రఘురామపై అనర్హత వేటు? క్లారిటీ ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
posted on Jul 12, 2021 @ 4:04PM
నర్సాపురం ఎంపీ రాఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు పడనుందా? వైసీపీ ఎంపీలు చెబుతున్నట్లు స్పీకర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారా? రఘురామ విషయంలో దీనిపై ఇటీవల కాలంలో జోరుగా చర్చ సాగుతోంది. ఢిల్లీకి వెళ్లి మరీ విజయసాయి రెడ్డి లాబీయింగ్ చేస్తుండటంతో రఘురామ అంశంలో ఏం జరుగుతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లోనూ కన్పిస్తోంది. అయితే వైసీపీ ఇచ్చిన అనర్హత పటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఆ విషయంపై రన్నింగ్ కామెంటరీ చేయలేమని స్పీకర్ అన్నారు. అనర్హత పిటిషన్‌పై చర్యలకు ఒక ప్రక్రియ అంటూ ఉంటుందని, ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఇరుపక్షాల వాదనలు వింటామన్నారు. సభను స్తంభింపజేస్తామని వైసీపీ ఎంపీలు చెప్పడంపై స్పందించిన స్పీకర్.. సభలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు.
రఘురామ అనర్హత పిటిషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను రాజ్యసభ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కోరారు. గత శుక్రవారం స్పీకర్‌ను కలిసిన ఆయన.. పిటిషన్ వేసి ఏడాది గడిచిందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకర్ చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్‌లో ఆందోళన చేపడతామని వ్యాఖ్యానించారు. అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామన్నారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే అర్ధం వచ్చేలా కూడా విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజు తన విమర్శలను ఎక్కుపెడుతూనే ఉన్నారు. తాజాగా సోమవారం ఆయన మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై దాడులు జరగకూడదని తాను చెప్పడం కూడా పార్టీ వ్యతిరేక నిర్ణయం కిందకు వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం జగన్ ను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? అన్న అనుమానం వెలిబుచ్చారు. ఏపీలో దేవాలయాలపై జరిగిన దాడులను ఖండిస్తున్నానని తాను చెప్పడం వైసీపీ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. తాను వెల్లడిస్తున్న అభిప్రాయాలు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయా? అని రఘురాజు ప్రశ్నించారు. తన పార్లమెంటు సభ్యత్వంపై వేటు వేయాలని వైసీపీ చేస్తున్న డిమాండ్ కు కారణం ఏమిటని నిలదీశారు. తాను చేసిన తప్పు ఏమిటో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే వేటు వేయాలని అంటారా? అంటూ ఎంపీ రఘురామ రాజు మండిపడ్డారు.