5 లక్షలు కాదు కోటి రూపాయలు ఇవ్వాలి! వివేకా కేసులో జగన్ కు రఘురామ ట్విస్ట్..
posted on Aug 21, 2021 @ 3:21PM
ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. కొన్ని రోజులుగా దూకుడు పెంచిన సీబీఐ అధికారులు.. అనుమానితులందరిని ప్రశ్నిస్తున్నారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులను పలుమార్లు ప్రశ్నించారు.
తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ప్రకటన చేసింది. వివేకా హత్యపై నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు తెలిపింది. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ చేసిన ప్రకటనపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో సీబీఐ ప్రకటన ఇచ్చిందని, నిజాలు తెలిపిన వారికి రూ.5 లక్షలు అంటున్నారని చెప్పారు, ఆ లెక్కన సాక్ష్యం చెప్పేందుకు వచ్చేవారికి సీఎం జగన్ కోటి రూపాయల బహుమానం ఇవ్వాలని అన్నారు.
"ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తే వెంటనే పట్టుకుంటున్నారు. మరి వివేకా హత్యకేసులో నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారు?" అని రఘురామ ప్రశ్నించారు. ఈ కేసులో ఉన్న శ్రీనివాసరెడ్డి గతంలోనే హత్యకు గురయ్యాడని వెల్లడించారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా రక్షణ కోరారని తెలిపారు. సీబీఐ ప్రకటనతో వివేకా హత్యకేసు త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నట్టు రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసినవారు ఎవరైనా సరే ముందుకు రావాలని కోరుతూ సీబీఐ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. నమ్మకమైన, కచ్చితమైన, నమ్మదగిన సమాచారం కలిగిన వారు డిఎస్పీ దీపక్ గౌర్ (011-24368646, 9474256974), ఎస్పీ రామ్‌సింగ్ (011-24368649, 9988272709) లను కార్యాలయంలో కానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చని సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది.