తులసి రెడ్డికి పీసీసీ పగ్గాలు?
posted on Dec 21, 2021 @ 1:08PM
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుని మార్పుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఆ దిశగా కసరత్తు ప్రారంభించిందా? అందుకేనా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఉమెన్ చాందీ విజయవాడ చేరుకుంది? రేపో మాపో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు శైలజా నాథ్ స్థానంలో కొత్త పీసీసీ చీఫ్ రావదం,ఖాయేమేనా?అంటే అవుననే అంటున్నారు పార్టీ ఇన్సైడర్స్.
నిజానికి, రాష్ట్ర విభజన నాటి నుంచి నవ్యాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉండీ లేనట్లుగానే ఉంది. వరసగా 2014,2019 సార్వత్రిక ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. నవ్యాంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఇంతవకు కాంగ్రెస్ పార్టీ కాలు పెట్టలేదు. రెండు ఎన్నికలలోనూ హస్తం పార్టీకి రెండు శాతం కంటే తక్కువగానే ఓట్లు పోలయ్యాయి. అయినా గతవైభవ చిహ్నంగా పార్టీ మనుగడసాగిస్తూనే వుంది. రాష్ట్ర విభజన నేపధ్యంగా పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి పరిస్థితులు అనుకులించక పోయినా, ఐదారేళ్ళు చురుగ్గానే పనిచేశారు. రఘువీరా రెడ్డి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత,మరో మాజీ మంత్రి శైలజానాథ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అయితే, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుని ముందుకు సాగడంలో ఆయన అంతగా విజయం సాదించలేక పోయారు. మరో వంక ఆయన వ్యవహర సరళికి సంబంధించి పార్టీ అధిష్టానానికి గత కొంత కాలంగా ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపధ్యంలోనే పార్టీ అధిష్టానం ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది.
పీసీసీ అధ్యక్షుని మార్పు విషయం చర్చించేందుకే విజయవాడ చేరుకున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఉమెన్ చాందీ రెండు రోజుల పాటు విజయవాడలో బస చేయనున్నారు. ఈరోజు ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సమావేశం అవుతారు. రేపు (బుధవారం) పీసీసీ సమావేశంలో పాల్గొంటారు. అలాగే, బుధవారం మరోమారు పార్టీ ముఖ్య నాయకులతో ఉమెన్ చాందీ సమావేశం అవుతారని, ఈ మొత్తం ఎక్సర్సైజ్, కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసమే అని పార్టీ వర్గాల సమాచారం. ఆగష్టులో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో రాహుల్ గాంధీ సమావేసమైనప్పుడే పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని వార్తలొచ్చాయి. అప్పట్లో రాజ్య సభ మాజీ సభ్యుడు కేవీపీ రామ చంద్రరావు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటుగా కేంద్ర మాజీమంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, ఎంపీలు కేవీపీ, హర్ష కుమార్, చింతా మోహన్ మరికొందరు నాయకులు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా, కేవీపీ, కిరణ్ కుమార్ రెడ్డి, పల్లంరాజు, పేర్లు పీసీసీ అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి.
అయితే ఇప్పుడు పీసీసీ రేసులో మరో రెండు మూడు పేర్లు షికారు చేస్తున్నా, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. తులసి రెడ్డివైపే రాహుల్ గాంధీ మొగ్గుచుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై రాహుల్ గాంధీ ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నివిధాలా విఫలమైన నేపధ్యంలో పార్టీ పునర్జీవనానికి ఇదే సరైన సమయమని ఉమెన్ చాందీ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆయన రాహుల్ గాంధీకి ఒక నివేదికను కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారనే ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే తులసి రెడ్డి ఎంపిక నిర్ణయం జరిగిందని, ఇక ప్రకటన మాత్రమే మిగిలుందని అంటున్నారు.