బీఆర్ఎస్ పతనం పరిపూర్ణం?
posted on Jun 3, 2024 @ 10:53AM
తెలంగాణ సాధించిన పార్టీగా పదేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు పరిపూర్ణంగా పతనమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది చివరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ప్రారంభమైన బీఆర్ఎస్ పతనం లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత పరిపూర్ణమౌతుందని అంటున్నారు. పార్టీ పేరులోంచి తెలంగాణను తొలగించి టీఆర్ఎస్ ను కాస్తా బీఆర్ఎస్ గా మార్చిన క్షణం నుంచి ఆ పార్టీ తిరోగమనం ఆరంభమైంది. తాజా లోక్ సభ ఎన్నికలలో కనీస స్థానాలలో కూడా ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ తేల్చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ భవిష్యత్ పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ లోగా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆ పార్టీ నిలబెట్టుకున్నా.. పార్టీకి అదేమంత కలిసొచ్చేది కాదని అంటున్నారు.
తాజాగా ముగిసిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ సోదిలోకి లేకుండా పోయిందనీ, ప్రధానంగా పోటీ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే జరిగిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చడానికి ముందే పరిశీలకులు కూడా ఆ దిశగానే విశ్లేషణలు చేశాయి. అసలు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలే కనిపించ లేదు. గత ఏడాది డిసెంబర్ లో జరిగని అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ గ్రేటర్ పరిథిలో మంచి ఫలితాలు రాబట్టింది. ఆ స్థానాలే బీఆర్ఎస్ విపక్ష హోదా దక్కించుకోవడానికి దోహదం చేశాయి. అయితే ఈ తరువాత వెంటనే జరిగిన లోక్ సభ ఎన్నికలలో గ్రేటర్ పరిథిలో బీఆర్ఎస్ బాగా వెనుకబడిందని ఎగ్జిట్ పోల్స్ ను బట్టి తెలుస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ పతనం పరిపూర్ణమైనట్లే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఐదు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే గ్రేటర్ పరిథిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్ లలో లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుపు ధీమాతో ఉండాలి. కానీ పోలింగ్ తరువాత బీఆర్ఎస్ లో ఆ ధీమా ఇసుమంతైనా కనిపించలేదు. తీరా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తరువాత ఆయా స్థానాలలో బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదని తేటతెల్లమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే జరిగిందని అర్ధమౌతున్నది.