అప్పుడు గ్రామ కమిటీలు... ఇప్పుడు వాలంటీర్లు... 2025లో జగన్ కొంప మునగడం ఖాయమేనా?
posted on Mar 2, 2020 @ 3:32PM
టీడీపీ గ్రామ కమిటీలతో చంద్రబాబుకు ఎంత నష్టం జరిగిందో 2019 ఎన్నికల్లో రుజువైంది. తెలుగుదేశం గ్రామ కమిటీ సభ్యుల అతితో పార్టీకి నష్టం జరుగుతోందని, సొంత నేతలు నెత్తీనోరు మొత్తుకున్నా, ఆనాడు చంద్రబాబు వినిపించుకోలేదు. చివరికి, ఏమైంది, 2019లో ఎన్నడూలేనంతగా దారుణమైన ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. తెలుగుదేశం ఘోర పరాజయంలో టీడీపీ గ్రామ కమిటీ సభ్యుల పాత్ర అంత గొప్పది. చంద్రబాబు చేసిన తప్పిదాల కంటే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం గ్రామ కమిటీ సభ్యులు చేసిన నష్టమే ఎక్కువ. అంతలా టీడీపీ కొంప ముంచారు వాళ్లు. అయితే, టీడీపీ గ్రామ కమిటీ సభ్యుల తరహాలోనే.... గ్రామ వాలంటీర్లు త్వరలో జగన్ కొంప ముంచడం ఖాయమంటున్నారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ... చివరికి, వైసీపీ పాలిట శాపమయ్యే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.
గ్రామ వాలంటీర్లపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో వ్యతిరేకత లేకపోయినా, ఇప్పడిప్పుడే అసంతృప్తి, నెగటివ్ నెస్ మొదలవుతోందని అంటున్నారు. ముఖ్యంగా పెన్షన్లు లాంటి నగదు సంబంధమైన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో గ్రామ వాలంటీర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పెడుతోన్న రకరకాల నిబంధనల్లో ఏదో ఒకటి సాకుగా చూపి, తమకు ముడుపులు ఇవ్వకపోతే... మీ పెన్షన్ తీసేస్తాం... మీకు ఆ పథకం వర్తింపకుండా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే, ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, నిజంగా క్షేత్రస్థాయిలో ఇదే జరుగుతోంది. ఎందుకంటే, మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యేలకు గ్రామ వాలంటీర్ల మీద ప్రతిరోజూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వ్యాఖ్యలే అందుకు రుజువు. గ్రామ వాలంటీర్ల అవినీతిపై ఆధారాలతో సహా తనకు ఎన్నో ఫిర్యాదులు అందాయని, బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, పైగా ఆ డబ్బును వైసీపీ నాయకులకు ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాలనాగిరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రజాప్రతినిధులు ఎంతోమంది గ్రామ వాలంటీర్ల అవినీతిపై గుర్రుగా ఉన్నారు. లంచాలు డిమాండ్ చేయడం, లెక్కలేనితనంగా ఇష్టానుసారంగా మాట్లాడటం, మహిళలకు మర్యాద ఇవ్వకపోవడం లాంటి ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని చెబుతున్నారు. అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను అప్రతిష్టపాలు చేయడం ఇష్టంలేకే మౌనంగా ఉంటున్నామని, కానీ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం, ఇప్పుడు టీడీపీకి పట్టిన గతే, 2025లో వైసీపీకి పడుతుందని హెచ్చరిస్తున్నారు.