రాజధాని ప్రాంతంలో త్వరలో జగన్ పర్యటన అందుకేనా?
posted on Dec 12, 2014 7:20AM
పంట రుణాల మాఫీ, రాజధాని భూముల వ్యవహారంలో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో రాష్ట్రంలో తన పార్టీని ఉనికిని కాపాడుకొంటూ, అధికార తెదేపాను ఏవిధంగా ఎదుర్కోవాలని చాలా తికమకపడుతున్నట్లున్నారు.
తూళ్ళూరు మండలంలో కొన్ని గ్రామాల ప్రజలు రాజధానికి తమ భూములు ఇచ్చేందుకు అయిష్టత చూపుతున్న విషయాన్ని గమనించిన ఆయన త్వరలో రాజధాని నిర్మించబోయే ప్రాంతాలలో స్వయంగా పర్యటించేందుకు సిద్దమవుతున్నారు. తద్వారా అక్కడి రైతులలో అసంతృప్తిని మరింత పెంచి పోషించడం ద్వారా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించవచ్చని బహుశః ఆయన ఆలోచన కావచ్చును. చాలా గ్రామాలలో రైతులు భూములు ఇచ్చేందుకు సిద్దమయినప్పటికీ, మధ్యలో కొన్ని గ్రామాల రైతులు ఇవ్వకపోతే ప్రభుత్వం వారిపై ఒత్తిడి చేసినా, చేయకున్నా కూడా ఇబ్బందులు ఎదుర్కోకతప్పనిసరి పరిస్థితి కలుగుతుందని జగన్ ఆలోచన కావచ్చును. అందుకే నిన్న తనను కలిసిన కొందరు రైతులకు తాను స్వయంగా తూళ్ళూరు మండలంలో పర్యటించి వారికి అండగా నిలుస్తానని, త్వరలో జరుగబోయే శాసనసభ సమావేశాలలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఆయన హామీ ఇచ్చారు.
రైతుల జీవనాధారమయిన భూములను ప్రభుత్వం తీసుకొంటే రైతులు ఆందోళన చెందడం సహజమే. అటువంటప్పుడు పార్టీలకతీతంగా ప్రతీ ఒక్కరు కూడా వారికి అండగా నిలవవలసిన అవసరం ఉంది. అయితే వారికి దైర్యం చెప్పి ప్రభుత్వం నుండి సరయిన నష్టపరిహారం పొందేలా చేసేందుకు ప్రయత్నాలు చేయాలి తప్ప వారిని భూములు ఇవ్వకుండా చేసి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నాలు చేయడాన్ని ఎవరూ హర్షించరు. ఇప్పటికే రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు. వారి ఆందోళన అర్ధం చేసుకొన్నముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వారితో మాట్లాడి వారికి ఎటువంటి నష్టము కలగనీయనని, వారి భవిష్యత్ కి తాను పూర్తి భరోసా ఇస్తానని హామీ ఇచ్చిన తరువాత అనేక గ్రామాలలో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయా గ్రామాలలో పర్యటించి రైతులను రెచ్చగొట్టినట్లయితే పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. విజయవాడ వద్ద రాజధాని నిర్మాణాన్ని తాను స్వాగతిస్తున్నాని శాసనసభలో ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, తన పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసమే మళ్ళీ ఈవిధంగా దానికి అడ్డంకులు సృష్టించాలనుకోవడం చాలా శోచనీయం. ఇటువంటి పనుల ద్వారా వైకాపా బలపడటం సంగతి అటుంచి, రాజధాని నిర్మాణానికి అడుగడునా అడ్డుపడుతున్నందుకు యావత్ రాష్ట్ర ప్రజలు అతనిని, అతని పార్టీకి మరింత దూరం అయ్యే అవకాశాలే ఎక్కువని జగన్ గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.