తాడిపత్రిలో దీక్షకు షర్మిల రెడీ.. ముందే షాకిచ్చిన మంత్రి..
posted on Jul 12, 2021 @ 4:04PM
ప్రజా సమస్యలపై దీక్షలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు వైఎస్ షర్మిల. కొత్త పార్టీతో ఇక తన సత్తా ఏంటో నిరూపించుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే నిరుద్యోగ సమస్యలపై ఇందిరా పార్కు దగ్గర దీక్ష చేయడం.. జాకెట్ చినగడం.. అరెస్ట్ కావడం.. ఇలా పొలిటికల్‌గా ఫుల్ మైలేజ్ తెచ్చుకున్నారు షర్మిల. ఆ టెంపోను అలానే కంటిన్యూ చేసేందుకు.. తాజాగా తాడిపత్రిలో నిరుద్యోగ నిరాహార దీక్షకు సిద్దమవుతున్నారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.
పార్టీ ప్రకటన అనంతరం షర్మిల తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల పర్యటనకు సిద్దమవుతున్నారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగుల కోసం చేస్తున్న నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా, వైఎస్ షర్మిల ఈ నెల 13న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపత్రి గ్రామంలో ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ చేపట్టనున్నారు.
తాడిపత్రికి చెందిన కొండల్ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించనున్నారు. బాధిత కుటుంబీకుల సమక్షంలో పగలంతా.. ఆమె నిరాహారదీక్ష చేయనున్నారు. అయితే.. షర్మిల దీక్ష విషయం తెలిసి టీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. షర్మిల రాకకు ముందే.. సోమవారం మంత్రి నిరంజన్‌రెడ్డి కొండల్ కుటుంబాన్ని పరామర్శించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామంలో ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదంటూ ఇటీవల కొండల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో కలకలంగా మారింది. ఈ విషయం తెలిసి షర్మిల మంగళవారం కొండల్ ఇంట్లో దీక్షకు సిద్దమయ్యారు. షర్మిల దీక్షకు కౌంటర్‌గా అన్నట్టు.. తాజాగా మంత్రి నిరంజన్‌రెడ్డి కొండల్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ. లక్ష చెక్కు అందజేశారు. కొండల్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. యువత క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని.. ప్రభుత్వం దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి తెలిపారు. త్వరలో భారీ నోటిఫికేషన్లు రానున్నాయని విద్యార్థులు ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు.
అటు.. షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష.. ఇటు మంత్రి నిరంజన్‌రెడ్డి ఓదార్పు యాత్రతో తాడిపర్తి గ్రామంలో రాజకీయ హడావుడి నెలకొంది.