జగన్ బాటలో కేసీఆర్.. మద్యం తాగించి ఖజానా నింపేలా స్కెచ్..
posted on Aug 21, 2021 @ 3:10PM
ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కొన్ని విషయాల్లో విబేధాలుంటే ఉండవచ్చును, కానీ, ఆ ఇద్దరి మధ్య చాలా విషయాల్లో సారూప్యాలున్నాయి. కొన్ని విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ రెడ్డి ఫాలో అయితే మరికొన్ని విషయాల్లో జగన్ రెడ్డిని కేసీఅర్ ఫాలో అవుతారు. ఇప్పుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మద్యం ఆదాయం పెంచుకునే విషయంలో ఏపీ సీఎంతో పోటీకి సిద్ధమవుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వం మద్యం విధానాన్ని సమూలంగా మార్చేసింది. ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగిపోయింది. ముఖ్యమంత్రి రెండు చేతులా సంపాదించుకుంటున్నారు. ఓ వంక అంచెలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెపుతున్న ప్రభుత్వం, మద్యం మీద వచ్చే ఆదాయంపై అప్పులు తెచ్చుకుంకుంటోంది. అంటే అప్పులు తీరాలంటే జనం చచ్చినట్లు తాగి తీరాలనే విధంగా వ్యవహరిస్తోంది. మరో వంక ఈ అప్పులు తీరటానికి మరో 25ఏ ళ్ళు పడుతుందని అంటున్నారు. అంటే 25ఏళ్ల వరకు జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా లేకున్నా, ఆయన చేసిన అప్పు ఉంటుంది. అలాగే, సంపూర్ణ మద్యం పాలసీ కొనసాగుతుంది.
తెలంగాణ ప్రభుత్వం జగన్ రెడ్డి అంత దుస్సాహసం అయితే చేయడంలేదు కానీ, ప్రజల సంక్షేమం కోసం, లిక్కర్ ఆదాయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకునేదుకు, రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను పెంచే ఆలోచన చేస్తోందని ఆబ్కారీ మాటగా వినిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం మద్యం దుకాణాలు ఏర్పాటుకు, మంచి గిరాకీ ఉన్న ప్రాంతాలను గుర్తుంచాలని అబ్కారీ శాఖను ఆదేశించింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన మండలాలలో ప్రతి కొత్త మండలంలో కనీసం ఒకటి వంతున, వీలైతే రెండు, మూడు షాపులను ఏర్పాటు చేయాలని, మొత్తంగా కనీసం 150 షాపులు అయినా కొత్తగా తెరిచేలా జాబితా తయారు చేయాలని, అబ్కారీ శాఖను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.
ప్రస్తుతం, తెలంగాణ రాష్ట్రంలో 2,216 మద్యం షాపులున్నాయి. ఈ షాపుల లైసెన్స్ గడువు, అక్టోబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపధ్యంలో నూతన పాలసీ తీసుకు రావాలని రావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే, షాపుల సంఖ్యను, అదే చేత్తో లైసెన్స్ ఫీజును పెంచే ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త షాపులకు వేలం పాట ద్వారా లైసెన్స్ మంజూరు చేస్తారు. తద్వారా ప్రభుత్వాని మాంచి కిక్కిచ్చే రేంజిలో ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ప్రాంతంలో 459 మండలాలున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కొత్తగా 133 మండలాలను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య 592కు చేరింది. కొత్తగా ఏర్పడిన మండలాల ప్రజలకు మందు అందుబాటులో లేదనే మాట రాకుండా ప్రభుత్వం ఇటీవల కొత్తగా 159 బార్లకు పర్మిషన్ ఇచ్చింది . ఇప్పుడు అదే క్రమంలో మద్యం షాపుల విషయంలోనూ జనం ఇబ్బందులు పడకూడని షాపుల సంక్ష్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో వైన్ షాపుల లైసెన్స్ ఫీజుతోనే ప్రభుత్వానికి 976 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక ఇప్పుడు కొత్తగా 150 మద్యం షాపులకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు అప్లికేషను, లైసెన్స్ ఫీజు సవరణలతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని, అధికారులు అంటున్నారు.
మద్యం అమ్మకాల్లో ఉత్పత్తి, విక్రయదారులకు కలిపి 40 శాతం పోగా మిగిలిన 60 శాతం వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ కింద రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఆవిధంగా ఒక్కజూలై నెలలో ప్రభుత్వ ఖజానాకు చేరిన మద్యం ఆదాయం, ఇంచుమించుగా రూ 1,600 కోట్లకుపైగా ఉంటుందని అధికార లెక్కలు సూచిస్తున్నాయి. ఇక ముందు, అది ఎన్నివేల కోట్లకు చేరుతుందో, ఏమో ..సంక్షేమ పథకాలు కావాలంటే, తప్పదు మరి. ఒకటి కావాలంటే ఒకటి వాడుకోక తప్పదు..