పేదలు, వలస కూలీలు దుర్భరంగా బ్రతుకీడుస్తున్నారు!
posted on Apr 20, 2020 @ 5:08PM
కరోనా వైరస్ నివారణకు చేపట్టిన లాక్డౌన్ కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వలన రైతులు , పేద ప్రజలు , వలస కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యలు తీరాలంటే సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు.
గత మూడు రోజులుగా రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. పిడుగుపాటుకు అనేకమంది రైతులు మృత్యువాత పడ్డారు. వారందరిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో రైతుల సమస్యలు, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై చర్చించకపోవడం దురదృష్టకరం అన్నారు. దేశం మొత్తం లాక్డౌన్ తో ఇంటికే పరిమితం అయ్యారు. పేద ప్రజలు , రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు ఉన్నారు. వారిపై చర్చించకుండా మహిళలు డ్వాక్రా రుణాలు చెల్లించాలి, ప్రాపర్టీ టాక్స్ కట్టాలి అని ప్రభుత్వం ప్రకటించడం హేయమైన చర్య, ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ కాలంలో పెన్షనర్లకి కోత విధించకుడదు , ఇతరులపై ఆదరపడకుండా అత్మ గౌరవంతో బ్రతుకుతున్న వారికి కోత వింధించడం వల్ల వారికి కొత్త సమస్యలు వస్తాయన్నారు. కరోనపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న పంచాయితీ రాజ్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి ప్రోత్సహం అందించకపోవడం విచారకరం అన్నారు. పరిశ్యుద్ధ పనులు చేసి ప్రతి పల్లెను, గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు. వారికోసం ఎంత చేసినా తక్కువే అన్నారు. కానీ అలాంటివారికి ప్రభుత్వం ఏమి చేయకపోవడం నిరుత్సాహపరిచింది అన్నారు.
రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ప్రకటించింది. దానికి అనుగుణంగా లేబర్ కమిషన్ బోర్డు ప్రతి భవన నిర్మాణ కార్మికునికి 1500 రూపాయలు అందించేలా తీర్మానం చేసి పంపిన సీఎం కేసీఆర్ ఆ తీర్మానం పై స్పందించకపోవడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికులు భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా ఉన్నారని వారందరు లాక్డౌన్ లో ఎలాంటి పని లేకుండా ఇంటిపట్టున ఉంటున్నారని అన్నారు. బోర్డు నిర్ణయం ప్రకారం కార్మికులందరికి 1500 వందల రూపాయలు అందించేలా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
గ్రామాల్లో సేవలందిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్స్ ని విధుల్లోకి తీసుకునే విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోక పోవడం విడ్డురం అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.
ఈ కష్టకాలన్ని ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎంపీ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.