Read more!

అరెస్టు భయంతో ముందస్తు బెయిలుకు అవినాష్

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమని ఫిక్సైపోయారా? అందుకే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారా అంటే న్యాయ నిపుణులు ఔననే అంటున్నారు. గత విచారణ సందర్భంగానే సీబీఐ తెలంగాణ హైకోర్టుకు అవినాష్ ను అరెస్టు చేయనున్నట్లు చెప్పింది. అయితే ఆ తరువాత కేసు దర్యాప్తు ఎందుకనో మందగించింది.

కేసు దర్యాప్తు వేగం మందగించడానికీ జగన్ హస్తిన పర్యటనకూ లింకు పెడుతూ.. సామాజిక మాధ్యమంలో పలు వ్యాఖ్యలు వచ్చాయి. అలాగే సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంకా ఎంత కాలం సాగదీస్తారంటూ సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, అవసరం అనుకుంటే మరో దర్యాప్తు అధికారిని నియమించండని పేర్కొంది. దీంతో వివేకా హత్య కేసు మళ్లీ మొదటికి వచ్చిందన్న అనుమానాలు వ్యక్త మయ్యాయి.

అయితే మంగళవారం (మార్చి 28) అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయడం, అలాగే బుధవారం ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనుండటంతో వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ రంగం సిద్ధం చేసిందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

ఇటు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించడం, అటు ముఖ్యమంత్రి జగన్ హస్తినకు వెళ్లనుండటంతో ఒకటి రెండు రోజులలో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలున్నయని పరిశీలకులు అంటున్నారు.