పులివెందుల to పాలేరు..
posted on Mar 24, 2021 @ 3:32PM
తెలుగువన్ చెప్పిందే మరోసారి నిజమైంది. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేయబోతున్నారని నెల రోజుల క్రితమే వెల్లడించింది తెలుగు వన్. పాలేరులో పోటీ చేయాలని నిర్ణయించింది కాబట్టే... ఖమ్మం వేదికగా కొత్త పార్టీ ప్రకటన చేయబోతున్నారని ప్రత్యేక కథనం ఇచ్చింది. ఇప్పుడు తెలుగు వన్ చెప్పినట్లే.. వైఎస్ షర్మిల ప్రకటన చేసింది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించింది. దివంగత సీఎం వైఎస్సార్‌కు పులివెందుల ఎలాగో, తనకు పాలేరు అలా అని ఆమె తెలిపింది. బుధవారం ఖమ్మం జిల్లా నేతలతో లోటస్‌పాండ్‌లో సమావేశమైన షర్మిల.. తన పోటీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది.
మరోవైపు షర్మిల పార్టీ ప్రకటనకు సంబంధించిన బహిరంగ సభకు ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ సభకు పోలీసులు అనుమతినిస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 9న ఖమ్మంలో షర్మిల సభ నిర్వహించనున్నారు. ఈ లోగా ప్రభుత్వం కరోనా దృష్ట్యా ఏవైనా ఆంక్షలు విధిస్తే? ఎలా అన్న కోణంలో నేతలు ఆలోచిస్తున్నారు. సభ నిర్వహణ కోసం మైదానానికి అవసరమైన అనుమతి వచ్చినప్పటికీ, పోలీస్ శాఖ నుంచి మాత్రం ఇంకా అనుమతి రాలేదు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, తాము మాత్రం సభ నిర్వహించి తీరుతామని, తమను ఎవరూ ఆపలేరని షర్మిల స్పష్టం చేస్తున్నారు.
వైఎస్ షర్మిలకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, తూడి దేవందర్ రెడ్డి సహా పలువురు నేతలు ఆమెకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ కుడా షర్మిల పార్టీలో చేరారు. పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు ఆమెకు సలహాదారులుగా ఉన్నారు. ఉద్యమ గాయకుడు ఏపూరు సోమన్న కూడా షర్మిల పార్టీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు డీజీపీగా పనిచేసిన స్వరణ్ జిత్ సేన్ దంపతులు మంగళవారం లోటస్ పాండ్ కు వెళ్లి షర్మిలకు మద్దతు తెలిపారు.