వైకాపా సానుభూతి కాంగ్రెస్ మంత్రులను ఆకర్షించేందుకేనా
posted on May 22, 2013 @ 10:04AM
నిన్న మొన్నటి వరకు జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ని మాత్రం బలిపశువుని చేసి, అదే కేసులో సీబీఐ చేత తప్పుపట్టబడిన మంత్రులను వెనకేసుకువస్తున్నారని కాంగ్రెస్ పార్టీని, కిరణ్ కుమార్ రెడ్డిని తప్పుపడుతూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, మొన్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను పదవులలోంచి తప్పించగానే, అకస్మాత్తుగా కొత్త రాగం అందుకొని వారిరువురూ కాంగ్రెస్-తెదేపాల రాజకీయ చదరంగంలో బలిపశువులయ్యారని వారిపై సానుభూతి కురిపించింది.
తద్వారా తమను అన్యాయంగా, చాలా అవమానకరంగా పదవులలోంచి తొలగించిందంటూ కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడుతున్న వారిరువురినీ, ఇదే అదనుగా తమ పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. చంద్రబాబు మంత్రులను తొలగించమని ఆదేశించగానే కాంగ్రెస్ ఇద్దరినీ తొలగించిందని, అదేవిధంగా మిగిలిన వారిని కూడా తొలగించమని ఆయన ఆదేశిస్తే వారినీ తొలగిస్తుందా అని వైకాపా నేత శోభానాగి రెడ్డి ప్రశ్నించడం, కిరణ్ ప్రభుత్వంలో కళంకిత మంత్రులుగా ముద్రపడి, తీవ్ర అభద్రతా భావంతో ఉన్న ఇతర మంత్రులలో మరింత భయాందోళనలు పెంచడానికేనని చెప్పవచ్చును. తద్వారా కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అసమ్మతి మంటలను మరింత ఎగదోసి ఇదే అదనుగా ఎంత మందిని వీలయితే అంత మందిని తమ పార్టీ వైపు ఆకర్షించుకోవాలని వైకాపా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
“తన పోరాటాల ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ కళంకిత మంత్రులను తొలగించవలసి వచ్చిందని స్వయంగా చంద్రబాబే, వేరెక్కడి నుండో కాక నేరుగా డిల్లీ నుండే ప్రకటించడంతో వైకాపా మాటలకు బలం చేకూరుతోంది.
తమ రాజీనామాలు ఆమోదిస్తే పార్టీని వీడి వైకాపాలో చేరడం ఖాయమన్నట్లు మంత్రులిరువురూ స్పష్టమయిన సంకేతాలు ఇస్తుండటంతో, కిరణ్ కుమార్ రెడ్డి ఇంత వరకు ఇద్దరు మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదానికి పంపలేకపోతున్నట్లు అర్ధం అవుతోంది. తద్వారా గాలిలో వ్రేలాడుతున్నట్లున్న ఇద్దరు మంత్రులను ఇదే అదనుగా తమ వైపు రప్పించుకోవాలని వైకాపా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
జగన్ సమ్మతిస్తే తెదేపా ఖాళీ అయిపోతుందని శోభా నాగిరెడ్డి మరో మాట కూడా అన్నారు. తెదేపా సంగతెలా ఉన్నా, ప్రస్తుతం ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి మిగిలిన కళంకిత మంత్రులపై వేటు వేసే సాహసం చేయకపోవచునేమో. మరి అధిష్టానం ఏమంటుందో?