నవరత్న పథకాల అమలు విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్న వైసిపి ప్రభుత్వం...
posted on Feb 8, 2020 @ 9:41AM
నవరత్న పథకాల అమలు విషయంలో వైసిపి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వెళుతోంది. మిగిలిన అంశాల్లో కాస్త కూస్తో తేడాలు జరిగినా చూసీ చూడనట్టుగా ఉంటుందేమో కానీ నవరత్నాలపై చాలా సీరియస్ గా ఉంది. ఇంటింటికీ పెన్షన్ లను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గతానికి భిన్నంగా అత్యంత త్వరగా పారదర్శకంగా పెన్షన్ లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించుకుంది దీనికి అనుగుణంగానే గ్రామ వాలెంటీర్ లు, గ్రామ సచివాలయం సెక్రెటరీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజునే తొంభై శాతం మేర పెన్షన్ లను పంపిణీ పూర్తి చేసింది ప్రభుత్వం. గతంలో ఇవే పెన్షన్ లను పంపిణీ చేయాలంటే కనీసం వారం రోజులు పట్టేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇంటింటికీ పెన్షన్ లను అమలు చేసే విషయంలో లబ్ధిదారుల నుంచి ప్రభుత్వానికి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. దీంతో పెన్షన్ ల పథకం అమలులో మరిన్ని వెసులుబాట్లు కల్పించడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంట్లో భాగంగా పెన్షన్ ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా నుంచి ఆయా మండలాల ఎంపిడీవోల బ్యాంకు ఖాతాలకు ఆ మండలానికి సంబంధించిన నిధులు వెళతాయి. అక్కడ నుంచి ఆ మండల పరిధి లోని గ్రామ సచివాలయాల సెక్రెటరీ కన్వీనర్ కు పెన్షన్ ల మొత్తాన్ని అందజేయడం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ లు జారీ ప్రక్రియ చేపడతారు.
ఇప్పుడు దీనికి చిన్నపాటి సవరణ చేపట్టే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ఖజానా నుంచి ఆయా మండలాల ఎంపీడీవో లకు కాకుండా నేరుగా గ్రామ సచివాలయం సెక్రెటరీ కన్వీనర్ల ఖాతాలకు సదరు గ్రామానికి చెందిన పెన్షనర్ ల నిధులను పంపి జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. దీని ద్వారా గ్రామాల నుంచి సదరు గ్రామ సచివాలయం సెక్రెటేరియట్ కన్వీనర్ కు మండల కేంద్రానికి వెళ్లే బాధ తప్పుతుంది అనేది సర్కారు పెద్దల వద్దకు వచ్చిన ప్రతిపాదన. మరో వైపు పెన్షన్ లను మరింత మందికి అందించేలా చర్యలు ప్రారంభించింది సర్కార్. గతంలో ఉన్న పెన్షన్ లతో పోల్చుకుంటే ప్రస్తుతం పెన్షన్ లు భారీ స్థాయిలో కోతలు విధించినట్టు విమర్శలు వస్తుండటంతో వీలైనంత మందిని పెన్షన్ ల అర్హుల జాబితాలో చేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గతంతో పోల్చుకుంటే సుమారు రెండు లక్షలకు పైగా లబ్ధిదారులకు అదనంగా పెన్షన్ లు జారీ చేస్తున్నా, ఇంతకు ముందున్న జాబితాలో ఉన్నవారిలో నాలుగు లక్షల పదహారు వేల ముప్పై నాలుగు మందిని అనర్హులుగా ప్రకటించారు. అయితే ఈ అనర్హుల జాబితాను పునహ్ పరిశీలించడం ద్వారా మరింత మందికి పెన్షన్ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. అలాగే మూడు వందల యూనిట్ల మేర విద్యుత్ ను వినియోగించుకోవటంతో సుమారు ఎనిమిది వేల తొమ్మిది వందల మంది అర్హత కోల్పోయారు. ఈ జాబితాను కూడా పరిశీలించడం ద్వారా ఇంకొంతమందికి పెన్షన్ సౌకర్యం కల్పించాలి అనేది సర్కారు సంకల్పం. నవరత్నాల పథకాల అమలు విషయంలో మరీ ముఖ్యంగా పెన్షన్ లు, అమ్మఒడి వంటి పథకాల్లో ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెప్పించుకోవడం, దానికనుగుణంగా అమలులో అవసరమైన మేరకు మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది నిరంతర ప్రక్రియగా పెట్టుకోవాలనే భావన ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోంది.