వైఎస్ షర్మిల వాట్ నెక్స్ట్!
posted on Jun 3, 2024 @ 11:23AM
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ ను పూర్తిగా తిరస్కరించారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగిలిన దాఖలాలు లేవు. విభజన తరువాత జరిగిన తొలి రెండు ఎన్నికలలోనూ జీరో స్థానాలతో రిక్త హస్తాలతో మిగిలిన పార్టీ.. 2024 ఎన్నికలలో మాత్రం రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం కాకపోయినా.. ఉనికి చాటుకోవడానికి చాలా చాలా కష్టపడింది. పార్టీకి దూరమైన వైఎస్ బ్రాండ్ ను షర్మిల ద్వారా తిరిగి సొంతం చేసుకోవడానికి ఎత్తుగడ వేసింది. సరిగ్గా ఎన్నికలకు నెలల ముందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించింది. ఇది కాంగ్రెస్ శ్రేణులలో ఒకింత జోష్ నింపింది. అయితే ఆ జోష్ రాష్ట్రంలో కనీసం కొన్ని అసెంబ్లీ స్థానాలలైనా గెలుచుకునేందుకు ఇసుమంతైనా సరిపోలేదని పోలింగ్ తరువాత స్పష్టమైంది.
అయితే షర్మిల స్వయంగా కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆమె ప్రసంగాలు, అధికార పార్టీపై, మరీ ముఖ్యంగా తన సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ పై ఆమె చేసిన విమర్శలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
కాంగ్రెస్ అధినేత్రిగా ఆమె రాష్ట్రం మొత్తం పర్యటించి పార్టీ తరఫున ప్రచారం చేసినా ఆమె మొత్తం కాన్సన్ ట్రేషన్ అంతా స్వయంగా తాను పోటీ చేస్తున్న కడప లోక్ సభ స్థానంపైనే పెట్టారు. తన ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ, ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ఆయనను వెనకేసుకు వస్తున్న అన్నని గట్టిగా నిలదీశారు. ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పుకోలేక ఇద్దరూ ఇబ్బంది పడ్డారు. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య అంశం ఎత్తకూడదంటూ కడప కోర్టు నుంచి గాగ్ ఆర్డర్ సైతం తెచ్చుకున్నారు. వివేకా హత్య ఒక వైపు అవినాష్ విజయంపై నీలి నీడలు కమ్ముకునేలా చేయగా, మరో వైపు సరిగ్గా పోలింగ్ కు ముందు రోజు వైఎస్ విజయమ్మ.. అమెరికా నుంచి ఓ వీడియో సందేశంలో వైఎస్ షర్మిలని గెలిపించాలని కడప ఓటర్లకు చేసిన విజ్ణప్తితో కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి షర్మిల విజయం తథ్యమన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది.
అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం షర్మిల విజయం అంత సునాయాసం కాదని తేల్చేశాయి. ఏ ఎగ్జిట్ పోల్ కూడా కడపలో షర్మిల విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొన లేదు. అంతే కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఒక్కంటే ఒక్క సీటు గెలుచుకునే అవకాశాలు కూడా లేవనే పేర్కొన్నాయి. దీంతో ఇప్పుడు షర్మిల పొలిటికల్ స్టెప్ ఏమిటి? అన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె పార్టీ ఉనికే కనిపించని పార్టీ తరఫున చేసే పని కూడా ఉండదు. దీంతో షర్మిల వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్న తలెత్తుతోంది. పరిశీలకులు మాత్రం ఆమెకు ముందుగానే కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ మేరకు ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు.