సిగ్గు లేని సీఎం.. తిట్లు మామూలుగా లేవుగా!
posted on Dec 21, 2021 @ 1:38PM
సిగ్గు లేదు.. దద్దమ్మ... ఇంగితం లేదు.. రైతు ద్రోహి.. ఇవన్ని ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్, కేటీఆర్ ఇలాఖాల్లో రైతుల ఆత్మహత్యలు సిగ్గుచేటని అన్నారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు షర్మిల. గంభీరావు పేటలో మాట్లాడుతూ.. కేటీఆర్‌కు కనీసం ఇంగిత జ్ఞానం లేదని మండిపడ్డారు. రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. రుణమాఫీ ఇంకా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అధికారం అనుభవిస్తే సరిపోదని బుద్ధి, సిగ్గు ఉండాలన్నారు.
సీఎం కేసీఆర్ రైతు ద్రోహి అని, రైతుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రే కారణమని షర్మిల ఆరోపించారు. వరి వద్దని చెప్పే అధికారం సీఎంకు లేదన్నారు. మద్దతు ధర ఉన్న పంటలనే రైతు పండిస్తారని, వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దన్నారు. కేసీఆర్ సీఎంగా పనికి రారని, చావు డప్పు కేసీఆర్‌కు, ఆయన ప్రభుత్వానికి కొట్టాలన్నారు. ఇవి ఆత్మహత్యలు కావని, కేసీఆర్ చేసిన హత్యలని వైఎస్ షర్మిల అన్నారు. మీ సత్తాలేని పాలన వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని... ఇంగితం ఉంటే రైతులను ఆదుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యేని, మంత్రిని, కాబోయే సీఎంనని చెప్పుకోవడానికి సిగ్గుండాలని వైఎస్ షర్మిల అన్నారు.
బోర్లు వేసుకున్న రైతులకు దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో చేశారని షర్మిల చెప్పారు. పదవుల్లో ఉన్న తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. రైతుబంధు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి... విత్తనాలు, సబ్సిడీలు, యంత్రలక్ష్మి, నష్టపరిహారాలను బంద్ పెట్టారని అన్నారు. మరణించిన రైతు కుటుంబాలకు కూడా పెన్షన్ ఇవ్వడం చేతకాని ప్రభుత్వం ఇదని షర్మిల విమర్శించారు. పరిపాలన చేతకాక గల్లీల్లో దర్నాలు, ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని షర్మిల విమర్శించారు.