మార్నింగ్ మీటింగ్... మధ్యాహ్నం తీర్మానం... మండలి రద్దు ఖాయమే..!
posted on Jan 25, 2020 @ 9:46AM
ఏపీ శాసనమండలి కొనసాగుతుందో లేక రద్దు చేస్తారో మరో రెండ్రోజుల్లో తేలిపోనుంది. మండలి ఉండాలో వద్దో సోమవారం శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... అదే రోజు ఉదయం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశంకానున్న ఏపీ కేబినెట్... కౌన్సిల్ వివాదంపై విస్తృతంగా చర్చించనుంది. అయితే, కేబినెట్‌లో తీసుకునే నిర్ణయం మేరకే మండలిపై శాసనసభలో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.
రాజధాని వికేంద్రీకరణ... అలాగే సీఆర్డీఏ బిల్లులు మండలిలో ఆమోదం పొందే పరిస్థితులు లేకపోతే కనుక.... కౌన్సిల్ రద్దు వైపే మొగ్గుచూపే అవకాశముందని భావిస్తున్నారు. ఎందుకీ మండలి అంటూ శాసనసభ వేదికగా సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కౌన్సిల్ రద్దు దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది. అయితే, సోమవారంలోపు పరిస్థితులేమైనా ప్రభుత్వానికి అనుకూలంగా మారితే మాత్రం మండలి రద్దుపై వెనక్కి తగ్గే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ సానుకూల వాతావరణం లేకపోతే మాత్రం కౌన్సిల్ రద్దు తప్పదేమోనంటున్నారు. నిజానికి, శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఇంగ్లీషు మీడియం, ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల బిల్లులను మండలి తిరస్కరించినప్పుడే... మండలి రద్దు ఆలోచన చేశారని, ఇక, ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు విషయంలోనూ చుక్కెదురు కావడంతో కౌన్సిల్ రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు.
మొత్తానికి, జగన్ ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారిన మండలి రద్దుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, మండలి పరిస్థితులు ప్రభుత్వానికి అనుకూలంగా మారకపోతే మాత్రం... కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించే అవకాశముంది. ఆ తర్వాత ఉభయ సభలను ప్రోరోగ్ చేసి మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆర్డినెన్సులు జారీచేసి తన పంతం నెగ్గించుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.