జూమ్ యాప్ పెళ్లిళ్లకు చట్టబద్ధత!
posted on Apr 20, 2020 @ 5:52PM
పెళ్లికాని ప్రసాద్ లకు కరోనా షాకిచ్చింది. పెళ్లిచేసుకుందామని అంతా రెడీ అయ్యాక కరోనా వైరస్ వచ్చి ఆపేసింది. ఒకటో, రెండో కాదు.. వందలాది పెళ్లిళ్లకు కరోనా దెబ్బ తగిలింది. ఏప్రిల్‌లో జరగాల్సిన వివాహాలన్నీ వాయిదాపడ్డాయి. కరోనా దెబ్బతో ఈఏడాది చాలా పెళ్లిళ్ళు ఆగిపోయాయి.
మరో వైపు 'పెళ్లిళ్ల విషయంలో ఇప్పుడు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జూమ్ వీడియో కాల్ యాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు' అని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. న్యూయార్క్ వాసులు వీడియో కాల్స్ ద్వారా పెళ్లిళ్లు చేసుకునేందుకు వీలుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తున్నానని తెలిపారు. ఇటువంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పెళ్లికాని ప్రసాద్ లకు ఇది శుభవార్తే మరి.
పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలు విదేశాల్లో, మన దేశంలోనే వేర్వేరు ప్రాంతాలు, నగరాల్లో చిక్కుకుపోయారు. వారి సొంత ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో మరికొన్ని పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. మే 4న విజయవాడలో వివాహం జరగాల్సిన పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇద్దరూ అమెరికాలోనే చిక్కుకుపోయారు. వారు ఇప్పట్లో భారత్‌కు వచ్చే పరిస్థితి లేదు. దీంతో పెళ్లి నిరవధికంగా వాయిదా వేశారు పెద్దలు.
అలాగే పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి విశాఖపట్నంలో, అమ్మాయి హైదరాబాద్‌లో చిక్కుకుపోయారు. ఈ నెల 14న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ వివాహమూ వాయిదా పడింది. లాక్ డౌన్ కారణంగా ఎవరూ ఎక్కడినించి ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. లాక్ డౌన్ ఎత్తేస్తారని భావించినా కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.
నెల రోజుల కిందటే ఏర్పాట్ల కోసం అడ్వాన్సులు ఇచ్చేశారు. కరోనా నేపథ్యంలో వివాహాన్ని వాయిదా వేశారు. కొందరు ముందుగానే శుభలేఖలు పంచేశారు. ప్రస్తుతం పెళ్లి వాయిదా పడిందని ఫోన్లలో సమాచారమిస్తున్నారు. కల్యాణ మండపాలు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, కేటరింగ్, డెకరేషన్, లైటింగ్, బ్యాండ్, మ్యారేజ్ ఈవెంట్ నిర్వాహకులకు అడ్వాన్సులు చెల్లించేశారు. మళ్లీ తాము అనుకున్న తేదీలకు అవి కుదురుతాయో లేదోనన్న ఆందోళన ఉంది.
ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు ఆయా ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో ఒక్క నిత్యావసర సేవలు మినహా మిగిలిన సేవలన్నీ పూర్తిగా ఆగిపోయాయి. అదేసమయంలో ముందుగా కుదుర్చుకున్న వివాహాది శుభకార్యాలన్నీ వాయిదాపడుతున్నాయి. అయితే, కొందరు మాత్రం వీడియో కాల్స్ ద్వారా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వివాహాలు వాయిదా పడకుండా ఉండేందుకు న్యూయార్క్ ప్రభుత్వం తాజాగా ఈ విషయంపై సానుకూలంగా ఆదేశాలు జారీచేసింది. వీడియో కాల్స్ ద్వారా పెళ్లి చేసుకుంటే సామాజికదూరం పాటిస్తూనే, వివాహం కూడా జరుపుకునే అవకాశం ఉండడంతో వాటికి అనుమతి ఇచ్చింది.
దీంతో పెళ్లికి సిద్ధమైన యువత గవర్నర్ చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జూమ్ యాప్ ద్వారా ఒక్కటయ్యే జంటలు శోభనాలను ఏ విధంగా జరుపుకోవాలన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇదే అంశంపై నెటిజన్లు కూడా తమకు తోచిన రీతిలో సెటైర్లు వేస్తున్నారు.