కరోనా కల్లోలం... చైనా అతలాకుతలం...
posted on Jan 25, 2020 @ 9:58AM
కరోనా వైరస్... చైనాను కుదిపేస్తోంది. సుడిగాలిలా దేశమంతటా విస్తరిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తోంది. వందల మంది కాదు... వేల మంది కాదు... కోట్లాది మంది చైనీయులు కరోనా భయంతో వణికిపోతున్నారు. కరోనా వైరస్ కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది కూడా ఈ వైరస్ బారినపడుతున్నారు. దాంతో, కరోనా రోగులకు చికిత్స అందించాలంటేనే వైద్యులు జంకుతున్నారు. ఇక, కరోనా బాధితులను ప్లాస్టిక్ ట్యూబుల్లో పెట్టి తరలిస్తున్నారు. మరోవైపు, వైరస్ విస్తరించకుండా చైనా జాగ్రత్తలు తీసుకుంటోంది. దాదాపు చైనా అంతటా ట్రావెల్ బ్యాన్ విధించింది. ముఖ్యంగా వైరస్ బయటపడిన ఉహన్ నగరంలో ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేశారు. అలాగే, చైనా అంతటా అన్ని రకాల ఉత్సవాలను రద్దు చేశారు. కరోనా భయంతో చైనాకు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నిలిచిపోతున్నాయి.
మరోవైపు వరల్డ్ వైడ్ గా కరోనా వైరస్ విస్తరిస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 800మంది కరోనా బారినపడగా... 25మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా అంతటా కరోనా వైరస్ వ్యాపించగా... జపాన్, థాయ్ లాండ్, అమెరికాలో కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా భయంతో పలు దేశాలు చైనా వెళ్లొద్దని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి.
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో భారత్ కూడా అప్రమత్తమైంది. అన్ని విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోనూ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. చైనా, హంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించేందుకు ప్రత్యేక మెడికల్ స్కానర్లు ఏర్పాటు చేశారు. అలాగే, కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు వైద్య బృందాలను నియమించారు. అలాగే, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ప్రత్యేక ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. అయితే, కేరళలో ఓ నర్సు కరోనా బారినపడినట్లు వస్తున్న వార్తలు భారత్ లో కలకలం రేపుతున్నాయి.