తాత్కాలిక రాజధానికి తరలి రావడానికి అయిష్టంగా ఉన్న ఉద్యోగులు
posted on Jan 6, 2015 @ 10:39AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీలయినంత త్వరలో విజయవాడ నుండి ప్రభుత్వ పాలన మొదలుపెట్టాలని కోరుకొంటున్నారు. అందుకోసం అమరావతి సమీపంలో తాత్కాలిక భవనాలను నిర్మించమని రాష్ట్ర మౌలికవసతుల కల్పన సంస్థకు ఆదేశాలు కూడా జారీ చేసారు. కానీ హైదరాబాద్ లో స్థిరపడిన ఉద్యోగులు మాత్రం మరో మూడేళ్ళ వరకు అక్కడి నుండి కదలలేమని కుండబ్రద్దలు కొట్టినట్లు చెపుతున్నారు. పిల్లల చదువులు, భార్యా భర్తలలో ఒకరు ప్రైవేట్ లేదా కేంద్రప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు చేస్తుండటం వంటివి వ్యక్తిగత కారణాలున్నాయి.
అవికాక రెండు రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ, విద్యా, విద్యుత్, నీటి పారుదల, రోడ్లు భవనాలు, ఆర్ధిక తదితర అనేక శాఖలకు చెందిన ఫైళ్ళు మార్పిడి ఇంకా జరుగవలసి ఉంది. ఆ ప్రక్రియ ఇంకా ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఇదికాక అనేక ప్రభుత్వ కేసుల విషయంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు హైకోర్టు చుట్టూ నిత్యం తిరుగవలసి ఉంటుంది. ఒకవేళ గుంటూరుకి తరలి వెళ్ళినట్లయితే ఆ కేసుల కోసం నిత్యం గుంటూరు-హైదరాబాద్ మధ్య తిరగడానికే సమయం అంతా సరిపోతుందని ఉద్యోగుల సంఘాల నేతల వాదన.
ఎస్‌టి యు రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ “అసలు ఒకేసారి దాదాపు 20,000 మంది ఉద్యోగులను ఎటువంటి ప్రాధమిక సౌకర్యాలు లేని చోటికి తరలించడం వలన ఉద్యోగులకీ, ప్రభుత్వానికీ కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. అందువలన ముందుగా ప్రాధమిక సౌకర్యాలు కల్పించి ఆ తరువాత అవసరాన్ని బట్టి ఉద్యోగులను అంచెలంచెలుగా గుంటూరు తరలించాలని సూచిస్తున్నారు.
“ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉంటూ మిగిలిన ఉద్యోగులను గుంటూరుకి తరలించితే వారి మధ్య సరయిన సమన్వయం లేక పాలనపరమయిన చిక్కులు ఏర్పడుతాయని” ఎపిఆర్‌ఎస్‌ఎ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. “అయినా హైదరాబాద్ లో పదేళ్ళపాటు ఉండే అవకాశం ఉన్నప్పుడు ఇంత హడావుడిగా దానిని వదిలిపెట్టి ఎటువంటి సౌకర్యాలు లేనిచోటికి వెళ్లి ఇబ్బందులు పడవలసిన అవసరం ఏమిటని” ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఇవ్వన్నీ విన్న తరువాత హైదరాబాద్ లో ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడప్పుడే గుంటూరుకు తరలి వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది.