ్చారు. కానీ జీర్ణవ్యవస్థలో ఉండే కొన్ని పరిస్థితులు మన మెదడుని కూడా ప్రభావితం చేస్తాయని నిదానంగా తేల్తోంది. బహుశా ఈ విషయం రుజువైతే ఆహారానికీ, ఆలోచనకూ సంబంధం ఉందని వేల ఏళ్లుగా ఆయుర్వేద వైద్యులు చెబుతున్న మాట నిజమవుతుందేమో!   యాంటీబయాటిక్స్ వాడిన రోగుల్లో మెదడు పనితీరుని గమనించేందుకు పరిశోధకులు దాదాపు 400 మంది వివరాలను పరిశీలించారు. మనం తరచూ వాడే సిప్రాఫ్లొక్సాసిన్‌ సహా 54 రకాల యాంటీబయాటిక్స్ పనితీరుని వీరు గమనించారు. ఈ యాంటీబయాటిక్స్‌ను తీసుకున్న 47 శాతం మందిలో, మానసికమైన వికారాలు ఏర్పడ్డాయట. వీరిలో ఉద్రేకం, భ్రాంతి, అయోమయం, మూర్ఛ వంటి సమస్యలు కలిగాయంటున్నారు బోస్టన్‌కు చెందిన షమిక్‌ భట్టాచార్య అనే పరిశోధకుడు. ఇక యాంటీబయాటిక్స్‌ను తీసుకున్నాక మెదడు పనితీరు ఎలా ఉంటుందో గ్రహించేందుకు EEG తీసిన వైద్యులకీ ఇలాంటి ఫలితాలే కనిపించాయి. యాంటీబయాటిక్స్‌ వాడిన దాదాపు 70 మంది మెదడులో అసహజమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లు సదరు EEGలు నిర్ధారించాయి. చాలా సందర్భాలలో యాంటీబయాటిక్స్‌ వాడకాన్ని ఆపవేసిన వెంటనే రోగులు తిరిగి మామూలు స్థితికి చేరుకున్నారు. కానీ మరికొందరిలో కిడ్నీలు దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తేలింది. ఈ పరిశోధనలన్నీ గమనించిన తరువాత అసలు యాంటీబయాటిక్స్‌ వాడకం గురించే భయం ఏర్పడం సహజం. కానీ యాంటీబయాటిక్స్‌ నిజంగా మన ప్రాణాల్ని కాపాడే ఆయుధాలని గుర్తుంచుకోవాలి. ఆయుధాలని ఎలాగైతే విచక్షణారహితంగా వాడితే ప్రమాదమో యాంటీబయాటిక్స్‌ కూడా అంతే! దీర్ఘకాలికంగా, వైద్యుని పర్యవేక్షణ లేకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా యాంటీబయాటిక్స్‌ను వాడితే మాత్రం అసలుకే ఎసరు తప్పదు. - నిర్జర.  

తుమ్ములు ఎక్కువయితే..!

ముక్కు పూర్తిగా బ్లాక్‌ అవుతుందా. తుమ్ములు ఎక్కువగా వస్తున్నాయా.. ఊపిరి ఆడటం లేదా... అలాగే తుమ్ములు ఆగకుండా వస్తున్నాయా.. కరోనా సమయంలో ఇలాంటి లక్షణాలు భయపెట్టేస్తాయి. అయితే ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు పట్టేయడం వంటి లక్షణాలకు కరోనానే కారణం కాదు. ఇతర కారణాలవల్ల కూడా ఈ అనారోగ్య లక్షణాలు కనిపించవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇవాళ తెలుసుకుందాం? దీనికి పరిష్కారం మార్గాలు, వైద్యుల సలహాలు చూద్దాం..   ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు పట్టేయడం జరగడానికి కారణం ఎడమ వైపు ముక్కులో అలర్జీ, సైనస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉండటమే. దీనివల్ల ముక్కులో నీటి పదార్థాలు ఎక్కువగా చేరుతాయి. అలర్జీతో ముక్కులో కొన్ని రకాల జీవరసాయన చర్యలు జరగడం వల్ల రసాయనాలు ఎక్కువగా తయారవుతాయి. వీటివల్ల తుమ్ములు వస్తాయి. ఇలా తుమ్ములు ఆగకుండా వచ్చినప్పుడు అలర్జీకి సంబంధించిన మందులు వీలైనంత తొందరగా మొదలు పెట్టాలి. దాంతో రక్తస్రావం నివారించవచ్చు. అలర్జీ జన్యువుల ద్వారా వచ్చే సమస్య ఇది. కొన్నేండ్ల పాటు ఉంటుంది. ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు లేదా తక్కువ ఉండవచ్చు. అందువల్ల అలర్జీకి సంబంధించిన మందులు క్రమం తప్పకుండా చాలా కాలం వాడాల్సి ఉంటుంది. సైనసైటిస్‌, ఆస్తమా సమస్యలు రాకుండా నివారించవచ్చు. ముక్కు బ్లాక్‌ కావడం, తుమ్ములు రావడానికి ముందే ముక్కులో అలర్జీకి సంబంధించిన చర్యలు జరుగుతాయి. వీటివల్ల ముక్కు లోపల చర్మం పాడవుతుంది. ఇది 30 నుంచి 40 శాతం పాడైన తరువాత అలర్జీ లక్షణాలు బయటపడుతాయి. మందులు మొదలుపెట్టిన వారం రోజులకే అలర్జీ తగ్గిపోయినప్పటికీ ముక్కు లోపల జరిగే ఉత్ప్రేరకాల ప్రక్రియ కొన్ని వారాలు, నెలల పాటు జరుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల చర్మం పాడవకుండా ఉండాలంటే అలర్జీ మందులు లక్షణాలు తగ్గిన తరువాత కూడా కనీసం రెండు మూడు నెలలు వాడాలి. అలా వాడటం వల్ల ఆస్తమా రాకుండా ఆపవచ్చు. వీలైనంత త్వరగా నిపుణులను సంప్రదించడం చాలా మంచిది.

పరుగు పెడితే మోకాలి నొప్పులు రావు

పరుగుతీయడం వల్ల మోకాళ్లు త్వరగా అరిగిపోతాయని ఓ ప్రగాఢమైన నమ్మకం. అందుకే మోకాళ్లకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు అసలు పరుగు జోలికే పోరు. కానీ పరుగులెత్తితే మోకాళ్లకి కొత్త బలం వస్తుందని ఓ కొత్త పరిశోధన నిరూపిస్తోంది.   పరుగులెత్తించారు అమెరికాలోని ‘బ్రిగాం యంగ్‌ యూనివర్సిటీ’కి చెందిన కొందరు పరిశోధకులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందుకోసం వాళ్లు 15 మంది ఆరోగ్యవంతమైన యువకులను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 18 నుంచి 35 ఏళ్ల వయసు లోపువారే! ఈ 15 మందిలో 11 మంది మగవారు కాగా 4 ఆడవారు. ఈ 15 మంది చేతా ఒక అరగంట పాటు పరుగులెత్తించారు పరిశోధకులు. ఆ పరుగుకి ముందూ, తరువాతా వారి రక్తాన్ని పరీక్షించారు. దాంతో పాటుగా మోకాళ్ల దగ్గర ఉంటే Synovial fluid (SF) అనే జిగురుని కూడా పరీక్షించారు.   వాపు లేదు ఆశ్చర్యకరంగా మోకాళ్ల వాపు సమయంలో కనిపించే ‘సైటోకైన్స్‌’ (Cytokines) అనే తరహా రసాయనాలు... పరుగు తరువాత తగ్గిపోవడాన్ని గమనించారు. ఈ సైటోకైన్స్‌ మనలోని రోగనిరోధకశక్తిలో ఓ ముఖ్యభాగం. శరీరంలో ఎక్కడన్నా వాపు కానీ ఇన్ఫెక్షన్‌ కానీ కనిపించినప్పుడు, శరీరంలోని రక్షణవ్యవస్థను ఇవి అప్రమత్తం చేస్తాయి. పరుగు తరువాత వీటి ఉనికి తక్కువగా కనిపించింది అంటే వాపు కలిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అర్థం.   పరుగు ఓ మందు భవిష్యత్తులో ఆర్థ్రైటిస్ వంటి రోగాల బారిన పడి మోకాలినొప్పులు రాకుండా ఉండాలంటే, పరుగుని కూడా ఓ మందులా భావించమంటున్నారు పరిశోధకులు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఇప్పటికే మోకాలిసమస్యలతో బాధపడుతున్నవారి సంగతి ఏమిటి? అన్న ఆలోచన కూడా వచ్చింది పరిశోధకులకి. అందుకనే ఇప్పుడు ఆ దిశగా మరిన్ని పరిశోధనలు మొదలుపెట్టారు.   మోకాలినొప్పులు – నడక మోకాలినొప్పులతో పరుగు తీయడం ఎంతవరకు శ్రేయస్కరం అన్నదాని మీద రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అవి ఓ కొలిక్కి వచ్చేవరకు మోకాలి సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా పరుగులు తీస్తే ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే మోకాలి సమస్యలు ఉన్నప్పుడు నడక మాత్రం చాలా మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదంటున్నారు. దానికి ఈ కారణాలను విస్పష్టంగా చెబుతున్నారు...   - నడక వల్ల శరీర బరువు తగ్గుతుంది. ఒంటి బరువు తగ్గితే మోకాళ్ల మీద కూడా బరువు తగ్గినట్లే కదా!   - నడుస్తూ ఉండటం వల్ల కాళ్లు బలపడతాయి. ఒంటి బరువంతా కేవలం మోకాళ్ల మీదే పడకుండా కాలిలోని మిగతా ఎముకలు, కండరాలు కూడా తోడ్పడతాయి.   - మోకాళ్ల మధ్య ఉండే కార్టిలేజ్ అనే జిగురుపదార్థం నడక వల్ల బలాన్ని పుంజుకుంటుంది. దీని వలన మోకాళ్లలలోని ఒరిపిడి తగ్గుతుంది.   అదీ విషయం! దీంతో మోకాలి సమస్యలు రాకుండా ఉండాలంటే పరుగులు పెట్టాలనీ, ఇప్పటికే ఆ సమస్య ఉన్నవారు నడకని మానుకోకూడదనీ చెప్పుకోవచ్చన్న మాట!   - నిర్జర.

బ్రెడ్‌తో క్యాన్సర్‌... ఎంతవరకూ నిజం!

  ఏదన్నా ఆహారపదార్థం గురించి వార్త రానంతవరకూ దానిని విచక్షణారహితంగా వాడేయటం, ఏదో ఒక వార్త రాగానే బెంబేలెత్తిపోవడం వినియోగదారులకు ఉండే అలవాటే! దానికి గొప్ప ఉదాహరణగా నూడిల్స్ గురించి చెప్పుకోవచ్చు. మ్యాగీ వంటి ప్రముఖ బ్రాండ్‌ నూడిల్స్‌లో సైతం MSG అనే ప్రమాదకరమైన రసాయనం ఉందని తెలియగానే దేశం నూడిల్స్ ఉడికినట్లు ఉడికిపోయింది. ఇప్పుడు తాజాగా బ్రెడ్‌ల గురించి కూడా వస్తున్న ఇలాంటి వార్తలు భారతీయులని కలవరపరుస్తున్నాయి. వివాదం ఏమిటి! దిల్లీకి చెందిన CSE అనే ఓ సంస్థ చేసిన పరిశోధనే ప్రస్తుత వివాదానికి కారణం. CSE చెబుతున్న వివరాల ప్రకారం, దిల్లీలో సేకరించిన దాదాపు 38 రకాల బ్రెడ్‌ నమూనాలలో దాదాపు 84 శాతం నమూనాలలో ప్రమాదకరమైన పొటాషియం బ్రోమైట్‌, అయోడైట్‌ అనే పదార్థాలు కనిపించాయి. ఈ నమూనాలు ఎక్కడో మారుమూల ఉన్న బేకరీల్లోంచి సేకరించినవి కావు. బ్రిటానియా దగ్గర్నుంచీ KFC వరకూ ప్రఖ్యాత బ్రాండ్లకు సంబంధించిన నమూనాలు కూడా ఈ పరీక్షలో తేలిపోయాయి.   ఎందుకువాడతారు! బ్రెడ్‌ కోసం కలిపిన పిండి చక్కగా సాగేందుకు, బ్రెడ్‌ ఉబ్బెత్తుగా వచ్చేందుకు, మంచి రుచితో ఉండేందుకు ఈ పదార్థాలను వాడతారు. నిజానికి బ్రెడ్‌ లేదా బేకరీ పదార్థాల తయారీలో వీటిని ఉపయోగించకూడదన్న చట్టమేమీ మన దేశంలో లేదు. కాకపోతే ఒక మోతాదు మేరకే వీటిని వాడాలన్న నిబంధనలు మాత్రం ఉన్నాయి. ఉదాహరణకు బ్రెడ్‌ తయారీలో 50 PPM వరకూ ఈ పదార్థాలను వాడవచ్చన్న నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారమే తాము బ్రెడ్‌లను ఉత్పత్తి చేస్తున్నామని ఉత్పత్తిదారులు చెబుతున్నారు   సమస్య ఏమిటి! ఉత్పత్తిదారులు చెబుతున్న మాట వాస్తవమే. బ్రెడ్‌ తయారు చేసే సమయంలో పొటాషియం బ్రొమైట్‌ను కలపినా కూడా ఉత్పత్తి దశలో అది పొటాషియం బ్రోమైడ్‌గా మారిపోతుంది. బ్రోమైడ్ ఏమంత హానికారక పదార్థం కాదు. కానీ అలా జరగకపోవడమే అసలు సమస్య. CSE అందించిన గణాంకాల ప్రకారం... ప్యాక్‌ చేసిన బ్రెడ్‌లో కూడా పొటాషియం బ్రోమైట్‌ ఆనవాళ్లు శుభ్రంగా కనిపిస్తున్నాయి. బ్రెడ్‌ను ఉత్పత్తి చేసే సమయంలో లోపాలు ఉండటం, బ్రెడ్‌ మరింత ఉబ్బెత్తుగా కనిపించడం కోసం కక్కుర్తి పడి ఎక్కువ పాళ్లు కలపడంతో.... మన చేతిలో ఉండే బ్రెడ్‌లో కూడా బ్రోమైట్‌ ఉంటోంది.   బ్రోమైట్‌ ఉంటే ఏంటట! బ్రోమైట్‌ గురించిన భయాలు ఈనాటివి కావు. బ్రోమైట్‌ ఒక క్యాన్సర్‌ కారకమంటూ దశాబ్దాల తరబడి పరిశోధనలు చెబుతున్నాయి. కిడ్నీ, థైరాయిడ్ వంటి అనేక క్యాన్సర్లను ఇది కలిగించే ప్రమాదం ఉందంటూ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందుకనే ఆస్ట్రేలియా మొదలుకొని బ్రెజిల్‌ వరకూ దీనిని ఆహారపదార్థాల తయారీలో వాడవద్దంటూ నిషేధించారు. అంతదాకా ఎందుకు? మన పక్కనే ఉన్న శ్రీలంక, చైనాలలో సైతం ఈ నిషేధం అమలులో ఉంది. కానీ నిరంతరం తన నిర్ణయాల కోసం అమెరికా వైపు చూసే మన దేశం మాత్రం, అక్కడిలాగే ఇక్కడ కూడా బ్రోమైట్‌ గురించి చూసీ చూడనట్లు ఉండిపోయింది. ఇక అయోడైట్ గురించి కూడా ఇలాంటి భయాలే ఉన్నాయి. థైరాయిడ్‌ పనితీరుని అయోడైట్ దారుణంగా ప్రభావంతం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.     ఇప్పుడేం చేసేది! బ్రోమైట్‌ క్యాన్సర్‌ కారకం అన్న మాట నిజమే కానీ... దానిని ఎలా, ఏ స్థాయిలో తీసుకుంటే క్యాన్సర్‌ కారకమో అన్న విషయం మీద స్పష్టత లేదు. పైగా ఇక నుంచి బ్రెడ్‌ ఉత్పత్తిలో బ్రోమైట్‌ను నిషేధిస్తామంటూ Food Safety Standards Association of India (FSSAI)  ప్రకటించింది. దీంతో ప్రస్తుతానికి ఈ వివాదానికి తెరపడినట్లే. కానీ మొన్నటి వరకూ నూడిల్స్, ఇప్పుడు బ్రెడ్‌కు సంబంధించిన వివాదాలతో మనకు ఓ పాఠం తెలిసొచ్చినట్లు అయ్యింది. ఆరోగ్యకరమైన, అందుబాటులో ఉండే పళ్లు, కూరగాయల వంటి ఆహారాన్ని కాదని... బద్ధకంతోనో, జిహ్వచాపల్యంతోనో, గొప్ప కోసమో కృత్రిమమైన ఆహారం మీద ఆధారపడితే, అది ఎప్పటికైనా, ఎలాగైనా ఆరోగ్యానికి నష్టం కలిగించక మానదు. మరమరాల దగ్గర్నుంచీ మినప బజ్జీల వరకు మన సాంప్రదాయకమైన ఆహారాలు ఇన్ని ఉండగా పాశ్చాత్య ధోరణుల కోసం పాకులాడితే బొక్కబోర్లా పడకా తప్పదు.

వందకోట్లమందిలో కంటి సమస్యలు

'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్నారు పెద్దలు. రెప్పపాటు కాలం కళ్లు మూసుకుంటే ప్రపంచమే చీకటైపోతుంది. అందుకే కళ్ల విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలని మన పెద్దవారు చెప్తారు. స్మార్ట్ యుగంలో కంటికి రక్షణ లేకుండా పోయిందని, ఎక్కువ సేపు ఫోన్, లాప్ టాప్, కంప్యూటర్, టీవీ వంటి స్క్రీన్లను చూడటం కంటికి హాని కలిగిస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.   ప్రపంచ జనాభా 780కోట్లు అయితే అందులో వందకోట్ల మందిలో కంటిసమస్యలు ఉన్నాయి. వారు దూర, దగ్గరి దృష్టిలోపం కారణంగా ఇబ్బందిపడుతున్నారు. సాధారణంగా 50ఏళ్లు పై బడిన వారిలో కంటిసమస్యలు వస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల్లో కూడా కంటిచూపు సమస్యలు వస్తున్నాయి.   కంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో జనాభాలో  రెప్రాక్టీవ్ ఎరర్(refractive error) కారణంగా  దాదాపు 123.7 మిలియన్ మంది,  కంటిశుక్లం( cataract )కారణంగా 65.2 మిలియన్ మంది, గ్లాకోమా ( glaucoma ) తో 6.9 మిలియన్ మంది, కార్నియల్ అస్పష్టత ( corneal opacities )తో 4.2 మిలియన్ మంది,  డయాబెటిక్ రెటినోపతి(  diabetic retinopathy ) కారణంగా 3 మిలియన్ మంది, ట్రాకోమా ( trachoma ) తో 2 మిలియన్ మంది ఇతర సమస్యతో 826 మిలియన్ మంది ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో డయాబెటిక్ రెటినోపతి, గ్లాకోమా, మాక్యులార్ డీజెనరేషన్ వంటి వ్యాధుల కారణంగా కంటిచూపు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పేదదేశాల్లో పుట్టుకతోనే కంటిశుక్లాలు రావడం దృష్టిలోపానికి ప్రధాన కారణం అవుతుంది.   కంటి సమస్యలను నివారించాలంటే అవసరమైన పోషకాలను, విటమిన్-ఎ, సి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ఫోన్, టీవీ, కంప్యూటర్ స్క్రీన్ లను ఎక్కువ సేపు చూడవద్దు. ప్రతి అరగంటకు ఒకసారైన ఒక నిమిషం కంటికి విశ్రాంతి ఇవ్వాలి. కళ్లు చాలా సున్నితమైన భాగాలు అన్న విషయం గుర్తుంచుకోవాలి. నేత్రదానం చేయడం వల్ల ఇతరులకు కంటిచూపు ఇవ్వవచ్చన్న అంశంపై అవగాహన కల్పించాలి.

షికంజి సోడా తాగితే ఎంత మంచిదో తెలుసా...?

మన దేశంలో ఎండాకాలం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. మంచి ఎండల్లో బయటకి వెళ్లాల్సి వస్తే... ఒళ్లంతా మంటెక్కిపోక తప్పదు. అలాంటప్పుడు రోడ్డు పక్కన ఆగి ఓ గుక్కెడు లెమన్ సోడా తాగితే కావల్సినంత రిలీఫ్‌ దొరుకుతుంది. రోడ్డు పక్కన తయారుచేసే లెమన్‌సోడాని షికంజి అని పిలుస్తారు. ఇందులో సోడాతో పాటు ఉప్పు, పంచదార, అల్లం, జీరాపొడి, నల్ల ఉప్పు కూడా కలుపుతారు. దీని వల్ల దాహం చల్లారడమే కాదు... చెప్పలేనన్ని లాభాలు ఉంటాయట. అవేంటో మీరే చూడండి... ఎండాకాలం మనకి తెలియకుండానే ఒంట్లో నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది. ఇంకా చెమటతో పాటు శరీరానికి చాలా అవసరమయ్యే సోడియం అనే మినరల్ కూడా బయటకి వెళ్లిపోతుంది. ఇది డీహైడ్రేషన్‌ లాంటి చాలా సమస్యలకి దారితీస్తుంది. షికంజిలో కలిపి ఉప్పు, పంచదార ORSలాగా పనిచేసి ఒంటికి కావల్సినంత బలాన్ని ఇస్తాయి. ఎండాకాలంలో డైజషన్‌ చాలా sensitiveగా ఉంటుంది. దానికి తోడు చల్లదనం కోసం మనం రకరకాల డ్రింక్స్‌ తీసుకుంటూ ఉంటాం. వీటన్నింటి వల్ల కూడా digestion upset అవుతుంది. కానీ షికంజిలో ఉండే నల్ల ఉప్పు, అల్లం, జీరాపొడి, నిమ్మరసం... అన్నీ కూడా మన digestive systemని healthyగా ఉంచుతాయి. షికంజి తాగడం వల్ల immunity పెరుగుతుంది. దీనిలో ఉన్న నిమ్మరసం వల్ల మన ఒంటికి కావల్సిన విటమిన్ సి దొరుకుతుంది. విటమిన్‌ సి వల్ల పళ్ల దగ్గర నుంచీ గుండె దాకా ఒంట్లో అన్న organs healthyగా ఉంటాయి. ఇక అల్లంలో gingerol అనే పదార్థం ఉంటుంది. ఇది ఒక natural antibiotic గా painkiller గా పనిచేస్తుందట. షికంజితో weight loss కూడా సాధ్యమే అంటున్నారు. షికంజిలో pectin అనే పీచు పదార్థం ఉంటుంది. ఇది ఒంట్లో కొవ్వుని కరిగించేస్తుంది. ఒంట్లో ఉన్న విషాన్నంతా బయటకి పంపేసే detoxing agentలాగా షికంజి పనిచేస్తుంది. దాని వల్ల లివర్ పనితీరు మెరుగుపడి, కొవ్వు కణాలన్నీ కరిగిపోతాయి. చూశారుగా! normal drinkలాగా కనిపించే షికంజి వెనుక ఎన్ని లాభాలున్నాయో. ఒకవేళ దీన్ని బయట రకరకాల నీళ్లు కలుపుతారు కాబట్టి, తేడా చేస్తాయి అనుకుంటే ఇంట్లోనే మామూలు నీటితోనే షికంజి తయారుచేసుకోవచ్చు.  

ఆత్మబంధువులా నిలిస్తే ఆత్మహత్యలే వుండవు...

సంవత్సరానికి 1,35,445 మంది... ప్రతిరోజూ సగటున 242 మంది మగవారు, 129 ఆడవారు జీవితాన్ని వద్దనుకుని బలవంతంగా ప్రాణాలు వదులుతున్నారు మన భారతదేశంలో. అందులోనూ 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నవారే ఎక్కువట. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా పాటిస్తున్న ఈరోజున ఆత్మహత్యలని నివారించడానికి మనంగా ఏం చేయాలని ఆలోచించి తీరాలి. సమాజం, సామాజిక సంస్థలు, ప్రభుత్వం బాధ్యత ఎంతవుందో.. వ్యక్తులుగా, మన బాధ్యత కూడా అంతే వుందన్నది నిజం. అందుకే పెద్ద పెద్ద సిద్ధాంతాలని పక్కనపెట్టి సగటు మనిషిగా ఆలోచిస్తే మనతోపాటు మసలే మన కుటుంబంలోని వ్యక్తి లేదా స్నేహితుడు, బంధువు, సహోద్యోగి లేదా పక్కింటివారు... ఇలా మన పరిధుల్లో మనకి పరిచయం వున్నవారు, నిన్నటిదాకా మనతో వున్నవారు హఠాత్తుగా చడీచప్పుడు లేకుండా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే అందులో మన పాత్ర ఏం లేదా? మనం చేయగలిగింది ఏం లేదా? వీటిని ఆపడం సాధ్యం కాదా? చిన్న విషయమే.. అందరికీ తెలిసిన విషయమే.. మనందరి అనుభవంలోనిదే. మనసుకి బాధ కలిగితే పంచుకోవడానికి ఒక వ్యక్తి కావలసి వుంటుంది. ఎలాంటి ఆక్షేపణలు లేకుండా కేవలం మనసుపెట్టి వినే ఒక్క వ్యక్తి చాలు ఆ నిమిషానికి దేవుడిలా కనిపిస్తాడు. అందుకే వినటం నేర్చుకుందాం. ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశమిద్దాం. మనసులోని బాధనంతా వెళ్ళగక్కేందుకు కొంచెం సమయం ఇద్దాం. సత్సంబంధాలు, సాన్నిహిత్యం మనుషుల్లో భరోసాని, ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి. ఆపద రాగానే పరిగెట్టుకు రాగలరు. బాధని పంచుకోగలరు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే.. కొంచెం మానవ సంబంధాలపై దృష్టి పెడదాం. ఉదయం లేచి మనకి ఎదురుపడే ప్రతి ఒక్కరిని చిన్న చిరునవ్వుతో పలకరిద్దాం. ఇంట్లోని పనిమనిషి నుంచి ఆఫీసులోని ప్యూను దాకా అందరినీ కుశలం అడుగుదాం. నాలుగు కబుర్లు చెబుదాం. మన జీవితంలోని విశేషాలని పంచుకుందాం. వాళ్ళ జీవితంలోని విశేషాలని అడుగుదాం. బలమైన మానవ సంబంధాలు ఎప్పుడూ ధైర్యాన్నిస్తాయి. ఆత్మహత్య అనే భూతం ఎప్పుడు ఎవర్ని నిశ్శబ్దంగా కబళిస్తుందో తెలీదు. బతుకు పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమని తెలిసీ ఆ క్షణానికి నైరాశ్యానికి లొంగిపోయే వారెందరో! సహాయం చేయగలమా, వారి సమస్యలని తీర్చగలమా అన్నది పక్కన పెడితే, తన బాధలనయితే వినగలం కదా! నాలుగు ధైర్య వచనాలు పలకగలం కదా! ఏదో ఒక దారినైతే చూపించగలం కదా! ఇలా జరగాలంటే ముందు మనం నలుగురికి అందుబాటులో వుండాలి. ఒంటరితనపు కంచుకోటని బద్దలు కొట్టుకుని బయటకి రావాలి. ఈరోజున ఆ నిర్ణయం తీసుకుందాం. ‘‘ఆత్మహత్యల నివారణకి వ్యక్తిగా నేనేం చేయగలను’’ అన్న ఒక చిన్న ఆలోచన చేద్దాం. నలుగురితో ఆ ఆలోచని పంచుకుందాం. నిస్సహాయంగా, నిర్వేదంగా జీవితానికి వీడ్కోలు పలికే దుస్థితి ఎవరికీ రావద్దు అంటే కొంచెం మానవత్వంతో ఆలోచిద్దాం. మానవ సంబంధాలని బలపర్చుకుందాం. -రమ  

విటమిని ఇ ఎక్కువగా ఉండే కొబ్బరిపాలు

శరీరానికి కావల్సిన సూక్ష్మ పోషకాలు ఎక్కువగా లభించే పదార్థాల్లో కొబ్బరి పాలు ఒకటి. ఇందులో సోడియం, క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్‌, ప్రోటీన్స్‌, పొటాషియం వంటి పోష‌కాలు స‌మృద్దిగా ఉంటాయి. అంతేకాదు క‌రోనాను అరిక‌ట్టే జింక్‌, బీ12 వంటి న్యూట్రియంట్స్ కూడా పుష్క‌లంగా లభిస్తాయి. ఇప్పుడు కొబ్బరిపాలు మార్కెట్ లో కూడా లభిస్తున్నాయి. అయితే ఇంట్లో తయారుచేసుకోవడం మంచిది. పచ్చి కొబ్బరిని తురిమి లేదా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. పలుచటి క్లాత్ తీసుకుని అందులో ఈ కొబ్బరి ముద్దను వేసి గట్టిగా పిండాలి. ఈ పాలను సన్నని మంటమీద ఐదు నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. సహజసిద్ధంగా లభించే కొబ్బరిపాలలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కొబ్బరిపాలు ఎంతో మేలు చేస్తాయి. చుండ్రు సమస్యతో బాధపడేవారు కొబ్బరిపాలను తలకు పట్టించి బాగా మసాజ్ చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. జుట్టు పట్టులా మెరుస్తుంది.

పసుపుతో మతిమరుపు మాయం

ప్రతి ఇంట్లో పసుపు తప్పని సరిగా ఉంటుంది. కూరల్లో రంగు కోసం తప్పని సరిగా వాడే పసుపు యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మన పెద్దవారు గాయమైనా, జబులైనా పసుపుతో నయం చేసేవారు. ఆడపిల్లలకు నెలసరి సమయంలో చిన్న పసుపు ముద్ద మింగమని చెప్పేవారు. బ్యాక్టీరియా, వైరస్ ఇన్ ఫెక్షన్స్ ను నివారించడంతో దీనికి ఇదే సాటి.  పురాతన కాలం నుంచి మన సంప్రదాయంలో, ఆహారపు అలవాట్లలో భాగమైన పసుపు వల్ల కలిగే లాభాలపై ఇప్పటికీ అనేక పరిశోధనలు జరగుతున్నాయి. ఆశ్చర్యకరమైన అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. పసుపు మెదడు పనితీరుపై ఏ విధమైన ప్రభావం చూపిస్తోందో తెలుసుకోవడానికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజెల్స్  శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. 50 నుంచి 90ఏండ్ల మధ్య వయసు ఉన్న వారికి  ఆహారంలో ప్రతిరోజూ 90మిల్లీగ్రాముల పసుపు ఇచ్చారు. ఆరునెలలకు ఒకసారి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 18నెలల తర్వాత వారిలో జ్ఞాపకశక్తి పెరగడాన్ని గమనించారు. పసుపు రక్తంలో కలిసి మెదడుకు చేరి కణాలను ఉత్తేజం చేస్తుందని తెలుసుకున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మతిమరుపును దూరం చేస్తుందని గమనించారు. దాంతో పసుపు మతిమరుపుతో బాధపడేవారికి ఒక వరం అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అల్జీమర్స్  వ్యాధి నివారణలో పసుపు వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పరిశోధనలతో స్పష్టమైంది. ఈ పరిశోధన వల్ల పసుపు గొప్పదనం మరోసారి రుజువైంది.

జలుబు కోసం కొన్ని చిట్కాలు

* జలుబుతో బాధపడుతుంటే మిరియాలు,బెల్లం, పెరుగు కలుపుకుని సేవించండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిన జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. * ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. * పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకుని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. * ఏడు- ఎనిమిది మిరియాలు నెయ్యిలో వేంచుకున్న వెంటనే సేవించాలి. ఆ తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది. * తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబు మటుమాయం. * అజీర్ణం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటే... పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చిటికెడు జీలకర్ర పొడి, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ తేనె కలుపు కుని తాగాలి. ఇలా వారం రోజులు చేస్తే పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. * గ్లాసు గోరువెచ్చని నీటిలో టీ స్పూన్ నెయ్యి కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్దకం నుండి ఉపశమనం లభిస్తుంది.  

ఆపిల్‌కి తాత అరటిపండు

అరటిపండు అన్ని రుతువులలో, అన్ని ప్రాంతాలల్లో దొరికే పండు. శరీరంలో ప్రతి అవయవం మీద ప్రభావం చూపే శక్తి అరటికి వుంది. అందుకే రోజుకి ఒక్క అరటిపండు అయినా తినాలని చెబుతారు. పోషకాల విషయానికి వస్తే నిజానికి ఆపిల్ కన్నా అరటే ముందుంటుందని చెప్పాలి.  ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఆపిల్ కన్నా అరటి పండు నుంచి మనకి  ఎక్కువగా అందుతాయి. ఎవరెవరికి ఈ అరటి మేలు చేస్తుందో చూద్దాం.   * రక్తలేమితో బాధ పడేవారికి అరటిని మించిన మందు మరొకటి లేదు. దీనిలో వున్న అధిక ఐరన్ రక్తంలోని హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది.    * అరటిలో పొటాషియం అధికం. అలాగే ఉప్పు తక్కువ కాబట్టి రక్తపోటుతో బాధపడేవారికి మంచి ఆహరం.   * పిల్లలకి మంచి జ్ఞాపకశక్తి కోసం రోజు ఒక అరటిపండు తినిపించాలి. దీనిలోని పొటాషియం మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. బ్రిటన్‌లో జరిపిన ఓ పరిశోధనలో రోజు అరటిపండు తిన్న పిల్లలలో జ్ఞాపక శక్తి కూడా పెరిగినట్టు తేలింది .   * ఎసిడిటితో బాధపడే వారికీ అరటిపండు సహజమైన యాంటి ఆసిడ్. అల్సర్లతో బాధపడేవారు కూడా అరటిపండు తింటే ఉపశమనం వుంటుంది. కడుపులోపలి గోడల మీద పొరగా ఏర్పడి ఆమ్లాల ప్రభావాన్ని అరటిపండు తగ్గిస్తుంది.   * ఇంపీరియల్ కాలేజీ అఫ్ లండన్‌లో జరిపిన ఓ అధ్యయనంలో రోజూఅరటిపండు తిన్న పిల్లలు మిగతా పిల్లల కంటే  34% తక్కువ అస్తమాకి గురి అయ్యే ప్రమాదం వున్నట్టు తేలింది.   * న్యూ ఇంగ్లాండ్ జర్నల్ అఫ్ మెడిసిన్ వారి ప్రకారం ప్రతిరోజూ అరటిపండు తినేవారిలో గుండె జబ్బు, రక్తనాళాలు మూసుకుపోవటం వంటి ప్రమాదాలుదాదాపు 40% తగ్గుతాయి.   * ఈ పండులోని విటమిన్ బి నాడుల మీద ప్రభావం చూపి ప్రశాంతతని అందిస్తుంది.అలాగే ఇందులోని విటమిన్ బి 6 రక్తంలోని గ్లూకోజు స్థాయిని నియంత్రిస్తుంది. ఫలితంగా మంచి మూడ్ కలిగివుంటాం.   ఇలా అరటిపండు నుంచి మనకి ఎన్నో పోషకాలు లభిస్తాయి . కాబట్టి  చక్కటి ఆరోగ్యానికి రోజుకి ఒక అరటిపండు తినటం మర్చిపోకండి. -రమ

కలలు కనే కళ్ళని అలవనీకండి..

ఎగ్జామ్స్ టైం వస్తోందంటే చాలు పిల్లలు చదివి చదివి అలసిపోతారు. అలాంటి చిన్ని కళ్ళని మనం కాకపోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. వాళ్ళు ఎక్కువగా చదవటం వల్ల వచ్చే ఒత్తిడిని కళ్ళు వెంటనే మనకి తెలియచేస్తాయని చెప్తున్నారు కంటి వైధ్యులు. అలా అలిసిపోయిన కళ్ళని కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కాపాడుకోవచ్చట. పిల్లలు చదువుకునే సమయంలో వాళ్ళ గదిలో ఉండే గాలి వెలుతురుని అంతగా పట్టించుకోరు. తొందరగా చదివేసుకోవాలనే తపన తప్ప వాళ్ళకి ఇంకో ధ్యాస ఉండదు. తగినంత వెలుతురు లేని చోట చదవటం వల్ల కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉందిట.   * ఏకధాటిగా చదివే సమయంలో కళ్ళనుంచి నీరు కారుతుంది. అలాంటి సమయంలో పల్చటి మజ్జిగలో తడిపిన దూదిని కళ్ళ మీద వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచినా చాలు. * నిద్ర లేవగానే ముందుగా కళ్ళ మీద చల్ల నీళ్ళని అయిదు నిమిషాల పాటు కొట్టుకోవాలి. ఇలా చేస్తే ఎంత అలిసిపోయిన కళ్ళయినా సేద తీరుతాయి. * కళ్ళ మంటలు తగ్గాలంటే ప్రతి ఇరవై నిమిషాలకోసారి కళ్ళు ఆర్పుతూ తెరుస్తూ ఉండాలి. అదే పనిగా ఎక్కువసేపు ఒకే వైపు చూస్తూ ఉండిపోకూడదని చెప్తున్నారు డాక్టర్లు.   * అలిసిపోయిన కళ్ళకి ఫ్రిజ్ లో పెట్టి తీసిన టీ బాగ్స్ బాగా పనికొస్తాయి. అలా బయటకి తీసిన టీ బాగ్స్ ని కళ్లపై ఉంచుకుని కాసేపు అయ్యాక తీసి చల్ల నీళ్ళతో కళ్ళు కడిగితే చాలా రిలీఫ్ గా ఉంటుంది. * కీరా దోసని గాని, బంగాళదుంపని గాని పల్చటి చక్రాలుగా తరిగి కళ్ల రెప్పలపై వేసి ఉంచినా కళ్ళు త్వరగా చల్లబడతాయి.   * అలసట వల్ల కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వస్తే టమాటో గుజ్జులో చిటికెడు పసుపు, 1 స్పూన్ నిమ్మరసం,1 స్పూన్ సెనగపిండి వేసి ముద్దలా చేసి దానిని కనురెప్పలపై పూసి అరగంట తర్వాత కడిగేసుకుంటే బ్లాక్ సర్కిల్స్ తొందరగా మాయమవుతాయి. * రోజ్ వాటర్ కళ్ళకి మంచి మందులా పనిచేస్తుంది. రోజ్ వాటర్ లో దూది ముంచి దానిని కనురెప్పలపై వేసినా కళ్ల అలసట తగ్గుతుంది. * చదువుతూనే కళ్ళకి అప్పుడప్పుడు చిన్నపాటి ఎక్సరసైజ్ ని చేయిస్తూ ఉండాలి. ఐ బాల్స్ ని గుండ్రంగా తిప్పుతూ, కిందకి మీదకి,ఎడమవైపు కుడివైపు తిప్పుతూ ఉంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ జాగ్రత్తలతో పాటు కళ్ళకి మంచి ఆరోగ్యనిచ్చే ఆహారం కూడా తీసుకుంటే పిల్లల కళ్ళు దెబ్బతినకుండా ముద్దులొలుకుతూ ఉంటాయి. --కళ్యాణి  

మోకాలి నొప్పుల వెనుక రహస్యం ఇదే!

కొందరు చేయి పైకెత్తితే చాలు భరించలేని నొప్పితో విలవిల్లాడిపోతారు. మరికొందరు నాలుగడుగులు వేయగానే నడుము నొప్పంటూ కూర్చుండిపోతారు. ఇక మోకాలి నొప్పి సంగతైతే చెప్పనే అక్కర్లేదు. అది ఇంటింటి బాధగా మారిపోయింది. అందరు మనుషుల్లోనూ ఒకే తీరున ఈ బాధలు ఎందుకు కనిపిస్తున్నాయి? మనిషి పరిణామక్రమానికీ, ఈ నొప్పులకీ మధ్య సంబంధం ఏమన్నా ఉందా? అన్న అనుమానం వచ్చింది ఆక్స్‌ఫర్డుకి చెందిన పరిశోధకులకి. దాంతో ఆ నొప్పుల వెనుక ఉన్న రహస్యం కాస్తా బయటపడిపోయింది.   నాలుగు నుంచి రెండుకి మనిషి కూడా మొదటి మిగతా జంతువులగానే నాలుగుకాళ్ల మీదే నడిచేవాడన్న విషయం తెలిసిందే! క్రమేపీ రెండుకాళ్ల మీద నిలబడటంతో అతని మేధస్సు కూడా పరుగులెత్తడం మొదలుపెట్టింది. ఇలా రెండు కాళ్ల మీద నడిచే క్రమంలో అతని కీళ్ల మధ్య కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ మార్పులను తెలుసుకునేందుకు పరిశోధకులు దాదాపు 300 అస్థిపంజరాలను గమనించారు. వీటిలో 40 కోట్ల సంవత్సరాల నాటి మనుషుల ఎముకలు కూడా ఉన్నాయి. వాషింగ్టన్‌లోని స్మిత్‌సోనియన్‌ సంస్థ సేకరించిన ఈ పురాతన ఎముకలకి సంబంధించిన స్కాన్లను పరిశీలించి ఆనాటికీ, ఈనాటికీ మన ఎముకల తీరులో వచ్చిన మార్పులను పోల్చి చూశారు.   బోలెడు మార్పులు మనిషి నిలబడి నడిచేటప్పుడు మరింత బరువుని మోసేందుకు వీలుగా, అతని తుంటి ఎముక దిగువ భాగం కాస్త వెడల్పుగా మారిందట. దీని వలన అది త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉందని తేలింది. ఆ కారణంగానే మనలో ఆర్థ్రైటిస్ సమస్యలు తలెత్తుతున్నాయట. ఇక భుజం కీలు దగ్గరేమో దీనికి విరుద్ధమైన మార్పు కనిపించింది. నడిచేటప్పుడు భుజాల మీద భారం తగ్గడం వల్లనో ఏమో... అక్కడి కీలు ఎముక మధ్య ఉన్న ఖాళీ తగ్గిందని తేలింది. దీని వల్ల ఆ ప్రదేశంలో ఉండే రక్తనాళాలు, కండరాలు నొక్కుకుపోతున్నాయని గమనించారు. చేతిని పైకెత్తగానే ఒక్కసారిగా భుజం కండరాలు విలవిల్లాడిపోవడానికి కారణం ఇదే కావచ్చు. మనుషుల మోకాళ్లు త్వరగా అరిగిపోవడానికి కూడా పరిణామక్రమంలో వచ్చిన ఈ మార్పులే కారణమని బయటపడింది.   ఆరంభం మాత్రమే అసలే పరిణామక్రమంతో మన శరీరంలో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయని బాధపడుతుంటే... ఇది మున్ముందు మరింత తీవ్రం కానుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే మరో 4000 ఏళ్ల తరువాత మోకాలు, తుంటి, భుజానికి సంబంధించి మరిన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే తగినంత వ్యాయామం చేయడం, నిటారుగా నడవటం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ లోపాలను కొంతవరకు ఎదుర్కోవచ్చునని సూచిస్తున్నారు.   - నిర్జర.

Adhesive Capsulitis of Shoulder

Adhesive Capsulitis of shoulder is the clinical term for the condition which we commonly call the 'Frozen Shoulder'. It is a painful and disabling disorder of the unknown origin, due to which the shoulder capsule and connective tissue of the shoulder joint become inflamed and stiff, estricting the movement and causing chronic pain. This pain is usually constant, but worsens at night and with cold weather.This condition sets at a slower pace and fades away gradually may be within a year or more. Frozen shoulder develops when the shoulder is seldom used due to pain, injury or health conditions like diabetes or stroke. Any shoulder problem may go further to develop into a frozen shoulder if its not employed to keep full range of motion. This obstructing disorder most often occurs after surgeries or injuries, in the age groups 40 - 70 years, in poeple with chronic diseases. It is more often seen in women than in men especially in post-menopausal women. Treatment includes the pain killer drug therapy and soothed by the application of heat to the affected area, followed by gentle streching. By applying ice the pain and swelling can be reduced. Physio-therapy can increase the range of motion of the shoulder. Most of the cases of frozen shoulder are preventable! Gentle, progressive range-of-motion exercises, stretching, and usage of the shoulder more often may help in preventing  frozen shoulder after surgery or an injury. But be patient and stick to your doctors advice, as frozen shoulder always get better over time! Take Care!! Stay Healthy!! ....SIRI