సంగారెడ్డిపై హరీష్ ఫోకస్... నియోజకవర్గం మారతారా? లేక జగ్గన్నకు చెక్ పెట్టేందుకేనా?
posted on Mar 2, 2020 @ 3:19PM
హరీష్ రావు అంటే సిద్దిపేట... సిద్దిపేట అంటే హరీష్ రావు... అంతలా సిద్దిపేటను తన పేటగా మార్చేసుకున్నారు హరీష్ రావు.... ఎంతలా ఉంటే, మొత్తం రాష్ట్రంలోనే హైయ్యెస్ట్ మెజారిటీ తనకే వచ్చేలా ప్రజల మనిషిగా మారారు... అయితే, హరీష్ రావు మనసు ఇప్పుడు మరో సెగ్మెంట్‌పై మళ్లుతోందని అంటున్నారు. హరీష్ ఫోకస్ మరో నియోజకవర్గంపై పడిందట. అదేదో కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కంచుకోట సంగారెడ్డి. మున్సిపల్ ఎన్నికల దగ్గర్నుంచి సంగారెడ్డిపై హరీష్ ప్రత్యేక దృష్టిపెట్టారని అంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో రెండు కీలక మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు హరీష్ రావు. దాంతో, నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించాలనే పట్టుదలతో ఉన్నారట హరీష్. అందులో భాగంగానే తన నియోజకవర్గం సిద్దిపేట తర్వాత, సంగారెడ్డి నియోజకవర్గానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఏ చిన్న ప్రభుత్వ కార్యక్రమమైనా, సంగారెడ్డిలో హరీష్ వాలిపోతున్నారని మాట్లాడుకుంటున్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా, సంగారెడ్డిలో కలియ తిరిగిన హరీష్ రావు.... పలు వార్డుల్లో పర్యటించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నించారు. అంతేకాదు, సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ క్యాడర్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారట హరీష్. సంగారెడ్డి గులాబీ నేతల ఫోన్ కాల్స్‌కు రెస్పాండ్ కావడంతోపాటు, వారికి కావాల్సిన పనులు చేసి పెడుతూ నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. సంగారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడల్లా ముఖ్య కార్యకర్తల ఇంటికెళ్లి మాట్లాడుతున్నారు.
సంగారెడ్డిపై హరీష్ ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణం స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి వైఖరే కారణమని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో హరీష్ ను జగ్గారెడ్డి బహిరంగంగా దూషించడం, అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, మంత్రి కసి పెంచుకున్నారని అంటున్నారు. ఎలాగైనా జగ్గారెడ్డికి చెక్‌పెట్టాలన్న లక్ష్యంతోనే నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా, ఇప్పుడు నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు సాధించి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఊపిరాడకుండా చేయాలనేది హరీష్ వ్యూహంగా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటున్నారు.