జగన్‌ను ఓడించడమే ప్రధాన లక్ష్యం
posted on Mar 31, 2011 @ 10:20AM
హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికలపై కాంగ్రెసు వ్యూహం మారినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెసు నాయకత్వం తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వ్యూహం మారినట్లు తెలుస్తోంది. కడప లోక్ సభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు నేత వైయస్ జగన్‌ను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మపై పోటీకి దిగకూడదని కాంగ్రెసు నాయకత్వం అనుకుంటున్నట్లు సమాచారం. కడప లోక్ సభ స్థానంలో వైయస్ జగన్‌పై ఆయన బాబాయ్, వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని పోటీకి దించాలని, జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్‌పై గౌరవంతోనే తాము వైయస్ విజయమ్మపై పోటీ పెట్టడం లేదని ప్రచారం చేసుకుని జగన్‌ను లోకసభ స్థానంలో దెబ్బ తీయాలని ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖను బట్టి ఈ వ్యూహం అర్థమవుతోంది. పులివెందులలో వైయస్ విజయమ్మపై అభ్యర్థిని పోటీకి దించకూడదని కోరుతూ ఆయన సోనియాకు లేఖ రాశారు. ఇలా తమ పార్టీ నాయకుల ద్వారా విజ్ఞప్తులు చేయించి వైయస్ విజయమ్మపై పోటీని విరమించుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.