తెదేపా సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన
posted on Dec 12, 2014 7:44AM
నెలరోజుల క్రిందట తెలుగుదేశం పార్టీ ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఆరంభించిన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియకు అనూహ్యమయిన స్పందన వచ్చింది. ఆంధ్రాలో ఆ పార్టీ 20-25 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని పని ప్రారంభిస్తే ఏకంగా30 లక్షల మంది ఇంతవరకు సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. అయితే తెరాస ప్రభావం అధికంగా ఉన్న కారణంగా తెలంగాణాలో మాత్రం ఆశించినంత స్థాయిలో సభ్యత్వ నమోదు జరగలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ తెలంగాణాలో కూడా కొత్తగా ఏడెనిమిది లక్షల మందికి పైగా పార్టీ సభ్యత్వం తీసుకోవడం గమనిస్తే, అక్కడ పార్టీ నేతలు గట్టిగా కృషి చేసినట్లయితే మరింతమంది సభ్యులుగా చేరే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఏమయినప్పటికీ ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 18వ తేది రాత్రి 12గంటలకు, తెలంగాణాలో 24వ తేదీ రాత్రి 12గంటలకు నిలిపివేస్తామని ఆ పార్టీ సమన్వయకర్త నారా లోకేష్ ప్రకటించారు.
దేశంలో మరే రాజకీయపార్టీ కూడా ఓకే సారి ఇన్ని లక్షలమంది కొత్త సభ్యులను చేర్చుకొన్న దాఖలాలు లేవని తెదేపా కార్యకర్తలు, నేతల సమిష్టి కృషి కారణంగానే ఇది సాధ్యమయిందని ఆయన అన్నారు. గడువు తేదీ ముగిసేలోగా ఇరు రాష్ట్రాలలో కలిపి మొత్తం 40లక్షల మందిని సభ్యులుగా చేర్చేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగినందుకు పార్టీ ప్రధాన కార్యాలయం యన్టీఆర్ భవన్ లో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు మిటాయిలు పంచి అభినందనలు తెలిపారు. మళ్ళీ గడువు తేదీ నాటికి అనుకొన్న లక్ష్యం సాధించి అందరూ కలిసి ఘనంగా సంబరాలు చేసుకొందామని ఆయన చెప్పారు.